పన్ను వేసుకో.. అభివృద్ధి చేసుకో
- పంచాయతీ ఆదాయాలతోనే గ్రామాల్లో వసతులు
- వికేంద్రీకృత అభివృద్ధి పేరిట సంస్కరణలు
- ఐదే ళ్ల ప్రణాళికల రచనకు ఏర్పాట్లు
ఏలూరు : గ్రామ స్వపరిపాలనలో సం స్కరణలు మొదలయ్యాయి. ప్రతి లావాదేవీని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా ఆదాయం, వ్యయా ల విషయంలో పంచాయతీ పాలకవర్గాలు, ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంచనున్నారు. ఇప్పటికే ఆ కసరత్తు మొదలైంది. సెప్టెంబర్ నెల నుంచి పంచాయతీ పాలన ఆన్‌లైన్ కానున్న నేపథ్యంలోనే మౌలిక వసతుల కల్పన ఆయూ గ్రామాలకు వచ్చే ఆదాయాలతోనే చేపట్టేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
దీంతో పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పన్నుల భారం పెరగనుంది. దాంతోపాటు అదనంగా ఆదాయ వనరులను దశలవారీగా అన్వేషించుకుని ఆ మొత్తాలతోనే గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ జీవో నంబర్-464ను జారీ చేసింది. దీంతో జిల్లాలోని 884 పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికల రూపక ల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఇందుకు పంచాయతీలను సమాయత్తం చేసే దిశగా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం కుళాయి, ఆస్తిపన్నులే గ్రామాలకు ఆధారంగా ఉన్నాయి. మరిన్ని ఆదాయ వనరులు సమకూర్చుకునే దిశగా సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఈవోఆర్డీలకు అవగాహన కల్పించేం దుకు డివిజన్‌స్థాయిలో అవగాహన, శిక్షణ కార్యక్రమాలను పంచాయతీ శాఖ చేపట్టింది. అనంతరం మూడు నెలల్లో వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉన్న ట్టు అధికారులు చెబుతున్నారు.
నాలుగు దశల్లో అభివృద్ధి ప్రణాళిక
అన్ని గ్రామాల్లో వికేంద్రీకృత ప్రణాళిక అమలు చేయనున్నారు. తొలుత ఆ గ్రామంలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తా రు. రెండో దశలో తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, వ్యవసా యం, ఆరోగ్యం, పశు సంవర్థకం, గృహనిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ రహదారులు, పర్యాటక రంగం వంటి అంశాలకు సంబంధించి సమాచారం సేకరి స్తారు. మూడో దశలో ఆర్థిక వనరుల సమీకరణ చేస్తారు.
తప్పనిసరి, ఐచ్ఛిక పన్నులను గుర్తిస్తారు. ఇంటి పన్ను, నీటి పన్ను, వీధిదీపాల పన్ను, డ్రెనేజీ పన్ను ,గ్రంథాలయ పన్ను, కొలగారం, ప్రకటన పన్నులతోపాటు పన్నేతరాలైన కుళాయి, చెరువులు, మార్కెట్లు, సంతలు, లే-అవుట్ ఫీజు, సేవా రుసుం, ఆక్రమణ పన్నులు, ప్రభుత్వ కేటాయింపులు, ప్రభుత్వ గ్రాంట్లు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలయ్యే ఆదాయూలను గుర్తిస్తారు.
వీటన్నింటినీ క్రోఢీకరించి నాలుగో దశలో మండల స్థాయి, గ్రామ స్థాయి సిబ్బంది కలిసి గుర్తించిన గ్రామస్థాయి అవసరాలపై చిత్తు ప్రతిని తయారు చేస్తారు. తరువాత గ్రామసభల్లో చర్చించి మార్పులు చేర్పులకు అనుగుణంగా అంతిమ ప్రణాళికను తయారు చేస్తారు. ఇదంతా పూర్తయ్యాక అన్ని గ్రామాల్లో తయారైన వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికను కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి అధికారుల సమక్షంలో మండలస్థాయి సమావేశంలో అభివృద్ది ప్రణాళికలను సిద్ధం చేస్తారు. 2015-16 నుంచి కొత్త ప్రణాళికతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రంగం సిద్ధం చేయనున్నట్టు పంచాయతీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.