TS govt
-
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజ్యమేలుతోన్న నిర్లక్ష్యం
-
తెలంగాణ మద్యం పాలసీలో మార్పులు ఇవే.. జీవో విడుదల
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్లకు గాను మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. 2021–23 సంవత్సరాలకు వైన్ (ఏ4) షాపుల కేటాయింపు నిబంధనలతో సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం జీవో ఎంఎస్ నం.98 విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే 2023 నవంబర్ 30 వరకు ఈ పాలసీ వర్తిస్తుంది. గత రెండేళ్ల కాలా నికి (2019–21) ఇచ్చిన నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు చేస్తూ ఈ నిబంధనలు రూపొందించారు. మద్యం దుకాణాల కోసం టెండర్ దరఖాస్తు ఫీజును గతంలోలాగే రూ.2 లక్షలుగా నిర్ధారించగా, ఎక్సైజ్ ఫీజును కూడా పాత స్లాబుల్లోనే కొనసాగించారు. అయితే ఫీజు చెల్లింపు వాయిదాల పెంపు, బ్యాంకు గ్యారెంటీ చూపించాల్సిన మొత్తం తగ్గింపు, టర్నోవర్‌పై రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ పెంపు లాంటి నిర్ణయాలతో ఈసారి కొత్త మద్యం పాలసీ విడుదల చేశారు. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలివే.. మద్యం షాపుల టెండర్లో పాల్గొనే దరఖాస్తు ఫీజును గత పాలసీలో ఉన్నట్లే రూ.2 లక్షలు ఖరారు చేశారు. టెండర్లో షాప్ రాకుంటే ఈ ఫీజు ప్రభుత్వానికి జమ అవుతుంది. ఎక్సైజ్ ఫీజును కూడా జనాభా ఆధారంగా పాత పాలసీలో ఉన్న స్లాబులుగానే నిర్ధారిస్తారు. ఫీజులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ఫీజును గతంలో ఏడాదికి నాలుగు సార్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ వాయిదా సంఖ్యను ఆరుకు పెంచారు. ఈ ఫీజు మొత్తంలో 25 శాతానికి బ్యాంకు గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది. గతంలో మాదిరిగానే ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం లేదు. లైసెన్సు లభించిన షాపు నుంచి నిర్ధారిత కోటా కన్నా ఏడు రెట్లు దాటితే గతంలో మార్జిన్ 6.4 శాతం ఉండేది. ఇప్పుడు ఆ కోటాను 10 రెట్ల వరకు 27 శాతంగా పెంచారు. కొన్ని మద్యం బ్రాండ్లపై 20 శాతం మార్జిన్ ఇవ్వనున్నారు. 10 రెట్ల టర్నోవర్ తర్వాత కూడా వ్యాపారులకు 10 శాతం మార్జిన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మొత్తం షాపులో 15 శాతం గౌడ, 10 శాతం ఎస్సీ, 5 శాతం ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన షాపులను జిల్లాలు యూనిట్‌గా ఆ జిల్లాలో సదరు సామాజికవర్గ జనాభాను రాష్ట్రంలోని ఆ సామాజికవర్గ జనాభాతో పోల్చి కేటాయిస్తారు. అది కూడా జిల్లా కలెక్టర్లు డ్రా పద్ధతిలో నిర్ధారిస్తారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి జిల్లా కలెక్టర్లు లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తారు. రిటైల్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ (షాపు ఫీజు)ను గతంలో ఉన్న స్లాబుల ప్రకారమే నిర్ణయించారు. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబును జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు 2 కిలోమీటర్ల దూరంలోని షాపులకు వర్తింపజేయనున్నారు. పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాలి. వాకిన్ స్టోర్ కావాలంటే మరో రూ.5 లక్షలు అదనంగా చెల్లించాలి. జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయించిన దుకాణాలకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లను ఏర్పాటు చేయాలా అనే అధికారాలను ఎక్సైజ్ కమిషనర్‌కు కట్టబెట్టారు. పెంచుదామా.. వద్దా? రాష్ట్రంలో అదనంగా కొత్త షాపులను నోటిఫై చేద్దామా వద్దా అన్న దానిపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2,216 (ఏ4) వైన్‌షాపులకు అనుమతి ఉంది. ఈ షాపుల సంఖ్యను రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెంచలేదు. ఈసారి రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో షాపుల సంఖ్య పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారీగా అమ్మకాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ షాపులు పెంచుదామనే కసరత్తు జరుగుతోంది. అయితే మరో 350 దుకాణాలా? 220 దుకాణాలా లేదా అసలే పెంచకుండా పాత షాపులనే నోటిఫై చేద్దామా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని బార్‌షాపులు నష్టాల్లో నడుస్తున్నాయన్న చర్చ నేపథ్యంలో వైన్‌షాపులు పెంచితే బార్లు ఆర్థికంగా మరింత దెబ్బతింటాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వం శనివారం ఇచ్చిన నోటిఫికేషన్లో షాపుల సంఖ్య ప్రస్తావన లేదు. దరఖాస్తు షెడ్యూల్ విడుదల సమయంలో ఈ సంఖ్యను స్పష్టం చేస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా నేడో, రేపో వెలువడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 9 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించి 20న డ్రాలు తీసి, అదే రోజున ప్రొవిజనల్ లైసెన్సులు ఇస్తారు. కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఎక్సైజ్ ఫీజు స్లాబులివే: జనాభా ఎక్సైజ్ ఫీజు (సంవత్సరానికి లక్షల రూపాయల్లో) 5 వేల వరకు 50 5 వేల నుంచి 50 వేల వరకు 55 50 వేల నుంచి లక్ష వరకు 60 లక్ష నుంచి 5లక్షల వరకు 65 5 నుంచి 20లక్షల వరకు 85 20 లక్షల కంటే ఎక్కువ 110 -
భూములపై త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లేందుకు అవసరమైన సమస్త సమాచా రాన్ని సేకరిస్తోంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, కొన్ని రకాల భూముల స్వాధీనంతో పాటు ధరణి రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలను పక్కాగా క్రోడీకరించే పని మొదలుపెట్టింది. రాష్ట్రం లోని అన్ని రకాల భూముల వివరాలను నిర్దేశించిన ఫార్మాట్లో పంపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. మొత్తం 9 రకాల భూముల వివరాలను మండలాలు, సర్వే నంబర్ల వారీగా పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ ఇంటిస్థలాల అంశంపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ముందుంచాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని కోరారు. ఈ లేఖకు జత చేసిన ఫార్మాట్లో ప్రతి కేటగిరీ భూమికి సంబం ధించిన ధర (చదరపు అడుగుకు)ను పేర్కొనాలని, లబ్ధిదారుల సంఖ్యతోపాటు ప్రస్తుత పరిస్థితి, సిఫారసులను కూడా జత పర్చాలని కోరడంతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తోందని, అందులో భాగంగానే ఈ వివరాలను అడిగిందనే చర్చ జరుగుతోంది. గ్రామకంఠం నుంచి సీలింగ్ భూముల వరకు ప్రభుత్వం మొత్తం తొమ్మిది కేటగిరీల కింద సమా చారాన్ని కోరింది. ఇందులో సీలింగ్ భూములు, 2008లో విడుదల చేసిన జీవో నం:166 ప్రకారం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, జీవో 58, 59ల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, గ్రామకంఠాలు, ప్రభు త్వం లీజుకిచ్చిన భూములు ఉన్నాయి. వీటితో పాటు రైతులు ధరణి పోర్టల్ ద్వారా క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీల్లేకుండా నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో గల ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను పంపాలని కూడా ప్రభుత్వం కోరింది. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. వేల సర్వే నంబర్లలోని పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉండగా రైతులు వీటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. గత రెండు, మూడు నెలల క్రితం వరకు ఈ విషయంలో ఏం చేయాలో రెవెన్యూ వర్గాలకు కూడా అంతు చిక్కలేదు. మొత్తానికి ఇటీవల ఈ జాబితా నుంచి పట్టా భూములను తొలగించుకునేందుకు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం రైతులకు కల్పించారు. కానీ ఆ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం, కొన్ని కేసుల్లో అన్యాయం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మండలాల వారీగా. సర్వే నంబర్ల వారీగా ఈ భూముల వివరాలను సేకరించి వాటిని ధరణి పోర్టల్‌లో తాజాగా నమోదు చేసి తప్పులు సరిదిద్దే క్రమంలోనే ఈ వివరాలను ప్రభుత్వం అడిగిందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు దేవాదాయ, అటవీ శాఖలతో చాలామంది పట్టాదారులకు సమస్యలున్నాయి. గతంలో పట్టా భూములుగా ఉన్న వాటిని ఉన్నట్టుండి ధరణి పోర్టల్‌లో అటవీ, దేవాదాయ భూముల జాబితాలో చేర్చారు. తాజాగా వీటి వివరాలను సేకరిస్తుండటంతో ఈ రెండు కేటగిరీల్లోని పట్టాదారుల భూములకు విముక్తి కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామ కంఠాలపై అటోఇటో! రాష్ట్రంలోని భూముల విషయంలో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య గ్రామ కంఠాలు. ఈ భూములు పట్టా భూములతో సమానమని, ఈ భూముల్లో నిర్మాణాలున్నా లేకపోయినా కబ్జాలో ఉన్నవారికి హక్కులు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు గతంలో చెప్పింది. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు పర్చలేదు. హైదరాబాద్ శివార్లలోని నానక్‌రాంగూడ, బాలానగర్, ఉప్పల్, ఖాజాగూడ, మజీద్గూడ లాంటి ప్రాంతాల్లో గ్రామ కంఠం భూములున్నాయి. ఇప్పుడు వీటి ధర చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి వీటిని స్వాధీనం చేసుకునేందుకు 2018లో అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చేసిన ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. సీలింగ్, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, స్వాధీనం! ఇక రాష్ట్రంలోని ఆరు లక్షల ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పేదలు కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించుకోగా, కొన్నిచోట్ల ఇంటి స్థలాలుగా కబ్జాలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ భూముల్లో లక్ష ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు గతంలోనే నిర్ధారించాయి. అసలు ప్రభుత్వం ఎవరికి అసైన్ చేసింది, ఎవరి కబ్జాలో ఇప్పుడు ఆ భూమి ఉంది, కబ్జాలో ఉన్న వారి సామాజిక హోదా ఏంటనే అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించింది. హైదరాబాద్ శివార్లలోని కోకాపేట, శంషాబాద్ తదితర మండలాల్లో ఉన్న అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని అమ్మాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీంతో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం వివరాలను సేకరిస్తోందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద 58, 59 జీవోల కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, సీలింగ్, అసైన్డ్ భూముల్లోని నిర్మాణాలు, స్థలాల క్రమబద్ధీకరణతో పాటు అవసరమైన గ్రామకంఠాలు, అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవడం, తాజా వివరాలను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేసి తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించే విషయంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్‌ల పరిశీలనల పేరిట అనవసర కాలయాపన చేస్తోందని గోదావరి బోర్డు తీరును తప్పుపట్టింది. పరిధికి మించి వ్యవహరిం చడం మాని డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి పంపాలని కోరింది. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, గోదావరి బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డి) ప్రకారం కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులతో అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలన చేయాల్సి ఉంటుందని, ట్రిబ్యునల్లు తమ అవార్డులో పేర్కొన్న నీటి లభ్యతకు నష్టం కలిగించే అంశాలపైనే తమ పరిశీలనలు తెలపాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అలాకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయ అంచనాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దృష్ట్యా క్లాజ్ 85(8)(డి)లో పేర్కొన్న అంశాలకే బోర్డు పరిమితం కావాలని సూచించారు. -
సత్తా చూసి ఎంపిక చేయండి
సాక్షి, హైదరాబాద్: బల్క్‌డ్రగ్స్ పార్కుల ఏర్పాటు విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పార్కు ల ఏర్పాటులో కేవలం భూముల ధరలనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఔషధాల రంగంలో ఉన్న మౌలిక వసతులు, అనువైన వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. బల్క్‌డ్రగ్స్ తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇతర కీలక ముడి పదార్థాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు మూడు కొత్త బల్క్ డ్రగ్స్ పార్కులను(బీడీపీ) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేయాలో సూచించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ విభాగానికి(డీఓపీ) కేంద్రం బాధ్యత అప్పగిం చింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 27న బీడీపీల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఆసక్తి కలి గిన రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. కేంద్ర పథకంలో భాగంగా ఒక్కో బీడీపీకి గరిష్టంగా రూ.వెయ్యి కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో పాటు 75 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాలు అక్టోబర్ 15వ తేదీలోగా తమ ప్రతిపాదనలు అందజేసేందుకు డీఓపీ తుది గడువు విధిం చింది. దీంతో తెలంగాణ, ఏపీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్ ఆసక్తి చూపుతూ ప్రతిపాదనలు అందజేశాయి. మార్గదర్శకాలపై అభ్యంతరం బీడీపీలకు అవసరమైన భూమి ధరలు, విద్యుత్ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల వివరాలు సమర్పిస్తే, చాలెంజ్ మోడ్‌లో అర్హత కలిగిన రాష్ట్రాలను ఎంపిక చేస్తామని డీఓపీ ప్రకటించింది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ.. రాష్ట్రాలు అందజేసే ప్రతిపాదనలను మదింపు చేసిన తర్వాత, ఏజెన్సీ చేసే సిఫారసు మేరకు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని వెల్లడించింది. కాగా, కనీసం ఒక్క బీడీపీని అయినా సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ, బీడీపీల ఎంపిక కోసం రూపొందించిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం భూమి ధరలు, రాయితీలు, ప్రోత్సాహకాలే కాకుండా ఇతర అంశాలు కూడా ఫార్మాపరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు లేఖ రాశారు. బీడీపీల ఏర్పాటులో ప్రణాళిక, పర్యావరణ అనుమతులు వంటి అంశాలను కూడా ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయంలో ఆయా రాష్ట్రాల శక్తిసామర్థ్యాలను లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. అలాగే ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రధాననగరాలకు దూరంగా 3 వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాల్లో భూమి ధరలు సహజంగానే తక్కువగా ఉంటాయనేది రాష్ట్రం వాదన. ఇలాంటి చోటకు నైపుణ్యం కలిగిన వారిని రప్పించడం, ఉద్యోగుల రవాణా, నివాసం తదితరాలు ఇబ్బందికరంగా ఉంటాయని, అలాగే అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కష్టమని కేంద్ర మంత్రికి రాసినలేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. చైనా కీలకం.. భారత బల్క్‌డ్రగ్స్ తయారీ, ఎగుమతి రంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. బల్క్‌డ్రగ్స్ తయారీలో కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లు (ఏపీఐ), ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏపీఐల రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, కోవిడ్ నేపథ్యంలో ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఉత్పత్తి, రవాణా వ్యయం పెరగడంతో పాటు లాభాలపై ఏపీఐ దిగుమతులు ప్రభావం చూపుతున్నాయి. -
వ్యాక్సిన్ ముందుగా ఎవరెవరికి..
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలో పేర్లతో జాబితా తయారు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లతో పాటు మొత్తం సిబ్బంది పేర్లతో ఆ జాబితా తయారు చేయాలని జిల్లా వైద్యాధికారుల (డీఎంహెచ్‌వో)ను రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కరుణ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అత్యవసర ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 31 నాటికి జాబితా తయారు చేసి కేంద్ర అధికారిక పోర్టల్‌లో పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులకు వ్యాక్సిన్ వేస్తారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా వేస్తారు. వారి పేర్లనూ జాబితాలో చేర్చుతారు. కాబట్టి ఫార్మాట్ ప్రకారం వారి పేర్లు, పనిచేసే ఆస్పత్రి పేరు లేదా పని చేసే ప్రాంతం, మండలం, జిల్లా వంటి వివరాలతో జాబితా తయారు చేస్తారు. వారిలో ఎవరికైనా ఇప్పటివరకు కరోనా సోకిందా? ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? తదితర వివరాలను కూడా పంపిస్తారు. అందుకు సంబంధించిన ఫార్మాట్‌ను డీఎంహెచ్‌వోలకు పంపించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలే మున్ముందు ప్రజలకు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి వారికి తగు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం పేర్లను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకున్నాక కేంద్రం డేటా బేస్ తయారు చేస్తుంది. వ్యాక్సిన్ వస్తే ముందుగా ఎంత మందికి వేయాల్సి ఉంటుందన్న దానిపై కేంద్రం ఓ అంచనాకు రానుంది. ప్రైవేట్ వైద్య సిబ్బందికే ఎక్కువ వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అందుకే మొదటి విడత వ్యాక్సిన్ తీసుకునే వైద్య సిబ్బంది జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దేశంలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ప్రస్తుత అంచనాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 18 శాతం మందికి టీకా ఇచ్చే అవకాశముంది. ప్రాధాన్యం ప్రకారం ముందుగా వైద్య సిబ్బందికి టీకా ఇస్తారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ఎక్కువగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్సల్లో ప్రైవేట్ ఆస్పత్రుల భాగస్వామ్యమే అధికం. 62 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8,794 కరోనా పడకలు ఉండగా, అందులో 1,411 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 227 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 8,943 కరోనా పడకలున్నాయి. వాటిల్లో ప్రస్తుతం 2,067 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇవికాక మండల కేంద్రాలు, పట్టణాల్లో ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అందువల్ల ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రి వైద్య సిబ్బందే వ్యాక్సిన్లు పొందు తారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఇదిలావుండగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బంది.. అనంతరం సామాన్య ప్రజల్లో లబ్ధిదారుల పేర్లతో డేటాబేస్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా నోడల్ ఆఫీసర్లను నియమిస్తారు. -
వరదల్లో సర్టిఫికెట్లు పోయినా.. పాడైనా కొత్తవి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు కోల్పోయిన వారు, పాడైయిన వారు ఉంటే ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఉచితంగా విద్యార్థుల సర్టిఫికెట్లను (ఫ్రెష్/డూప్లికేట్) జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా, ఇంటర్మీడియట్ బోర్డు, కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు, విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు తాము పోగొట్టుకున్న, తడిచి పాడైపోయిన సర్టిఫికెట్లను తిరిగి పొందేందుకు తమ పేరు, పరీక్ష, హాల్ టికెట్ నెంబర్, సంవత్సరం తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రుణమాఫీ..గందరగోళం!
సాక్షి, నల్లగొండ : రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఆయా ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ రుణాలను చెల్లించకుండా రుణమాఫీ వర్తిస్తుందన్న ధీమాలో ఉన్నారు. దాంతోపాటు మరో పార్టీ ఏకంగా రూ.2లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీతో మరికొందరు రైతులు తమ రుణాలను రెన్యువల్ కూడా చేయించుకోని పరిస్థితిలో ఉన్నారు. కానీ రూ.లక్ష వరకు రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు, గైడ్‌లైన్స్ కూడా అటు బ్యాంకులకు గానీ, ఇటు జిల్లా వ్యవసాయ శాఖకుగానీ పంపించలేదు. అసలు జిల్లాలో ఎంతమంది రైతులు పంటరుణాలను తీసుకున్నారు, దానికి సంబంధించిన నగదు ఎంత అనేది కూడా బ్యాంకుల వద్దగానీ, వ్యవసాయ శాఖ వద్దకూడా గణాంకాలు లేని పరిస్థితి. జిల్లా లీడ్ బ్యాంకుకు కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వారు కూడా ఎలాంటి గణాంకాలను సే కరించలేదని తెలుస్తోంది. అసలు రుణమాఫీ వస్తుందా లేదోనని జిల్లా వ్యాప్తంగా రుణాలు పొందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇ టు రుణాలను రెన్యువల్ చేసుకోక, కొత్త రుణా లను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. రెన్యువల్ కోసం బ్యాంకర్ల ఒత్తిడి రుణాలను రెన్యువల్ చేయించుకోవాలని బ్యాంకుల అధికారులు రైతులపై ఒత్తిడి పెంచారు. కనీసం వడ్డీ చెల్లించినా కొత్త రుణం కింద రెన్యువల్ చేస్తామని బ్యాంకుల అధికారులు రైతులను పీడిస్తున్నారు. దీంతో రైతులు తాము వడ్డీని చెల్లించి కొత్తరుణం కింద రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ వర్తిస్తుందో లేదో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ చెల్లిస్తే రెన్యువల్ చేస్తారే కానీ తిరిగి పంటరుణాలు ఇవ్వరనే భావనే కూడా రైతులలో నెలకొంది. బ్యాంకుల గడపతొక్కని రైతులు.. బ్యాంకర్లు రుణాల రెన్యువల్ కోసం ఒత్తిడి పెంచుతుండడంతో రైతులు బ్యాంకుల గడపతొక్కడానికి సాహసం చేయడం లేదు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ఒక స్పష్టతను ఇస్తే తప్ప బ్యాంకులకు రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రెన్యువల్ చేసుకుంటే తిరిగి రుణాలను ఇస్తామన్న భరోసాను కూడా బ్యాంకర్లు రైతులకు కల్పించకపోవడంతోనే రైతులు వెనకడుగువేస్తున్నారు. ఖరీఫ్ రుణలక్ష్యం ఘనం.. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రూ.2225.51 కోట్ల మేరకు పంటరుణాలను ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్ణయించింది. అదే విధంగా బ్యాంకు అధికారుల సమావేశంలో కూడా కలెక్టర్ డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ లక్ష్యం మేరకు పంటరుణాలను రైతులకు చెల్లించాల్సిదేనని ఆదేశాలను జారీ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు కూడా బ్యాంకర్లు కొంతమేరకు పంటరుణాలను రెన్యువల్ మాత్రమే చేశారు తప్ప ఎక్కడా తిరిగి ఖరీఫ్ పంట రుణాలను చెల్లించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై జిల్లా లీడ్ బ్యాంకు అధికారి సూర్యంను వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
పార్ట్‌టైం, ఎంటీఎస్ ఉద్యోగులెందరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం, మినిమమ్ టైంస్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగుల తాజా లెక్కల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాఖల వారీగా వివరాలను సమగ్రంగా అందజేయాల ని వివిధ విభాగాధిపతులను ఆర్థిక శాఖ ఆదేశించింది. గత నెలలో సీఎస్ ఎస్కే జోషి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల వివరాల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్‌ఎంఆర్‌లు, డైలీ వేజెస్, కంటిజెంట్ లేదా కన్సాలిడేటెడ్ కింద వివిధ శాఖల్లో చేరిన అనేకమంది ఉద్యోగులు ఏళ్లుగా పార్ట్‌టైం, మినిమమ్ టైం స్కేల్‌పై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కొంతమందిని రెగ్యులరైజ్ చేసినా, ఇంకా చాలామంది వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అలాగే ఉండిపోయిన వారి వివరాలను ఇవ్వాలని విభాగాధిపతులను ఆదేశించింది. 4 ప్రధానాంశాలు.. 1993 నవంబర్ 25వ తేదీ నాటికే పదేళ్ల సర్వీసు పూర్తయినా, రెగ్యులరైజ్ కాని పార్ట్‌టైం ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని కోరింది. ఆ స్థానాల్లో క్లియర్ వేకెన్సీలు ఉన్నాయా? పనిచేస్తున్న వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయా? ఇతర కారణాలతో అర్హత పొందలేకపోయారా? పాలనాపరమైన జాప్యం జరిగిందా? అన్న 4 ప్రధాన అంశాలతో ఆ వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ రూపొందించిన ప్రొఫార్మాను అన్ని శాఖలకు పంపించింది. దాని ప్రకారం వివరాలను ఇవ్వాలని పేర్కొంది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, పోస్టు పేరు, నియామక తేదీ, ఎన్‌ఎంఆర్‌గా అపాయింట్ అయ్యారా? డైలీ వేజెస్ కింద అపాయింట్ అయ్యారా? కంటింజెంట్ కింద లేదా కన్సాలిడేటెడ్ కింద నియమితులయ్యారా? ప్రస్తుతం వారికి ఎంత వేతనం వస్తోంది? 1993 నాటికి వారికి ఉన్న సర్వీసు ఎంత? ఆ పోస్టులకు నిర్దేశించిన అర్హతలు, అభ్యర్థికి ఉన్న అర్హతలు, సామాజిక వర్గాల వారీగా వివరాలు తదితర 12 అంశాలపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. -
ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జరీ చేసింది. ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్ రీ వాల్యువేషన్‌పై ఇంటర్ బోర్డు తన నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. అలాగే ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతలపై సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంటర్ బోర్డ్ వ్యవహారంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. బాధ్యులపై సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా.. ఇంటర్ ఫలితాలలో వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని అడిషనల్ ఏజీ రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. మొత్తం 9 లక్షల 70 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. బోర్డులో ఉన్న లోపాల్ని ఎత్తిచూపండి.. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ‘ 16 మంది విద్యార్థులు చనిపోయారు. అయినా ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు స్పందించడం లేదు. ఫలితాలపై జరిగిన అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. 50 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు అని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్యార్థులకు న్యాయం జరగాలంటే బోర్డులో ఉన్న లోపాల్ని ఎత్తి చూపాలని సూచించింది. తప్పుల్ని సరిచేస్తాం.. ఎంత సమయం కావాలి? ‘వారంలోపు సమస్య పరిష్కరిస్తాం.ఈ ఏడాది 9.7 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ప్రతి ఏడు 30 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రతియేడు 25వేల అప్లికేషన్స్ వస్తాయి. అయితే ఈ ఏడాది 9వేల అప్లికేషన్స్ వచ్చాయి. అని ప్రభుత్వ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. ఇందుకు స్పందించిన కోర్టు.. 9 లక్షల 70 వేల మందికి 2 నెలల సమయం పడితే.. ఫెయిలైన 3 లక్షల మంది రీవాల్యువేషన్‌కు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది. ఇందుకు బదులుగా... రెండు నెలల సమయం పడుతుందంటూ న్యాయవాది బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 3 లక్షల మందికి 10 రోజులు సమయం సరిపోతుందని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో.. వాళ్లంతా భవిష్యత్ ఉన్నవాళ్లు డాక్టర్లు , ఇంజినీర్లు కావాల్సినవాళ్ళు అంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ నేరుగా వాదనలు వినిపించగా.. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాదు సొల్యూషన్ చెప్పాలంటూ కోర్టు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా రెండో రోజు కూడా ఇంటర్ బోర్డ్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అక్కడికి భారీ ఎత్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. విద్యార్థులను లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అవతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్‌కే రేపే చివరి గడువు కావడం.. వెబ్సైట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ప్రమోషన్లు..!
సాక్షి, హైదరాబాద్ : భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతుండటంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుంది. 49 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు ప్రమోషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. 26 ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం వారిలో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ప్రమోషన్ ఇచ్చింది. ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురికి కార్యదర్శి, ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా పదోన్నతులు ఇచ్చారు. ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శిగా, మరో నలుగురికి డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. 23 మంది ఐపీఎస్‌లకు ప్రమోషన్ ఇచ్చిన సర్కార్.. వారిలో ఐదుగురికి అదనపు డీజీలుగా, నలుగురికి ఐజి, ఏడుగురికి డీఐజీ, ఆరుగురికి సీనియర్ స్కేల్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరొక ఐపీఎస్ అధికారికి కూడా ఐజీగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు అండగా..
సాక్షి, హైదరాబాద్ : క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టాలీవుడ్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునే కమిటీని నియమిస్తూ బుధవారం జీవో నంబర్ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సుధాకర్ రెడ్డిని కూడా కమిటీ సభ్యులుగా నియమించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు ఫిర్యాదు చేయవచ్చు. ప్యానెల్ సభ్యులు మాట్లాడుతూ... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కాగా క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. -
స్త్రీలోక సంచారం
సమాజంలో బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడి పదవిలోకి వచ్చిన కె.సి.ఆర్., ముఖ్యమంత్రి అయ్యాక తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటివ్వకుండా తిరిగి తనే వివక్షను పాటిస్తున్నారని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై (పిల్) స్పందించిన హైదరాబాద్ హైకోర్టు.. మంత్రివర్గంలో తప్పనిసరిగా మహిళలకు స్థానం కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించలేదు కనుక మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్‌ని కొట్టివేసింది. అధికార టి.ఆర్.ఎస్. పార్టీ మహిళా ఎమ్మెల్యేలలో దాదాపుగా అంతా ఎస్సీలు, ఎస్టీలు కావడం వల్లనే కె.సి.ఆర్. వారిని తన మంత్రివర్గంలోకి రానివ్వలేదని వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన దారా శ్రీశైలం అనే న్యాయవాది వేసిన ‘పిల్’పై కోర్టు ఈ విధంగా స్పందించింది. అమెరికా ప్రతినిధుల సభకు (దిగువ సభకు) నవంబరులో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో 180 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతుండగా, గత జూన్‌లో ‘సెనెట్’కు (ఎగువ సభకు) జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 42 మంది మహిళలు (24 మంది డెమోక్రాట్లు, 18 మంది రిపబ్లికన్లు) బరిలో నిలిచారని ‘సెంటర్ ఫర్ అమెరికన్ ఉమెన్ పాలిటిక్స్ (సి.ఎ.డబ్లు్య.పి) వెల్లడించింది. రెండేళ్ల కాలపరిమితితో 435 మంది సభ్యులుండే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువస¿¶ కు, ఆరేళ్ల కాలపరిమితితో 100 మంది సభ్యులుండే ఎగువసభకు ప్రతి ‘సరి సంవత్సరం’లో ఖాళీల భర్తీకి ఈ మధ్యంతర ఎన్నికలు జరుగుతుంటాయి. పన్నెండేళ్లుగా సహజీవనం చేసి, 2014లో పెళ్లి చేసుకుని, 2016లో విడిపోయిన హాలీవుడ్ అందాల జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్.. కోర్టు కేసుల పరిష్కారం కోసం ఇప్పుడు అయిష్టంగా ఒకరిముఖం ఒకరు చూసుకోవలసి వస్తోంది! దత్తత తీసుకున్న పిల్లలు, సొంత పిల్లలు కలిపి మొత్తం ఆరుమందిలో కొందరి పోషణ, సంరక్షణ కోసం ఒప్పందం ప్రకారం బ్రాడ్ పిట్ తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వడం లేదని ఏంజెలీనా కోర్టుకు వెళ్లగా, విడిపోయినప్పటి నుంచీ ఇప్పటి వరకు ఏంజెలీనాకు తను అనేక మిలియన్ డాలర్లను చెల్లించినట్లు బ్రాడ్ పిట్ చెబుతున్నారు. లైంగిక అకృత్యాల రాక్షసుడు హార్వీ వైన్‌స్టీన్‌ను తను పూర్తిగా సమర్థించనప్పటికీ, ‘మీటూ’ ఉద్యమానికి మాత్రం మద్దతు ఇవ్వలేకపోతున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి ‘లేలో’ (లిండ్సే లోహన్) సంచలనాత్మక ప్రకటన చేశారు. ‘నేనూ బాధితురాలినే’ అని బయటికి రావడం మహిళల బలాన్ని కాక, బలహీనతను మాత్రమే బయటపెడుతోందని ఆమె అన్నారు. బి.జె.పి మగవాళ్ల పార్టీ మాత్రమేనని, మహిళల్ని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనీ రాహుల్ ఆరోపించడం బి.జె.పి.లోని మహిళల్ని అవమానించడమేనని అంటూ.. రక్షణమంత్రి మహిళ కాదా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మహిళ కాదా, లోక్‌సభ స్పీకర్ మహిళ కాదా అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ.. రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ‘మహిళా అధికార్ సమ్మేళన్’లో రాహుల్ చేసిన పై ఆరోపణలను తిప్పికొట్టే సందర్భంలో.. ‘తెలియకుండా మాట్లాడ్డం మానాలని’ కూడా రాహుల్‌కు ఆమె హితవు చెప్పారు. 37 ఏళ్ల వయసులో హత్యకు గురైన పార్లమెంటు సభ్యురాలు, న్యాయవాది, ‘బందిపోటు రాణి’ అయిన ఫూలన్ దేవి బర్త్ డే ఇవాళ. స్టార్ చెఫ్ పద్మాలక్ష్మి తన ఎనిమిదేళ్ల కూతురు కృష్ణ, ఆ పాప తండ్రి ఆడమ్ డెల్‌తో కలిసి ప్రస్తుతం ఇటలీలో విహరిస్తున్నారు. అమెరికన్ రియాలిటీ షో ‘టాప్ చెఫ్’ ఫినాలీ ఎపిసోడ్ చిత్రీకరణ నుంచి స్వల్ప విరామం తీసుకోవడంతో దొరికిన వ్యవధిలో పద్మాలక్ష్మి చక్కగా టూర్లు కొడుతూ, ఇష్టమైన ఆహారం తింటూ, కూతురితో, పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న ఆడమ్ డెల్‌తో కుటుంబ అనుబంధాల్లోని మాధుర్యాన్ని గ్రోలుతున్నట్లు రెండు వారాల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)లో పేరు లేని నలభై లక్షల మంది ‘అస్సామీ’లను తరలించే ప్రయత్నాలు మొదలైతే కనుక మహిళలకు, బాలికలకు, చిన్నారులకు రక్షణ కరువు అయ్యే ప్రమాదం ఉండొచ్చని అంతర్జాతీయ సామాజిక, పాలనా విధానాల పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అంతిమ జాబితాను సిద్ధం చేసి, రిజిస్టరులో పేరు లేని పౌరుల తరలింపునకు తొందరపడితే అస్సాంలో కల్లోల పరిస్థితులు తలెత్తవచ్చునని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హ్యాండ్లూమ్.. ఫ్యాషన్ జూమ్
-
89 శాతం రైతులు సంతోషంగా ఉన్నారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తమది రైతుపక్షపాత ప్రభుత్వమని, రాష్ట్రంలో అమలవుతోన్న రైతుబంధు పథకం ద్వారా 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రతిష్టాత్మక రైతుబీమా పథకం ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం-లైఫ్ ఇన్సురెన్స కార్పొరేషన్(ఎల్ఐసీ)లు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు, ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ తదితరులు పాల్గొన్నారు. రైతుబీమా విధివిధానాలు: ఎల్ఐసీతో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతుబీమా పథకం విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. ►2018 ఆగస్టు 15 నుంచి రైతుబీమా అమలవుతుంది. ►18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరూ ఈ పథకానికి అర్హులే. ►రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే 10 రోజుల్లో పాలసీ క్లెయిమ్ అవుతుంది. ►ఆగస్టు 15లోపు సంబంధిత పత్రాలన్నీ నింపి ఎల్ఐసీకి అందజేయాలి. ►రైతుల బీమా పత్రాలను వ్యవసాయ అధికారులు మాత్రమే పూర్తిచేయాల్సిఉంటుంది. ►నామినీ వివరాలను రైతులు చెప్పిన ప్రకారమే నింపాలి. ►ఇందుకోసం ఏవోలకు ఐప్యాడ్లు అందజేస్తామని, రైతులందరి పేర్లు అందులో నమోదై ఉండాలని సీఎం చెప్పారు. రైతుబంధు వదులుకున్నా.. రైతుబీమా మాత్రం తీసుకుంటా: ‘‘బాగా సంపాదించే రైతులు రైతుబంధు పథకం కింద వచ్చే డబ్బును తీసుకోవద్దని ముఖ్యమంత్రిగా నేను కోరాను. ఆ మేరకు నాతోపాటు చాలా మంది చెక్కులు తీసుకోలేదు. అయితే ఇప్పటి రైతుబీమా పథకంలో మాత్రం నా పేరు కూడా నమోదు చేయించుకుంటా’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబీమా పథకానికి సంబంధించి తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ఎల్ఐసీకి గర్వకారణమని ఆ సంస్థ చైర్మన్ వీకే శర్మ అన్నారు. -
‘భరత్ బహిరంగ సభ’కు పొగ రాలేదా?
సాక్షి, వికారాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ జన సమితి పార్టీ(టీజేఎస్) ఆవిర్భావ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నగరం నడిబొడ్డున సభలు జరిపితే, అక్కడికి వచ్చే వాహనాల పొగ వల్ల కాలుష్యం పెరుగుతుందని, పైగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అనుమతివ్వడంలేదని పోలీసులు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘మేం సభ పెడతామంటే వద్దన్నారు. అదే మొన్న ‘భరత్ అనే నేను’ సినిమాకు ఎల్బీ స్టేడియంలో అనుమతి ఇచ్చారు. ఆ సభకు వాహనాలు రాలేదా? ఆ వాహనాల నుంచి పొగ రాలేదా?’’ అని కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా 29న సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు సన్నాకంగా వికారాబాద్ సత్యభారతి గార్డన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ‘‘నాయకులు మాట్లాడకుంటే ప్రజలకు న్యాయం జరగదు. కానీ ఆ నాయకులే అమ్ముడు పోతున్నరు. సమస్యల పరిష్కారాల కోసం నాలుగేళ్లుగా కొట్లాడుతున్నాం. ఆ ఉద్యమ స్ఫూర్తి నుంచి పుట్టిందే తెలంగాణ జనసమితి పార్టీ. ఎవరో వెనుక ఉండి చెబితే పెట్టిన పార్టీకాదిది. తెలంగాణ వచ్చి నాలుగేళ్లైనా వికారాబాద్ జిల్లాకు సాగునీటి జాడలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అబద్ధాలు చెబితే ఇగ ఏం చెప్పాలె!’ అని కోదండరాం అన్నారు. హైకోర్టులో రచనా రెడ్డి పిటిషన్ ఈ నెల 29న తలపెట్టిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కాలుష్యం సాకుతో అనుమతి నిరాకరించడాన్ని సవాలుచేస్తూ ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, ఎన్డీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏదో ఒక చోట సభ నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదావేసింది. -
ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం
వరంగల్ సిటీ : రాష్ట్రంలో అన్ని వ్యాపార రంగాలను ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రాష్ట్ర, వరంగల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కటకం పెంటయ్య, తెలంగాణ కాటన్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లలోని అడ్తి,వ్యాపారుల డిపాజిట్లతో పాటు భారీగా లైసెన్సుల రెన్యూవల్ ఫీజులను పెంచడంతో రాష్ట్రంలోని అన్ని చాంబర్ ఆఫ్ కామర్స్‌ల ఆధ్వర్యంలో నూతన జీవో.58ను సవరించాలని కోరుతూ అడ్తి, వ్యాపారులు నిరసన ర్యాలిలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పలుమార్లు మార్కెట్ శాఖ మంత్రి హరీష్‌రావును కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. మూడు నెలల అనంతరం ఎట్టకేలకు రా ష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు అనుమతితో జీవో.నం. 58ను సవరిస్తూ నూతనంగా జీఓ.నం 39ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. నూతన జీఓలో అడ్తి, వ్యాపారులకు అనేక అనుకూల, సానుకూల రాయితీలు కల్పించడంతో శుక్రవారం వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ అధ్యక్షులు, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటకం పెంటయ్య, బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడారు. కూరగాయలు, పండ్ల వ్యాపారుల బ్యాంకు గ్యారంటీని రూ.3లక్షల నుంచి రూ.25వేలకు, కోటి టర్నోవర్ కలిగిన రూ.5 లక్షల బ్యాంకు గ్యారంటీని రూ.50వేలకు, రూ.5కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వారికి రూ.లక్షకు తగ్గించడం హర్షనీయమని చెప్పారు. అదే విధంగా ఇతర లైసెన్సుల రెన్యూవల్స్ ఫీజులను కూడా సంతృప్తి పడే విధంగా తగ్గించారని వివరించారు. అనంతరం చాంబర్ ప్రధాన కార్యదర్శి గోరంటాల యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షలు కంది రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దుగ్యాల గోపాల్‌రావులు పాత, కొత్త జీఓల సవరణలు వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. జీఓ సవరణకు సహకరించిన కొండా దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఛాంబర్ ముఖ్య ప్రతినిధులు నాగమళ్ల పూర్ణచందర్రావు, రాయిశెట్టి సత్యనా రా యణ, అల్లె సంపత్, వీరారావు, ఎస్.భిక్షపతి, కరాణి రాజేష్, కూరగాయల సంఘం నుంచి బేతి అశోక్, జూల రాజేందర్, పండ్ల మార్కెట్ అసోసియేషన్ నుంచి సాంబయ్య, గుమస్తాల సంఘం నాయకుడు ఇనుముల మల్లేషం పాల్గొన్నారు. -
ప్రపంచ స్థాయి ప్రమాణాల కోసమే....
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలున్నవిద్యావకాశాల కోసమే ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనతో తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ‘ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణ బిల్లు’ను శాసన మండలి ఆమోదించింది. ఈ సందర్భంగా శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ యువతకు విద్యావకాశాలు విస్తృతం చేయడం కోసమే ప్రైవేట్ యూనివర్సీటీలకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసమే 25 శాతం తెలంగాణ వాసులకు దక్కేలా నిబంధన విధించామని చెప్పారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయని గుర్తుచేశారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలకు లోబడి ఆ యూనివర్సిటీలు పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్సష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే అత్యధిక ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో ఒకలా...ఇక్కడ మరో విధంగా భాజపా విధానం ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవసరానికి మించిన కాలేజీలు ఉన్నాయని, వాటిని నియంత్రిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే 1016 పోస్టులకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాల దృష్ట్యా పలువురు సలహాదారులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు కేబినెట్ హోదా ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా ఇవ్వడమన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారానికి సంబంధించిందని, కేబినెట్ హోదా ఇవ్వడమనే ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అమలు చేస్తున్నదేనని వివరించింది. తమకున్న అధికార పరిధిలోనే కేబినెట్ హోదా ఇచ్చామని, సలహాదారులకు, చైర్మన్లకు కేబినెట్ హోదా ఇవ్వడమన్నది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేబినెట్ మంత్రులతో సమానమైన హోదాలో పలువురు సలహాదారులను నియమించుకుందని తెలిపింది. ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాలు, దురుద్దేశాలతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని, అందువల్ల రేవంత్‌కు జరిమానా విధిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని హై కోర్టును కోరింది. పలువురు సలహాదారులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు కేబినెట్ హోదా ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ రేవంత్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిం దే. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తు లు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అమర్నాథ్గౌడ్తో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కౌంటర్ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధం కాదు.. ‘కేబినెట్ హోదా ఇవ్వడం ఏ రకంగానూ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఆయా రంగాల్లో నిపుణులు, అనుభ వజ్ఞులైన వ్యక్తులను సలహాదారులుగా, ప్రత్యేక ప్రతినిధులుగా, చైర్మన్లుగా నియమించుకుని వారికి కేబినెట్ హోదా ఇచ్చాం. తెలంగాణ రాష్ట్ర అవసరాలను, ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్ హోదా పొందిన వారు మంత్రులు కారు. వారిని గవర్నర్ నియమించలేదు. మంత్రిమండలిలో వారు భాగస్వాములు కాదు. అధికార రహస్యాలను కాపాడతామని మంత్రుల్లా ప్రమాణం చేయలేదు. మంత్రు లు నిర్వర్తించే విధులను నిర్వర్తించడం లేదు. మంత్రిమండలి సమావేశాల్లో పాల్గొనడం లేదు. మంత్రులు నిర్వర్తించే విధులకు, కేబినెట్ హోదా పొందిన వారు నిర్వర్తించే విధులకు ఏ మాత్రం పొంతనే లేదు. కేబినెట్ మంత్రుల సంఖ్య విషయంలో రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి(15%) ఎక్కడా దాటలేదు. కాబట్టి కేబినెట్ హోదా విషయంలో రాజ్యాంగ నిబంధలనల ఉల్లంఘన జరగలేదు. 2014 జూన్ 2న తెలంగాణ అవతరించింది. ఆ రోజు నుంచి మంత్రిమండలి పనిచేస్తోంది. ఆ రోజుకి మంత్రి మండలి లేదన్న పిటిషనర్ వాదన సరికాదు. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఎవరినైనా, ఎప్పుడైనా సలహాదారులుగా నియమించుకోవచ్చు. అసెంబ్లీ లేని సమయం లో, రాష్ట్రపతి పాలనలో మాత్రమే సలహాదారుల అవసరం ఉంటుందనుకోవడం సరికాదు. సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్‌కు కేబినెట్ హోదా ఇవ్వడమన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారానికి సంబంధించింది. ప్రజా ప్రయోజనా లు లేని ఈ వ్యాజ్యాన్ని జరిమానాతో కొట్టేయాలి’ అని జోషి కౌంటర్లో వివరించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో తిరుగు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రేవంత్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వచ్చే బుధవారా నికి వాయిదా వేసింది. -
ప్రజల తెలంగాణను ఆవిష్కరిస్తాం
-
ప్రజల తెలంగాణను ఆవిష్కరిస్తాం
హైదరాబాద్: ప్రజలు కోరుకున్న తెలంగాణను ఆవిష్కరించేందుకు రాజకీయంగా ముందుకు వస్తున్నామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కోదండ రాం నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త పార్టీలో పనిచేస్తామంటూ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌తోపాటు పలువురు అనుచరులు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. దిలీప్ తన అనుచరులనుకోదండరాం కు పరిచయం చేశారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరమని భావించామన్నారు. వారం తర్వాత కొత్త పార్టీ ప్రకటన కొత్త పార్టీ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తవుతుందని, అప్పుడే పార్టీని ప్రకటిస్తామని కోదండరాం అన్నారు. ఇప్పటికే పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ వస్తే మార్పు జరుగుతుందని, పిల్లలకు ఉచితంగా చదువులు, వైద్యం అందుతుందని, వ్యవసాయం బాగుపడుతుందని భావించామని, కాని ఆ పరిస్థితులు కానరావడంలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియేట్‌కు వెళ్లడం లేదని, కనీసం ఆయన ఇంటి వద్ద ధర్మదర్శనానికి కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు. దిలీప్‌కుమార్ మాట్లాడుతూ తాను ఏ పదవిని ఆశించి రాలేదని, ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం కోదండరాంతో కలసి పనిచేయడానికి వచ్చానని తెలిపారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ రియాజ్, మాజీ గౌరవాధ్యక్షురాలు కపిలవాయి ఇందిర, ఆకుల శ్రీనివాస్, సుబ్రమణ్యం, రవీందర్, విశాల్, మల్లేశ్, పార్థసారథి, జ్యోష్న, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
పాస్‌బుక్‌లో నాలా భూములూ నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల అదీనంలో ఉన్న వ్యవసాయేతర (నాలా) భూములను కూడా పక్కాగా రికార్డు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూములకు పెట్టుబడి సాయం పథకం అమలు నేపథ్యంలో వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో సాయం అందకుండా చూడటంతో పాటు భవిష్యత్తులో క్రయవిక్రయ లావాదేవీలను సులభతరం చేసేందుకు నాలా భూముల వివరాలను కూడా రైతుల పాస్ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఇందుకోసం పాస్‌పుస్తకంలో ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో మొత్తం 15,16,873 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు తేలింది. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2.65 లక్షల పైచిలుకు ఎకరాలు ఉన్నాయి. -
నాగార్జునసాగర్‌లో టెన్షన్
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బుధవారం ఉదయం మొదలైన వివాదం సాయంత్రానికి చల్లారింది. వాటాకు మించి వాడుకున్న కారణంగా నీటి విడుదల నిలిపివేయాలని ఏపీని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించడం, దాన్ని ఏపీ ధిక్కరించడం.. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం, తెలంగాణతో బోర్డు సంప్రదింపులు జరపడం, తెలంగాణ అంగీకరించడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. దీంతో ప్రస్తుత వివాదానికి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఇరు రాష్ట్రాల అవసరాలపై పూర్తి స్థాయి లో చర్చించేందుకు ఈ నెల రెండో తేదీన మధ్యా హ్నం 3 గంటలకు బోర్డు త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం చేసింది. వాటా వాడేసిన ఏపీ ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణాలో మొత్తంగా 466.64 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. తెలంగాణ 142.14 టీఎంసీలు, ఏపీ 324.50 టీఎంసీలు వాడుకున్నట్లుగా లెక్కలు తేలాయి. అవిగాక కృష్ణా బోర్డు జనవరిలో తెలంగాణకు 50 టీఎంసీలు, ఏపీకి 60 టీఎంసీలను పంచింది. అయితే ఏపీ కేటాయింపులకు మించి 2.32 టీఎంసీల నీటిని వాడినట్లు బోర్డు గుర్తించి శ్రీశైలం, సాగర్ కుడి కాల్వ పరిధిలో నీటి విడుదల నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి కుడి కాల్వ పరిధిలో ఏపీ నీటి వినియోగాన్ని తెలంగాణ నిలిపివేసింది. దీనిపై ఏపీ అధికారులు సాగర్ డ్యామ్‌పై హడావుడి చేయడంతో వివాదం మొదలైంది. కుడి కాల్వకు నీటిని విడుదల చేసేందుకు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర రెగ్యులేటర్‌ను ఆపరేట్ చేసుకోవాలని, తెలంగాణ అధికారులు అభ్యంతరం చెబితే పోలీసుల రక్షణ తీసుకోవాలంటూ ఏపీ నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్ రావు రాసిన లేఖతో ఆ రాష్ట్ర అధికారులు రంగంలోకి దిగారు. కృష్ణా బోర్డు కేటాయింపులతో తమకు సంబంధం లేదంటూ తెలంగాణ అధికారులతో వితండవాదానికి దిగారు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా చుక్కనీటిని కూడా విడుదల చేయలేమంటూ తెలంగాణ అధికారులు తెగేసి చెప్పారు.దీంతో డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడంతో ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎస్.సునీల్.. నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్ వద్ద ఇరురాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రంగంలోకి ఏపీ సీఎం ఈ వివాదం జరుగుతుండగానే తమ రాష్ట్రానికి నీళ్లు విడుదల చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశానికి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. కనీసం 2 వేల క్యూసెక్కులైనా విడుదల చేయాలని కోరారు. దీనిపై తెలంగాణ అధికారులతో చర్చిస్తానన్న పరమేశం.. వెంటనే తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌తో మాట్లాడారు. కుడి కాల్వల కింది పంటలకు నీటి అవసరాల దృష్ట్యా 5 రోజులపాటు 2 వేల క్యూసెక్కుల మేర విడుదలకు ఈఎన్సీ అంగీకరించడంతో కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగించవచ్చంటూ పరమేశం ఆదేశాలు ఇచ్చారు. దీంతో వివాదం చల్లారింది. అయితే శ్రీశైలం జలాశయం ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తేనే తాము కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తామని డ్యామ్ చీఫ్ ఇంజనీర్ సిరివోరు సునీల్ తెలిపారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. -
లెవెల్ క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న 460 రైల్వే లెవెల్ క్రాసింగుల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు–భవనాలు, రైల్వే శాఖలు నిర్ణయించాయి. ఈ ఏడాది 52 ఆర్వోబీలను నిర్మించాలని ప్రతిపాదించాయి. వీటికి అయ్యే రూ.2,700 కోట్ల ఖర్చును రెండు శాఖలు చెరి సగం భరించనున్నాయి. బుధవారం ఇక్కడ రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నందున ఆర్వోబీలు కూడా నాలుగు వరుసలుగా ఉండేవిధంగా చూడాలని మంత్రులు కోరగా రైల్వే జీఎం అంగీకరించారు. గతంలో నాలుగు వరుసల రోడ్లపై రెండు వరుసల ఆర్‌వోబీలనే నిర్మించారు. వంతెనల్లో పట్టాల మీదుగా నిర్మించే భాగాన్ని ఇప్పటిదాకా రైల్వే శాఖ చేపడుతోంది. ఇక్కడ సమన్వయలోపం కారణంగా ఆ పనులు పెండింగ్‌లో ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక నుంచి ఆ భాగాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించారు. రైల్వేవాటా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తే పనులను రాష్ట్ర యంత్రాంగమే చేపడుతుంది. పాత ఆర్వోబీలను తొలగించి కొత్తవాటిని నిర్మించేందుకు రైల్వే జీఎం అంగీకరించారు. మియాపూర్– పటాన్చెరు మధ్య రైల్వే టెర్మినల్ నిర్మించాలని ప్రతిపాదిస్తున్నట్టు తుమ్మల తెలిపారు. మెదక్– అక్కంపల్లి రైల్వేలైన్ నిర్మాణం ఈ సంవత్సరాంతానికి పూర్తి అవుతుందని హరీశ్ ప్రకటించారు. -
మిర్చి దందా మొదలైంది...
సాక్షి, హైదరాబాద్ : మిర్చి దందా మొదలైంది. వ్యాపారులు, దళారులు అక్రమాలకు తెరలేపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మిర్చికి డిమాండున్నా రైతుకు ధర ఇవ్వడంలో వ్యాపారులు మొండిచేయి చూపిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. 15–20 రోజుల క్రితం వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.11,275 వరకు ఉండగా, ఈ నెల పదో తేదీ నాటికి రూ.9 వేలకు పడిపోయింది. ఏకంగా రూ.2 వేలకుపైగా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలలపాటు మార్కెట్‌కు మిర్చి తరలిరానుంది. కీలకమైన ఈ సమయంలో ధర పతనం అవుతుండటంతో రైతులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. మున్ముందు ధర ఆశాజనకంగా ఉంటుందా?.. లేదా?.. అన్న భయం వారిని వెన్నాడుతోంది. గతేడాది జనవరి 10న మిర్చి ధర రూ. 11,500, 11న రూ. 11,200 పలికింది. ఫిబ్రవరి ఒకటో తేదీన రూ. 10,400, మూడో తేదీన రూ. 9,900, ఆరో తేదీన రూ. 9,100 పలికింది. చివరకు ఏప్రిల్ 27వ తేదీ నాటికి క్వింటా మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతున్న వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేశాసి బీభత్సం సృష్టించాడు. ఈ దాడితో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాడిలో పాల్గొన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడం కూడా రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఈ నేపథ్యంలో అదే పరిస్థితి ఈసారి కూడా పునరావృతమవుతుందా అన్న భయం అందరిలో నెలకొంది. 87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి... ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో మిర్చి అధికంగా సాగు చేశారు. దీంతో ఈసారి 87,220 మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ధర మున్ముందు కొనసాగే పరిస్థితి ఉంటుందా?.. లేదా?.. అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు పెద్దలను కూడా కలవరపరుస్తోంది. మిర్చికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదని కూడా చెబుతున్నారు. ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. అంటే ఈసారి కూడా వ్యాపారులు దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు దందా మొదలుపెడతారు. డిమాండ్ పెరిగిన సమయంలో ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. అయితే ఈ సమయంలో రైతులు తమ మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిలువ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటారు. అటువంటి సమయంలో రైతులకు కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉండాలి. కానీ అవి కేవలం వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరి రైతుల నుంచి కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
‘డూప్’ అకౌంట్లు
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు అకౌంట్లు.. వందల్లో కాదు.. ఇబ్బడిముబ్బడిగా.. ఏకంగా 40 వేలకుపైనే! ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలు తెరిచిన ఖాతాలు!! అసలు ఏ విభాగం ఎన్ని ఖాతాలు తెరిచింది? అవి ఎవరి అధీనంలో ఉన్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో అసలు నిధులున్నాయా? ఉంటే ఎంత ఉన్నాయి? ఈ ప్రశ్నలకు ఆర్థిక శాఖ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. 40 వేలకు మించిపోయిన ఈ ఖాతాల్లో దాదాపు 10 వేల నుంచి 20 వేల అకౌంట్లు అనుమానాస్పదంగా మిగిలిపోయాయి. వీటిలో భారీ మొత్తంలోనే నిధులు నిల్వ ఉన్నాయని, దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా ఉంటాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే వాటినెలా స్వా«ధీనం చేసుకోవాలి.. పెరిగిపోతున్న ఖాతాల సంఖ్యను ఎలా కట్టడి చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడి పథకానికి ఈ ఏడాది మే నెలలోనే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయి. ఇంత భారీ మొత్తంలో నిధులు సమకూర్చటం కత్తి మీద సామేనని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ లెక్కలేని ఖాతాలపై దృష్టి సారించింది. అందులో నిల్వ ఉన్న నిధులను తవ్వి తీయాలని భావిస్తోంది. ఎందుకు పెరిగిపోయాయి? ఒక్కో ప్రభుత్వ విభాగం తమ అవసరాల మేరకు ఖాతాలు తెరుచుకుంటూ పోవడం, వివిధ ప్రభుత్వ పథకాల అమలు కారణంగా బ్యాంకు అకౌంట్ల సంఖ్య ఏటేటా పెరిగిపోయింది. కొన్ని పథకాల అమలుకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవాల్సి వచ్చిందనిఅధికారులు చెబుతున్నారు. కొన్నిసార్లు కేంద్ర, రాష్ట్ర నిధుల కేటాయింపులకు అనుగుణంగా రెండు మూడు ఖాతాలు తెరిచిన సందర్భాలున్నాయి. కొన్ని విభాగాల్లో అధికారులు బదిలీపై వెళ్లినప్పుడల్లా పాత ఖాతాలు కొనసాగించే బదులు.. తమ పేరిట కొత్త ఖాతాలు తెరిచారు. దీంతో కొత్త ఖాతాలు పెరిగి పాత ఖాతాలు మూలనపడ్డాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఖాతాల సంఖ్యపై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం విస్మయం వ్యక్తం చేసింది. ఇన్ని వేలల్లో ఖాతాలు ఎందుకున్నాయి.. ఇవన్నీ అవసరమా అని అడిట్‌లో ప్రశ్నించింది. పాత నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్ము కోసం.. బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్మును వాడుకునే కొందరు అధికారుల కక్కుర్తి కూడా.. ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కొందరు అధికారులు ఎక్కడికి బదిలీపై వెళ్లినా.. వెంటనే తన పేరిట జరిగే అధీకృత చెల్లింపులకు కొత్త ఖాతాలు తెరిచారు. అధికారులు మారినప్పుడల్లా.. ‘మీ ఖాతాలు మా బ్యాంకులో నిర్వహించండి..’అంటూ బ్యాంకర్లు సైతం రకరకాల ఆఫర్ల వల విసరటం పరిపాటిగా మారింది. దీంతో అధికారులు తమ ఇష్టానుసారం ఖాతాలు తెరిచారు. దీంతో అవి అన్ని బ్యాంకులు, బ్రాంచీలకు విస్తరించాయి. ఇలా కొత్త అధికారి వచ్చినప్పుడల్లా కొత్త ఖాతాలు తెరవటంతో పాత ఖాతాల్లో నిధులున్నాయా.. లేవా.. ఖాళీ అయ్యాయా.. అన్నది తేలకుండా పోయింది. అనామతు ఖాతాలన్నీ రద్దు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ఉన్న ఖాతాల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఖాతాల వివరాలే అన్ని శాఖలు పంపిస్తాయని, మూలనపడ్డ ఖాతాలను దాచిపెడతాయని ముందుగానే అంచనా వేసుకుంది. అందుకే అధికారికంగా వెల్లడించిన ఖాతా నంబర్లను నోటిఫై చేసి.. బ్యాంకులకు సమాచారం అందించాలని నిర్ణయించింది. తాము నోటిఫై చేసినవిగాకుండా మిగతా ఖాతాలన్నీ చెల్లుబాటు కావనీ, వాటిలో ఉన్న డబ్బును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని బ్యాంకర్లకు సూచించనుంది. దీంతో దాదాపు రూ.వెయ్యి కోట్లు రికవరీ అవుతాయని ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు, నిధుల సర్దుబాటు, ఒక పథకం నిధులను అవసరం మేరకు మరో పథకానికి మార్చేందుకు వీలుగా అన్ని విభాగాల్లో పీడీ ఖాతాలు తెరిచే ఆనవాయితీని ఆర్థిక శాఖ ఎప్పట్నుంచో అమలు చేస్తోంది. వాటికి భిన్నంగా లెక్కతేలని సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు కూడా ఉన్నాయని, ఇప్పుడు అందులో ఉన్న నిల్వలపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
బతికుండగానే చంపేశారు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి) : బతికుండగానే ఆ వృద్ధుడిని రికార్డుల్లో చంపేశారు. రూ.ఐదువేలు లంచం ఇవ్వనందు కే అధికారులు ఇంతపని చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లికి చెందిన జంగ మాధవరెడ్డి(80) వృద్ధుడు కొంతకాలంగా ఆసరా పెన్షన్ తీసుకుంటున్నాడు. అక్టోబర్ నుంచి పెన్షన్ జాబితాలో మాధవరెడ్డి పేరు తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే బతి కున్నవారి జాబితాలో తనపేరు లేదని అం దుకే తొలగించారని అధికారులు సెలవిచ్చారని, పైఅ ధికారులకు రూ. ఐదువేలు లంచం ఇస్తే తిరిగి పెన్షన్ కొనసాగుతుందని అధికారులు కరాఖండిగా తేల్చారని బాదితుడు వాపోయాడు. తనకు భార్య పిల్లలు లేరని ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రూ.200 ఇచ్చారని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. వెయ్యి ఇచ్చారని ఇప్పుడు లంచం ఇస్తేనే తిరిగి పింఛన్ ఇస్తామనడంతో ఆ వృద్ధుడు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చాడు. లంచం అడగలేదు.. పింఛన్ విషయమై ఎంపీడీవో సురేశ్‌ను ‘సాక్షి’ వి వరణ కోరగా గ్రామ పంచాయతీ వారు పంపిన జాబితాలో చనిపోయినట్లు పేర్కొనడంతో పింఛన్ నిలిపి వేశామని తానెవరిని లంచం అడగలేదన్నారు. కావాలనే నాపై ఆరోపణలు చేస్తున్నారని మాధవరెడ్డికి తిరిగి పింఛన్ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. -
కంది కొనుగోలుకు రూ.600 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంది కొనుగోలు, రైతు బకాయిల చెల్లింపులకు రూ.600 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకాలు నిర్ణయించాయి. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధమవడంతో అందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వద్దకు వెళ్లింది. సీఎం ఆమోదం రాగానే రుణానికి వెళ్లాలని మార్క్‌ఫెడ్, హాకాలు భావిస్తున్నాయి. రైతుల నుంచి రూ.762 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్ టన్నుల కంది కొనుగోలు చేసి ఇప్పటివరకు రూ.262 కోట్లే చెల్లించారు. దీంతో బకాయిలు, మున్ముందు కొనుగోలుకు రుణమే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతు పండించిన కందిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది. కందిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలసి కోరారు. సీఎం కేసీఆర్ లేఖతో ఇటీవల ఆరుగురు ఎంపీలు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. కానీ స్పందన లేదు. 10 రోజుల క్రితం 1.13 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొంటామని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ సమాచారం ఇచ్చిన కేంద్రం.. సీఎం లేఖ తర్వాత సాంకేతిక కారణాలు చూపించి 75,300 మెట్రిక్ టన్నులే కొంటామని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీశ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌పాశ్వాన్‌కు లేఖ రాశారు. మరో లక్ష టన్నులు కొనాలని కోరారు. కానీ కేంద్రం నుంచి అనుమతి వస్తుందన్న ఆశ లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకోడానికి సర్కారు సిద్ధమైంది. -
లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల రీ అసైన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పరాధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రీ అసైన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చిలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోగా ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు అన్ని విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసేందుకు మరో ఆర్డినెన్స్ తీసుకు రానుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అసైన్డ్ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని, ఒకవేళ నిరుపేద వర్గాల చేతుల్లో ఉంటే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 22.63 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ప్రతి గ్రామంలో దాదాపు 60 శాతానికి పైగా అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84,706 మంది ఆక్రమణదారుల జాబితాలను సిద్ధం చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం 2007 జనవరి 29 నాటికి ఆక్రమణలో ఉన్నవారికే ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా ఈ కటాఫ్ తేదీని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2 నాటికి అసైన్డ్ భూములు ఎవరి పేరిట ఉన్నాయో గుర్తించి.. వారి పేరిట రీ అసైన్ చేస్తారు. అందుకు అనుగుణంగా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(ప్రొహిబిష¯Œన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్– 977లో పలు నిబంధనల్ని సవరించటం తప్పనిసరి. అందుకే అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 12కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డినెన్స్‌కు అధికార యంత్రాంగం రూపకల్పన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చేపట్టి పేద వర్గాలకు రీ అసైన్డ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుపై వచ్చే వారమే ఆర్డినెన్స్! అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్లన్నింటా తెలుగును తప్పనిసరి చేసేలా ఈ ఆర్డినెన్స్ ఉంటుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి చట్టరూపం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సీఎం హామీ ఇచ్చిన మేరకు ఆర్డినెన్స్‌ను అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ముసాయిదా న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. గవర్నర్ ఆమోదంతో వచ్చే వారంలో ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
సీట్లు ఖాళీగా ఉంటే సర్కారుకెందుకు బాధ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విధాన నిర్ణయం పేరుతో సాంకేతిక విద్యాసంస్థల్లో కొత్త కోర్సులకు నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్ఓసీ) ఇవ్వకపోవడం సబబు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో లక్ష్మీబాయి విద్యాపీఠం నిర్వహిస్తున్న బొజ్జల నర్సింహులు మహిళా ఫార్మసీ కాలేజీలో 2018–19 విద్యాసంవత్సరంలో ఫార్మాడీ కోర్సును ప్రారంభించేందుకు వీలుగా ఎన్ఓసీ మంజూరు చేయాలని జేఎన్టీయూ–హెచ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. ఫార్మా–డీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. సీట్లు భర్తీ కాకపోతే సంబంధిత కాలేజీ బాధపడాలే గానీ ఆ బాధను ప్రభుత్వమే తనపై వేసుకుని ఎన్ఓసీ ఇవ్వకపోవడం సబబు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ విద్యలో ఉన్న పరిస్థితులను ఫార్మా–డీ కోర్సుకు వర్తింపజేయడం సముచితంగా లేదని పేర్కొంది. ఏఐసీటీఈ, పీసీఐ అనుమతిచ్చినా తమ కాలేజీలో ఫార్మా–డీ కోర్సు ప్రారంభానికి అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదని ఆ కాలేజీ హైకోర్టును ఆశ్రయించింది. ఫార్మా–డీ సీట్లు ఏటా ఖాళీలు ఉన్నాయంటూ సర్కార్‌తోపాటు జేఎన్టీయూ–హెచ్ చేసిన వాదనల్ని ధర్మాసనం తిరస్కరించింది. -
కాళేశ్వరం నీళ్లు.. చెరువులకే ముందు!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా సాగునీరివ్వాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికాకున్నా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రధాన కాలువ నుంచి నేరుగా ఫీడర్ చానల్‌ను తవ్వి.. చెరువులను నింపడంతోపాటు నేరుగా పొలాలకు కూడా నీరివ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రిజర్వాయర్లకన్నా ముందుగా శరవేగంగా కాల్వల పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతోంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనులు ఇప్పటికిప్పుడు పూర్తయ్యే అవకాశం లేని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫీడర్ చానల్ ద్వారా 400 వరకు చెరువులు నింపడంతోపాటు 3.5 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా కాల్వల తవ్వకాలను ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగు రిజర్వాయర్లకు నీరు వచ్చే మిడ్‌మానేరు–మల్లన్నసాగర్ మధ్య అనుబంధ పనులను పూర్తి చేస్తోంది. దిగువకు అంతా సిద్ధం.. కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌కు చేరాలంటే ఎగువనున్న మేడిగడ్డ–ఎల్లంపల్లి, ఎల్లంపల్లి–మిడ్‌మానేరు, మిడ్‌మానేరు–మల్లన్నసాగర్ లింకు పనులు పూర్తి కావాలి. ఇప్పటికే మేడిగడ్డ–ఎల్లంపల్లి మధ్య మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌస్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపును మూడు ప్యాకేజీలు (ప్యాకేజీ 6, 7, 8)గా విడగొట్టగా... ఇందులో మేడారం రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్యాకేజీల పరిధిలో 49.81 కిలోమీటర్ల మేర టన్నెళ్లు తవ్వాల్సి ఉండగా.. 49.63 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. గ్రావిటీ కెనాల్, అప్రోచ్ చానల్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇక మిడ్‌మానేరుకు వచ్చే నీటిని మల్లన్నసాగర్‌కు తరలించే పనులను ప్యాకేజీ 10, 11, 12గా విడగొట్టగా.. అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్ల పనులు జూన్ నాటికి పూర్తి కానున్నాయి. వాటి పరిధిలో పంపుల బిగింపు ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తంగా జూన్ నాటికి ఈ పనులన్నింటినీ పూర్తిచేసి అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి, 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 39, సిరిసిల్ల జిల్లాలో 59 చెరువులు నింపడంతోపాటు ఎడమ కాల్వ కింద 70 వేల ఎకరాలు, కుడి కాల్వ కింద 40 వేల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఈ రిజర్వాయర్ల అనంతరం మల్లన్నసాగర్‌కు చేరే నీటిని ఫీడర్ చానల్ తవ్వి.. గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాల్వలకు అనుసంధానించనున్నారు. తద్వారా నేరుగా ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధమైంది. మల్లన్నసాగర్ దిగువన 3.50 లక్షల ఎకరాలకు.. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీలు, కొండపోచమ్మ 15, గంధమల 9.86, బస్వాపూర్ 11.39 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతుండగా.. వాటిని పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం పట్టనుంది. ఆలోగానే వాటి కింది ఆయకట్టుకు నీరిచ్చేలా తాజా ప్రత్యామ్నాయాన్ని అధికారులు సిద్ధం చేశారు. రంగనాయక సాగర్ నుంచి వచ్చే నీటిని నేరుగా మల్లన్నసాగర్ పరిధిలో 8 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ తవ్వి గంధమల, బస్వాపూర్ కాల్వలకు తరలిస్తారు. అటు కొండపోచమ్మ సాగర్ కింది కాల్వలకు నీటిని తరలించే పనులు కూడా మొదలు పెట్టారు. ఈ రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చయ్యే ఈ ఫీడర్ చానల్‌తో గంధమల, బస్వాపూర్‌ల ప్రధాన కాల్వల కింది 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. దీంతోపాటు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను నింపి రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు జూలై నాటికి పూర్తయ్యే అవకాశముంది. దీనికిందే 150 చెరువులు నింపేలా ప్రణాళిక వేశారు. అటు మల్లన్నసాగర్ కింద 1.25 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా.. 90 చెరువులు నింపి వీలైనంత ఆయకట్టుకు నీరందిస్తారు. మొత్తంగా ప్రత్యామ్నాయ చర్యల కారణంగా వచ్చే వర్షాకాలం నాటికే 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి. -
కందుల కొనుగోలు ఎప్పుడో?
సాక్షి,ఆదిలాబాద్ : కంది పంట మార్కెట్‌కు వచ్చే సమయం సమీపిస్తున్నా ఇంకా కొనుగోలు తేదీలు ఖరారు కాలేదు. మొన్నటివరకు కొనుగోలు కేంద్రాల విషయంలో తకరారు నెలకొగా, ఇప్పుడు కేంద్రాలు ఖరారు చేసినా కందులను ఎప్పటినుంచి కొంటారనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే చేలల్లో కంది కోతలు ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల్లో పంట రైతుల చేతికొచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కందులను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించినా తేదీలు ఖరారు చేయకపోవడంతో పంటను మార్కెట్‌కు తీసుకొచ్చే విషయంలో రైతుల్లో అయోమయం నెలకొంది. వెంటనే కొనుగోలు తేదీలను ప్రకటించి రైతులకు న్యాయం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2.43 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా.. జిల్లాలో కంది పంట సాధారణ విస్తీర్ణం 16,338 హెక్టార్లు కాగా ఈ ఏడాది 19,447 హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి పట్టుకున్నా సుమారు 2లక్షల 43వేల 090 క్వింటాల్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది జిల్లాలో 24వేల హెక్టార్లలో పంట సాగు కాగా, రూ.142 కోట్ల విలువైన 2,83,097 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయడం జరిగింది. గతేడాది ఆదిలాబాద్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, జైనథ్‌లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాఫెడ్, ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు. 14,642 మంది రైతులు పంటలను విక్రయించినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. డబ్బులు సైతం పూర్తిస్థాయిలో చెల్లించినట్లు తెలిపారు. ఈఏడాది పంట సాగు విస్తీర్ణం సుమారు 5వేల హెక్టార్లు తగ్గిపోయింది. దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. కాగా ఈసారి ఆదిలాబాద్, బండల్‌నాగాపూర్, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, జైనథ్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మద్దతు ధర దక్కేనా.. క్వింటాలు కందులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర రూ.5450 ప్రకటించాయి. గతేడాది కనీస మద్దతు ధర రూ.5050 ఉంది. ఈ ఏడాది మద్దతు ధరను పెంచినా రాష్ట్ర ప్రభుత్వం రూ.225 బోనస్ కుదించడంతో కంది రైతులకు ధర తగ్గిపోయింది. గతేడాది పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నిబంధనల పేరిట రైతులకు మొండి చేయి చూపించిన యంత్రాంగం, రైతుల ముసుగులో వచ్చిన దళారులకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరించి సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు బాహాటంగానే వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి మార్కెట్లో రైతులు నష్టపోకుండా కందుల కొనుగోలు కోసం అధికార యంత్రాంగం సరైన ప్రణాళిక రూపొందించి రైతులకు మద్దతు ధర కల్పిస్తారన్న ఆశ పెట్టుకున్నారు. త్వరలో కొనుగోలు చేస్తాం కందుల కొనుగోళ్లకు సంబంధించి తేదీ ఖరారు కాలేదు. జనవరి 12 తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌కు ఇంకా కందులు రాలేదు. మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తాం. ఈవిషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – టి.శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి -
నిరంతర విద్యుత్ ఘనత కేంద్రానిదే
కనగల్ (నల్లగొండ) : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న నిరంతర విద్యుత్ ఘనత కేంద్రప్రభుత్వానిదేనని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం దర్వేశిపురం స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ చేస్తున్న సంస్కరణల్లో భాగంగా ఏర్పడిన మిగులు విద్యుత్‌తోనే తెలంగాణలో నిరంతర విద్యుత్ అందుతుందన్నారు. తామే ఇస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆరోపించారు. విద్యుత్ ఆదా చేసేందుకు దేశంలో 25వేల కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసిందన్నారు. బడ్జెట్ కేంద్రానిది ప్రచారం రాష్ట్రానిది అయిందన్నారు. సమావేశంలో పోతెపాక సాంభయ్య, బండారు ప్రసాద్, నకిరెకంటి శంకర్, తిరందాసు కనకయ్య, నందగౌడ్, యాదయ్య, జలం దర్, కృష్ణ, రాములు, సతీశ్ పాల్గొన్నారు. -
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు
-
తెలుగు.. సినీవెలుగు
-
తారలు దిగివచ్చిన వేళ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం సినీ ప్రముఖులు సందడి చేశారు. ఒకరు ఇద్దరు కాదు 40 మందికిపైగా ఒకే వేదికపైకి చేరి అలరించారు. సోమవారం రాత్రి లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించిన ‘సినీ సంగీత విభావరి’లో సినీ ప్రముఖులు కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, అశ్వినీదత్, రాజమౌళి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, ఆర్.నారాయణ మూర్తి, విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. సినీ దిగ్గజాలతోపాటు గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్‌లు హాజరయ్యారు. తొలుత వేదికపై పలువురు గాయనీగాయకులు ఆ పాత మధురపు పాటలతో ప్రేక్షకులను అలరించారు. సినీ ప్రముఖులకు సన్మానం వేదికపై కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, జమున, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రాఘవేంద్ర రావు, బి.నర్సింగ్‌రావు, రాజమౌళి, జయసుధ, ఎన్.శంకర్లను గవర్నర్, మంత్రులు సన్మానించారు. తెలుగే మాట్లాడుతా..: చిరంజీవి సీఎం కేసీఆర్ తెలుగు భాషను రక్షించేందుకు ఓ బాధ్యతగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఆయన సంస్కారానికి నిదర్శనమని చిరంజీవి పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఇంత గొప్పగా సభలు జరుగుతున్నాయంటే దానికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషే కారణమని చెప్పారు. తెలుగును సంరక్షిస్తూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన ఆలోచనలు ఏ భాష ద్వారా వస్తాయో.. అదే మన మాతృభాష అని పేర్కొన్నారు. ‘‘ఈ మహాసభలకు మంత్రి కేటీఆర్ నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. అప్పుడు నేను కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులను ఇంగ్లిష్‌లో చెబుతూ అభినందిస్తున్నాను. వెంటనే కేటీఆర్ స్పందించి.. ‘‘అన్నా.. నేను తెలుగు సభల కోసం మిమ్మల్ని పిలవడానికి వస్తే.. మీరేంటి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారనడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాను. నిజమే నేను ఆ క్షణంలో సత్యాన్ని గ్రహించాను. ఇకపై అన్ని సందర్భాల్లో తెలుగే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను..’’ అని చిరంజీవి వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్‌లను సత్కరించాలి... ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే సామెతను గుర్తు చేస్తూ కేసీఆర్ ఈ సభలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు. ఇంగ్లిష్ నేర్పించాలని ఒత్తిడి వస్తున్న రోజుల్లో ఈ సభలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన తమను పిలిచి సత్కరించడం నిజంగా అభినందనీయమన్నారు. కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకుగాను ఆయనను సత్కరించేందుకు సొంతంగా శాలువా తెచ్చానని చెప్పారు. తాను తెచ్చిన శాలువా కప్పి కేటీఆర్‌ను సత్కరించారు. అలరించిన సినీ సంగీత విభావరి - కార్యక్రమంలో మహిళా దర్శకురాలు నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ‘బతుకమ్మ’ పాటను ఈ సభల్లో చూపారు. ప్రముఖ యాంకర్లు ఉదయభాను, ఝాన్సీ, సుమలు ప్రధాన భూమిక పోషించిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. - ప్రముఖ దర్శకుడు పైడిపల్లి వంశీ దర్శకత్వం వహించిన ‘హోలీ’ పాటను కూడా చూపారు. అందులో యువ నటుడు విజయ్ దేవరకొండ, మెర్లీన్ చోప్రాలు ప్రేక్షకులను అలరించారు. - దర్శకుడు హరీశ్‌శంకర్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ చరిత్ర’ పాట వీక్షకుల్ని కట్టిపడేసింది. ఈ పాటను తెలంగాణ చరిత్రకు సంబంధించిన చరిత్రకారుల్ని, తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ప్రదేశాలను గుర్తు చేస్తూ తీశారు. ఇందులో నటులు మెర్లీన్ చోప్రా, లావణ్య త్రిపాఠి, వరుణ్‌తేజ్, రాజ్‌తరుణ్, సింగర్ రేవంత్, సాయిధరమ్‌తేజ్, హెబ్బా పటేల్, షాలినీ పాండే, సునీత, సునీల్, చంద్రబోస్‌లు మెరిశారు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. - కార్యక్రమంలో నటులు కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, శ్రీహరి కుటుంబాలను సత్కరించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం బంద్
-
రైతులకుకొత్త పాసుపుస్తకాల పంపిణీపై మెలిక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 26 నుంచి రైతులకు ఇవ్వనున్న కొత్త పాసుపుస్తకాలపై సర్కారు మెలిక పెట్టనుంది. పంట రుణం లేదా భూమిని కుదువపెట్టి రుణాలు తెచ్చుకున్న రైతులు తమ భూములకు కొత్త పాసుపుస్తకాలు పొందాలనుకుంటే కచ్చితంగా రుణం ఇచ్చిన బ్యాంకు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తెచ్చుకోవాలని, అప్పుడే రైతులకు కొత్త పాసుపుస్తకాలు మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళన ఈ నెల 31 నాటికి పూర్తి కానుండటంతో ఆ రికార్డుల ఆధారంగా ఇచ్చే కొత్త పాసుపుస్తకాల విషయంలో కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. రుణాలు లేకుంటే నేరుగా ఇంటికే.. కొత్త పాసుపుస్తకాల కోసం రైతులు ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల ప్రక్షాళన పూర్తయిన తర్వాత ప్రభుత్వమే రైతుల ఇళ్లకు కొరియర్ ద్వారా పాసుపుస్తకాలు పంపుతుందని, పాసుపుస్తకాల కోసం రైతులు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదంటున్నారు. అయితే ఇది బ్యాంకుల్లో ఎలాంటి రుణాలు లేని భూములకు మాత్రమే వర్తించనుంది. బ్యాంకుల్లో పంట రుణాలు లేదా ఇతర రుణాలు తీసుకొని ఉంటే మాత్రం రైతులు ఆ రుణాలను చెల్లించి బ్యాంకుల నుంచి ఎన్వోసీ తెచ్చుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 26.90 లక్షల మంది రుణాలు తీసుకున్న రైతులు, అంతకు ముందు రుణాలు తీసుకున్న వారు కచ్చితంగా బ్యాంకుల నుంచి ఎన్వోసీలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పాసుపుస్తకంపై తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు. అప్పుడు కూడా ఎలాంటి దరఖాస్తు లేకుండానే రైతు ఇంటికి పాసు పుస్తకం వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ప్రచురించేది ఎవరు? కొత్త పాసుపుస్తకాల ప్రచురణ విషయంలో కూడా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. అత్యంత పకడ్బందీగా రూపొందిస్తున్న పాసుపుస్తకాలను ప్రచురించి జారీ చేసే అధికారం తహసీల్దార్లకు ఇవ్వాలా లేదా ప్రభుత్వమే ప్రచురించి రైతులకు నేరుగా పంపాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ తహసీల్దార్లకు ఆ అధికారం ఇస్తే మాత్రం మంజూరీతోపాటు పబ్లిషర్ సిగ్నేచర్ కూడా వారికే ఇవ్వాలని లేదంటే నేరుగా సీసీఎల్ఏ నుంచి పంపాలని యోచిస్తోంది. ఈ విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. భూ రికార్డులకు కొత్త పోర్టల్ భూ రికార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ఇప్పుడున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ తేవాలనే యోచనలో రెవెన్యూ ఉన్నతాధికారులున్నారు. వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయగా ప్రస్తుతం జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన వివరాలను ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రాసెస్ (ఎల్‌ఆర్‌యూపీ) అనే పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీన్ని పబ్లిక్ డొమైన్లో అనుసంధానించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులకు మాత్రమే ఈ పోర్టల్‌లో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక ఈ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఇప్పుడున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ కాకుండా కొత్త పోర్టల్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
‘ఈహెచ్ఎస్’ సేవలపై ప్రైవేటు ఆస్పత్రుల అల్టిమేటం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ వైఖరి ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తోంది. ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ఉద్యోగులకు చికిత్సలు అందించిన కార్పొరేట్ సహా అన్ని రకాల ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య, ఆరోగ్యశాఖ దాదాపు ఏడాదిగా చెల్లింపులు నిలిపేసింది. కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.200 కోట్లు, మిగిలిన ఆస్పత్రులకు రూ.200 కోట్ల చొప్పున బకాయి పడింది. దీంతో ఆస్పత్రులు ఉద్యోగులకు వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వారం కిందటే సమాచారం ఇచ్చాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులకు వైద్యం విషయంలో కటువుగా వ్యవహరిస్తున్నాయి. వైద్య సేవలు అందించేందుకు సమయం పడుతుందని చెబుతున్నాయి. దీంతో వైద్య సేవలు, చికిత్సల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్న ఉద్యోగులకు అవమానాలు ఎదురవుతున్నాయి. అత్యవసర వైద్యం అవసరమయ్యే ఉద్యోగులు ఆస్పత్రులను బతిమిలాడుకొని సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వైద్య, ఆరోగ్య శాఖ తీరుతో తమకు ఇబ్బందులు వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం గతంలో ఏడాదికి రూ. 700 కోట్ల వరకు ఖర్చు చేసేదని, ఈహెచ్‌ఎస్‌తో ఇది రూ. 400 కోట్లకు తగ్గిందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 1.19 లక్షల మందికి చికిత్సలు... ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను ప్రవేశపెట్టింది. అలాగే అన్ని జిల్లాల్లో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత హైదరాబాద్‌లో రెండు, సిద్దిపేట, వరంగల్‌లలో ఒకటి చొప్పున వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2016 డిసెంబర్ 17 నుంచి ఈహెచ్ఎస్ సేవలు మొదలయ్యాయి. వెల్నెస్ సెంటర్ల ద్వారా ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, మందులను ఉచితంగా అందిస్తున్నారు. పరీక్షల ఆధారంగా అవసరమైన వైద్య చికిత్సల కోసం ఎంపిక చేసిన ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. ఈహెచ్ఎస్ సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ఆస్పత్రులు ఉన్నాయి. అన్ని ఆస్పత్రులలో కలిపి ఇప్పటివరకు 1,19,210 మంది ఇన్పేషెంట్లుగా చికిత్సలు పొందారు. ఈ సేవలకు రూ. 400 కోట్లు ఖర్చయింది. ఉద్యోగులకు వైద్యం అందించిన ఆస్పత్రుల జాబితాలో 16 బడా కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. అత్యవసర, క్లిష్టమైన సేవలు అందించేందుకు అన్ని వసతులుగల ఈ కార్పొరేట్ ఆస్పత్రులకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు గుర్తింపు ఉంది. ఎన్బీఏ గుర్తింపు ఉన్న ఆస్పత్రుల్లో 24,210 మందికి వివిధ రకాల చికిత్సలు నిర్వహించారు. వారిలో 10,225 మంది ఉద్యోగులు, 13,549 మంది పెన్షన్‌దారులు, 436 మంది జర్నలిస్టులు చికిత్సలు పొందారు. ఈహెచ్ఎస్ కింద అందించిన ఈ సేవల కోసం ఏడాదిలో రూ. 270 కోట్లు ఖర్చయ్యాయి. ఈహెచ్ఎస్ మొదలైన కొత్తలో ఆస్పత్రులు అన్నింటికీ కలిపి వైద్య, ఆరోగ్యశాఖ రూ. 70 కోట్లు చెల్లించింది. కానీ గత 11 నెలలుగా మాత్రం చెల్లింపుల ప్రక్రియను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెల్లింపుల విషయంలో అడ్డుంకులు సృష్టిస్తున్నారని ఆస్పత్రుల నిర్వాహకుల సంఘం ముఖ్యలు ఆరోపిస్తున్నారు. బకాయిలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే వివిధ రకాల వైద్య పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. -
కాళేశ్వరానికి కేంద్రం అనుమతి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులకు కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని పర్యావరణ మదింపు కమిటీ (ఈఏసీ) సానూకులత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. మంగళవారం ఈ మేరకు పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈఏసీకి వివరించారు. పర్యావరణ రక్షణకే రూ.3,055 కోట్లు ఖర్చు చేస్తున్నామని, భూ సేకరణ, పునరావాసానికి మరో రూ.13,296 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఈఎన్సీ మురళీధర్, ప్రాజెక్టు సీఈ హరిరామ్ తెలిపారు. దీంతోపాటే పరీవాహక, ఆయకట్టు ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, జీవవైవిధ్యం–వన్యమృగ సంరక్షణ, పచ్చదనం అభివృద్ధి, చేపల పెంపకం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే నీటి లభ్యతకు సంబంధించిన క్లియరెన్స్‌లు వచ్చిన విషయాన్ని ప్రస్తావించి దానికి సంబంధించిన లేఖలను అందజేశారు. దీనిపై ఈఏసీ ఎలాంటి అభిప్రాయాలు తెలుపలేదని, తమ నిర్ణయాన్ని మినిట్స్ రూపంలో తెలియజేస్తుందని, అప్పటి వరకు వేచి చూడాల్సి ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన వివరణతో ఈఏసీ సంతృప్తి చెందిందని, త్వరలోనే కాళేశ్వరానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. పాల్వంచలో స్టీల్‌ప్లాంటుకు అవకాశాలు పుష్కలం - కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ పొంగులేటి సాక్షి, న్యూఢిల్లీ: పాల్వంచలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ ప్రాంతంలో ఎన్ఎండీసీకి చెందిన 450 ఎకరాల స్థలంలోపాటు నీరు, విద్యుత్, మౌలిక వసతులు ఉన్నాయని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేంద్రసింగ్‌కు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్‌తోపాటు పాల్వంచలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి చర్చించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రిని కలసిన వారిలో ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఉన్నారు. రాజకీయ ఉద్యోగాల కోసమే ‘కొట్లాట’.. కొంతమంది రాజకీయ ఉద్యోగాల కోసమే ‘కొలువుల కొట్లాట’ పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని జేఏసీ చైర్మన్ కోదండరాంను ఉద్దేశించి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీమేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తోందన్నారు. కొంత మంది కావాలనే రాజకీయ ప్రయోజనాలతో ఉద్యమాలు చేస్తున్నారన్నారు. -
‘క్లినికల్’ హత్యలు ఆపలేరా?!
తగిన చట్టాలు, వ్యవస్థలు... వాటి పర్యవేక్షణ లేకుండానే ఔషధ పరీక్షలు (క్లినికల్ ట్రయల్స్) యధేచ్ఛగా సాగుతున్నాయని ఈ నెల 3న ‘సాక్షి’ దినపత్రిక వెలువరించిన కథనం బయటపెట్టింది. తెలంగాణలో చడీచప్పుడూ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకూ చెందిన వేలాదిమంది పేద జనం సమిధలవుతున్నారని, వారిలో అనేకులు తీవ్ర అస్వస్థతకు లోనై నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరు చనిపోయారని ఆ కధనం చెబుతోంది. ఈ ఔషధ పరీక్షల బారిన పడుతున్నవారంతా నిరుపేదలు మాత్రమే కాదు... నిరక్షరాస్యులు కూడా. వీటిల్లో పాల్గొంటే ఎంతో కొంత డబ్బిస్తారని, అందువల్ల అయినవారికి ఒకటి రెండు రోజులు పట్టెడన్నం పెట్టవచ్చునన్న ఒకే ఒక ఆశ తప్ప వారు ఇంకేమీ ఆలోచించలేని నిస్సహాయులు. వారికి తమ హక్కులేమిటో తెలియదు. ఆ పరీక్షలు వికటిస్తే ఎలాంటి సాయం అందుతుందో, ఔషధ పరీక్షలు నిర్వహించే సంస్థ జవాబుదారీతనం ఎంతో వారికి తెలియదు. అలాంటివారంతా ఔషధ పరీక్షల సాలెగూటిలో చిక్కుకున్నాక రోజువారీ పనులు కూడా చేసుకోలేని దుస్థితికి చేరుకుంటున్నారు. నెత్తుటి వాంతులతో, నిద్రలేమితో, ఒంటి నొప్పులతో నానా యాతనా పడుతున్నారు. చిక్కి శల్యమై అయినవారికి భారంగా మారుతున్నారు. కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి పరీక్షలకు సంబంధించి దేశంలో నిర్దిష్టమైన చట్టం లేదుగానీ డ్రగ్ కంట్రోల్ జనరల్ (డీసీజీఐ), భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), ఔషధ నియంత్రణ సంస్థ(డీసీఓ)వంటి విభాగాలు రూపొందించిన నిబంధనలు, మార్గదర్శకాలున్నాయి. అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న ఈ ఔషధ ప్రయోగాలపై సమగ్రమైన నిబంధనలతో సవరణ బిల్లు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లక్రితం ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రయోగాలు నిర్వహించే సంస్థలపై కఠిన చర్యలుండేలా ఈ బిల్లులో ఏర్పాట్లున్నాయని తెలిపింది. కానీ ఇంతవరకూ ఆ బిల్లు చట్టంగా రూపుదిద్దుకోలేదు. ఇప్పటికీ బ్రిటిష్ వలసపాలకుల కాలంలో రూపొందిన డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం నిబంధనలే అమల్లో ఉన్నాయి. ఔషధ ప్రయోగాలకు ఆ చట్ట నిబంధనలు అనువుగా లేవన్న ఉద్దేశంతో 2005లో దాన్ని సవరించారు. ఆ నిబంధనలు సైతం బేఖాతరవుతున్నాయి. ఔషధ పరీక్షలపై 2012లో సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిని ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ఆ వ్యాజ్యం దాఖ లయ్యాకే ఔషధ పరీక్షల వికృత పోకడ అందరికీ అర్ధమైంది. 2005–12 మధ్య దేశవ్యాప్తంగా ఔషధ పరీక్షల అనంతరం 2,828 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఇందులో కేవలం 89 మరణాలు మాత్రమే ఔషధ పరీక్షలకు సంబంధించినవని ఆ శాఖ ప్రకటించింది. ఇందులో 82మందికి సంబంధించినవారి వారసులకు నష్టపరిహారం అందిందని వివరించింది. కానీ మరణాల విషయంలో ఆరా తీసిందెవరో, వాటి సహేతుకత ఎంతో ఎవరికీ తెలియదు. అందువల్లే పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ ఔషధ పరీక్షల్లో డీసీజీఐ, ఐసీఎంఆర్, పరీక్షలు నిర్వహించిన సంస్థలతోపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తప్పు కూడా ఉన్నదని వ్యాఖ్యానించింది. నిజానికి ఈ పరీక్షల ప్రక్రియ ఒక క్రమపద్ధతి ప్రకారం సాగాలి. ఏ ఔషధాన్నయినా దేశంలో పరీక్షలకు అనుమతిస్తూ లైసెన్స్ జారీచేసే ముందు డీసీజీఐ అదెంత సురక్షితమైనదో, సమర్ధత కలిగిందో ఆరా తీయాలి. తగిన పరి శోధన నిర్వహించాలి. ఈ లైసెన్సింగ్ విధానం ఎలా ఉంటున్నదో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షించాలి. ఔషధ పరీక్షలకు సంబంధించిన ప్రొటోకాల్స్ పాటి స్తున్నారో లేదో ఐసీఎంఆర్ చూడాలి. వీరిలో అందరికందరూ వాణిజ్య ప్రయో జనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, విదేశీ ఔషధ సంస్థల ప్రభావంలో పడుతున్నారని ఆ నివేదిక నిశితంగా విమర్శించింది. దేశంలో అత్యవసర వైద్య సదుపాయాలున్న 330 వైద్య కళాశాలల్లో మాత్రమే ఈ ఔషధ పరీక్షలు సాగాలని కూడా సూచించింది. ఔషధ పరీక్షలు ఎంత అమానవీయంగా సాగుతాయో 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో బయటపడిన ఉదంతాలే చెబుతాయి. మహిళల్లో వివిధ రకాల కేన్సర్లకు దారితీసే హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ)కు విరుగుడుగా కనుగొన్న ఒక ఔషధంపై అప్పట్లో రెండు రాష్ట్రాల్లోని 16,000మంది బాలికలపై పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల పర్యవసానంగా వందలాదిమంది తీవ్ర అస్వస్థతకు లోనుకాగా, వారిలో ఏడుగురు బాలికలు మరణించారు. ఆ తర్వాత ఔషధ నియంత్రణ జనరల్ అప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలకు తోడు మరికొన్నిటిని జోడించడం మినహా వేరే చర్యలేమీ తీసుకోలేదు. మృతుల కుటుంబాలకు నామమాత్ర పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. మరణాలకు బాధ్యులెవరో మాత్రం తేలలేదు. నిజానికి 2005లో డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టానికి తీసుకొచ్చిన సవరణ ప్రకారం రెండో దశ పరీక్షలకు మాత్రమే దేశంలో అనుమతి ఉంది. అంటే విదేశాల్లో పరీక్షించి చూసిన ఔషధాన్ని మాత్రమే ఇక్కడ పరీక్షలకు అనుమతించాలి. దానికి ముందు అక్కడి ఫలితాలెలా ఉన్నాయో తెలుసు కోవాలి. కానీ డబ్బుకు కక్కుర్తిపడే వైద్యులు, అధికార గణం, పట్టనట్టు వ్యవహరించే పర్యవేక్షణ సంస్థల తీరు వల్ల నిరుపేద జనం బలిపశు వులవుతున్నారు. ఈ పరీక్షల వల్ల ఏటా వందల మరణాలు సంభవిస్తున్నా, వేలాదిమంది అస్వస్థులవుతున్నా దాన్ని నేరంగా పరిగణించడం, కేసు పెట్టడంలాంటివి జరగడం లేదు. బాధితులకు వైద్య సాయంగానీ, వారి కుటుంబాలకు తగిన పరిహారంగానీ దక్కటం లేదు. మనుషుల ప్రాణాలకు కనీస విలువనీయని మనస్తత్వం మన దేశంలో మినహా ప్రపంచంలో మరెక్కడా కనబడదు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ఔషధ పరీక్షలను తక్షణం నిలుపుచేయించాలి. సమగ్ర విచారణ జరిపించి కారకులపై తగిన చర్యలు తీసుకోవాలి. పౌరుల జీవించే హక్కును కాపాడాలి. (క్లినికల్ ట్రయల్స్ పై డిసెంబర్ 3న ‘సాక్షి’ దినపత్రిక వెలువరించిన కథనం చదవండి : ‘క్లినికల్’ కిల్లింగ్స్!) -
చట్ట సభల్లో బీసీ కోటా
-
చిల్లర దేవుళ్లకు.. వెయ్యి కోట్ల ‘మామూళ్లు’
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకు నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో ఎన్నో రకాల సేవలు అవసరం. అవన్నీ జనానికి ఉచితంగానే అందాలి. కానీ ఇలా మామూలుగా అందాల్సిన సేవలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘మామూళ్లు’గా మారాయి. ప్రతి సేవకూ తృణమో, పణమో సమర్పించక తప్పదు కదా అన్న భావన కూడా స్థిరపడిపోయింది. రాష్ట్రంలో ఏటా ఇలాంటి చిన్న చిన్న ‘చిల్లర’లంచాల మొత్తమే ఏకంగా రూ. 1,000 కోట్లు దాటిపోతోంది. ప్రజలకు తరచూ ఏదో ఒక పనిపడే ప్రభుత్వ విభాగాల్లో ఈ జాడ్యం ఎక్కువగా ఉంటోంది. ఇలా ఒక్కో శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది జేబుల్లోకి ఏటా వేల కోట్ల రూపాయలు చేరుతున్నట్లు ఏసీబీ, విజిలెన్స్ విభాగాల రహస్య అధ్యయనంలోనే వెల్లడైంది. ఇక అవసరమైన పెద్ద పనుల కోసం, అక్రమాలు, అవకతవకలకు సహకరిస్తూ అధికారులు, సిబ్బంది డిమాండ్ చేసే ‘ముడుపులు’వేరే. అవన్నీ లెక్కగడితే వేల కోట్ల రూపాయలకు చేరుతాయని అంచనా. ‘చిల్లర’లంచాల్లో రెవెన్యూ టాప్ అన్ని ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే.. రెవెన్యూ విభాగం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటుంది. అదే క్రమంలో చిన్న చిన్న లంచాల స్వీకరణలోనూ టాప్‌లో నిలుస్తోంది. స్థానిక, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి భూముల లెక్కలు సరిచేసే వరకు చాలా రకాల సేవలు అందించే రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి చదివింపులు భారీగానే ఉంటున్నట్టు విజిలెన్స్ అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొత్త మండలాలతో కలిపి మొత్తంగా 584 మండలాలు ఉన్నాయి. వీటిలో 510 కార్యాలయాలు నిత్యం బిజీగా ఉంటాయి. వీటిలో పనుల కోసం వచ్చే జనం.. రోజూ సగటున సుమారు రూ.35 వేల వరకు సమర్పించుకుంటున్నారు. ఈ లెక్కన మండల రెవెన్యూ కార్యాలయాలన్నింటిలో కలిపి రోజుకు రూ.1.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 645 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నట్లు విజిలెన్స్, ఏసీబీల అధ్యయనంలో వెల్లడైంది. కలెక్టరేట్లలోనూ.. రెవెన్యూ శాఖ పరిధిలో 31 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ ‘మామూళ్లు’కోట్లకు చేరిపోయాయి. ఒక్కో జిల్లా కలెక్టరేట్లో సగటున రోజూ రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు చదివింపులు జరుగుతున్నాయని.. ఇలా ఏటా రూ.273 కోట్ల మేర లంచాలు వసూలవుతున్నాయని ఏసీబీ ఇటీవల జరిపిన రహస్య అధ్యయనంలో గుర్తించింది. రవాణా శాఖలో ఏటా రూ.220 కోట్లు వాహనాల రిజిస్ట్రేషన్లు సహా పలు రకాల సేవలు అందించే రవాణా శాఖలో లంచాల పర్వం ఎక్కువగానే ఉంది. ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని ఉండకుండా అప్పటికప్పుడే పని పూర్తికావాలంటూ వాహనదారులు మామూళ్లు చెల్లిస్తున్నారని.. ఇలా రోజూ సుమారు రూ. 60 లక్షల మేర లంచంగా సమర్పించుకుంటున్నారని ఏసీబీ, విజిలెన్స్ అధ్యయనంలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ఆర్టీఏ, యూనిట్ ఆఫీసులలో ఒక్కో యూనిట్లో రోజుకు రూ.లక్ష మేరకు చిన్న చిన్న లంచాలు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు అంచనా. ఇలా ముడుపుల సొమ్ము ఏటా రూ.220 కోట్ల వరకు చేరుతోంది. రిజిస్ట్రేషన్‌లో ‘మామూలే’! స్థలం అమ్మినా, కొన్నా, బదిలీ చేసినా.. ఇలా 14 రకాల సేవలు అందించే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలోనూ చిన్న చిన్న ముడుపులు మామూలైపోయాయి. రాష్ట్రంలో 22 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లోని 22 కార్యాలయాల్లో ఒక్కో దానిలో నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు (మొత్తంగా 66 లక్షలు).. 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్కోదానిలో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ( మొత్తంగా రూ.1.56 కోట్లు) చిల్లర లంచాలు జమవుతున్నాయి. మొత్తంగా జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి నెలకు సుమారు రూ.2.2 కోట్ల చొప్పున ఏటా రూ.26 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోందని ఏసీబీ, విజిలెన్స్ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ఎక్సైజ్‌లో నెలకు రూ.15 కోట్లు.. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాలకు వేల కోట్ల రూపాయలు వచ్చిచేరుతున్నట్టే.. అధికారులు, సిబ్బంది జేబుల్లోకి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు చేసిన అధ్యయనం మేరకు.. ప్రతీ నెల జిల్లాల వారీగా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా చిన్న చిన్న చదివింపులు ఉంటున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల రూ. 15 కోట్ల చొప్పున ఏడాదికి రూ.180 కోట్ల మేర ‘మామూళ్లు’అందుతున్నాయి. జీఎస్టీతో తగ్గిన ‘వాణిజ్య’జోరు వాణిజ్య పన్నుల శాఖలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. జీఎస్టీ రాకముందు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారుల నుంచి రోజు వారీ చెల్లింపులు భారీగానే ఉండేవి. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత నెల వారీగా మాత్రమే చదివింపులు వస్తున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలోని 12 డివిజన్లలో ప్రతీ నెలా రూ.65 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ‘చిన్న మొత్తాలు’వస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇలా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోంది. వీటిలో నెలవారీ వసూళ్లు..! సమయం, సందర్భాన్ని బట్టి ప్రజలు ఉపయోగించుకునే విభాగాల్లో.. రోజు లెక్కన కాకుండా నెలవారీగా ‘చదివింపులు’జరుగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాలకు నెలవారీగా చిన్న లంచాలు అందుతున్నాయి. వీటిల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా... జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ శాఖలు అనుమతులను బట్టి మూడో స్థానంలో ఉన్నాయి. తూనికలు కొలతలు, పోలీసుశాఖ నాలుగో స్థానంలో ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ‘చదివింపులు’ ⇒ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ విభాగాల్లో అనుమతుల అవసరాలు, సందర్భాన్ని బట్టి ‘చిల్లర లంచం’సమర్పణలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో కలిపి ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిన్న మొత్తాలు’అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నాయి. ⇒ పోలీసు శాఖలోనూ జిల్లాల్లో నెలవారీ మామూళ్ల లెక్క కోట్లు దాటుతోంది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్ విభాగాల పరిధిలో 740 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. పట్టణ ప్రాంత పోలీస్స్టేషన్లలో రూ.5 లక్షల వరకు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు ఏసీబీ అధ్యయనంలో గుర్తించింది. ఈ లెక్కన మొత్తంగా ఏటా రూ.180 కోట్ల మేర చిల్లర చెల్లింపులు ఉంటున్నట్టు తేల్చింది. ⇒ తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలిలకు కేసుల వారీగా చెల్లింపులు ఉంటున్నట్టు ఏసీబీ అధ్యయనంలో తేల్చింది. ఈ రెండు విభాగాల్లో ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిల్లర’చెల్లింపులు ఉంటున్నట్టు అంచనా వేసింది. -
చట్ట సభల్లో బీసీ కోటా
సాక్షి, హైదరాబాద్ : బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం తేవాలని రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాయని, దీన్ని తెలంగాణ డిమాండ్‌గా కేంద్రం ముందు పెడతామన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్ష కమిటీ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసి ఈ విషయంపై ఒత్తిడి తెస్తుందని ప్రకటించారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని, పదోన్నతుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం కన్నా అధికంగా ఉన్న బలహీన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీల అభ్యున్నతికి ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వారి జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీలపై చర్చ బీసీ డిమాండ్లు, అభ్యున్నతి కోసం త్వరలోనే అసెంబ్లీలో ఒకరోజు పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ను సీఎం కోరారు. బీసీ ప్రజాప్రతినిధులంతా రెండు మూడ్రోజులపాటు సమావేశాలు నిర్వహించుకుని, తమకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించాలని, ఆ మేరకు అవసరమైన తీర్మానాలు, చట్టాలు, జీవోలు తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వాటిని నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రకటించారు. బీసీ ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం అవసరమైన చట్టాలు తేవడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత విధానంలో ఏమైనా లోపాలుంటే మార్చుకోవడానికి కూడా తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అంతిమంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు మేలు కలగాలని, వారి భవిష్యత్‌కు మంచి బాటలు పడాలన్నదే తన లక్ష్యమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు మారినా విధానపరమైన విషయాల్లో స్థిరత్వం ఉంటుందని, కానీ మనదేశంలో విధానపరమైన స్థిరత్వం లేకపోవడం ప్రధానలోపమన్నారు. బీసీల కోసం విధానాలు, పథకాలు రూపకల్పన చేసే సందర్భంలో భవిష్యత్‌లో వాటినెవరూ తొలగించలేనంత పకడ్బందీగా రూపొందించాలన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఎలా పనిచేయాలో, స్వయం ఉపాధి పథకాల స్వరూపం ఎలా ఉండాలో సూచించాలన్నారు. రాజకీయాలకతీతంగా బీసీ వర్గాల ప్రజాప్రతినిధులు అన్ని కులాల అభిప్రాయాలు తీసుకుని.. ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలన్నారు. బీసీ పారిశ్రామికవేత్తలకు భూముల్లో రిజర్వేషన్ ‘‘కొన్ని కులాలకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులున్నాయి. ప్రభుత్వ లబ్ధి అందుకునే అంశంపై కొన్ని కులాల మధ్య ఘర్షణలున్నాయి. కొన్ని కులాల గుర్తింపునకు సంబంధించిన సమస్యలున్నాయి. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాలి’’ అని సీఎం కోరారు. ‘‘బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసుకుందాం. బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్ఐఐసీ ఇచ్చే భూముల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం. ఇంకా బీసీలకు ఏం చేయాలో కొత్త పథకాలు రచించండి. అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించండి. అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. మీరు ఇచ్చిన నివేదికనే ప్రభుత్వం ఆదేశంగా స్వీకరించి అమలు చేస్తుంది. మీరు చర్చించిన అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించి అప్పటికప్పుడు విధానపరమైన నిర్ణయాలు ప్రకటిద్దాం. బీసీల విషయంలో రాజకీయాల్లేవు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకేలా కోరుకుంటున్నారు. ఉన్నంతలో బీసీల కోసం ఎంత ఉన్నతంగా పనిచేయగలమన్నదే ప్రధానాంశం. కేవలం ప్రభుత్వమే ఖ్యాతి పొందాలనుకోవడం లేదు. అన్ని పార్టీలు కలసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు చెబుదాం. దీంతో ప్రజలకు కూడా మంచి సందేశం పోతుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. అమలు చేసే బాధ్యత నాది.. ‘‘సమున్నత లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నం. అన్ని వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రతీ వర్గం ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. ఎవరూ ఆత్మన్యూనతతో ఉండడానికి వీల్లేదు. అంతా ఆత్మవిశ్వాసంతో బతకాలి. అందరికీ అవకాశాలు రావాలి. ఎవరి పెత్తనం కిందో బతకాల్సిన అవసరం లేదు. అందరూ బాగుపడాలి. అందరూ అవకాశాలు పొందాలి. ఇందుకనుగుణంగానే ఇప్పుడు బాటలు పడాలి. అదే బాటలో భవిష్యత్ తెలంగాణ నడవాలి. సగానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రజాప్రతినిధులు సమయం వెచ్చించి, లోతుగా అధ్యయనం చేసి విధానాలు రూపకల్పన చేయాలి. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి చర్చించండి. సమైక్యంగానే ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వండి. వాటిని అమలు చేసే బాధ్యత నాది. అనుకున్నట్లుగానే తెలంగాణకు మంచి ఆదాయ వనరులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు కలిపి ఏడాది రూ.1.25 లక్షల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంత ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చంతా రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడాలి’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం.. ‘‘బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో బీసీల కోసం కేవలం 19 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 123 స్కూళ్లు స్థాపించుకున్నాం. వీటి ద్వారా 91,520 మంది బీసీ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతున్నది. రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా భావి తరాలకు బంగారు భవిష్యత్ ప్రసాదించగలుగుతాం’’ అని సీఎం అన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లతో రాష్ట్రంలో 50 మంది బీసీలకు మార్కెట్ చైర్మన్ పదవులు లభించాయన్నారు. బీడీ కార్మికులకు భృతి ఇవ్వాలనే నిర్ణయం వల్ల ఎక్కువ మంది బీసీలు, అందులోనూ పద్మశాలిలకు ఎక్కువ మేలు కలిగిందన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థిక సహాయం అందించే పథకాలకు రూపకల్పన చేయాలని కోరారు. కుల వృత్తులకు ప్రోత్సాహం.. ‘‘చెప్పులు కుట్టుకునే వృత్తి తప్ప మిగతా వృత్తిదారులంతా బీసీలేæ. చేతి వృత్తులను నమ్ముకుని బతుకుతున్నారు. వారి వృత్తిలో వారికి నైపుణ్యం ఉన్నా సరైన ప్రోత్సాహం, ఆర్థిక చేయూత లేక వారు సతమతమవుతున్నారు. అందుకే మనుగడ సాధ్యమయ్యే కుల వృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూసివేయడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే కల్లు దుకాణాలు పునరుద్ధరించాం. దీనివల్ల హైదరాబాద్‌లో ఉన్న వారికే కాకుండా గ్రామాల్లోని గీత కార్మికులకు కూడా మేలు కలిగింది. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రూ.1,200 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తోంది. పవర్‌లూమ్‌లను వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఆధునీకరిస్తున్నాం. 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు అందిస్తున్నాం. నేత కార్మికులు తయారు చేసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కుతో.. వలసలు పోయిన వారు తిరిగి సొంత గడ్డకు వస్తున్నారు. సిరిసిల్లలో కాటన్ టు గార్మెంట్ పద్ధతిలో వస్త్ర పరిశ్రమను విస్తరిస్తున్నాం. 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పథకం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 29.50 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పంపిణీ చేసిన గొర్రెలకు మరో 10 లక్షల పిల్లలు పుట్టాయి. ఇప్పటికి లక్షా 41 వేల కుటుంబాలకు గొర్రెల పంపిణీ జరిగింది. మొత్తం 7.30 లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేస్తాం. దేశంలోకెల్లా తెలంగాణలోని గొర్రెల కాపరులే అత్యంత ధనవంతులు అవుతారు. గొల్ల, కుర్మల జీవితంలో గొప్ప మార్పు రాబోతోంది. 100 శాతం సబ్సిడీపై చేపల పంపిణీ చేపట్టాం. మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉండేలా రూ.5 వేల కోట్లతో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. రజకులకు అవసరమైన చేయూత అందిస్తాం. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. విశ్వ బ్రాహ్మణుల కుల వృత్తులను ప్రోత్సహించడానికి రూ.250 కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రులు జోగు రామన్న, ఈటల రాజేందర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, గంప గోవర్ధన్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద భాస్కర్, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఎవరేమన్నారు? బీసీ సంక్షేమంపై సీఎంతో సమావేశమైన తర్వాత పలువురు సభ్యులు మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే... అన్ని వర్గాలకూ ప్రాధాన్యం : రాజేందర్, ఆర్థిక మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సమస్యలపై గళమెత్తితే అధికార పార్టీ అహంకారంతో స్పందించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని బీసీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. పది రకాల అంశాలను ప్రాతిపదికన తీసుకుంటున్నాం. ఉత్పాదక కులాలు, సేవా ఆధారిత కులాలు, ఆదరణ లేని కులాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే ప్రణాళిక దేశానికే ఆదర్శంగా నిలవాలి. మరో రెండ్రోజుల పాటు ఇదే హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం ప్రతిపాదనలను సీఎంకు నివేదిస్తాం. – ఈటల అన్ని వర్గాలకు న్యాయం : జోగు రామన్న, బీసీ మంత్రి బీసీ కులాల్లో కిందిస్థాయిలో ఉన్న వర్గాలకూ న్యాయం జరగాలి. కులాల వారీగా స్థితిగతులను అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ఫెడరేషన్ల విషయంలో ప్రత్యేక చర్చ నిర్వహించి తగిన విధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా బీసీల అభివృద్ధికి శ్రద్ద చూపలేదు. కొత్త రాష్ట్రంలో అణగారిన వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం ఈ మేరకు నిర్ణయించారు. బీసీ ఉప ప్రణాళిక తేవాలి : ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే బీసీలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ఉప ప్రణాళిక తీసుకు రావాలి. ఈ డిమాండ్ గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాం. తాజా చర్చలో సీఎం సానుకూలంగా స్పందించారు. సభ్యులంతా ఏకాభిప్రాయంతో వస్తే ఎన్ని ప్రతిపాదనలైనా ఏకపక్షంగా ఆమోదిస్తామని చెప్పడం సంతోషకరం. బీసీల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపుతో పాటు రుణాల వితరణపైనా చర్చించాలి. 12 ఫెడరేషన్లకు కూడా బడ్జెట్ కేటాయించాలి. కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకున్న క్రీమీలేయర్‌ను తొలగించాలి. రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి : కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన అభివృద్ధికి నిధులిచ్చి ఖర్చు చేయాలనే అంశాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించా. దానికి అనుగుణంగా సీఎం స్పందించి ఒకరోజు బీసీ సంక్షేమంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి చర్చిద్దామని చెప్పారు. రాష్ట్ర జనాభాలో 54 శాతం బీసీలున్నారు. బీసీలు మరింత వేగంగా అభివృద్ధి కావాలంటే రాజకీయంగా ఎదగాలి. అందుకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఫెడరేషన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : ఆకుల లలిత, ఎమ్మెల్సీ ప్రస్తుతమున్న బీసీ ఫెడరేషన్లలో చాలావరకు పనిచేయడం లేదు. వీటన్నిటినీ కలిపి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నిధులు వేరుగా కేటాయించినా పనితీరు వేగవంతమయ్యేందుకు కార్పొరేషన్ కిందకు తేవాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలి. గ్రామ స్థాయిలో కులవృత్తులకు ఆర్థిక చేయూత ఇవ్వాలి. మండలానికో గురుకులం : శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే అభివృద్ధిలో కీలకం విద్యే. అందులో భాగంగా బీసీ పిల్లలందరికీ చదువును మరింత చేరువ చేయాలి. అందుకు ప్రతి మండలంలో ఒక గురుకులాన్ని తెరవాలి. ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి ఏటా వంద చొప్పున ప్రారంభిస్తే మూడు, నాలుగేళ్లలో అన్ని మండల కేంద్రాల్లో గురుకులాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని కులాలు లెక్కలో లేవు. వాటికి కుల ధ్రువీకరణ అందని పరిస్థితి నెలకొంది. వాటిని గుర్తించేందుకు బీసీ కమిషన్ చర్యలు చేపట్టాలి. -
సబ్సిడీ బర్రె రూ.80 వేలు
సాక్షి, హైదరాబాద్: పాడి రైతులకు సబ్సిడీపై ఇచ్చే బర్రెలను రూ.80 వేల చొప్పున కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యూనిట్ ధరను పశుసంవర్థక శాఖ ఖరారు చేసింది. సబ్సిడీ బర్రెల కొనుగోలు కోసం రూ. 971 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. రెండ్రోజుల్లో ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచిగానీ, నాబార్డు నుంచిగానీ, ఏదో ఒక వాణిజ్య బ్యాంకు నుంచిగానీ రుణాల కోసం అధికారులు ప్రయత్నిస్తారు. వచ్చే నెల నుంచి బర్రెలను పంపిణీ చేస్తారు. 2.17 లక్షల మంది రైతులకు లబ్ధి విజయ డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ పాల ఉత్పత్తిదారుల సంఘం, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీలకు పాలు పోసే రైతులకు ఒక్కో బర్రెను సబ్సిడీపై ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా సంఘాల పరిధిలో మొత్తం 2.17 లక్షల మంది రైతులున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీపై, బీసీలు, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేస్తారు. ఒక్కో బర్రె 8–10 లీటర్లు ఇచ్చేలా ఉండాలని నిర్ణయించారు. ధర ఎక్కువైతే లబ్ధిదారులపైనే భారం బర్రె యూనిట్ ధర రూ. 80 వేలుండగా, అంతకంటే ఎక్కువ ధర పలికితే లబ్ధిదారుడే భరించాలని మార్గదర్శకాల్లో పేర్కొంటామని అధికారులు చెబుతున్నారు. యూనిట్ ధరలోనే రవాణా ఖర్చు సహా అన్నీ కలిపి ఉంటాయి. బర్రెలను హరియాణాలో కొనుగోలు చేసి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కో బర్రె ఎన్ని పాలు ఇస్తుందో మూడు రోజులపాటు గమనించి 8–10 లీటర్లు ఇస్తుందని నిర్ధారించుకున్నాక కొనుగోలు చేస్తారు. -
పల్లెల్లో ‘పరోక్షమే’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇక సర్పంచుల ఎన్నిక పరోక్షం కానుంది. నేరుగా ప్రజలే ఎన్నుకునేలా కాకుండా.. ఎన్నికైన వార్డు మెంబర్లే తమలో నుంచి ఒకరిని సర్పంచుగా ఎన్నుకునే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు నేరుగా రాజకీయ పార్టీల అధికారిక అభ్యర్థులుగా, పార్టీ గుర్తులతోనే గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచులకు కచ్చితమైన విధి విధానాలు ఏర్పరచాలని.. సరిగా పనిచేయకపోతే తొలగించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉండాలని నిర్ణయించింది. స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా, గ్రామాల పాలకులు మరింత జవాబుదారీగా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్ట సవరణపై తుది కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీల్లో శివారు గ్రామాల విలీనం, తండాలు, గూడేలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయడం తదితర అంశాలనూ సవరణలో చేర్చనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును వచ్చే వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2018 జూలై 31తో రాష్ట్రంలో ప్రస్తుత గ్రామ సర్పంచ్‌లు, పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల విధానంలో మార్పులు.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నిక ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో జరుగుతోంది. దానికి బదులుగా ఉప సర్పంచ్ పదవికి జరుగుతున్న తరహాలో పరోక్షంగా (వార్డు మెంబర్లు ఎన్నుకునేలా) సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దిశగా సమాలోచనలు చేస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల కారణంగా సర్పంచ్ పదవికి పోటీపడే అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు గెలిచిన వార్డు మెంబర్లు తమలో ఒకరిని సర్పంచ్‌గా ఎంచుకునే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఉప సర్పంచ్ ఎన్నికకు ఇదే విధానం అమల్లో ఉంది. అయితే ఈ విధానం క్యాంపు రాజకీయాలు, గ్రూపులు, కోరం లేకుండా అభ్యర్థులను అదృశ్యం చేసే ఎత్తుగడలు వంటివాటికి తావిస్తుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో వార్డు మెంబర్ల ఫలితాలు వెలువడిన వెంటనే.. అప్పటికప్పుడు సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ దిశగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పలువురు రాజకీయ ముఖ్యులకు సూచించినట్లు తెలిసింది. పార్టీ గుర్తులతోనే ఎన్నికలు..! పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పార్టీ రహితంగా, పార్టీల గుర్తులేమీ లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీల్లో క్రియాశీలంగా ఉన్న అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. అభ్యర్థి గుర్తింపు, బ్యాలెట్ పత్రాల్లో మాత్రం పార్టీలకతీతంగా గుర్తులను కేటాయిస్తున్నారు. పార్టీలు, జెండాల వివాదాలకు తావు లేకుండా పల్లెల్లో సామరస్య వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానం కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీ సర్పంచులెందరు గెలిచారు, వార్లు మెంబర్లు ఎందరు విజయం సాధించారన్న బలబలాలను చాటుకోవటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తులతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధ్యయనం జరుగుతోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ ఈ దిశగా చట్ట సవరణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. గ్రామాల విలీనాధికారం సర్కారుకు.. ప్రస్తుతం మున్సిపాలిటీల చుట్టుపక్కల, పరిసరాల్లో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలంటే చట్టపరంగా చిక్కులు ఉన్నాయి. దాంతో ప్రభుత్వం న్యాయపరమైన కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేలా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిసర గ్రామాలను పట్టణాల్లో విలీనం చేసే సంపూర్ణ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం పది వేల జనాభాకు మించి ఉన్న గ్రామాలను నగర పంచాయతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పలుచోట్ల వీటికి సానుకూలత ఉన్నా.. కొన్ని చోట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. పట్టణాల్లో కలిస్తే గ్రామాలకు ఉపాధి హామీ నిధులు రావని, అన్ని రకాల పన్నులు పెరుగుతాయన్న అభిప్రాయం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం... భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి దృష్ట్యా అలాంటి గ్రామాలను పట్టణాల్లో విలీనం చేయాలని పట్టుదలతో ఉంది. కొత్త పంచాయతీల ఏర్పాటు కూడా.. గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శివారు పల్లెలను సైతం పంచాయతీలుగా చేయనుంది. 500, 600 జనాభాకు మించిన పల్లెలు, ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ కేంద్రాలకు రెండు కిలోమీటర్ల దూరంలోని వాటికి తొలుత ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను చేర్చనుంది. పనిచేయని సర్పంచులపై కొరడా! ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్లో గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి జనాభా ఆధారంగా ఈ నిధులు ఇవ్వాలని యోచిస్తోంది. ఇదే సమయంలో గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పాలకుల విధి నిర్వహణను కట్టుదిట్టం చేసేలా చట్ట సవరణలను సిద్ధం చేస్తోంది. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రంతో పాటు తాగునీటి సరఫరా, మురికి కాల్వలు, పారిశుద్ధ్యం, స్మశానవాటికల నిర్వహణను పక్కాగా చేపట్టేలా నిబంధనావళిని చట్టంలో పొందుపర్చనున్నారు. అవసరమైనన్ని నిధులిచ్చినా పట్టింపులేనట్లుగా బాధ్యతారహితంగా ప్రవర్తించే సర్పంచులను పదవి నుంచి తొలగించే అధికారం సైతం ప్రభుత్వానికి ఉండేలా చట్టానికి సవరణలు చేయాలని భావిస్తోంది. -
జిల్..జిగేల్..గోల్కొండ
-
‘విక్టోరియా హోం’ లీజు రద్దు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని నిజాం కాలం నాటి విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు లీజుకిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. భూమి విషయంలో ఏ నిర్ణయమైనా చట్టానికి లోబడి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. విక్టోరియా హోంకు చెందిన భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి లీజుకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ విక్టోరియా మెమోరియల్ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్.బుచ్చిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదనలు వినిపించారు. 11 ఏళ్ల లీజు చట్టవిరుద్ధం.. అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. రికార్డులను పరిశీలిస్తే, విక్టోరియా హోం భూములను స్వాధీనం చేసుకునేందుకు కథ నడిపించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దేవాదాయ భూమి ఎప్పటికీ ప్రభుత్వ భూమి కాదని ధర్మాసనం మరోసారి గుర్తు చేసింది. ‘దేవాదాయ చట్ట నిబంధనల ప్రకారం మూడేళ్లకు మాత్రమే లీజు ఇచ్చే అధికారం కమిషనర్‌కు ఉంది. ఒకవేళ అంతకు మించిన గడువుతో లీజుకివ్వాలంటే గరిష్టంగా ఐదేళ్లకు మాత్రమే ఇవ్వొచ్చు. అది కూడా ప్రభుత్వ అనుమతితోనే చేయాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. విక్టోరియా భూమిని 11 ఏళ్లకు లీజుకివ్వడాన్ని తప్పుబట్టింది. ఏ అధికారంతో అంత కాలానికి లీజుకిచ్చారని నిలదీసింది. ఐదేళ్లకు మించి లీజుకివ్వాలంటే బహిరంగ వేలం నిర్వహించాలని, అలా చేయకుండా 11 ఏళ్లకు లీజుకివ్వడం చట్ట నిబంధనలకు విరుద్ధమని, దేవాదాయ ట్రస్ట్‌కు చెందిన ఆ భూమిని లీజుకివ్వాలంటే ట్రస్ట్ కార్యవర్గమే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. కార్యవర్గం నుంచి లీజుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ చేసిన వినతి రికార్డుల్లో ఎక్కడా తమకు కనిపించలేదంది. ట్రస్ట్ లేకపోతే ప్రభుత్వం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని, అయితే ప్రస్తుత కేసులో అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తెలిపింది. అది ఎప్పటికీ ప్రభుత్వ భూమి కాదు.. దేవాదాయ భూమికి ప్రభుత్వం ధర్మకర్త మాత్రమేనని, ఆ భూమిని స్వాధీనంలోకి తీసుకోవడానికి.. ఆ భూమిపై ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అవసరమైన పక్షంలో ఆ భూమిని పరిహారం చెల్లించి భూసేకరణ కింద తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ‘అవసరం మీదే.. భూమి కావాలని కోరేదీ మీరే.. భూమి ఇచ్చేదీ మీరే.. ఇలా అయితే ఎలా?’అని ప్రశ్నించింది. లీజు మొత్తాన్ని గణనీయంగా తగ్గించడాన్ని కూడా ధర్మాసనం తన తీర్పులో తప్పుబట్టింది. దేవాదాయ భూమిని దానం చేసిన దాతలకు గానీ, వారి వారసులకు గానీ ఆ భూమిని దేవాదాయ అవసరాలకు కాక మరో అవసరానికి కేటాయిస్తున్నట్లు ఎక్కడ సమాచారం ఇచ్చారని ప్రశ్నించింది. ముందు 11 ఏళ్ల లీజు, ఆ తర్వాత 33 ఏళ్లు, ఆ తర్వాత భూమి మాదేనంటారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విక్టోరియా హోంకి నిధులిస్తున్నారన్న సాకుతో క్రమంగా దానికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని, కావాలంటే నిధులు ఇవ్వడం మానుకోవాలని, అంతే తప్ప ఇలా చట్టవిరుద్ధంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తెగేసి చెప్పింది. దేని ఆధారంగా లీజుకివ్వాలని దేవదాయ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదంటూ, లీజు ఉత్తర్వులను రద్దు చేసింది. -
రాష్ట్రంలో రూ.12,500 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణంలో రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్‌కి చెందిన ప్రముఖ కంపెనీ బిన్ జాయెద్ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం బిన్ జాయెద్ గ్రూప్ చైర్మన్ షేక్ ఖాలెద్ బిన్ జాయెద్ అలీతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, మూడేళ్లలో సాధించిన అభివృద్ధి, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను తెలుసుకుని ఆకర్షితులైన షేక్ ఖాలెద్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ గ్రూపు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతి, పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని ఖాలెద్‌ను అరవింద్ కుమార్ ఆహ్వానించారు. ఒప్పందం మేరకు బిన్ జాయెద్ గ్రూప్ రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాద్‌లో నిర్మించనున్న గేమ్, యానిమేషన్ టవర్, మూసీ రివర్ డెవ లప్మెంట్ ఫ్రంట్, మిషన్ భగీరథ, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ వంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. త్వరలోనే తెలంగాణకు ఒక ఉన్నతస్థాయి బృందాన్ని పంపేందుకు ఈ సంస్థ అంగీకరించింది. సదస్సులో ఆకట్టుకున్న తెలంగాణ దుబాయ్‌లో జరుగుతున్న రెండు రోజుల ఇండియా–యూఏఈ భాగస్వామ్య సదస్సుకు హాజరైన పలువురు పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం ఆకట్టుకుందని పరిశ్రమల మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సదస్సులో భాగస్వామ్య రాష్ట్రంగా హాజరైన తెలంగాణ ప్రతినిధి బృందం.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై ఇచ్చిన ప్రజెంటేషన్ పలువురిని ఆకట్టుకుందని తెలిపింది. భారత్‌లో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం మూడున్నరేళ్లలో సాధించిన ప్రగతిని అరవింద్ కుమార్ తన ప్రజెంటేషన్‌లో వివరించారని పేర్కొంది. తెలంగాణ ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారని, ప్రధానంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఐటీ, టెక్స్టైల్స్ వంటి 14 రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారని చెప్పింది. ఆయా రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలతోపాటు రాష్ట్రంలో నూతన పరిశ్రమలకు అందుబాటులో ఉన్న లాండ్ బ్యాంక్, విద్యుత్ వంటి సౌకర్యాలను వివరించారని, ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్క్, మెడికల్ డివైజస్ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారని వెల్లడించింది. -
‘సర్కారు’లోకి అంగన్వాడీలు
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): జిల్లాలో 1,038 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 155 మినీ అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 55,137 మంది చిన్నారులున్నారు. సాధారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో రెండున్నరేళ్ల పిల్లలను చేర్చుకుంటారు. ప్రాథమిక పాఠశాలల్లో విలీనం అనంతరం ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టి, ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధిస్తారని తెలుస్తోంది. పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేయడం వల్ల ఈ చిన్నారులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నారు. సమీపంలోని పాఠశాలలో.. ఇప్పటి వరకు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు వేరేవేరుగా నడుస్తున్నాయి. ఇకపై వాటిని విలీనం చేయాలని సర్కారు యోచిస్తోంది. చిన్నారులను నిర్ణీత వయసు తర్వాత నేరుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాన్ని విలీనం చేస్తారు. ఒక్కో పాఠశాలలో సుమారుగా 10 మంది చిన్నారులు, 10 మంది గర్భిణులు ఉండాలి. ఒకవేళ అంతమంది లేకపోతే మరో అంగన్వాడీ కేంద్రంలో విలీనం చేసి సమీప ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులకు ఈ విషయమై సూచనలిచ్చింది. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కమిటీని వేసింది. ఐసీడీఎస్ అధికారులు పూర్తి నివేదికలను జూన్ నెలాఖరు కల్లా సమర్పించాల్సి ఉంది. గ్రామీణ విద్యార్థులకు వరం అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసే దిశగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీనిపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి, నివేదికలు అందించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నివేదికలు రూపొందించాం. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. –సంధ్యారాణి, ఐసీడీఎస్ సీడీపీవో, కామారెడ్డి -
30 ఏళ్లు పైబడితేనే ఒంటరి మహిళలు!
♦ అవివాహితల కనీస వయస్సు నిర్ధారించిన సర్కారు ♦ ఏప్రిల్, మే ఆర్థికభృతి జూన్ 2 నుంచి చెల్లింపు ♦ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం పథకానికి సంబంధించి అవివాహి తలను ఒంటరి మహిళలుగా పరిగణించేం దుకు కనీస వయస్సు 30 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. అలాగే భర్త వదిలేసిన, భర్త నుంచి వేరుగా ఉంటున్న మహిళల విషయం లో కనీస వయస్సును 18గా నిర్ణయించిన ప్రభుత్వం, ఏడాదికి పైగా వారు విడిగా ఉండాలని స్పష్టం చేసింది. ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఆసరా పథకం కింద నెలకు రూ.1,000 ఆర్థిక భృతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్థికభృతి పథకానికి సంబంధించి ఉత్తర్వులు బుధవారం విడుదల కానున్నాయి. గురువా రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దరఖాస్తుల స్వీకరణకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక భృతి పథకం ఏప్రిల్ 1 నుంచే వర్తింపజేస్తున్నప్పటికీ ఏప్రిల్, మే నెలల్లో అందాల్సిన భృతిని తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి అందజే యాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సమయం కావాలని జిల్లా కలెక్టర్లు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తహసీల్దారు ధ్రువీకరణ భర్త నుంచి ఏడాదికి పైగా వేరుగా ఉంటున్న మహిళలను స్థానిక విచారణ ద్వారా తహసీల్దారు ధ్రువీకరించాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలె క్టర్లతో దరఖాస్తుల పరిశీలన చేయించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారుల ఎంపికలో సమగ్ర కుటుంబ సర్వే, ఉన్నతి సర్వే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆర్థిక భృతి పొందుతున్న మహిళలు తిరిగి వివాహం చేసుకున్నా, మరణించినా.. సదరు సమాచారాన్ని గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు వెంటనే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేస్తే ఆర్థిక భృతి నిలిపేస్తారు. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పంపిణీ ఆసరా పింఛన్లతో పాటే జరుగుతుంది. పథకం అమలుకు సంబంధించిన అంశాలను (సాఫ్ట్వేర్, సిబ్బంది, నిర్వహణ) గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి ప్రభుత్వం అప్పగించింది. ఆధార్ ఉంటేనే ఆర్థిక భృతి ఒంటరి మహిళల కేటగిరీలో ఆర్థికభృతికి దర ఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఆధార్ నంబ రు తప్పనిసరి కానుంది. వ్యక్తిగత దర ఖాస్తుతో పాటే ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, వార్షికాదాయ పత్రం నకళ్లను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. కార్డున్న లబ్ధిదారుల ఆధార్ సంఖ్యను ఆధార్ ఇనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)లో వెంటనే నమోదు చేస్తారు. కార్డులేని వారు ఆధార్ పొందేందుకు స్థానిక అధికారులు సహాయం చేయాలని ప్రభుత్వం సూచించింది. వేలిముద్రలు లేదా ఐరిష్ ఆధారంగానే ఆర్థిక భృతి చెల్లించనున్న నేపథ్యంలో ఆధార్ నంబరు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. -
హామీల అమలులో విఫలం
నూతనకల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని యడవెల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఆచరణకు సాధ్యం కానీ హామీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, ముస్లీం మైనార్టీలకు రిజర్వేషన్, గిరిజనులకు 12శాతం రిజరేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నర్సయ్య, జన్నారెడ్డి వివేక్‌రెడ్డి, నాగం సుధాకర్‌రెడ్డి, మర్రు ప్రసాద్‌రావు, బద్దం ప్రశాంత్‌రెడ్డి, మేడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిపై సస్పెన్షన్ బ్రిడ్జీలు
నాలుగు లేన్ల రోడ్లతో నాలుగు చోట్ల నిర్మాణం ఒక్కో వంతెన నిర్మాణానికి రూ.150 కోట్ల ఖర్చు ఒక్కోటీ దాదాపు కిలోమీటరు పొడవు వరంగల్ జిల్లా తుపాకులగూడెం వద్ద.. ఖమ్మంలో మణుగూరు-పర్ణశాల రోడ్డు వద్ద.. కరీంనగర్లో కాళేశ్వరం చెంత ప్రాణహితపై బ్రిడ్జీల నిర్మాణం.. ఆదిలాబాద్ జిల్లా గూడెం వద్ద వంతెనకు ఇప్పటికే అనుమతులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి సస్పెన్షన్ బ్రిడ్జీలు రూపుదిద్దుకోబోతున్నాయి. గోదావరిపై నాలుగు లేన్ల రోడ్లతో నాలుగు చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో వంతెనకు దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో జల రవాణా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా ఈ వంతెనల డిజైన్ రూపుదిద్దుకోబోతోంది. ఒక్కో వంతెన దాదాపు కిలోమీటరు పొడవు ఉండనుంది. వరంగల్ జిల్లాలో తుపాకులగూడెం వద్ద గోదావరిపై, ఖమ్మం జిల్లాలో మణుగూరు-పర్ణశాల రోడ్డు వద్ద గోదావరిపై, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం వద్ద ప్రాణహిత నదిపై వీటిని నిర్మించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గూడెం వద్ద ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రజలకు తీరనున్న కష్టాలు.. మహారాష్ట్రలో గోదావరి నది వెడల్పు తక్కువగా ఉంటుంది. దాంతో అక్కడ చిన్నచిన్న వంతెనలతో నదిని సులభంగా దాటొచ్చు. కానీ నది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత కిలోమీటరు కంటే ఎక్కువ వెడల్పుతో ప్రవహిస్తోంది. నదిని దాటేందుకు పెద్దపెద్ద వంతెనల అవసరం ఉంది. కానీ వాటి నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది కావటంతో గతంలో ప్రభుత్వాలు పెద్దగా నిధులు కేటాయించలేకపోయాయి. వంతెనలు లేకపోవటంతో నది అవతలి వైపు వెళ్లేందుకు ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ దూరంలో ఉన్న గమ్యస్థానాలకు చేరుకునేందుకు సైతం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇటీవల వరంగల్ జిల్లా ఏటూరు నాగారం వద్ద భారీ వంతెన నిర్మించటంతో కోల్‌కతా లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు దాదాపు 200 కిలోమీటర్ల దూరాభారం తగ్గింది. దీంతో ఇలాంటివి మరిన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారులతో సంబంధం లేకుండా సాధారణ రహదారులున్న చోట కూడా వీటిని నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా మూడు వంతెనలకు రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో మణుగూరు-పర్ణశాల వంతెనను రాష్ట్ర రహదారుల కింద ఇప్పటికే చేపట్టిన పనుల జాబితాలో చేర్చారు. త్వరలో దీని పనులు మొదలుకాబోతున్నాయి. మిగతా రెంటికి త్వరలో డీపీఆర్‌లను సిద్ధం చేయనున్నారు. సస్పెన్షన్ బ్రిడ్జిలపై భారీ వాహనాలు వెళ్లినప్పుడు వాటి బరువుకు తగ్గట్టుగా వంతెనలు స్వల్పంగా ఊగుతూ ఒత్తిడిని తట్టుకుంటాయి. పొడవైన వైర్లతో ఈ వంతెన నమూనా చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. -
కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యంకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. స్నానఘట్టాల నిర్మాణంతో పాటు దేవాలయాల మరమ్మతులు, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, విద్యుత్ సౌక ర్యం తదితర పనులపై సమీక్షించారు. ఆయా శాఖలన్నీ తమ ప్రతిపాదనలను సంబంధిత కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని సీఎస్ కోరారు. పుష్కరాల సందర్భంగా చేపట్టే పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సీఎస్ సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండ జిల్లాలో 34 స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నామని సీఎస్ తెలిపారు. కృష్ణా పుష్కరాలకు తగినంత ప్రచారం కల్పించాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను కోరారు. అవసరమైన చోట ఎల్ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు, హోర్డింగులు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యాస్థాయిలో అన్నిరకాల ఫీజులు రద్దు
హైదరాబాద్: ఇంటర్ విద్యాస్థాయిలో అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదలైంది. గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజులు రద్దు చేస్తూ టీఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు త్వరలో మార్గదర్శకాలు
సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆరు నెలల్లో స్పష్టమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టనున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ తెలిపారు. ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ప్రోగ్రెస్ హార్మనీ డెవలప్మెంట్ చాంబర్ సంయుక్తంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో స్పష్టత లేకపోవడంతో ఈ రంగం ఆశించినంగా వృద్ధి చెందడం లేదన్నారు. వినియోగదార్ల ప్రయోజనాలకు తగిన నిబంధనలు అవసరమని నిపుణులు బిజోన్ మిశ్రా అభిప్రాయపడ్డారు. టాప్‌లో వెల్నెస్, హెల్త్‌కేర్: ఐడీఎస్ఏ-పీహెచ్డీ 2014-15 సంవత్సరానికిగాను వార్షిక నివేదికను ఈ సందర్భంగా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమ భారత్‌లో రూ.7,958 కోట్లు నమోదైందని ఐడీఎస్ఏ చైర్మన్ రజత్ బెనర్జీ తెలిపారు. ఇందులో 42 శాతం వాటా వెల్నెస్, హెల్త్‌కేర్ ఉత్పత్తులదని వివరించారు. నిబంధనల లోపంతో డెరైక్ట్ సెల్లర్ల సంఖ్య 43.83 లక్షల నుంచి 39.3 లక్షలకు పడిపోయిందన్నారు. అయినప్పటికీ పంపిణీ వ్యవస్థపట్ల కస్టమర్ల ఆసక్తి పెరగుతుండడంతో పరిశ్రమ 6.5% వృద్ధి చెందిందని వెల్లడించారు. టర్నోవర్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా 23 శాతంతో రూ.1,830 కోట్లుందని అసోసియేషన్ కోశాధికారి వివేక్ తెలిపారు. -
పన్నుల పరేషాన్
నామమాత్రపు వసూళ్లతో సరిపెట్టిన అధికారులు పన్నుల వసూళ్లలో వెనకబడ్డ వివిధ శాఖలు సిమెంట్ ఎగుమతులతో భారీగా పడిపోయిన ఆదాయం ఆదాయ పన్ను శాఖ దాడులతో దారిలోకి వచ్చిన వ్యాపారులు నల్లగొండ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి నిధుల గండం పట్టుకుంది. అభివృద్ధి సాధించేందుకు రూ.16 వేల కోట్ల అప్పు కోసం వివిధ సంస్థలను, కేంద్రాన్ని ఆశ్రయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమస్య కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పన్నుల రూపంలో ఆదాయాన్ని సమకూర్చే వివిధ ప్రభుత్వ శాఖలను నమ్ముకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అవిభాజ్య రాష్ట్రంలో వసూలైన పన్నులు రాష్ట్ర విభజన తర్వాత భారీగా పడిపోయాయి. సంబంధిత శాఖల అధికారులు కూడా నామమాత్రంగానే పన్నులు వసూలు చేస్తూ చేతులుదులుపుకుంటున్నారు. పన్నుల ఆదాయంలో పరమావధిగా భావించే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడం, సిమెంట్ ఎగుమతులు పొరుగు రాష్ట్రాల కు ఎక్కువగా వెళ్తున్నందున పన్నుల వసూళ్లు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఆదాయపు పన్ను శాఖ ముమ్మర దాడులు చేయడం వల్ల పన్ను ఎగవేత దారుల ముక్కుపిండి మరీ పన్నులు రాబట్టారు. కోలుకోని రియల్ దందా... రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశించిన మేర ముందుకు వెళ్లకపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేష న్ల శాఖకు ఆదాయం తగ్గుతోంది. దీంతో ఆ శాఖ ఒకింత అయోమయానికి లోనవుతోంది. గతేడాది నిర్దేశించిన లక్ష్యాని కంటే రూ.82.13 కోట్ల రాబడి తగ్గింది. జిల్లాలో రియల్ ఎస్టే ట్ వ్యాపారం జోరుగా సాగే బీబీనగర్, భువనగిరి, చౌటుప్పుల్, నల్లగొండ ప్రాంతాల్లో వ్యాపారం మందగించింది. అలాగే ఆయకట్టు ప్రాంతాలైన కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడలలో కూడా రియల్ వ్యాపారం స్తబ్దుగానే ఉంది. జిల్లా మొత్తం మీద యాదగిరిగుట్ట ప్రాంతంలోనే పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక్కడ నిర్దేశించిన లక్ష్యం రూ.13.73 కోట్లు కాగా... రూ.25.44 కోట్ల ఆదాయం సమకూరింది. యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. వాణిజ్యానికి సిమెంట్ దెబ్బ.. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రూ.148.69 కోట్లకు పడిపోయింది. సేల్స్‌టాక్స్, టర్నో వర్ టాక్స్ వసూలు చేయడంలో ఈ శాఖ వెనుకబడింది. ఎక్కువ మొత్తంలో పన్నులు సిమె ంట్ రంగం నుంచే వస్తుంటాయి. అయితే అవిభాజ్య రాష్ట్రంలో సిమెంట్ అమ్మకాలు స్థానికంగా జరిగినందున సీఎస్టీ 14 శాతం వసూలు అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత సిమెంట్ ఉత్పత్తులు పొరుగు రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తుండటంతో సీఎస్టీ రెండు శాతం మాత్ర మే జిల్లాకు వస్తోంది. దీంతో ఆదాయం తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. టర్నోవర్ టాక్సు వసూళ్లలో సైతం డీలర్లను ఒత్తిడి చేయడం లేదని...స్ట్రీట్ సర్వేల ముసుగులో సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే అపవాదు నుంచి అధికారులు ఇంకా బ యటపడలేదు. జిల్లాలో ఇటీవల టైల్స్ పరిశ్రమకు సంబంధించిన జీరో దందా నడుస్తోం ది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా టై ల్స్త రలిస్తూ గుట్టుచప్పుకాకుండా వ్యాపా రంచేస్తున్నారు. వీటి పైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం లేదనే విమర్శఉంది. గనుల శాఖదీ అదే తీరు... సిమెంట్ రంగంలో రారాజుగా భావించే ఐదు ప్రముఖ కంపెనీలు మూతపడటంతో గనుల శాఖకు ఆదాయం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి, నార్కట్‌పల్లి-అద్దంకి రహదారుల నిర్మాణాలను దృష్టిలో పెట్టుకుని పన్నుల లక్ష్యాన్ని నిర్దేశించారు. వాస్తవానికి 2012లోనే ఈ రెండు రహదారుల పనులు పూర్తియ్యాయి. కానీ పన్ను వసూళ్ల లక్ష్యంలో ఈ రెండు పనులను కూడా చూపిస్తున్నారు. అయితే జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గతేడాది ఈ శాఖకు రావాల్సిన ఆదాయంలో రూ.52.27 కోట్ల లోటు ఏర్పడింది. వసూలు చేసిన ఆదాయంలో ఎక్కువ భాగం ఇసుక వ్యాపారం నుంచి వచ్చిందే. రవాణా పన్నులు నామమాత్రం... జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం అనుమతి లేని వాహనాలు, పన్ను చెల్లించని వాహనా లు 12 వేల వరకు తిరుగుతున్నాయి. ఇవిగాక తప్పుడు మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనా లు అనేకం. చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేస్తున్న తనిఖీ బృందాల కన్నుగప్పిమరీ దొడ్డిమార్గా న జిల్లా మీదుగా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పన్నుల రూపంలో జిల్లాకు రావాల్సిన ఆదాయంలో రూ.31.45 కోట్లు తగ్గింది. ఐటీ శాఖ మెరుపు దాడులు... జిల్లా ఆదాయపు పన్ను శాఖ లక్ష్యం రూ.10 కోట్లుకు గాను రూ.11 కోట్లు వసూలు అ య్యింది. ఐటీ శాఖ కమిషనర్, అదనపు కమిషనర్ రెండు, మూడు సార్లు జిల్లాపై మెరుపు దాడు లు చేశారు. పన్ను ఎగవేత దారులను పసిగట్టి ఐటీ పరిధిలోకి తీసుకొచ్చారు. రియల్ వ్యా పారం, జీరో దందా చేస్తున్న వారిని గుర్తించి పన్నులు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అలాగే పన్ను చెల్లింపు దారులతో అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే ఐటీ శాఖ, వా ణిజ్య పన్నుల శాఖ సమన్వయంతో పనిచేసినట్లయితే పన్నుల రాబడి మరింత పెరుగుతుందని ఐటీ శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.