చెడును సంహరించి, మంచిని సంరక్షించే వారు దైవంతో సమానం అయిపోతారు. జబ్‌నా తన ఊరిలోని అనేక చెడులను రూపుమాపి, ఊరిని కాపాడుతోంది. అందుకే ఆమె స్థానికులకు గ్రామ దేవత అవతారంలా కనిపిస్తోంది.
జబ్‌నా చౌహాన్.. పాతికేళ్ల యువతి. ఇరవై రెండేళ్లకే సర్పంచ్‌గా ఎన్నికైంది. అంతకంటే ముందు జర్నలిస్టుగా తన ఊరిలో రాజ్యమేలుతున్న సామాజిక సమస్యలను కెమెరాలో కంటితో చూసింది. ఇంకా వెనక్కి వెళ్తే... కాలేజీ ముఖం చూడకనే చదువు మానేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. మా ఊర్లో డిగ్రీ కాలేజ్ ఉండి ఉంటే... ఈ పరిస్థితి రాకపోయేది కదా అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు తన ఊరికి డిగ్రీ కాలేజ్ కోసం అడుగులు వేస్తోంది.జబ్‌నా చౌహాన్‌ది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, మండి జిల్లాలోని థార్జున్ గ్రామం. జబ్‌నా తండ్రి శ్రీహరియా. చదువులో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. ఆర్థిక కారణాల వల్ల పన్నెండో తరగతి తర్వాత ‘ఇకపై చదివించడం తన వల్ల కాద’ని తేల్చేశాడు హరియా. జబ్‌నతోపాటు మరో అమ్మాయిని, చూపు సరిలేని కొడుకును పోషించాల్సిన బాధ్యత అతడితో ఆ మాట చెప్పించింది.
ఆ సమయంలో చిన్నాన్న సహాయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె ఖర్చులకు తగినంత డబ్బు సంపాదించుకోవడానికి స్థానిక వార్తా పత్రిక ఆఫీస్‌లో పార్ట్ టైమ్ జాబ్ ఇప్పించాడు ఆమె చిన్నాన్న. దాంతో జబ్‌న స్థానిక సమస్యలను తెలుసుకోవడం కోసం మండి జిల్లాలో ప్రతి మూలకు ప్రయాణించగలిగింది. ఆ అనుభవంతో స్థానిక ‘ఓరియెంటల్ న్యూస్‌చానెల్’ లో యాంకర్, రిపోర్టర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ ఉద్యోగం జబ్‌న ప్రయాణాన్ని మరో మలుపు తిప్పింది. సామాజిక బాధ్యత కలిగిన రిపోర్టర్‌గా ఆమె మొదటగా తనకు బాగా పరిచయమున్న తన గ్రామ సమస్యల మీదనే ఫోకస్ పెట్టింది. థార్జున్ గ్రామం లోని అట్టడుగు వర్గాల జీవితాలను చిత్రీకరించింది.
లింగ వివక్ష, మహిళల సమస్యలు, సామాజిక దురాగతాల మీద కథనాలను ప్రసారం చేసింది. ఆమె ప్రయత్నం ఎంతగా సఫలమైందంటే... అంత వరకు అలాంటి సమస్యలు కరడుగట్టిపోయి ఉన్నాయన్న సంగతి కూడా తెలియని స్థితిలో ఉన్న అధికారులకు చేరాయి ఆమె కథనాలు. యంత్రాంగం ఆ సమస్యల పరిష్కారం కోసం పని చేయడం మొదలైంది. అప్పుడు వచ్చాయి ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు. గ్రామస్థులు ఆమెను సర్పంచ్ పదవికి పోటీ చేయవలసిందిగా కోరారు. అలా 2016, జనవరి ఒకటో తేదీన, ఇరవై రెండేళ్ల జబ్‌న థార్జున్ గ్రామానికి సర్పంచ్ అయింది.
తొలి సమావేశం మద్యం పైనే
జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి ఆమెకు గ్రామ సమస్యల మీద అవగాహన ఉండడంతో సర్పంచ్ అయిన వెంటనే మద్యపానం మీద దృష్టి పెట్టింది. అప్పటికి ఆ ఊరి మగవాళ్లలో ఎక్కువ మంది మద్యానికి బానిసలై ఉన్నారు. పేదింటి ఆడవాళ్లు పొలాల్లో, ఉపాధి హామీ పథకాలలో పనులు చేస్తున్నారు. మగవాళ్లు సాయంత్రానికి ఇంటికి వచ్చి ఆడవాళ్లు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కుని మద్యం దుకాణాలకు ధారపోస్తున్నారు. అందుకే... ఆమె తొలి పంచాయతీ సమావేశంలోనే పంచాయతీ సభ్యుల ముందు మద్యపాన నిషేధం ఆలోచనను ప్రతిపాదించింది. మద్యంతోపాటు మద్యం వల్ల ఎదురవుతున్న అనుబంధ సమస్యల వల్లనే గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందని కూడా వివరించింది. మొదటి సమావేశంలో ఆమెకు మిగిలిన సభ్యుల మద్దతు లభించలేదు.
యువ పాలన
జబ్న తన ప్రయత్నాలను వదల్లేదు. గ్రామంలో ఉన్న ఐదు మహిళా మండళ్లను సంప్రదించింది. యువతను సమీకరించింది. వాళ్ల ఫోన్ నంబర్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది. ఆ గ్రూపుల్లో నిరంతరం గ్రామాన్ని సంస్కరించడానికి చేపట్టాల్సిన పనుల గురించే చర్చ సాగేది. వారందరితోపాటు ఆమె డిప్యూటీ కమిషనర్‌ను కలిసి మెమొరాండం సమర్పించి తమ గ్రామంలో ఉన్న మద్యం దుకాణాలను మూసి వేయించమని కోరింది. పొరుగున ఉన్న గ్రామాల్లో మద్యం ఏరులై పారుతూ ఉన్నప్పుడు తమ గ్రామంలో మాత్రమే మద్యం దుకాణాలను మూసివేస్తే సరిపోదని ఆమెకు తెలుసు. సమీప గ్రామాల సర్పంచ్‌లను కలిసి ఈ ఉద్యమంలో సహకరించవలసిందిగా కోరిందామె.
ఆమె ప్రయత్నాలను తెలుసుకున్న ‘సుందర్ నగర్స్ సామాజిక్ జాగరణ్ మంచ్’ జబ్‌నా చౌహాన్‌ను మద్య నిషేధ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించమని ప్రభుత్వాన్ని కోరింది. అలా ఆమె గుజరాత్‌లో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని మద్యపానం వల్ల సమాజం ఎదుర్కొనే కష్టనష్టాల గురించి విపులంగా ప్రసంగించింది. ఆ తర్వాతనే సొంత గ్రామంలో ఆమెను వ్యతిరేకించిన వాళ్లు కూడా ఆమె ఉద్దేశాన్ని గౌరవిస్తూ, ఆమె మార్గాన్ని అనుసరించారు. అలా ఆమె 2017, మార్చి ఒకటి నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు జరగకూడదని, ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. మద్యానికి బానిసలైన మగవాళ్లు ఆమెను తిట్టరాని తిట్లు తిట్టారు. కొందరైతే దాడికి కూడా దిగారు. వాళ్లందరికీ ఆమె చెప్పిన మాట ఒక్కటే... ‘‘మీరంతా మద్యం లేకుండా ఉండలేరనే నిజాన్ని అంగీకరిస్తున్నాను.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మీరు సృష్టించే న్యూసెన్స్‌ను గ్రామస్థులు ఎందుకు భరించాలి? వాళ్లందరి ఇబ్బందిని అరికట్టడం నా బాధ్యత’’ అని స్థిరంగా చెప్పింది. దీంతోపాటు ఆమె వయసు మళ్లిన వాళ్ల దగ్గర కూర్చుని పొగాకుతో సంభవించే అనారోగ్యాలను పూసగుచ్చినట్లు వివరించేది. చివరికి మద్యం, పొగాకు వినియోగాన్ని పూర్తిగా అరికట్టగలిగింది. గ్రామసభ పెట్టి ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఫైన్ ఉంటుందనే కఠిన నిబంధన కూడా విధించింది. ఆఖరుకి పెళ్లి వంటి వేడుకలకు కూడా మినహాయింపు లేదు.
స్వచ్ థార్జున్
జబ్‌న స్వచ్ భారత్ జాతీయ పథకాన్ని నూటికి నూరు పాళ్లు వినియోగించుకుంది. మహిళల వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. టాయిలెట్‌లు కట్టించుకోవడానికి ఊరంతటినీ ప్రభావితం చేసింది. థార్జున్ గ్రామం స్వచ్‌భారత్‌లో జిల్లా స్థాయిలో ముందు నిలవడంతో ‘బెస్ట్ ప్రధాన్’ అవార్డు అందుకుంది జబ్‌న. గవర్నర్ ఆచార్యదేవ్ విరాట్ నుంచి సర్పంచ్ జబ్నకు ప్రశంసలు అందాయి. అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఆమెను అభినందించి ‘బెస్ట్ సర్పంచ్’ అవార్డు ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ప్రత్యేక పురస్కారం లభించిందామెకి. అక్షయ్ కుమార్ ‘టాయిలెట్– ఏక్ ప్రేమ్‌కథ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జబ్‌నను సత్కారం చేసి, ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక ఇప్పుడామె టార్గెట్ తమ గ్రామంలో డిగ్రీ కాలేజ్ పెట్టించడం, మహిళల కోసం ఒక ఎన్‌జీవో స్థాపించి వారి ఆదాయ మార్గాలను పెంచడం, మహిళా సాధికారత కోసం పని చేయడం.
నాన్న మీద ప్రేమ
జబ్న తాను ఎదుర్కొన్న గడ్డు స్థితిని తలుచుకుంటూ ‘‘మా నాన్నకు ముగ్గురు పిల్లల్నీ బాగా చదివించాలనే కోరిక ఉండేది. మా ఊరిలో డిగ్రీ కాలేజ్ ఉండి ఉంటే మమ్మల్ని ఎలాగోలా చదివించేవాడే. డిగ్రీకి జిల్లా కేంద్రం ‘మండి’కి వెళ్లాలి. హాస్టల్ ఫీజులు కట్టే స్థోమత లేని నిస్సహాయ స్థితి ఆయనది’’ అని మాత్రమే అంటుంది తప్ప తండ్రిని మీద మాట పడనివ్వదు. తండ్రి తన కూతుళ్ల కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఆడపిల్లలు సాధారణంగా తప్పుపట్టరు. తండ్రి గుండెలోతులను తాకి చూసినట్లు అర్థం చేసుకుంటారు.
తండ్రి ప్రేమను గౌరవిస్తారు. ఎంతమందిలో అయినా తండ్రి నిర్ణయాన్ని సమర్థించుకుంటారు. ఇంకా ఆమె ‘‘ఊళ్లో వాళ్లు, బంధువులు కూడా మొదట్లో మా నాన్న మీద చాలా ఒత్తిడి తెచ్చారు. ఉన్న కొడుకు చూపు సరిలేని వాడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసెయ్యమన్నారు. అయితే మా అమ్మానాన్నలు ఆర్థికంగా పేదవారే కానీ, వారికి భావదారిద్య్రం లేదు. వారి ఆలోచనలెప్పుడూ అభ్యుదయం వైపే సాగేవి’’ అని చెప్పింది.
– వాకా మంజులారెడ్డి
►‘‘సముద్రాన్ని శుభ్రం చేయాలనే తలంపు నీలో ఉన్నప్పుడు... సముద్రంలో దూకాల్సిందే. అంతేతప్ప, తీరాన కూర్చుని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆ అవకాశం ఎప్పటికీ మన దగ్గరకు రాదు’’
►‘వయసెంత అనేది విషయం కాదు, ఎక్కడ నుంచి వచ్చారనేది కూడా ముఖ్యం కాదు, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారనేది కూడా ప్రధానం కాదు, నీ శక్తి సామర్థ్యాలే నీ గుర్తింపు, నీవు సాధించిన విజయాలే నీకు గౌరవం’
Comments
Please login to add a commentAdd a comment