TS Vikarabad Assembly Constituency: TS Election 2023: బయట శుభాకాంక్షలు..! లోపల దూరంగానే..!! సయోధ్య కుదిరేనా..?
Sakshi News home page

TS Election 2023: బయట శుభాకాంక్షలు..! లోపల దూరంగానే..!! సయోధ్య కుదిరేనా..?

Published Sat, Sep 9 2023 6:58 AM | Last Updated on Sat, Sep 9 2023 11:08 AM

- - Sakshi

వికారాబాద్‌: మంత్రి మహేందర్‌రెడ్డికి జిల్లాలోని ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య కుదిరేనా అనే అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మూడేళ్ల క్రితం రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ వీడి అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు తాండూరు నుంచి జిల్లా మొత్తం వ్యాపించాయి. అధికార బీఆర్‌ఎస్‌లో పట్నం వర్సెస్‌ ఎమ్మెల్యేలు అంటూ జిల్లా మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయి అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది.

కొడంగల్‌ ఎమ్మెల్యే మినహా జిల్లాలోని శాసనసభ్యులందరూ ఒక్కటై తనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని గ్రహించిన పట్నం జిల్లాలో రెబల్‌ స్టార్‌ అవతారమెత్తారు. పట్నం మహేందర్‌రెడ్డి జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను తన అనుచరులుగా మార్చుకుని అధికార పార్టీ పెద్దలతో పాటు జిల్లా ఎమ్మెల్యేలకు కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. చివరికి పార్టీని సైతం వీడతారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ మంత్రి పదవి చేపట్టి మరోసారి జిల్లా రాజకీయాలను షేక్‌ చేస్తూ అందరికి ఊహించని షాకిచ్చారు.

అయితే ఇప్పటి వరకు ౖపైపెకి అందరు కలసిపోయాం అంటూ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినప్పటికీ వారి మధ్య ఇంకా సఖ్యత కుదర లేదనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అదే ఆయన మొదటి అధికారిక పర్యటన. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాకపోవడం.. వారిలో సఖ్యతపై అనుమానాలకు తావిస్తోంది.

పట్నం వర్గం తలోదారి..
మంత్రి పదవి చేపట్టే వరకు ఆయనతో ఉంటూ వచ్చిన అనుచరగనం పదవి చేపట్టాక చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా తయారయ్యాయి. పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులందరు పట్నం మహేందర్‌రెడ్డితో జతకట్టిన విషయం తెలిసిందే.. మహేందర్‌రెడ్డితో పాటు జతకట్టిన నేతలందరికీ ఎవరి అవసరాలు, ఎవరి డిమాండ్లు, ఎవరి ఆశలు, ఎవరి అలకలు వారికి ఉన్నాయి. అయితే అధిష్టానం తాండూరు బీఆర్‌ఎస్‌ టికెట్‌ రోహిత్‌రెడ్డి ఇవ్వడం, పట్నం అలక బూనకుండా మంత్రి పదవితో పట్టాభిషేకం చేసింది.

అధిష్టాన నిర్ణయంతో రెబల్‌ వర్గంలో పట్నం ఒక్కడికి మినహా ఆయన వర్గంలోని వారందరికీ నిరాశే ఎదురైంది. ఇక ఏం చేయాలో పాలుపోని అసమ్మతి నేతలు ధిక్కార స్వరం వినిపిస్తూ తలోదారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు ఇతర పార్టీల వైపు చూస్తుండగా, మరి కొందరు నామినేటెడ్‌ పదవులు ఇప్పించాలని మంత్రి మహేందర్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం.

మనోహర్‌రెడ్డి నివాసంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే భేటీ..
వికారాబాద్‌ నుంచి పలువురు నేతలు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. పరిగి నుంచి డీసీసీబీ చైర్మన్‌ బీ మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీ మొదటి జాబితాలో జిల్లా లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికి టికెట్లు దక్కా యి. అయితే తనకే టికెట్‌ ఖాయవ్డుంటూ ప్రచా రం చేసుకున్న మనోహర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ జాబితాలో పేరు లేకపోవడంతో కార్యకర్తలు, నియోజకవర్గానికిదూరంగా ఉంటున్నారు.

అయితే రెండు రోజుల క్రితం మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలసి నగరంలోని మనోహర్‌రెడ్డి నివాసంలో భేటీ అయినట్టు తెలుస్తోంది. వీరి భేటీతో విడిపోయిన పరిగి నేతలు, కార్యకర్తలు కలుస్తారా? మనస్ఫూర్తిగా మహేశ్‌రెడ్డికి సపోర్టు చేస్తారా? లేక పక్కదారులు వెతుక్కుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement