సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లేందుకు అవసరమైన సమస్త సమాచా రాన్ని సేకరిస్తోంది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, కొన్ని రకాల భూముల స్వాధీనంతో పాటు ధరణి రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలను పక్కాగా క్రోడీకరించే పని మొదలుపెట్టింది. రాష్ట్రం లోని అన్ని రకాల భూముల వివరాలను నిర్దేశించిన ఫార్మాట్‌లో పంపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.
మొత్తం 9 రకాల భూముల వివరాలను మండలాలు, సర్వే నంబర్ల వారీగా పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ ఇంటిస్థలాల అంశంపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ముందుంచాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని కోరారు. ఈ లేఖకు జత చేసిన ఫార్మాట్‌లో ప్రతి కేటగిరీ భూమికి సంబం ధించిన ధర (చదరపు అడుగుకు)ను పేర్కొనాలని, లబ్ధిదారుల సంఖ్యతోపాటు ప్రస్తుత పరిస్థితి, సిఫారసులను కూడా జత పర్చాలని కోరడంతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తోందని, అందులో భాగంగానే ఈ వివరాలను అడిగిందనే చర్చ జరుగుతోంది.
గ్రామకంఠం నుంచి సీలింగ్ భూముల వరకు
ప్రభుత్వం మొత్తం తొమ్మిది కేటగిరీల కింద సమా చారాన్ని కోరింది. ఇందులో సీలింగ్ భూములు, 2008లో విడుదల చేసిన జీవో నం:166 ప్రకారం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, జీవో 58, 59ల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్, అటవీ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, గ్రామకంఠాలు, ప్రభు త్వం లీజుకిచ్చిన భూములు ఉన్నాయి. వీటితో పాటు రైతులు ధరణి పోర్టల్ ద్వారా క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీల్లేకుండా నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో గల ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను పంపాలని కూడా ప్రభుత్వం కోరింది.
ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. వేల సర్వే నంబర్లలోని పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉండగా రైతులు వీటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. గత రెండు, మూడు నెలల క్రితం వరకు ఈ విషయంలో ఏం చేయాలో రెవెన్యూ వర్గాలకు కూడా అంతు చిక్కలేదు. మొత్తానికి ఇటీవల ఈ జాబితా నుంచి పట్టా భూములను తొలగించుకునేందుకు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం రైతులకు కల్పించారు. కానీ ఆ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర జాప్యం, కొన్ని కేసుల్లో అన్యాయం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మండలాల వారీగా. సర్వే నంబర్ల వారీగా ఈ భూముల వివరాలను సేకరించి వాటిని ధరణి పోర్టల్‌లో తాజాగా నమోదు చేసి తప్పులు సరిదిద్దే క్రమంలోనే ఈ వివరాలను ప్రభుత్వం అడిగిందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు దేవాదాయ, అటవీ శాఖలతో చాలామంది పట్టాదారులకు సమస్యలున్నాయి. గతంలో పట్టా భూములుగా ఉన్న వాటిని ఉన్నట్టుండి ధరణి పోర్టల్‌లో అటవీ, దేవాదాయ భూముల జాబితాలో చేర్చారు. తాజాగా వీటి వివరాలను సేకరిస్తుండటంతో ఈ రెండు కేటగిరీల్లోని పట్టాదారుల భూములకు విముక్తి కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్రామ కంఠాలపై అటోఇటో!
రాష్ట్రంలోని భూముల విషయంలో ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య గ్రామ కంఠాలు. ఈ భూములు పట్టా భూములతో సమానమని, ఈ భూముల్లో నిర్మాణాలున్నా లేకపోయినా కబ్జాలో ఉన్నవారికి హక్కులు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు గతంలో చెప్పింది. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు పర్చలేదు. హైదరాబాద్ శివార్లలోని నానక్‌రాంగూడ, బాలానగర్, ఉప్పల్, ఖాజాగూడ, మజీద్‌గూడ లాంటి ప్రాంతాల్లో గ్రామ కంఠం భూములున్నాయి. ఇప్పుడు వీటి ధర చాలా ఎక్కువగా ఉంది. అయితే ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి వీటిని స్వాధీనం చేసుకునేందుకు 2018లో అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి చేసిన ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.
సీలింగ్, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, స్వాధీనం!
ఇక రాష్ట్రంలోని ఆరు లక్షల ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పేదలు కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించుకోగా, కొన్నిచోట్ల ఇంటి స్థలాలుగా కబ్జాలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ భూముల్లో లక్ష ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు గతంలోనే నిర్ధారించాయి. అసలు ప్రభుత్వం ఎవరికి అసైన్ చేసింది, ఎవరి కబ్జాలో ఇప్పుడు ఆ భూమి ఉంది, కబ్జాలో ఉన్న వారి సామాజిక హోదా ఏంటనే అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించింది.
హైదరాబాద్ శివార్లలోని కోకాపేట, శంషాబాద్ తదితర మండలాల్లో ఉన్న అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని అమ్మాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీంతో ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం వివరాలను సేకరిస్తోందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద 58, 59 జీవోల కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, సీలింగ్, అసైన్డ్ భూముల్లోని నిర్మాణాలు, స్థలాల క్రమబద్ధీకరణతో పాటు అవసరమైన గ్రామకంఠాలు, అసైన్డ్ భూములను పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవడం, తాజా వివరాలను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భూములపై త్రిముఖ వ్యూహం
Published Sat, Nov 6 2021 2:18 AM | Last Updated on Sat, Nov 6 2021 2:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment