Village development funds
-
చెక్‌పవర్ ఏదీ?
పాపన్నపేట (మెదక్) : దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు ఉండాలి. కానీ పదవి చేపట్టి రెండు నెలలు గడిచినా చెక్ పవర్‌పై స్పష్టత లేకపోవడం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. నిధులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు జనాభా ప్రాతిపదికన రూ.17,12,71,000 పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. నిధులు మంజూరైనా .. చెక్కుపై రెండో సంతకం ఎవరు పెట్టాలన్న విషయంపై ఇంతవరకు స్పష్టత లేక పోవడంతో చిక్కు వచ్చి పడింది. జిల్లాలో 469 పంచాయతీలున్నాయి. 2018 జూలై నాటికి పాత సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో 2018 ఆగస్టు 2 నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. అప్పట్లో గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు స్పెషల్ ఆఫీసర్లకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. జనవరి 2019లో గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2 నుంచి కొత్త సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. చెక్కుపై రెండో సంతకమే చిక్కు .. 2018 ఏప్రిల్ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలన్న నిబంధనలు పొందు పరిచారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త నిబంధన అమలు కాదని అదే నెలలో సర్కార్ ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు ఎప్పటి మాదిరిగా పంచాయతీ కార్యదర్శుల జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలని మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు దాటిపోయినా పంచాయతీ నిధుల నుంచి రూపాయి కూడా డ్రా చేయలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచ్‌లు వాపోతున్నారు. నిధుల వరద.. తీయలేమనే బాధ ఈఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాకు రూ.17,12,71,000 మంజూరయ్యాయి. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలుండగా 7,67,428 జనాభా ఉంది. ఒక్కొక్కరికి రూ.259 చొప్పున నిధులు సంబంధిత పంచాయతీ ఖాతాల్లో పడ్డాయి. ఈ మేరకు వీటి నుంచి పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరా, మోటార్ల కొనుగోలు, రిపేర్లు, వీధి దీపాల నిర్వాహణ, కొనుగోళ్లు, అంతర్గత రోడ్లు తదితర పనులు చేపట్టొచ్చు. ఎండలు మండుతుండడంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మురికి కాల్వలు, విద్యుత్ దీపాల ఏర్పాటు అత్యవసరం కావడంతో చాలామంది సర్పంచ్‌లు సొంతంగా ఖర్చు చేసి పనులు చేయించారు. నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. గతంలో 2018లో స్పెషల్ ఆఫీసర్లు పదవీ బాధ్యతలు చేపట్టగానే అదే సంవత్సరం ఆగస్టులో పంచాయతీరాజ్ కమిషనర్ ఒక ఉత్తర్వు ఇస్తూ.. ప్రత్యేక అధికారి, కార్యదర్శి సంతకాలను అనుమతించా లంటూ స్పష్టత ఇచ్చారని సర్పంచ్‌లు అంటున్నారు. ప్రస్తుతం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అప్పటి లాగానే సర్పంచ్‌తో పాటు కార్యదర్శులకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. గత మార్చి తోనే ఆర్థిక సంవత్సరం ముగిసినందున అప్పు చేసి పనులు చేసిన తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. స్పష్టత ఇవ్వాలి సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.4 లక్షల పనులు చేపట్టాం. చెక్కు వివాదంతో బిల్లులు రావడం లేదు. పంచాయతీరాజ్ శాఖ స్పందించి ఏదో ఒకటి తేల్చాలి. వేసవి కాలం కావడంతో తాగునీటి సరఫరాపై ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఇబ్బంది కలుగకుండా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. – పి.బాపురెడ్డి, సర్పంచ్, మల్లంపేట త్వరలోనే పరిష్కారం.. గ్రామ పంచాయతీ చెక్కుపై జాయింట్ పవర్ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. అందుకే బిల్లులు పాస్ కావడం లేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ఏర్పడింది. దానికనుగుణంగా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది. – హనూక్, జిల్లా పంచాయతీ అధికారి -
‘పవర్’ లేక పరేషాన్!
సాక్షి, నేరడిగొండ(బోథ్): ప్రజల ఆశీర్వాదంతో పదవి దక్కించుకున్న సర్పంచులకు చెక్ పవర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘మాకు చెక్ పవర్ ఇవ్వండి’ సారూ అంటూ నూతన సర్పంచులు అధికారుల వద్ద ప్రాధేయపడుతున్నారు. సర్పంచ్‌గా గెలిచినా.. శిక్షణ పూర్తి చేసిన తర్వాత చెక్ పవర్ ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌లో ఐదు రోజుల పాటు పంచాయతీరాజ్ చట్టంపై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో సర్పంచులు నిరాశ చెందుతున్నారు. ఎన్నికలకు ముందు జాయింట్ చెక్‌పవర్ అన్నారు. గెలిచాక సర్పంచులకు కూడా చెక్‌పవర్ ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. అప్పుల పాలవుతున్న సర్పంచులు జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా 465 పంచాయతీల్లో ఎన్నికలు జరిగి 465 మంది సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వారికి చెక్‌పవర్ లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. నేరడిగొండ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు సర్పంచే తన జేబులో నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. అలాగే కుమారి గ్రామపంచాయతీ సర్పంచ్ సుమారు రూ.లక్షకు పైగా వివిధ పనుల నిమిత్తం ఖర్చు పెట్టారు. ఈ గ్రామపంచాయతీల సర్పంచులే కాకుండా జిల్లాలో వారే భరిస్తుండడంతో ఈ పదవి తలకుమించిన భారంగా మారిందని లోలోన మదన పడుతున్నారు. సర్పంచులుగా గెలిచి ఇన్నిరోజులైనా చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ పేరిట ఉన్న అకౌంట్లలోని డబ్బులను తీయలేని పరిస్థితి నెలకొంది. గెలిచిన ఉత్సాహంతో గ్రామాల్లో డ్రెయినేజీలు శుభ్రం చేయించడం, తాగునీటి పైపుల లీకేజీలు మరమ్మతులు చేయించడం, ఇతర పనుల కోసం మేజర్ గ్రామాల్లో రూ.లక్షల్లో, చిన్న గ్రామాల్లో రూ.50వేలకుపైగానే ఖర్చు చేశారు. పంచాయతీ సిబ్బందికి కూడా ఆరు నెలలుగా జీతాలు ఇచ్చేది ఉంది. గ్రామాల్లో తక్కువ జీతాలకు పనిచేసే పారిశుధ్య కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జీతాల కోసం పనులు మానుకోవడం, ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతుండగా త్వరలో చెక్‌పవర్ వస్తుంది. రాగానే ఒకేసారి జీతాలు ఇస్తామని వారిని శాంతింపజేస్తున్నారు. తాగునీటి పైపులు లీకైనా, ఇతర అవసరాల కోసం నిత్యం రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఇదే విషయంపై ఇన్చార్జి ఎంపీడీఓ ప్రభాకర్‌ను సంప్రదించగా జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వస్తేనే చెక్‌పవర్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. లక్షలు ఖర్చు చేశాం చెక్‌పవర్ కోసం అధికారుల వద్ద ప్రాధేయ పడాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచిన ఉత్సాహంతో గ్రామంలో రూ.లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాం. శిక్షణ కూడా పొందాం. చెక్‌పవర్ ఇస్తే నిధులు డ్రా చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. – అల్లూరి ప్రపుల్‌చందర్‌రెడ్డి, సర్పంచ్, తేజాపూర్ -
చేసిన పనే మళ్లీ మళ్లీనా!
తూర్పుగోదావరి, కొత్తపేట: గ్రామాల్లో వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, పురోగతిపై రెండు రోజుల్లో సర్వే జరిపి నివేదించాలని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులను ప్రభుత్వం గ్రామాల్లోకి పంపింది. గ్రామదర్శినిలో గ్రామీణాభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆ మేరకు 51 అంశాలకు సంబంధించి 2018 మార్చి 31 నాటికి ప్రగతి, పూర్తి చేయడానికి మిగిలిన లక్ష్యం, 2018–19 లక్ష్యం, 2019–24 లక్ష్యం అంటూ నాలుగు కాలమ్స్, రెండు పేజీల్లో పేర్కొన్నారు. విద్యాశాఖకు సంబంధించి మరుగుదొడ్లు కలిగిన పాఠశాలల సంఖ్య తదితర 5 అంశాలు, పంచాయతీరాజ్‌కు సంబంధించి బీటీ రోడ్ల సదుపాయం కలిగి ఉన్న ఆవాసాలు, తాగు నీరు, అంగన్వాడీ, పీహెచ్సీ, మీ–సేవ, శిశు, మాతృ మరణాల సంఖ్య, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సంఖ్య తదితర 51 అంశాలను పేర్కొన్నారు. వీటిపై ఇప్పటికే గ్రామ దర్శిని ద్వారా కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు సర్వే చేసి నివేదికను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ద్వారా జిల్లా అధికారులకు నివేదించారు. ఆ నివేదిక సక్రమమా? కాదా? అనే దానిపై రీ సర్వే చేసి నివేదించాలని కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులను రంగంలోకి దింపారు. రెండు రోజుల్లోనే.. ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులకు ఒక అధ్యాపకుడి చొప్పున బృందాలుగా విభజించి, మండలానికి రెండు బృందాలకు ఈ సర్వే బాధ్యతలు అప్పగించారు. అలా జిల్లా వ్యాప్తంగా 74 ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు చెందిన 218 మంది అధ్యాపకులను (మోనిటర్స్గా), 854 మంది విద్యార్థులను రంగంలోకి దింపింది. ఈ విధంగా ఒక్కో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మూడు, నాలుగు మండలాలకు వెళ్లారు. పలు మండలాల్లో బృందాలు మండల పరిషత్ కార్యాలయాలకు లేదా గ్రామ పంచాయతీలకు వెళ్లి ఇప్పటికే నివేదించిన నకళ్లను తీసుకుని పరిశీలించి వాటిలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి నివేదించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఇదేమిటండీ! అంటే ఏమి చేస్తామండీ! అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించి 51 అంశాలపై సర్వే రెండు రోజుల్లో రెండు బృందాలు పూర్తి చేయడం సాధ్యమా? అని ఓ అధ్యాపకుడు ప్రశ్నించారు. చదువులు గాలికొదిలేసి గ్రామాల్లో అదీ ఇతర మండలాలకు వెళ్లి సర్వే చేయమన్నారు.. రవాణా చార్జీలు, భోజనం ఖర్చులు ఏమీ లేవు. ఎలా? అని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. పబ్లిసిటీ కోసమా? ఈ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరిస్తోందని, దానిలో భాగంగా అధికారులు బాగా పనిచేస్తున్నారా? లేదా? వారిచ్చే నివేదికలు సంతృప్తికరమేనా? కాదా అని అనుమానిస్తూ వారి నివేదికలపై రీ సర్వేకు అధ్యాపకులు, విద్యార్థులను నియమించినట్టు ప్రజల నుంచి మెప్పు పొందడానికి, ప్రచారం కోసమేనని పలువురు అధికకారులు, అధ్యాపకులు పెదవివిరిచారు. -
పట్టాలెక్కని పల్లె ప్రగతి
పల్లె ప్రగతి పథకం కింద ప్రభుత్వం కొన్ని ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెనుకబడిన మండలాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోనే తక్కువ వర్షపాతం నమోదు కావడం, ఎక్కువ నిరక్షరాస్యత, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్కువ ప్రసవాల శాతం.. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు, పౌష్టికాహారం సరిగా అందని ప్రాంతాలను గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేశారు. జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు: ప్రపంచ బ్యాంకు సహకారంతో వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ప్రారంభించిన తెలంగాణ పల్లె ప్రగతి పథకం (తెలంగాణ రూరల్ ఇన్‌క్లూసివ్ గ్రోత్ ప్రాజెక్ట్ –టీఆర్ఐజీపీ) పట్టాలెక్కడం లేదు. పథకం ప్రారంభించి మూడేళ్లు కావొస్తున్న పురోగతి కన్పించడం లేదు. కోట్ల రూపాయలు కేటాయించినా ఇప్పటివరకు ఖర్చు చేయని దుస్థితి కన్పిస్తోంది. ఉపాధి కల్పనే ప్రధానాంశం.. పల్లె ప్రగతి కింద గుర్తించిన గ్రామాల్లోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకురావడం ప్రధాన ధ్యేయం. గ్రామీణ ఉత్పత్తి రంగాలను అభివృద్ధి చేస్తూనే ప్రజల ఆసక్తిని బట్టి ఉపాధి కల్పించాలి. గేదెలు, గొర్రెల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, స్వయం ఉపాధి పొందడం కోసం ఏర్పాటు చేసుకునే కుటీర పరిశ్రమలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాల్సి ఉంది. మహిళా పొదుపు సంఘాల సభ్యులకు రుణాలు అందించడం ప్రత్యేక అంశం. కేటాయింపులు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా తెలంగాణ పల్లె ప్రగతి పథకానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచ బ్యాంకు రూ.450 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లతో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థికవృద్ధి రేటును పెంచడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కొనసాగింది ఆరు నెలలే.. హైదరాబాద్ మినహా నాటి తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని 150 అత్యంత వెనుకబడిన మండలాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. అప్పటి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2015, ఆగస్టులో మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించారు. ఆరు నెలలపాటు పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. ఉన్నట్టుండి ఈ కార్యక్రమాల అమలును నిలుపుదల చేశారు.లక్ష్యం పెద్దదే.. అయినా.. రూ.653 కోట్ల వ్యయంతో 150 మండలాల్లోని సుమారు 75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చేపట్టిన ఈ పథకం అర్ధంతరంగానే ఆగిపోయింది. పల్లె ప్రగతితో తమ జీవితాలు మారిపోతాయని భావించిన వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 75 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం 150 తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎంపికైన మండలాలు రూ.653 కోట్లు స్వయం ఉపాధి కల్పనకు కేటాయించిన నిధులు.. రూ.203 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సిన నిధులు ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటుగా పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెటింగ్ సౌకర్యం స్థానికంగానే కల్పిస్తారు. ఈ పథకంలో మంచి అంశాలను చేర్చినా అమలులో జాప్యం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నా ఏ కారణాల వల్ల నిలిపివేశారో తెలియడం లేదు. ఈ పథకంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
లెక్కల్లోగుట్టు..ఎవరికెరుక!
విజయనగరం మున్సిపాలిటీ: ఒక చిన్న ఇంట్లో నెలవారీ ఖర్చులకు గాను పదిసార్లు లెక్కలు వేసుకునే పరిస్థితి ఉన్న తరుణంలో గ్రామాభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులకు లెక్కలు తేలడం లేదు. పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కల సంగతేంటి? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖర్చులను కంప్యూటరీకరణ చేయడంలో తాత్సారం చేయడంతో అవి పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు పంచాయతీల్లో గ్రామ సభ తీర్మా నం పెట్టకుండా, ఎటువంటి వివరాలు లేకుండానే భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించడం గమనార్హం. భారీగా నిధులు సుమారు మూడేళ్ల పాటు నిధుల లేమితో నీరసించిన పంచాయతీలకు గత ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నికల అనంతరం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ గ్రాంట్ల కింద రూ.కోట్లాదిగా నిధులు మంజూరుచేశాయి. రెండు విడతలుగా వివిధ గ్రాంట్ల కిం ద మొత్తం రూ.23 కోట్ల 83 లక్షల 85వేల 400 విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిధుల్లో ఒక్కో పం చాయతీకి రూ.60వేల చొప్పున కేటాయించారు. భారీ మొత్తంలో పంచాయతీలకు నిధుల కేటాయింపు జరుగుతున్నా పల్లెల్లో అభివృద్ధి మాత్రం కానరాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిధుల వినియోగంపై జరగని ఆన్లైన్ పంచాయతీలకు వివిధ గ్రాంట్ల కింద విడుదలవుతున్న నిధులను ఏ పనికి ఎంత మొత్తంలో కేటాయించారో... వాటి వివరాలను, ఆ మొత్తాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు సంబంధించి జిల్లాలో మొత్తం 495 క్లస్టర్లు ఉండగా.. అందులో తొలి విడగా 203 క్లస్టర్ల పరిధిలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ విధానాన్ని అమలు చేసేందుకు కంప్యూటర్లు పంపిణీ చేయగా...వాటిని నిర్వహించే సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు ఎప్పటినుంచే చెప్పుకొస్తున్నారు. అయితే జిల్లాలో ఏ పంచాయతీలో కూడా ఈ క్రమపద్ధతిని అనుకరించే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు కుమ్మక్కై ఇష్టారీతిన నిధులు డ్రా చేయడంతో పాటు నెలల తరబడి అందుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయని పరిస్థితి ఉంది. 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, చినగుడబ, ఉద్దవోలు పంచాయతీల్లో 13వ ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్, సాధారణ నిధుల కింద కేటాయించిన రూ.5.03 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించిన కలెక్టర్ సంబంధిత కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా డెంకాడ మంలం మోదవలస పంచాయతీలో రూ.20.47లక్షల వ్యయంతో కూడిన పనులను గ్రామ సభ తీర్మానం లేకుండా, ఎటువంటి ప్రతిపాదనలు రూపొందించకుండా చేపట్టారన్న ఆరోపణలపై ఆ పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానరాని ఈఓపీఆర్డీల పర్యవేక్షణ వాస్తవానికి పంచాయతీలో చేపట్టే అన్ని కార్యక్రమాలపై ఈఓపీఆర్డీలు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితిలేదు. మండలానికి ఒక్కొక్కరు చొప్పున ఉండే అధికారులు కేవలం ఎంపీడీఓ కార్యాలయానికే పరిమితమవుతున్నారన్న విమర్శలను ఏ ఒక్కరూ ఖండించలేకపోతున్నారు. ఫలితంగా కార్యదర్శులే అంతా తామై వ్యవహరించడంతో సర్పంచ్‌లతో చేయికలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి బి.మోహనరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావిం చగా.. పంచాయతీల్లో వినియోగిస్తున్న నిధులకు సంబందించి ఆన్లైన్ నమోదు జరగని మాట వాస్తవమేనన్నారు. ఈ విషయంపై ఈఓపీఆర్డీలతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తున్నా సక్రమంగా స్పందించడం లేదని చెప్పారు. నిబంధనల మేరకు నిధులు వినియోగించని పక్షంలో చర్యలు తప్పవని ఈ విషయంలో కార్యదర్శులే బాధ్యత వహిస్తారని హెచ్చరించారు.