రుణమాఫీ..గందరగోళం! | Waiting Farmers For Loan Waived Nalgonda | Sakshi
Sakshi News home page

రుణమాఫీ..గందరగోళం!

Published Mon, Jun 24 2019 11:33 AM | Last Updated on Mon, Jun 24 2019 11:37 AM

Waiting Farmers For Loan Waived Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఆయా ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ రుణాలను చెల్లించకుండా రుణమాఫీ వర్తిస్తుందన్న ధీమాలో ఉన్నారు. దాంతోపాటు మరో పార్టీ ఏకంగా రూ.2లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీతో మరికొందరు రైతులు తమ రుణాలను రెన్యువల్‌ కూడా చేయించుకోని పరిస్థితిలో ఉన్నారు.

కానీ రూ.లక్ష వరకు రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు, గైడ్‌లైన్స్‌ కూడా అటు బ్యాంకులకు గానీ, ఇటు జిల్లా వ్యవసాయ శాఖకుగానీ పంపించలేదు. అసలు జిల్లాలో ఎంతమంది రైతులు పంటరుణాలను తీసుకున్నారు, దానికి సంబంధించిన నగదు ఎంత అనేది కూడా బ్యాంకుల వద్దగానీ, వ్యవసాయ శాఖ వద్దకూడా గణాంకాలు లేని పరిస్థితి. జిల్లా లీడ్‌ బ్యాంకుకు కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వారు కూడా ఎలాంటి గణాంకాలను సే కరించలేదని తెలుస్తోంది. అసలు రుణమాఫీ వస్తుందా లేదోనని జిల్లా వ్యాప్తంగా రుణాలు పొందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇ టు రుణాలను రెన్యువల్‌ చేసుకోక, కొత్త రుణా లను తీసుకునే పరిస్థితి లేకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

రెన్యువల్‌ కోసం బ్యాంకర్ల ఒత్తిడి
రుణాలను రెన్యువల్‌ చేయించుకోవాలని బ్యాంకుల అధికారులు రైతులపై ఒత్తిడి పెంచారు. కనీసం వడ్డీ చెల్లించినా కొత్త రుణం కింద రెన్యువల్‌ చేస్తామని బ్యాంకుల అధికారులు రైతులను పీడిస్తున్నారు. దీంతో రైతులు తాము వడ్డీని చెల్లించి కొత్తరుణం కింద రెన్యువల్‌ చేసుకుంటే రుణమాఫీ వర్తిస్తుందో లేదో అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ చెల్లిస్తే రెన్యువల్‌ చేస్తారే కానీ తిరిగి పంటరుణాలు ఇవ్వరనే భావనే కూడా రైతులలో నెలకొంది. 

బ్యాంకుల గడపతొక్కని రైతులు..
బ్యాంకర్లు రుణాల రెన్యువల్‌ కోసం ఒత్తిడి పెంచుతుండడంతో రైతులు బ్యాంకుల గడపతొక్కడానికి సాహసం చేయడం లేదు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వ ఒక స్పష్టతను ఇస్తే తప్ప బ్యాంకులకు రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రెన్యువల్‌ చేసుకుంటే తిరిగి రుణాలను ఇస్తామన్న భరోసాను కూడా బ్యాంకర్లు రైతులకు కల్పించకపోవడంతోనే రైతులు వెనకడుగువేస్తున్నారు.

ఖరీఫ్‌ రుణలక్ష్యం ఘనం..
జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రూ.2225.51 కోట్ల  మేరకు పంటరుణాలను ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్ణయించింది. అదే విధంగా బ్యాంకు అధికారుల సమావేశంలో కూడా కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ లక్ష్యం మేరకు పంటరుణాలను రైతులకు చెల్లించాల్సిదేనని ఆదేశాలను జారీ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇప్పటి వరకు కూడా బ్యాంకర్లు కొంతమేరకు పంటరుణాలను రెన్యువల్‌ మాత్రమే చేశారు తప్ప ఎక్కడా తిరిగి ఖరీఫ్‌ పంట రుణాలను చెల్లించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై జిల్లా లీడ్‌ బ్యాంకు అధికారి సూర్యంను వివరణ కోరడానికి ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement