కొర్టికల్(బి) గ్రామపంచాయతీ
సాక్షి, నేరడిగొండ(బోథ్): ప్రజల ఆశీర్వాదంతో పదవి దక్కించుకున్న సర్పంచులకు చెక్ పవర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘మాకు చెక్ పవర్ ఇవ్వండి’ సారూ అంటూ నూతన సర్పంచులు అధికారుల వద్ద ప్రాధేయపడుతున్నారు. సర్పంచ్‌గా గెలిచినా.. శిక్షణ పూర్తి చేసిన తర్వాత చెక్ పవర్ ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌లో ఐదు రోజుల పాటు పంచాయతీరాజ్ చట్టంపై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో సర్పంచులు నిరాశ చెందుతున్నారు. ఎన్నికలకు ముందు జాయింట్ చెక్‌పవర్ అన్నారు. గెలిచాక సర్పంచులకు కూడా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది.
అప్పుల పాలవుతున్న సర్పంచులు
జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా 465 పంచాయతీల్లో ఎన్నికలు జరిగి 465 మంది సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వారికి చెక్‌పవర్ లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. నేరడిగొండ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు సర్పంచే తన జేబులో నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. అలాగే కుమారి గ్రామపంచాయతీ సర్పంచ్ సుమారు రూ.లక్షకు పైగా వివిధ పనుల నిమిత్తం ఖర్చు పెట్టారు. ఈ గ్రామపంచాయతీల సర్పంచులే కాకుండా జిల్లాలో వారే భరిస్తుండడంతో ఈ పదవి తలకుమించిన భారంగా మారిందని లోలోన మదన పడుతున్నారు.
సర్పంచులుగా గెలిచి ఇన్నిరోజులైనా చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ పేరిట ఉన్న అకౌంట్లలోని డబ్బులను తీయలేని పరిస్థితి నెలకొంది. గెలిచిన ఉత్సాహంతో గ్రామాల్లో డ్రెయినేజీలు శుభ్రం చేయించడం, తాగునీటి పైపుల లీకేజీలు మరమ్మతులు చేయించడం, ఇతర పనుల కోసం మేజర్ గ్రామాల్లో రూ.లక్షల్లో, చిన్న గ్రామాల్లో రూ.50వేలకుపైగానే ఖర్చు చేశారు. పంచాయతీ సిబ్బందికి కూడా ఆరు నెలలుగా జీతాలు ఇచ్చేది ఉంది. గ్రామాల్లో తక్కువ జీతాలకు పనిచేసే పారిశుధ్య కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జీతాల కోసం పనులు మానుకోవడం, ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతుండగా త్వరలో చెక్‌పవర్ వస్తుంది. రాగానే ఒకేసారి జీతాలు ఇస్తామని వారిని శాంతింపజేస్తున్నారు. తాగునీటి పైపులు లీకైనా, ఇతర అవసరాల కోసం నిత్యం రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఇదే విషయంపై ఇన్‌చార్జి ఎంపీడీఓ ప్రభాకర్‌ను సంప్రదించగా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వస్తేనే చెక్‌పవర్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
లక్షలు ఖర్చు చేశాం
చెక్‌పవర్ కోసం అధికారుల వద్ద ప్రాధేయ పడాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచిన ఉత్సాహంతో గ్రామంలో రూ.లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాం. శిక్షణ కూడా పొందాం. చెక్‌పవర్ ఇస్తే నిధులు డ్రా చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం.
– అల్లూరి ప్రపుల్‌చందర్‌రెడ్డి, సర్పంచ్, తేజాపూర్
Comments
Please login to add a commentAdd a comment