సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించే విషయంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్‌ల పరిశీలనల పేరిట అనవసర కాలయాపన చేస్తోందని గోదావరి బోర్డు తీరును తప్పుపట్టింది. పరిధికి మించి వ్యవహరిం చడం మాని డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి పంపాలని కోరింది. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, గోదావరి బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.
ఏపీ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డి) ప్రకారం కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులతో అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలన చేయాల్సి ఉంటుందని, ట్రిబ్యునల్‌లు తమ అవార్డులో పేర్కొన్న నీటి లభ్యతకు నష్టం కలిగించే అంశాలపైనే తమ పరిశీలనలు తెలపాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
అలాకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయ అంచనాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దృష్ట్యా క్లాజ్ 85(8)(డి)లో పేర్కొన్న అంశాలకే బోర్డు పరిమితం కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment