లెక్కల్లోగుట్టు..ఎవరికెరుక!
విజయనగరం మున్సిపాలిటీ: ఒక చిన్న ఇంట్లో నెలవారీ ఖర్చులకు గాను పదిసార్లు లెక్కలు వేసుకునే పరిస్థితి ఉన్న తరుణంలో గ్రామాభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులకు లెక్కలు తేలడం లేదు. పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కల సంగతేంటి? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖర్చులను కంప్యూటరీకరణ చేయడంలో తాత్సారం చేయడంతో అవి పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు పంచాయతీల్లో గ్రామ సభ తీర్మా నం పెట్టకుండా, ఎటువంటి వివరాలు లేకుండానే భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించడం గమనార్హం.
భారీగా నిధులు
సుమారు మూడేళ్ల పాటు నిధుల లేమితో నీరసించిన పంచాయతీలకు గత ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నికల అనంతరం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ గ్రాంట్‌ల కింద రూ.కోట్లాదిగా నిధులు మంజూరుచేశాయి. రెండు విడతలుగా వివిధ గ్రాంట్‌ల కిం ద మొత్తం రూ.23 కోట్ల 83 లక్షల 85వేల 400 విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిధుల్లో ఒక్కో పం చాయతీకి రూ.60వేల చొప్పున కేటాయించారు. భారీ మొత్తంలో పంచాయతీలకు నిధుల కేటాయింపు జరుగుతున్నా పల్లెల్లో అభివృద్ధి మాత్రం కానరాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిధుల వినియోగంపై జరగని ఆన్‌లైన్
పంచాయతీలకు వివిధ గ్రాంట్‌ల కింద విడుదలవుతున్న నిధులను ఏ పనికి ఎంత మొత్తంలో కేటాయించారో... వాటి వివరాలను, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇందుకు సంబంధించి జిల్లాలో మొత్తం 495 క్లస్టర్‌లు ఉండగా.. అందులో తొలి విడగా 203 క్లస్టర్‌ల పరిధిలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేసేందుకు కంప్యూటర్‌లు పంపిణీ చేయగా...వాటిని నిర్వహించే సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు ఎప్పటినుంచే చెప్పుకొస్తున్నారు.
అయితే జిల్లాలో ఏ పంచాయతీలో కూడా ఈ క్రమపద్ధతిని అనుకరించే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు కుమ్మక్కై ఇష్టారీతిన నిధులు డ్రా చేయడంతో పాటు నెలల తరబడి అందుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ చేయని పరిస్థితి ఉంది. 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, చినగుడబ, ఉద్దవోలు పంచాయతీల్లో 13వ ఆర్థిక సంఘం, బీఆర్‌జీఎఫ్, సాధారణ నిధుల కింద కేటాయించిన రూ.5.03 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించిన కలెక్టర్ సంబంధిత కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా డెంకాడ మంలం మోదవలస పంచాయతీలో రూ.20.47లక్షల వ్యయంతో కూడిన పనులను గ్రామ సభ తీర్మానం లేకుండా, ఎటువంటి ప్రతిపాదనలు రూపొందించకుండా చేపట్టారన్న ఆరోపణలపై ఆ పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కానరాని ఈఓపీఆర్‌డీల పర్యవేక్షణ
వాస్తవానికి పంచాయతీలో చేపట్టే అన్ని కార్యక్రమాలపై ఈఓపీఆర్‌డీలు పర్యవేక్షణ చేయాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితిలేదు. మండలానికి ఒక్కొక్కరు చొప్పున ఉండే అధికారులు కేవలం ఎంపీడీఓ కార్యాలయానికే పరిమితమవుతున్నారన్న విమర్శలను ఏ ఒక్కరూ ఖండించలేకపోతున్నారు. ఫలితంగా కార్యదర్శులే అంతా తామై వ్యవహరించడంతో సర్పంచ్‌లతో చేయికలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి బి.మోహనరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావిం చగా.. పంచాయతీల్లో వినియోగిస్తున్న నిధులకు సంబందించి ఆన్‌లైన్ నమోదు జరగని మాట వాస్తవమేనన్నారు. ఈ విషయంపై ఈఓపీఆర్‌డీలతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తున్నా సక్రమంగా స్పందించడం లేదని చెప్పారు. నిబంధనల మేరకు నిధులు వినియోగించని పక్షంలో చర్యలు తప్పవని ఈ విషయంలో కార్యదర్శులే బాధ్యత వహిస్తారని హెచ్చరించారు.