వ్యాక్సిన్‌ ముందుగా ఎవరెవరికి.. | TS Govt Has Decided To Make List Of Names Under Whom To Give Corona Vaccine | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ ముందుగా ఎవరెవరికి..

Published Wed, Oct 21 2020 3:08 AM | Last Updated on Wed, Oct 21 2020 5:05 PM

TS Govt Has Decided To Make List Of Names Under Whom To Give Corona Vaccine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరికి ఇవ్వాలో పేర్లతో జాబితా తయారు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లతో పాటు మొత్తం సిబ్బంది పేర్లతో ఆ జాబితా తయారు చేయాలని జిల్లా వైద్యాధికారుల (డీఎంహెచ్‌వో)ను రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కరుణ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అత్యవసర ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 31 నాటికి జాబితా తయారు చేసి కేంద్ర అధికారిక పోర్టల్‌లో పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులకు వ్యాక్సిన్‌ వేస్తారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కూడా వేస్తారు.

వారి పేర్లనూ జాబితాలో చేర్చుతారు. కాబట్టి ఫార్మాట్‌ ప్రకారం వారి పేర్లు, పనిచేసే ఆస్పత్రి పేరు లేదా పని చేసే ప్రాంతం, మండలం, జిల్లా వంటి వివరాలతో జాబితా తయారు చేస్తారు. వారిలో ఎవరికైనా ఇప్పటివరకు కరోనా సోకిందా? ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? తదితర వివరాలను కూడా పంపిస్తారు. అందుకు సంబంధించిన ఫార్మాట్‌ను డీఎంహెచ్‌వోలకు పంపించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలే మున్ముందు ప్రజలకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. కాబట్టి వారికి తగు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం పేర్లను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకున్నాక కేంద్రం డేటా బేస్‌ తయారు చేస్తుంది. వ్యాక్సిన్‌ వస్తే ముందుగా ఎంత మందికి వేయాల్సి ఉంటుందన్న దానిపై కేంద్రం ఓ అంచనాకు రానుంది.

ప్రైవేట్‌ వైద్య సిబ్బందికే ఎక్కువ వ్యాక్సిన్లు
కరోనా వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. అందుకే మొదటి విడత వ్యాక్సిన్‌ తీసుకునే వైద్య సిబ్బంది జాబితాను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దేశంలో 20 కోట్ల నుంచి 25 కోట్ల మందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ప్రస్తుత అంచనాల ప్రకారం దేశ జనాభాలో దాదాపు 18 శాతం మందికి టీకా ఇచ్చే అవకాశముంది. ప్రాధాన్యం ప్రకారం ముందుగా వైద్య సిబ్బందికి టీకా ఇస్తారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే ఎక్కువగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్సల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల భాగస్వామ్యమే అధికం. 62 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8,794 కరోనా పడకలు ఉండగా, అందులో 1,411 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 227 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 8,943 కరోనా పడకలున్నాయి. వాటిల్లో ప్రస్తుతం 2,067 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇవికాక మండల కేంద్రాలు, పట్టణాల్లో ప్రైవేట్‌ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అందువల్ల ఎక్కువగా ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్య సిబ్బందే వ్యాక్సిన్లు పొందు తారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఇదిలావుండగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్య సిబ్బంది.. అనంతరం సామాన్య ప్రజల్లో లబ్ధిదారుల పేర్లతో డేటాబేస్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా నోడల్‌ ఆఫీసర్లను నియమిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement