పల్లెల్లో ‘పరోక్షమే’! | TS govt willing to change local body elections process | Sakshi
Sakshi News home page

పల్లెల్లో ‘పరోక్షమే’!

Published Sat, Dec 2 2017 3:03 AM | Last Updated on Sat, Dec 2 2017 8:50 AM

TS govt willing to change local body elections process - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఇక సర్పంచుల ఎన్నిక పరోక్షం కానుంది. నేరుగా ప్రజలే ఎన్నుకునేలా కాకుండా.. ఎన్నికైన వార్డు మెంబర్లే తమలో నుంచి ఒకరిని సర్పంచుగా ఎన్నుకునే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు నేరుగా రాజకీయ పార్టీల అధికారిక అభ్యర్థులుగా, పార్టీ గుర్తులతోనే గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచులకు కచ్చితమైన విధి విధానాలు ఏర్పరచాలని.. సరిగా పనిచేయకపోతే తొలగించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉండాలని నిర్ణయించింది. స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా, గ్రామాల పాలకులు మరింత జవాబుదారీగా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్ట సవరణపై తుది కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీల్లో శివారు గ్రామాల విలీనం, తండాలు, గూడేలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయడం తదితర అంశాలనూ సవరణలో చేర్చనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును వచ్చే వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2018 జూలై 31తో రాష్ట్రంలో ప్రస్తుత గ్రామ సర్పంచ్‌లు, పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ఆసక్తి రేపుతోంది.

ఎన్నికల విధానంలో మార్పులు..
ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల ఎన్నిక ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో జరుగుతోంది. దానికి బదులుగా ఉప సర్పంచ్‌ పదవికి జరుగుతున్న తరహాలో పరోక్షంగా (వార్డు మెంబర్లు ఎన్నుకునేలా) సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దిశగా సమాలోచనలు చేస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల కారణంగా సర్పంచ్‌ పదవికి పోటీపడే అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు గెలిచిన వార్డు మెంబర్లు తమలో ఒకరిని సర్పంచ్‌గా ఎంచుకునే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఉప సర్పంచ్‌ ఎన్నికకు ఇదే విధానం అమల్లో ఉంది. అయితే ఈ విధానం క్యాంపు రాజకీయాలు, గ్రూపులు, కోరం లేకుండా అభ్యర్థులను అదృశ్యం చేసే ఎత్తుగడలు వంటివాటికి తావిస్తుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో వార్డు మెంబర్ల ఫలితాలు వెలువడిన వెంటనే.. అప్పటికప్పుడు సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ దిశగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, పలువురు రాజకీయ ముఖ్యులకు సూచించినట్లు తెలిసింది.

పార్టీ గుర్తులతోనే ఎన్నికలు..!
పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పార్టీ రహితంగా, పార్టీల గుర్తులేమీ లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీల్లో క్రియాశీలంగా ఉన్న అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. అభ్యర్థి గుర్తింపు, బ్యాలెట్‌ పత్రాల్లో మాత్రం పార్టీలకతీతంగా గుర్తులను కేటాయిస్తున్నారు. పార్టీలు, జెండాల వివాదాలకు తావు లేకుండా పల్లెల్లో సామరస్య వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానం కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీ సర్పంచులెందరు గెలిచారు, వార్లు మెంబర్లు ఎందరు విజయం సాధించారన్న బలబలాలను చాటుకోవటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తులతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధ్యయనం జరుగుతోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ ఈ దిశగా చట్ట సవరణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

గ్రామాల విలీనాధికారం సర్కారుకు..
ప్రస్తుతం మున్సిపాలిటీల చుట్టుపక్కల, పరిసరాల్లో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలంటే చట్టపరంగా చిక్కులు ఉన్నాయి. దాంతో ప్రభుత్వం న్యాయపరమైన కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేలా పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిసర గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసే సంపూర్ణ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం పది వేల జనాభాకు మించి ఉన్న గ్రామాలను నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలుచోట్ల వీటికి సానుకూలత ఉన్నా.. కొన్ని చోట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. పట్టణాల్లో కలిస్తే గ్రామాలకు ఉపాధి హామీ నిధులు రావని, అన్ని రకాల పన్నులు పెరుగుతాయన్న అభిప్రాయం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం... భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి దృష్ట్యా అలాంటి గ్రామాలను పట్టణాల్లో విలీనం చేయాలని పట్టుదలతో ఉంది.

కొత్త పంచాయతీల ఏర్పాటు కూడా..
గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శివారు పల్లెలను సైతం పంచాయతీలుగా చేయనుంది. 500, 600 జనాభాకు మించిన పల్లెలు, ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ కేంద్రాలకు రెండు కిలోమీటర్ల దూరంలోని వాటికి తొలుత ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలను చేర్చనుంది.

పనిచేయని సర్పంచులపై కొరడా!
ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్‌లో గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి జనాభా ఆధారంగా ఈ నిధులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇదే సమయంలో గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పాలకుల విధి నిర్వహణను కట్టుదిట్టం చేసేలా చట్ట సవరణలను సిద్ధం చేస్తోంది. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు తాగునీటి సరఫరా, మురికి కాల్వలు, పారిశుద్ధ్యం, స్మశానవాటికల నిర్వహణను పక్కాగా చేపట్టేలా నిబంధనావళిని చట్టంలో పొందుపర్చనున్నారు. అవసరమైనన్ని నిధులిచ్చినా పట్టింపులేనట్లుగా బాధ్యతారహితంగా ప్రవర్తించే సర్పంచులను పదవి నుంచి తొలగించే అధికారం సైతం ప్రభుత్వానికి ఉండేలా చట్టానికి సవరణలు చేయాలని భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement