
v
సాక్షి, మరికల్(మహాబూబ్‌నగర్) : సర్పంచ్‌లుగా విజయం సాధించి 7 నెలలు అవుతుంది. అయినా ఏం ప్రయోజనం.. గ్రామ పంచాయతీకి నిధులు లేవు, చెక్ పవర్ పేరుతో ఐదు నెలలు కాలయాపన చేశారు. దీంతో సర్పంచ్‌లు ఏం చేయాలో తోచక సొంత నిధులు, అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గ్రామ పాలన కత్తిమీద సాముల మారింది. నూతన పంచాయతీ చట్టం ప్రకారం ఎట్టకేలకు ఉపసర్పంచ్‌తో కలిపి సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తునట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కూడా సర్పంచ్‌లు అసంతృప్తిగా ఉన్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ వద్దంటూ ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు.
అప్పులు తెచ్చి సమస్యల పరిష్కారం
మరికల్, ధన్వాడ మండల్లాలో కలిపి 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించడంలో అనేక నిబంధనలు పెట్టడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీరు, పైపులైన్ లీకేజీలు, డ్రెయినేజీల పూడికతీత, రహదారుల మరమ్మతులు, స్వచ్ఛభారత్ కింద రహదారులను శుభ్రం చేయించుట, తాగునీటి మోటర్లు కాలిపొతే మరమ్మతులు, విధిదీపాలు వేయించుట తదితర సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గ్రామాలను బట్టి ఒక్కో సర్పంచ్ రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు పెట్టారు. కనీసం ఈ సమస్యలను కూడా పరిష్కరించకుంటే ప్రజల నుంచి చీవాట్లు తప్పవని కొందరు సర్పంచులు అప్పులు తెచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి.
రూ.3లక్షలు ఖర్చు చేశాను..
ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయాన్ని ఎటూ తేల్చకపోవడంతో గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రూ.3లక్షలు ఖర్చు చేయడం జరిగింది. జాయింట్ చెక్ పవర్ కారణంగా విబేధాలు తలెత్తే అవకాశముంది. ఇంతకుముందు మాదిరిగానే కార్యదర్శి, సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పిస్తే బాగుంటుంది.
– పూణ్యశీల, సర్పంచ్, మాధ్వార్
అప్పులు చేశాను..
గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే పెరుకుపోతున్నాయి. తన వద్ద కూడా డబ్బులు లేవు. దీంతో సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో రూ.2లక్షలు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది.
– రాజు, సర్పంచ్, రాకొండ
Comments
Please login to add a commentAdd a comment