
మార్కెట్ యార్డులో మిర్చి బస్తాలు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : మిర్చి దందా మొదలైంది. వ్యాపారులు, దళారులు అక్రమాలకు తెరలేపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మిర్చికి డిమాండున్నా రైతుకు ధర ఇవ్వడంలో వ్యాపారులు మొండిచేయి చూపిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. 15–20 రోజుల క్రితం వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.11,275 వరకు ఉండగా, ఈ నెల పదో తేదీ నాటికి రూ.9 వేలకు పడిపోయింది. ఏకంగా రూ.2 వేలకుపైగా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలలపాటు మార్కెట్‌కు మిర్చి తరలిరానుంది. కీలకమైన ఈ సమయంలో ధర పతనం అవుతుండటంతో రైతులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. మున్ముందు ధర ఆశాజనకంగా ఉంటుందా?.. లేదా?.. అన్న భయం వారిని వెన్నాడుతోంది.
గతేడాది జనవరి 10న మిర్చి ధర రూ. 11,500, 11న రూ. 11,200 పలికింది. ఫిబ్రవరి ఒకటో తేదీన రూ. 10,400, మూడో తేదీన రూ. 9,900, ఆరో తేదీన రూ. 9,100 పలికింది. చివరకు ఏప్రిల్ 27వ తేదీ నాటికి క్వింటా మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతున్న వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేశాసి బీభత్సం సృష్టించాడు. ఈ దాడితో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాడిలో పాల్గొన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడం కూడా రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఈ నేపథ్యంలో అదే పరిస్థితి ఈసారి కూడా పునరావృతమవుతుందా అన్న భయం అందరిలో నెలకొంది.
87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి...
ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో మిర్చి అధికంగా సాగు చేశారు. దీంతో ఈసారి 87,220 మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ధర మున్ముందు కొనసాగే పరిస్థితి ఉంటుందా?.. లేదా?.. అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు పెద్దలను కూడా కలవరపరుస్తోంది. మిర్చికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదని కూడా చెబుతున్నారు. ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. అంటే ఈసారి కూడా వ్యాపారులు దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు దందా మొదలుపెడతారు. డిమాండ్ పెరిగిన సమయంలో ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. అయితే ఈ సమయంలో రైతులు తమ మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిలువ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటారు. అటువంటి సమయంలో రైతులకు కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉండాలి. కానీ అవి కేవలం వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరి రైతుల నుంచి కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment