డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు త్వరలో మార్గదర్శకాలు
సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆరు నెలల్లో స్పష్టమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టనున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్ కుమార్ తెలిపారు. ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ప్రోగ్రెస్ హార్మనీ డెవలప్‌మెంట్ చాంబర్ సంయుక్తంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో స్పష్టత లేకపోవడంతో ఈ రంగం ఆశించినంగా వృద్ధి చెందడం లేదన్నారు. వినియోగదార్ల ప్రయోజనాలకు తగిన నిబంధనలు అవసరమని నిపుణులు బిజోన్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
టాప్‌లో వెల్‌నెస్, హెల్త్‌కేర్: ఐడీఎస్‌ఏ-పీహెచ్‌డీ 2014-15 సంవత్సరానికిగాను వార్షిక నివేదికను ఈ సందర్భంగా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో డెరైక్ట్ సెల్లింగ్ పరిశ్రమ భారత్‌లో రూ.7,958 కోట్లు నమోదైందని ఐడీఎస్‌ఏ చైర్మన్ రజత్ బెనర్జీ తెలిపారు. ఇందులో 42 శాతం వాటా వెల్‌నెస్, హెల్త్‌కేర్ ఉత్పత్తులదని వివరించారు. నిబంధనల లోపంతో డెరైక్ట్ సెల్లర్ల సంఖ్య 43.83 లక్షల నుంచి 39.3 లక్షలకు పడిపోయిందన్నారు. అయినప్పటికీ పంపిణీ వ్యవస్థపట్ల కస్టమర్ల ఆసక్తి పెరగుతుండడంతో పరిశ్రమ 6.5% వృద్ధి చెందిందని వెల్లడించారు. టర్నోవర్‌లో దక్షిణాది రాష్ట్రాల వాటా 23 శాతంతో రూ.1,830 కోట్లుందని అసోసియేషన్ కోశాధికారి వివేక్ తెలిపారు.