village sarpanches
-
పారాలింపియన్లు, సర్పంచులు, చేతివృత్తుల వారు..
సాక్షి, న్యూఢిల్లీ: 76వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పదివేల మంది హాజరుకానున్నారు. 26వ తేదీన ఢిల్లీ కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్‌కు ‘స్వర్ణిమ్ భారత్’వాస్తు శిల్పులు, పారాలింపియన్లు, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఆహ్వానిస్తున్నట్లు గురువారం పేర్కొంది. వీరిలో ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ సర్పంచ్‌లు, చేనేత నిపుణులు, విపత్తు సహాయక సిబ్బంది, అటవీ, వన్యమృగ సంరక్షణ కేంద్రాల ఉద్యోగులు తదితరులు ఉంటారని తెలిపింది. ఎంపిక చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆరు ప్రధాన పథకాల్లో లక్ష్యాలను సాధించిన పంచాయతీ సర్పంచిలు, ఈ శాన్య రాష్ట్రాలు, బెస్ట్ స్టార్టప్‌లు, రహదారి నిర్మాణ కార్మికులు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. వీరందరికీ ఢిల్లీలోని పలు ప్రముఖ ప్రదేశాలైన జాతీయ యుద్ధ స్మారకం, ప్రధానమంత్రి సంగ్రహాలయ వంటివాటిని సందర్శించేందుకు వీలు కల్పిస్తారు. -
ఆ మహిళలు.. పేరుకే సర్పంచులు
రాంచీ: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. జార్ఖండ్‌లో చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. ధన్‌బాద్ జిల్లాలో 95 మంది మహిళా సర్పంచులున్నారు. తమ ఫోన్‌కాల్‌కు వీరిలో 11 మంది సర్పంచులు మాత్రమే స్వయంగా స్పందించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. మిగతా 84 మందిలో సర్పంచుల భర్తలో, మరుదులో, లేక ఆమె కుటుంబంలోని ముఖ్యులో ఆ ఫోన్ కాల్లకు స్పందించారు. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం సర్పంచులకు బదులుగా వారి భర్తలు, ఇతర కుటుంబసభ్యులే హాజరవుతున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది. బ్లాక్, సబ్ డివిజిన్, జిల్లా స్థాయి సర్పంచుల సమావేశాలకు హాజరై వీరు తమను ఫలానా గ్రామ సర్పంచి భర్త అనో లేక ఇతర కుటుంబ సభ్యులమనో పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలకు మహిళా సర్పంచులు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. వారికి బదులుగా కుటుంబసభ్యులను, ఇతరులను లోపలికి రానివ్వద్దంటూ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది! -
సర్పంచ్ల సేవలు సూపర్
న్యూఢిల్లీ: పంచాయతీలకు సాధికారత కల్పించి గ్రామస్వరాజ్యం సాధించడంలో ఎనిమిదేళ్లలో భారత్ కొత్త మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ చేరేలా కృషి చెయ్యాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. ఎన్డీఏ పాలనకు ఎనిమిదేళ్ల పూర్తయిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్‌లకు మోదీ లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్లలో గ్రామస్థాయిలో వారందించిన సహకారాన్ని, చేసిన సేవల్ని కొనియాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మానవత్వం కోసం యోగా అనే థీమ్‌తో ఈ ఏడాది నిర్వహిస్తున్న యోగా డేని సర్పంచులు వారి వారి గ్రామాల్లో ఏదైనా పురాతన పర్యాటక కేంద్రాన్ని లేదంటే నదీ తీరంలో నిర్వహించాలని గ్రామంలో ప్రతీ ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సాహించాలని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. యోగా డే రోజు తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలన్నారు. 75ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ నీటి సంరక్షణపై అత్యధిక దృష్టి పెట్టాలని. ప్రతీ నీటి బొట్టు విలువైనదని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా కృషి చేస్తే సదరు గ్రామంతో పాటు దేశం కూడా సుసంపన్నంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలన్నీ స్వయంసమృద్ధి సాధిస్తే దేశం పురోగతిలో ముందుంటుందని లేఖలో పేర్కొన్నారు. -
గ్రామ సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్
-
గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో పల్లె ముంగిట్లోకే పాలన వచ్చిందన్నారు. గ్రామ సర్పంచ్‌లతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో "జగనన్న స్వచ్ఛ సంకల్పం" అమలుపై చర్చించారు. జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రూ.1312.04 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సర్పంచ్‌లంతా గ్రామసచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా.. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛసంకల్పానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ‘‘గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మారుతాయి. ప్రజాప్రతినిధులుగా మీ ఎదుగుదలకు సర్పంచ్ పదవి తొలిమెట్టు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలి. పట్టణాలకు ధీటుగా గ్రామాలను తీర్చిదిద్దాలి. ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలి. స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని’’ మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్ -
సర్పంచ్‌లతో నేడు మంత్రి పెద్దిరెడ్డి సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం అమలుపై ఆయన సర్పంచ్‌లతో చర్చిస్తారు. ప్రతిధ్వని పేరుతో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున 26 మంది సర్పంచ్‌లు మంత్రితో మాట్లాడనున్నారు. -
‘పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే మన లక్ష్యం’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో స్వచ్చతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న స్వచ్చ సంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఆయా గ్రామ సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల జెడ్పీ సీఇఓ, డీపీఓ, డ్వామా పీడీ, ఎంపీడీఓ, పంచాయతీ ఇఓ, గ్రామ సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లి సీపీఆర్ కార్యాలయం నుంచి పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్చాంధ్ర ఎండీ సంపత్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూలై 8 స్వర్గీయ వైఎస్సార్ జయంతి నాడు 'జగనన్న స్వచ్ఛసంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు. కోవిడ్ మన గ్రామ పొలిమేరల్లోకి రాకుండా చూసే బాధ్యత సర్పంచులదేనని, వాళ్ల సారథ్యంలో స్వచ్ఛమైన పల్లెలను సృష్టించుకోవాలని తెలిపారు. ప్రజలు సర్పంచులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే సమయం ఇదేనంటూ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ( చదవండి: వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు ) -
సర్పంచ్‌లకు పంచ్ పడింది
సాక్షి, హైదరాబాద్: లెక్కతప్పిన సర్పంచ్‌లకు పంచ్ పడింది. నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహించినవారిపై ఒక్కొక్కరిగా వేటు పడుతోంది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన 36 మంది సర్పంచ్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు సస్పెండ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తున్నా.. పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల జాప్యం, పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠ ధామాలను నిర్మించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. పనితీరు సంతృప్తికరంగాలేని సర్పంచ్‌లపై కొరడా ఝళిపిస్తోంది. అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో), పంచాయతీ కార్యదర్శులపైనా కన్నెర్ర జేసింది. దీంతో పంచాయతీ పాలకవర్గాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వేటు వేశారిలా..! గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో కఠిన నిబంధనలను పొందుపరిచింది. 85 శాతం మొక్కలు బతక్కపోతే సర్పంచ్, కార్యదర్శులను బాధ్యులను చేస్తామని స్పష్టం చేసింది. అక్రమార్కులకు నోటీసులు, వివరణలతో కాలయాపన చేయకుండా.. తక్షణమే సస్పెన్షన్ వేటు వేసేలా చట్టంలో పేర్కొంది. కేవలం నిధుల దుర్వినియోగమేకాదు.. పారిశుద్ధ్య నిర్వహణలో విఫలమైనా, కార్యక్రమాల అమలులో వెనుకబడినట్లు తేలినా వారి పదవులకు ఎసరుపెడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లె ప్రగతి నిర్వహణ, హరితహారం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలకు స్థలాల ఎంపికలోనూ జాప్యాన్ని ప్రదర్శించిన పలువురు సర్పంచ్‌లపై వేటు వేసింది. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో సర్పంచ్‌లు ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదని కలెక్టర్లతో ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పెదవి విరిచారు. అంతే.. అప్పటివరకు సర్పంచ్‌లపై ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లు ఉన్న కలెక్టర్లు.. వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల వ్యవధిలో 36 మంది గ్రామ సర్పంచ్‌లపై వేటు పడింది. అలాగే 92 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీవోలపైనా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చట్టం ఏం చెబుతుందంటే.. ► పంచాయతీరాజ్ చట్టం–2018 సెక్షన్ –37(5) విధుల పట్ల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, అలసత్వం, అక్రమ వసూళ్లకు పాల్పడినవారిని తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంది. ► సెక్షన్ 284 ప్రకారం.. డిసెంబర్ 31లోపు నిధు ల వినియోగానికి సంబంధించి ఆడిట్ రిపోర్టు సమర్పించని పక్షంలో నోటీసులు ఇవ్వకుండా సర్పంచ్, కార్యదర్శులను తొలగించవచ్చు. ► సెక్షన్ 43 ప్రకారం.. రికార్డుల నిర్వహణ, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ, 100% ఇంటి పన్నుల వసూళ్లలో ఆశించిన స్థాయిలో పనిచే యని కార్యదర్శులపైనా చర్యలు తీసుకోవచ్చు. ► సెక్షన్ 37(5) ప్రకారం.. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఉపసర్పంచ్‌లపైనా కూడా చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లు ఉంది. ప్రభుత్వ తీరు సరికాదు కొత్త చట్టాన్ని అస్త్రంగా చేసుకొని సర్పంచ్‌లపై వేటు వేయడం సరికాదు. స్థలాల లభ్యత లేకపోతే సర్పంచ్‌లను ఎలా బాధ్యులను చేస్తారు. తప్పులు చేస్తే చర్యలు తీసుకోవచ్చు. కానీ, పల్లె ప్రకృతివనాలకు స్థలాలను గుర్తించలేదని, వైకుంఠధామాలను నిర్మించలేదని వేటు వేయడం దారుణం. ఇలాంటి చర్యలతో సర్పంచ్‌లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే పనిభారంతో కార్యదర్శులు ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు. – చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు -
అలసత్వపు అధికారులు, సర్పంచ్‌లపై చర్యలు
సాక్షి, హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగనున్నాయని, పల్లెల్లో ప్రగతి కార్యక్రమాలు, నాణ్యతను ఈ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అలసత్వం వహించినట్లు తనిఖీల్లో రుజువైన అధికారులు, వంద శాతం పనిచేయని సర్పంచులపై తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏ మాత్రం మొహమాటాలు లేవని స్పష్టం చేశారు. అలసత్వం వహించినట్లు తేలిన అధికారులపై కఠిన చర్యలుంటాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ఆదివారం ఆయన ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. పచ్చని, పరిశుభ్రమైన పల్లెల కోసం సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభించిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందని సీఎం పేర్కొన్నారు. ఇందులో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామమన్నారు. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు చూపించడం లేదని క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. 100 శాతం ఫలితాల కోసం తనిఖీలు చేపట్టి, ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చన్నారు. దీనిలో భాగంగానే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. ‘పల్లెలను బాగుచేసుకోవడం కన్నా మించిన పని ప్రభుత్వానికి లేదు. అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద విశ్వాసంతోనే, వారికి కావాల్సినంత సమయాన్ని ఇచ్చినం. అందుకే తనిఖీల కోసం ఆత్రపడలేదు. ఈ తనిఖీలు ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు. జనవరి 1 నుంచి పల్లె ప్రగతి తనిఖీలు ప్రారంభించనున్నం’అని సీఎం వివరించారు. మారకపోతే వారిదే బాధ్యత.. ‘పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిల ఉద్యోగులకు వారు ఊహించని విధంగా పదోన్నతులు ఇచ్చాం. గ్రామ కార్యదర్శుల నియామకం చేపట్టడం నుంచి.. ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో అన్ని స్థాయిల్లో వ్యవస్థను పటిష్టపరిచి, శాఖను బలోపేతం చేశాం. అలాగే పల్లె ప్రగతిలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం.. పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లను టంచనుగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. పల్లెను అభివృద్ధిపథంలో నడిపించేలా జిల్లా కలెక్టర్లను నిరంతరం అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తున్నం. పంచాయతీరాజ్ చట్టంలో కూడా కలెక్టర్లకు ఆ మేరకు అధికారాలిచ్చాం. పచ్చదనం, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో పని వ్యవస్థలను కూడా పటిష్టం చేసినం. పంచాయతీ కార్మికుల జీతాలు కూడా పెంచినం. ఇన్ని చర్యలు తీసుకున్నాక కూడా పల్లెల్లో ప్రగతి అనుకున్ననట్లు ముందుకు పోకపోతే అది కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులదే బాధ్యత’అని స్పష్టం చేశారు. గోప్యంగా తనిఖీలు... ‘ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, మూడు క్యాడర్లనుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తం. ప్రతి అధికారికి ర్యాండమ్ విధానంలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల చొప్పున ఆకస్మిక తనిఖీల బాధ్యత అప్పగిస్తం. ఎవరికి ఏ మండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. ఆకస్మికంగా విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె పురోగతి క్రాస్ చెక్ అవుతుంది. తద్వరా ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు అందుతాయని’సీఎం అన్నారు. పనితీరుకు ఓ పరీక్ష... ‘ఈ తనిఖీల ద్వారా పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిని వారి శక్తి సామర్థ్యాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది. పలు రకాల తోడ్పాటు ఇచ్చినంక కూడా గ్రామాలు బాగుపడకపోతే ఇక జీవితంలో అవి బాగుపడవు. అలా కావడానికి వీల్లేదు’అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామాలన్నీ అద్దంలా తీర్చిదిద్దేవరకు ఎట్టి పరిస్థితిల్లో ప్రభుత్వం విశ్రమించదని చెప్పారు. అత్యవసర పనిమీద బెంగళూరు వెల్లవలసిన పంచాయతీరాజ్ కమిషనర్ రఘనందన్ రావు ప్రయాణాన్ని వాయిదా వేయించి మరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నం అంటే, పల్లె ప్రగతిపై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో చేసుకోవాలె అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్‌లకు షాక్
సాక్షి, మెదక్ : గ్రామాల్లో రోజురోజుకు పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు ఇటు పంచాయతీరాజ్, అటు విద్యుత్‌శాఖకు పెద్ద సమస్యగా మరింది. పునర్విభజనలో ఏర్పాటైన మెదక్ జిల్లాలో పాతవి, కొత్తవి కలిపి 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించి పదిహేనేళ్లుగా మొత్తం విద్యుత్‌శాఖకు రూ.1.58 కోట్ల బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో పంచాయతీకి రూ.లక్షల్లో బకాయిలు ఉండటంతో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు బకాయిల కోసం ఏక్షణాన అయినా విద్యుత్‌ను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతోనే.. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా వీధిదీపాలు, మంచినీటి పథకాలకు విద్యుత్‌వాడకం ఎక్కువగా ఉంటోంది. బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందనే ప్రకటనతో గ్రామ పంచాయతీల అధికారులు, ప్రజాప్రతినిధులు బిల్లుల చెల్లింపులను పట్టించుకోలేదు. అంతేకాకుండా విద్యుత్ వాడకంలో సైతం పొదుపు చర్యలు చేపట్టక పోవడంతో కొన్ని గ్రామాల్లో 24 గంటల పాటు విద్యుత్‌ధీపాలు వెలుగుతూనే ఉన్నాయి. తడిసి మోపెడవుతున్న బిల్లులు పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కుప్పులు తెప్పలుగా పేరుకుపోవటంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇక నుంచి పంచాయతీలే విద్యుత్ బిల్లులను చెల్లించుకోవాలని 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్ర్రంలో ఇచ్చిన ఉత్తర్వుల నుంచి 2016 వరకు బిల్లులు చెల్లించక పోవటంతో బకాయిలు తడిసి మోపెడయ్యాయి. 2016 తర్వాత నుంచి ప్రభుత్వం పంచాయతీ నిధుల నుంచి బిల్లులు వసూలు చేయటం మొదలు పెట్టింది. సర్పంచ్‌లు దీన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించటంతో ప్రతిఏటా అభివృద్ధి కోసం పంచాయతీలకు విడుదలయ్యే నిధుల నుంచి 20 నుంచి 25 శాతం రాబట్టేలా కృషి చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారిచేసింది. బకాయిలపై లేఖ రాశారు గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను చెల్లించాలని ఇటీవల సంబంధిత విదుత్‌శాఖ అధికారులు లేఖరాశారు. విద్యుత్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాం. గతేడాది మంజూరైన పద్నాలుగవ ఫైనాన్స్‌కు సంబంధించి జిల్లాలో సుమారు రూ.40 లక్షల వరకు బిల్లులు చెల్లించాం. ఇంకా రూ.1.58 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నాం. ఇక నుంచి ప్రతి నెల కరెంట్ బిల్లులు సంబంధిత పంచాయతీలే ట్రాన్స్‌కోకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. – కాశీనాథ్, విద్యుత్ ఎస్సీ, మెదక్ -
అప్పుల పాలన
సాక్షి, మరికల్(మహాబూబ్‌నగర్) : సర్పంచ్‌లుగా విజయం సాధించి 7 నెలలు అవుతుంది. అయినా ఏం ప్రయోజనం.. గ్రామ పంచాయతీకి నిధులు లేవు, చెక్ పవర్ పేరుతో ఐదు నెలలు కాలయాపన చేశారు. దీంతో సర్పంచ్‌లు ఏం చేయాలో తోచక సొంత నిధులు, అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గ్రామ పాలన కత్తిమీద సాముల మారింది. నూతన పంచాయతీ చట్టం ప్రకారం ఎట్టకేలకు ఉపసర్పంచ్‌తో కలిపి సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తునట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కూడా సర్పంచ్‌లు అసంతృప్తిగా ఉన్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ వద్దంటూ ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. అప్పులు తెచ్చి సమస్యల పరిష్కారం మరికల్, ధన్వాడ మండల్లాలో కలిపి 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పించడంలో అనేక నిబంధనలు పెట్టడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీరు, పైపులైన్ లీకేజీలు, డ్రెయినేజీల పూడికతీత, రహదారుల మరమ్మతులు, స్వచ్ఛభారత్ కింద రహదారులను శుభ్రం చేయించుట, తాగునీటి మోటర్లు కాలిపొతే మరమ్మతులు, విధిదీపాలు వేయించుట తదితర సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గ్రామాలను బట్టి ఒక్కో సర్పంచ్ రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు పెట్టారు. కనీసం ఈ సమస్యలను కూడా పరిష్కరించకుంటే ప్రజల నుంచి చీవాట్లు తప్పవని కొందరు సర్పంచులు అప్పులు తెచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. రూ.3లక్షలు ఖర్చు చేశాను.. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయాన్ని ఎటూ తేల్చకపోవడంతో గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రూ.3లక్షలు ఖర్చు చేయడం జరిగింది. జాయింట్ చెక్ పవర్ కారణంగా విబేధాలు తలెత్తే అవకాశముంది. ఇంతకుముందు మాదిరిగానే కార్యదర్శి, సర్పంచ్‌కు చెక్‌పవర్ కల్పిస్తే బాగుంటుంది. – పూణ్యశీల, సర్పంచ్, మాధ్వార్ అప్పులు చేశాను.. గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే పెరుకుపోతున్నాయి. తన వద్ద కూడా డబ్బులు లేవు. దీంతో సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో రూ.2లక్షలు అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. – రాజు, సర్పంచ్, రాకొండ -
‘పవర్’ లేక పరేషాన్!
సాక్షి, నేరడిగొండ(బోథ్): ప్రజల ఆశీర్వాదంతో పదవి దక్కించుకున్న సర్పంచులకు చెక్ పవర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘మాకు చెక్ పవర్ ఇవ్వండి’ సారూ అంటూ నూతన సర్పంచులు అధికారుల వద్ద ప్రాధేయపడుతున్నారు. సర్పంచ్‌గా గెలిచినా.. శిక్షణ పూర్తి చేసిన తర్వాత చెక్ పవర్ ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌లో ఐదు రోజుల పాటు పంచాయతీరాజ్ చట్టంపై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో సర్పంచులు నిరాశ చెందుతున్నారు. ఎన్నికలకు ముందు జాయింట్ చెక్‌పవర్ అన్నారు. గెలిచాక సర్పంచులకు కూడా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. అప్పుల పాలవుతున్న సర్పంచులు జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా 465 పంచాయతీల్లో ఎన్నికలు జరిగి 465 మంది సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వారికి చెక్‌పవర్ లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. నేరడిగొండ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు సర్పంచే తన జేబులో నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. అలాగే కుమారి గ్రామపంచాయతీ సర్పంచ్ సుమారు రూ.లక్షకు పైగా వివిధ పనుల నిమిత్తం ఖర్చు పెట్టారు. ఈ గ్రామపంచాయతీల సర్పంచులే కాకుండా జిల్లాలో వారే భరిస్తుండడంతో ఈ పదవి తలకుమించిన భారంగా మారిందని లోలోన మదన పడుతున్నారు. సర్పంచులుగా గెలిచి ఇన్నిరోజులైనా చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ పేరిట ఉన్న అకౌంట్లలోని డబ్బులను తీయలేని పరిస్థితి నెలకొంది. గెలిచిన ఉత్సాహంతో గ్రామాల్లో డ్రెయినేజీలు శుభ్రం చేయించడం, తాగునీటి పైపుల లీకేజీలు మరమ్మతులు చేయించడం, ఇతర పనుల కోసం మేజర్ గ్రామాల్లో రూ.లక్షల్లో, చిన్న గ్రామాల్లో రూ.50వేలకుపైగానే ఖర్చు చేశారు. పంచాయతీ సిబ్బందికి కూడా ఆరు నెలలుగా జీతాలు ఇచ్చేది ఉంది. గ్రామాల్లో తక్కువ జీతాలకు పనిచేసే పారిశుధ్య కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జీతాల కోసం పనులు మానుకోవడం, ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతుండగా త్వరలో చెక్‌పవర్ వస్తుంది. రాగానే ఒకేసారి జీతాలు ఇస్తామని వారిని శాంతింపజేస్తున్నారు. తాగునీటి పైపులు లీకైనా, ఇతర అవసరాల కోసం నిత్యం రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఇదే విషయంపై ఇన్చార్జి ఎంపీడీఓ ప్రభాకర్‌ను సంప్రదించగా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వస్తేనే చెక్‌పవర్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. లక్షలు ఖర్చు చేశాం చెక్‌పవర్ కోసం అధికారుల వద్ద ప్రాధేయ పడాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచిన ఉత్సాహంతో గ్రామంలో రూ.లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాం. శిక్షణ కూడా పొందాం. చెక్‌పవర్ ఇస్తే నిధులు డ్రా చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. – అల్లూరి ప్రపుల్‌చందర్‌రెడ్డి, సర్పంచ్, తేజాపూర్ -
పల్లెల్లో ‘పరోక్షమే’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇక సర్పంచుల ఎన్నిక పరోక్షం కానుంది. నేరుగా ప్రజలే ఎన్నుకునేలా కాకుండా.. ఎన్నికైన వార్డు మెంబర్లే తమలో నుంచి ఒకరిని సర్పంచుగా ఎన్నుకునే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు నేరుగా రాజకీయ పార్టీల అధికారిక అభ్యర్థులుగా, పార్టీ గుర్తులతోనే గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచులకు కచ్చితమైన విధి విధానాలు ఏర్పరచాలని.. సరిగా పనిచేయకపోతే తొలగించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉండాలని నిర్ణయించింది. స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా, గ్రామాల పాలకులు మరింత జవాబుదారీగా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్ట సవరణపై తుది కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీల్లో శివారు గ్రామాల విలీనం, తండాలు, గూడేలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయడం తదితర అంశాలనూ సవరణలో చేర్చనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును వచ్చే వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2018 జూలై 31తో రాష్ట్రంలో ప్రస్తుత గ్రామ సర్పంచ్‌లు, పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల విధానంలో మార్పులు.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నిక ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో జరుగుతోంది. దానికి బదులుగా ఉప సర్పంచ్ పదవికి జరుగుతున్న తరహాలో పరోక్షంగా (వార్డు మెంబర్లు ఎన్నుకునేలా) సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దిశగా సమాలోచనలు చేస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల కారణంగా సర్పంచ్ పదవికి పోటీపడే అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు గెలిచిన వార్డు మెంబర్లు తమలో ఒకరిని సర్పంచ్‌గా ఎంచుకునే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఉప సర్పంచ్ ఎన్నికకు ఇదే విధానం అమల్లో ఉంది. అయితే ఈ విధానం క్యాంపు రాజకీయాలు, గ్రూపులు, కోరం లేకుండా అభ్యర్థులను అదృశ్యం చేసే ఎత్తుగడలు వంటివాటికి తావిస్తుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో వార్డు మెంబర్ల ఫలితాలు వెలువడిన వెంటనే.. అప్పటికప్పుడు సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ దిశగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పలువురు రాజకీయ ముఖ్యులకు సూచించినట్లు తెలిసింది. పార్టీ గుర్తులతోనే ఎన్నికలు..! పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పార్టీ రహితంగా, పార్టీల గుర్తులేమీ లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీల్లో క్రియాశీలంగా ఉన్న అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. అభ్యర్థి గుర్తింపు, బ్యాలెట్ పత్రాల్లో మాత్రం పార్టీలకతీతంగా గుర్తులను కేటాయిస్తున్నారు. పార్టీలు, జెండాల వివాదాలకు తావు లేకుండా పల్లెల్లో సామరస్య వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానం కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీ సర్పంచులెందరు గెలిచారు, వార్లు మెంబర్లు ఎందరు విజయం సాధించారన్న బలబలాలను చాటుకోవటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తులతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధ్యయనం జరుగుతోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ ఈ దిశగా చట్ట సవరణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. గ్రామాల విలీనాధికారం సర్కారుకు.. ప్రస్తుతం మున్సిపాలిటీల చుట్టుపక్కల, పరిసరాల్లో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలంటే చట్టపరంగా చిక్కులు ఉన్నాయి. దాంతో ప్రభుత్వం న్యాయపరమైన కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేలా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిసర గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసే సంపూర్ణ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం పది వేల జనాభాకు మించి ఉన్న గ్రామాలను నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలుచోట్ల వీటికి సానుకూలత ఉన్నా.. కొన్ని చోట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. పట్టణాల్లో కలిస్తే గ్రామాలకు ఉపాధి హామీ నిధులు రావని, అన్ని రకాల పన్నులు పెరుగుతాయన్న అభిప్రాయం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం... భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి దృష్ట్యా అలాంటి గ్రామాలను పట్టణాల్లో విలీనం చేయాలని పట్టుదలతో ఉంది. కొత్త పంచాయతీల ఏర్పాటు కూడా.. గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శివారు పల్లెలను సైతం పంచాయతీలుగా చేయనుంది. 500, 600 జనాభాకు మించిన పల్లెలు, ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ కేంద్రాలకు రెండు కిలోమీటర్ల దూరంలోని వాటికి తొలుత ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను చేర్చనుంది. పనిచేయని సర్పంచులపై కొరడా! ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి జనాభా ఆధారంగా ఈ నిధులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇదే సమయంలో గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పాలకుల విధి నిర్వహణను కట్టుదిట్టం చేసేలా చట్ట సవరణలను సిద్ధం చేస్తోంది. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రంతో పాటు తాగునీటి సరఫరా, మురికి కాల్వలు, పారిశుద్ధ్యం, స్మశానవాటికల నిర్వహణను పక్కాగా చేపట్టేలా నిబంధనావళిని చట్టంలో పొందుపర్చనున్నారు. అవసరమైనన్ని నిధులిచ్చినా పట్టింపులేనట్లుగా బాధ్యతారహితంగా ప్రవర్తించే సర్పంచులను పదవి నుంచి తొలగించే అధికారం సైతం ప్రభుత్వానికి ఉండేలా చట్టానికి సవరణలు చేయాలని భావిస్తోంది. -
పల్లెసీమకు ఇక సర్పంచ్ కింగ్
సిద్దిపేట జోన్: గ్రామ సర్పంచ్‌లు పల్లెసీ మలకు ఇక కింగ్ లాంటి వారని, వచ్చే నెలలో పంచాయతీరాజ్ బిల్లు రానుందని, నిధులు పుష్కలంగా వస్తాయని గ్రామం ఆర్థికంగా బలోపేతంతోపాటు అభివృద్ధి మరింత వేగవంతంగా జరిగేందుకు ఆస్కారం ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆదివారం ఢంకా బజాయించి (బ్యాండ్ కొట్టి) అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో మంత్రులు పాల్గొన్నారు. నాయిని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ బిల్లును తీసుకురానున్నారని, మరో మూడు వారాల్లో ఈ బిల్లు రానుందన్నారు. ఇప్పటికే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మరో 1.12 లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామన్నారు. శాంతి పరిరక్షణలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. అందుకే దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని, ఇప్పటికే 2,500 పరిశ్రమల ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. హరీశ్‌రావే మాకు బాహుబలి.. మాకు కూడా బాహుబలి ఉన్నాడని.. యువ నాయకుడు హరీశ్‌రావే మాకు బాహుబలి లాంటి వాడని పరోక్షంగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై నాయిని ఆదివారం చమత్కరిస్తూ మాట్లాడారు. స్థానిక రెడ్డి సంక్షేమ భవన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ భూమి మీద నమ్మకం ఉన్న వారికే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా జైలుకు రూ.65 కోట్లు రానున్నాయని, వాటిని బడ్జెట్లో పెట్టామని, అత్యాధునిక వసతులతో జైలు నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా పారిశుద్ధ్య జిల్లాగా మారడం అభినందనీయ మని, ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం.. సిద్దిపేట ప్రజలు పట్టుదలకు మారు పేరని, అధికారుల, ప్రజాప్రతినిధుల, ప్రజల సమష్టి కృషికి ఫలితంగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మారడం సంతోషంగా ఉందని, ఇదే స్పూర్తిని ముందుకు కొనసాగించాలని, అందుకు మరో గురుతర లక్ష్యాన్ని ఎంచుకుందామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓడీఎఫ్ జిల్లాగా అధికారిక ప్రకటన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని 399 గ్రామాల్లో వైకుంఠ ధామాలను నిర్మించి దేశంలోనే వంద శాతం వైకుంఠధామాలు గల జిల్లాగా సిద్దిపేటకు రికార్డును సొంతం చేద్దామని పిలుపునిచ్చారు. అందుకు నేటి నుంచి మరో 75 రోజుల్లోగా లక్ష్యాన్ని ఎంచుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వంద శాతం వైకుంఠధామాలు ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్ల ఆగ్రహం
అహ్మదాబాద్: మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్లో సర్పంచ్ల అధికారాలకు అంట కత్తెరేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సర్కులర్‌పై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. సర్సంచ్‌లు ఏ అభివద్ధి కార్యక్రమానికి నిధులు కావాలన్నా తలాతి (విలేజ్ అకౌంటెంట్) అనుమతి తీసుకోవాలి. అందుకు అకౌంటెంట్ సంతకం చేయాలి. ఖర్చులన్నింటికి ఆయన లేదా ఆమెదే బాధ్యత. గతంలో నిధుల ఖర్చుకు ఓ సర్పంచ్, మరో పంచాయతీ సభ్యుడు బాధ్యులుగా ఉండేవారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థను ఈ కొత్త నిబంధన దెబ్బతీస్తుందని, ప్రజా ప్రతినిధుల అధికారాలను అంటకత్తెర వేస్తోందని రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివద్ధి పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవడం అంటే ఎలా ఉంటుందో, ఇది అలాగే ఉందని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి అధికారాలను కూడా కత్తిరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది సర్పంచ్‌లు నిరక్షరాస్యులను, దాన్ని ఆసరాగా తీసుకొని నిధులను ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చామని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి జయంతి కవాడియా చెబుతున్నారు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం కోసం అధికార వికేంద్రకరణ పేరిట కేంద్ర ప్రభుత్వం 1992లో 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. దీనిద్వారా జిల్లా, తాలూకా, గ్రామస్థాయిలో పంచాయతీ రాజ్ మూడంచెల వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ వచ్చి పాతికేళ్లు పూర్తవుతున్న ఇంకా బలపడలేదు. ఎక్కువ వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడే పనిచేయాల్సి వస్తోంది. సర్పంచ్‌లకు సరైనా అధికారాలు లేవు. నిర్వర్తించాల్సిన విధులెన్నో ఉన్నా అందుకు సరిపడా నిధులు లేవు. వ్యవసాయం, నీటిపారుదల, జంతుసంరక్షణ, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం లాంటి అన్ని విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి దానికి గ్రామ అకౌంటెంట్ లేదా రెవెన్యూ కార్యదర్శి అనుమతి తీసుకోవాలంటే తమకు చాలా ఇబ్బందని సర్పంచ్‌లు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఈ అధికారులు చాలా సందర్భాల్లో స్థానికులు కాకుండా ఉంటారని, అలాంటప్పుడు వారు గ్రామ అవసరాలను గుర్తించలేరని, కొన్ని సందర్భాల్లో మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక్క అకౌంటెంటే ఉంటారని, అలాంటప్పుడు వారు అందుబాటులో ఉండరని సర్పంచ్‌లు వాదిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగాలుగా తామేమీ మాట్లాడకూడదని, అయితే పని భారం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.