నాగార్జునసాగర్‌లో టెన్షన్‌ | Controversy between Telugu states about krishna river water | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’పై కొట్లాట!

Published Thu, Mar 1 2018 12:56 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

Controversy between Telugu states about krishna river water - Sakshi

డ్యాంపై ప్రత్యేక రక్షణ దళం పోలీసుల పహరా

సాక్షి, హైదరాబాద్‌/నాగార్జునసాగర్‌: కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య బుధవారం ఉదయం మొదలైన వివాదం సాయంత్రానికి చల్లారింది. వాటాకు మించి వాడుకున్న కారణంగా నీటి విడుదల నిలిపివేయాలని ఏపీని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశించడం, దాన్ని ఏపీ ధిక్కరించడం.. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం, తెలంగాణతో బోర్డు సంప్రదింపులు జరపడం, తెలంగాణ అంగీకరించడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. దీంతో ప్రస్తుత వివాదానికి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ఇరు రాష్ట్రాల అవసరాలపై పూర్తి స్థాయి లో చర్చించేందుకు ఈ నెల రెండో తేదీన మధ్యా హ్నం 3 గంటలకు బోర్డు త్రిసభ్య కమిటీ భేటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం చేసింది. 

వాటా వాడేసిన ఏపీ 
ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో కృష్ణాలో మొత్తంగా 466.64 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. తెలంగాణ 142.14 టీఎంసీలు, ఏపీ 324.50 టీఎంసీలు వాడుకున్నట్లుగా లెక్కలు తేలాయి. అవిగాక కృష్ణా బోర్డు జనవరిలో తెలంగాణకు 50 టీఎంసీలు, ఏపీకి 60 టీఎంసీలను పంచింది. అయితే ఏపీ కేటాయింపులకు మించి 2.32 టీఎంసీల నీటిని వాడినట్లు బోర్డు గుర్తించి శ్రీశైలం, సాగర్‌ కుడి కాల్వ పరిధిలో నీటి విడుదల నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి కుడి కాల్వ పరిధిలో ఏపీ నీటి వినియోగాన్ని తెలంగాణ నిలిపివేసింది. దీనిపై ఏపీ అధికారులు సాగర్‌ డ్యామ్‌పై హడావుడి చేయడంతో వివాదం మొదలైంది.

కుడి కాల్వకు నీటిని విడుదల చేసేందుకు నాగార్జున సాగర్‌ డ్యాం దగ్గర రెగ్యులేటర్‌ను ఆపరేట్‌ చేసుకోవాలని, తెలంగాణ అధికారులు అభ్యంతరం చెబితే పోలీసుల రక్షణ తీసుకోవాలంటూ ఏపీ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌ రావు రాసిన లేఖతో ఆ రాష్ట్ర అధికారులు రంగంలోకి దిగారు. కృష్ణా బోర్డు కేటాయింపులతో తమకు సంబంధం లేదంటూ తెలంగాణ అధికారులతో వితండవాదానికి దిగారు. అయితే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా చుక్కనీటిని కూడా విడుదల చేయలేమంటూ తెలంగాణ అధికారులు తెగేసి చెప్పారు.దీంతో డ్యామ్‌ వద్ద ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడంతో ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.సునీల్‌.. నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్‌ వద్ద ఇరురాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

రంగంలోకి ఏపీ సీఎం
ఈ వివాదం జరుగుతుండగానే తమ రాష్ట్రానికి నీళ్లు విడుదల చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశానికి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌ చేసి మాట్లాడారు. కనీసం 2 వేల క్యూసెక్కులైనా విడుదల చేయాలని కోరారు. దీనిపై తెలంగాణ అధికారులతో చర్చిస్తానన్న పరమేశం.. వెంటనే తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌తో మాట్లాడారు. కుడి కాల్వల కింది పంటలకు నీటి అవసరాల దృష్ట్యా 5 రోజులపాటు 2 వేల క్యూసెక్కుల మేర విడుదలకు ఈఎన్‌సీ అంగీకరించడంతో కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగించవచ్చంటూ పరమేశం ఆదేశాలు ఇచ్చారు. దీంతో వివాదం చల్లారింది. అయితే శ్రీశైలం జలాశయం ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తేనే తాము కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తామని డ్యామ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సిరివోరు సునీల్‌ తెలిపారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement