వికారాబాద్: అధికార పార్టీ అసమ్మతి నేతలు దారికొస్తారా అనే దానిపైనే ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించారు. దీంతో టికెట్ ఆశించిన వారు గుర్రుగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశించిన నేతలు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించడంతో కొడంగల్‌లో అసమ్మతి వర్గం కాంగ్రెస్ గూటికి చేరింది.
వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు అయోమయానికి గురవుతున్నారు. వీరు తలోదారి ఎంచుకుంటున్నట్లు సమాచారం. అయితే కొందరు పార్టీలోనే ఉంటూ తమ అసంతృప్తిని తెలియజేస్తుండగా, మరికొందరు కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇంకొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు.
కాంగ్రెస్‌తో టచ్‌లో పలువురు నేతలు..
కొడంగల్‌లో బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి దక్కదని తేలడంతో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఆయన అనుచరులతో కలిసి ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. పరిగికి చెందిన పలువురు నేతలు సైతం హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. తాండూరుకు చెందిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణాగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కమలం గూటికి వెళ్లారు. ఇక తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం.
పరిగి నియోజకవర్గంలో ఇటీవలి వరకు ఎమ్మెల్యేతో విబేధించిన డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి అతని వర్గంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, మరి కొంత మంది నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ నియోజకవర్గంలోనూ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఓ ఎంపీపీ, ఏఎంసీ మాజీ చైర్మన్ తదితరులు కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయోమయంలో అనుచర గణం..
కొందరు ముఖ్యనేతలు టికెట్లు ఆశించి రాకపోవడంతో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వర్గాలను పెంచి పోషించిన విషయం తెలిసిందే.. చివరకు అధిష్టానం చేపట్టిన సామ దాన బేద దండోపాయాలకు తలొగ్గి మిన్నకుండి పోయారు. మరో ముఖ్యనేతకు బీఆర్‌ఎస్ అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో పక్కచూపులు మానేసి పార్టీలోనే కొనసాగేందుకు సిద్ధమయ్యారు.
పరిగి నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నాయకుడు టికెట్ రాదని తేలడంతో అనుచరగణంతో మొహం చాటేశారు. దీంతో ఆయన్ను నమ్ముకుని ఎమ్మెల్యేలతో సున్నం పెట్టుకున్న పలువురు నేతలు తమను నట్టేట ముంచి వెళ్లారని మండి పడుతున్నారు. ఇన్నాళ్లు వెంట తిప్పుకుని కనీసం ఫోన్ కూడా తీయడం లేదని వారు వాపోతున్నారు.
ఒకవేళ నేతల బుజ్జగింపులతో తిరిగి ఎమ్మెల్యేల వర్గంలో చేరినా.. భవిష్యత్తు ఓ తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే తమను బతిమాలుతున్నారనే అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికలు ముగిశాక.. వారి అవసరం తీరాక తమను పక్కన పెడతారా? అనే అనుమానం కూడా వారిలో లేకపోలేదు. దీంతో వారు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment