సాక్షి, హైదరాబాద్ : క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునే కమిటీని నియమిస్తూ బుధవారం జీవో నంబర్ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి సభ్యులుగా ఉంటారు.
వీరితో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సుధాకర్ రెడ్డిని కూడా కమిటీ సభ్యులుగా నియమించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు ఫిర్యాదు చేయవచ్చు. ప్యానెల్ సభ్యులు మాట్లాడుతూ... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కాగా క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment