త్వరలో స్టేట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ వల్ల భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా (ఏడీఎస్‌ఈఐ), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ (ఫిడ్సీ) సహకారంతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాన్‌క్లేవ్’లో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘ఈ పరిశ్రమ ద్వారా రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చు. స్థానికంగా ఈ రంగం వృద్ధి చెందితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఈ పరిశ్రమలో సేవలందించే సంస్థలు నైతిక పద్ధతులను పాటిస్తూ స్థిరాభివృద్ధిపై దృష్టి సారించాలి. వినియోగదారులకు, విక్రేతలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ప్రభుత్వం పోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంలో తయారీ యూనిట్లు స్థాపించేందుకు సంస్థలు ముందుకురావాలి. ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో సేవలందించే సంస్థలకు అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుంది’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ..‘పారదర్శకంగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించడంలో ఈ పరిశ్రమ కీలకంగా మారనుంది. మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షిస్తూ, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ద్వారా మెరుగైన సేవలందించేందుకు వీలుగా స్టేట్ మానిటరింగ్ కమిటీను త్వరలో ఏర్పాటు చేస్తాం. ఇది వినియోగదారులు, సంస్థల ప్రయోజనాలను కాపాడుతుంది’ అన్నారు. ఏడీఎస్‌ఈఐ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ..‘డైరెక్ట్ సెల్లింగ్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వంతో జతకట్టడం సంతోషకరం. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకారం నెలకొల్పేందుకు ఈ సదస్సు వేదికగా నిలిచింది’ అన్నారు.
ఈ సందర్భంగా ఏడీఎస్‌ఈఐ, ఫిడ్సీ సంస్థలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అభివృద్ధికి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి తమ మద్దతు తెలుపుతామని ప్రకటించాయి. ఈ సమావేశంలో సామాజిక బాధ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతో పాటు, భవిష్యత్తులో డైరెక్ట్ సెల్లింగ్ విభాగంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగంపై చర్చించారు.
ఇదీ చదవండి: మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం
రిటైల్ వ్యాపారులు, దళారులు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తయారీదారుల నుంచి ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే ‘డైరెక్ట్ సెల్లింగ్’. భవిష్యత్తులో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానంలో దళారులు లేకపోవడంతో తుది ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ విలువ ఏకంగా 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి ఈ పరిశ్రమ ఏటా 6.4 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment