సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్లకు గాను మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. 2021–23 సంవత్సరాలకు వైన్ (ఏ4) షాపుల కేటాయింపు నిబంధనలతో సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం జీవో ఎంఎస్ నం.98 విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే 2023 నవంబర్ 30 వరకు ఈ పాలసీ వర్తిస్తుంది.
గత రెండేళ్ల కాలా నికి (2019–21) ఇచ్చిన నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు చేస్తూ ఈ నిబంధనలు రూపొందించారు. మద్యం దుకాణాల కోసం టెండర్ దరఖాస్తు ఫీజును గతంలోలాగే రూ.2 లక్షలుగా నిర్ధారించగా, ఎక్సైజ్ ఫీజును కూడా పాత స్లాబుల్లోనే కొనసాగించారు. అయితే ఫీజు చెల్లింపు వాయిదాల పెంపు, బ్యాంకు గ్యారెంటీ చూపించాల్సిన మొత్తం తగ్గింపు, టర్నోవర్‌పై రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ పెంపు లాంటి నిర్ణయాలతో ఈసారి కొత్త మద్యం పాలసీ విడుదల చేశారు.
ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలివే..
- మద్యం షాపుల టెండర్‌లో పాల్గొనే దరఖాస్తు ఫీజును గత పాలసీలో ఉన్నట్లే రూ.2 లక్షలు ఖరారు చేశారు. టెండర్‌లో షాప్ రాకుంటే ఈ ఫీజు ప్రభుత్వానికి జమ అవుతుంది.
- ఎక్సైజ్ ఫీజును కూడా జనాభా ఆధారంగా పాత పాలసీలో ఉన్న స్లాబులుగానే నిర్ధారిస్తారు. ఫీజులో ఎలాంటి మార్పు ఉండదు.
- ఈ ఫీజును గతంలో ఏడాదికి నాలుగు సార్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ వాయిదా సంఖ్యను ఆరుకు పెంచారు.
- ఈ ఫీజు మొత్తంలో 25 శాతానికి బ్యాంకు గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది. గతంలో మాదిరిగానే ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం లేదు.
- లైసెన్సు లభించిన షాపు నుంచి నిర్ధారిత కోటా కన్నా ఏడు రెట్లు దాటితే గతంలో మార్జిన్ 6.4 శాతం ఉండేది. ఇప్పుడు ఆ కోటాను 10 రెట్ల వరకు 27 శాతంగా పెంచారు. కొన్ని మద్యం బ్రాండ్లపై 20 శాతం మార్జిన్ ఇవ్వనున్నారు. 10 రెట్ల టర్నోవర్ తర్వాత కూడా వ్యాపారులకు 10 శాతం మార్జిన్ ఇవ్వనున్నారు.
- ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మొత్తం షాపులో 15 శాతం గౌడ, 10 శాతం ఎస్సీ, 5 శాతం ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన షాపులను జిల్లాలు యూనిట్‌గా ఆ జిల్లాలో సదరు సామాజికవర్గ జనాభాను రాష్ట్రంలోని ఆ సామాజికవర్గ జనాభాతో పోల్చి కేటాయిస్తారు. అది కూడా జిల్లా కలెక్టర్లు డ్రా పద్ధతిలో నిర్ధారిస్తారు.
- మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి జిల్లా కలెక్టర్లు లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తారు.
- రిటైల్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ (షాపు ఫీజు)ను గతంలో ఉన్న స్లాబుల ప్రకారమే నిర్ణయించారు. అయితే, జీహెచ్‌ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబును జీహెచ్‌ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు 2 కిలోమీటర్ల దూరంలోని షాపులకు వర్తింపజేయనున్నారు.
- పర్మిట్‌రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాలి. వాకిన్ స్టోర్ కావాలంటే మరో రూ.5 లక్షలు అదనంగా చెల్లించాలి.
- జీహెచ్‌ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయించిన దుకాణాలకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలా అనే అధికారాలను ఎక్సైజ్ కమిషనర్‌కు కట్టబెట్టారు.
పెంచుదామా.. వద్దా?
రాష్ట్రంలో అదనంగా కొత్త షాపులను నోటిఫై చేద్దామా వద్దా అన్న దానిపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2,216 (ఏ4) వైన్‌షాపులకు అనుమతి ఉంది. ఈ షాపుల సంఖ్యను రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెంచలేదు. ఈసారి రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో షాపుల సంఖ్య పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారీగా అమ్మకాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ షాపులు పెంచుదామనే కసరత్తు జరుగుతోంది. అయితే మరో 350 దుకాణాలా? 220 దుకాణాలా లేదా అసలే పెంచకుండా పాత షాపులనే నోటిఫై చేద్దామా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఇప్పటికే రాష్ట్రంలోని బార్‌షాపులు నష్టాల్లో నడుస్తున్నాయన్న చర్చ నేపథ్యంలో వైన్‌షాపులు పెంచితే బార్లు ఆర్థికంగా మరింత దెబ్బతింటాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వం శనివారం ఇచ్చిన నోటిఫికేషన్‌లో షాపుల సంఖ్య ప్రస్తావన లేదు. దరఖాస్తు షెడ్యూల్ విడుదల సమయంలో ఈ సంఖ్యను స్పష్టం చేస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా నేడో, రేపో వెలువడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 9 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించి 20న డ్రాలు తీసి, అదే రోజున ప్రొవిజనల్ లైసెన్సులు ఇస్తారు. కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ఎక్సైజ్ ఫీజు స్లాబులివే:
జనాభా ఎక్సైజ్ ఫీజు (సంవత్సరానికి లక్షల రూపాయల్లో)
5 వేల వరకు 50
5 వేల నుంచి 50 వేల వరకు 55
50 వేల నుంచి లక్ష వరకు 60
లక్ష నుంచి 5లక్షల వరకు 65
5 నుంచి 20లక్షల వరకు 85
20 లక్షల కంటే ఎక్కువ 110
Comments
Please login to add a commentAdd a comment