స్వేచ్ఛగా అసెంబ్లీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగా అసెంబ్లీ ఎన్నికలు

Published Wed, Oct 11 2023 7:40 AM | Last Updated on Wed, Oct 11 2023 8:24 AM

- - Sakshi

కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న అధికారులు

నిర్మల్‌: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సమష్టిగా పని చేయాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌, భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌పటిల్‌, నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డితో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు.

కోడ్‌ దాటొద్దు..
ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచే కోడ్‌ అమలులోకి వచ్చిందని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎవరూ నియమావళిని దాటొద్దని హెచ్చరించారు. పబ్లిక్‌ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పోస్టర్లు, చిహ్నాలను తొలగిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 922 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవంబర్‌ 30న ఎన్నికలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

జిల్లాలోని ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. చునావ్‌ గ్రామసభ, సెల్ఫీ విత్‌ పోలింగ్‌ స్టేషన్‌ వంటి వినూత్న కార్యక్రమాలనూ నిర్వహిస్తామని తెలిపారు. సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగుల ఓటు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు వివరించారు.

ఓటు నమోదు చేసుకోవచ్చు..
జిల్లాలో 7,11,190మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహించామన్నారు. ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు ఈనెల 31లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు.

పెద్ద క్యూలైన్లు లేకుండా..
ఈసారి ఎన్నికలకు పెద్ద క్యూలైన్లు లేకుండా ప్రశాంతంగా ఓటువేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో 1,500 దాటకుండా ఓటర్లు ఉండేలా చూస్తున్నామన్నారు. ఓటరుకు కేవలం 2కి.మీ. లోపే పోలింగ్‌ కేంద్రం ఉంటుందని చెప్పారు. కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్‌, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు, వీల్‌చైర్లు, ప్రత్యేకంగా వాలంటీర్లు వంటి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

జిల్లాలోని 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఉంటుందన్నారు. తొలిసారి ఎన్నికల కమిషన్‌ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి నుంచి ఓటువేసే ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. ఇలా ఓటు వేసేవారికి బీఎల్‌ఓలు ఫామ్‌–12డి ఇస్తారని, దీన్ని నవంబర్‌ 8లోపు రిటర్నింగ్‌ అధికారికి చేరేలా పంపించవచ్చని చెప్పారు. దివ్యాంగులు ఈ ఫామ్‌తోపాటు సదరం సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీ జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు ఎలక్ట్రానిక్‌/పోస్టల్‌ ఓటు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ వివరించారు.

రూ.50 వేల లోపే అనుమతి..
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేసేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ కోరారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా ఎన్నికలు పూర్తిచేద్దామన్నారు. కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచే జిల్లాలో సరిహద్దుల్లో ఐదుచోట్ల, అంతర్గతంగా ఐదుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మద్యం, డబ్బు, మత్తుపదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నగదు కేవలం రూ.50 వేలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్తే స్వాధీనం చేసుకుని గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగిస్తామన్నారు. సరైన లెక్కలు లేకపోతే ఆ డబ్బు ఐటీ అధికారులు జప్తు చేసుకుంటారని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారు సంబంధిత పత్రాలను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతిస్తారని చెప్పారు.

గన్‌లైసెన్స్‌ ఉన్నవారు ఆయుధాలను సమీప పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్‌ చేయాలని తెలిపారు. రౌడీషీట్‌, కమ్యూనల్‌ కేసులు ఉన్నవారిని బైండోవర్‌ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 153 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, 17 మావోయిస్టు ప్రభావి త ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు. ఇక కనీసం సిగ్నల్‌ వ్యవస్థలేని 10 షాడో జోన్‌లో ఉన్నవాటికి శాటిలైట్‌ ఫోన్స్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీ–విజిల్‌, డయల్‌ 100, కంట్రోల్‌రూం నంబర్లను ఉపయోగించుకుని పారదర్శక ఎన్నికలకు సహకరించాలని ఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement