గోదావరిపై సస్పెన్షన్ బ్రిడ్జీలు
నాలుగు లేన్ల రోడ్లతో నాలుగు చోట్ల నిర్మాణం
ఒక్కో వంతెన నిర్మాణానికి రూ.150 కోట్ల ఖర్చు
ఒక్కోటీ దాదాపు కిలోమీటరు పొడవు
వరంగల్ జిల్లా తుపాకులగూడెం వద్ద..
ఖమ్మంలో మణుగూరు-పర్ణశాల రోడ్డు వద్ద..
కరీంనగర్‌లో కాళేశ్వరం చెంత ప్రాణహితపై
బ్రిడ్జీల నిర్మాణం.. ఆదిలాబాద్ జిల్లా గూడెం వద్ద వంతెనకు ఇప్పటికే అనుమతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి సస్పెన్షన్ బ్రిడ్జీలు రూపుదిద్దుకోబోతున్నాయి. గోదావరిపై నాలుగు లేన్ల రోడ్లతో నాలుగు చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో వంతెనకు దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో జల రవాణా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా ఈ వంతెనల డిజైన్ రూపుదిద్దుకోబోతోంది.
ఒక్కో వంతెన దాదాపు కిలోమీటరు పొడవు ఉండనుంది. వరంగల్ జిల్లాలో తుపాకులగూడెం వద్ద గోదావరిపై, ఖమ్మం జిల్లాలో మణుగూరు-పర్ణశాల రోడ్డు వద్ద గోదావరిపై, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం వద్ద ప్రాణహిత నదిపై వీటిని నిర్మించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గూడెం వద్ద ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రజలకు తీరనున్న కష్టాలు..
మహారాష్ట్రలో గోదావరి నది వెడల్పు తక్కువగా ఉంటుంది. దాంతో అక్కడ చిన్నచిన్న వంతెనలతో నదిని సులభంగా దాటొచ్చు. కానీ నది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత కిలోమీటరు కంటే ఎక్కువ వెడల్పుతో ప్రవహిస్తోంది. నదిని దాటేందుకు పెద్దపెద్ద వంతెనల అవసరం ఉంది. కానీ వాటి నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది కావటంతో గతంలో ప్రభుత్వాలు పెద్దగా నిధులు కేటాయించలేకపోయాయి. వంతెనలు లేకపోవటంతో నది అవతలి వైపు వెళ్లేందుకు ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ దూరంలో ఉన్న గమ్యస్థానాలకు చేరుకునేందుకు సైతం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
ఇటీవల వరంగల్ జిల్లా ఏటూరు నాగారం వద్ద భారీ వంతెన నిర్మించటంతో కోల్‌కతా లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు దాదాపు 200 కిలోమీటర్ల దూరాభారం తగ్గింది. దీంతో ఇలాంటివి మరిన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారులతో సంబంధం లేకుండా సాధారణ రహదారులున్న చోట కూడా వీటిని నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా మూడు వంతెనలకు రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది.
ఇందులో మణుగూరు-పర్ణశాల వంతెనను రాష్ట్ర రహదారుల కింద ఇప్పటికే చేపట్టిన పనుల జాబితాలో చేర్చారు. త్వరలో దీని పనులు మొదలుకాబోతున్నాయి. మిగతా రెంటికి త్వరలో డీపీఆర్‌లను సిద్ధం చేయనున్నారు. సస్పెన్షన్ బ్రిడ్జిలపై భారీ వాహనాలు వెళ్లినప్పుడు వాటి బరువుకు తగ్గట్టుగా వంతెనలు స్వల్పంగా ఊగుతూ ఒత్తిడిని తట్టుకుంటాయి. పొడవైన వైర్లతో ఈ వంతెన నమూనా చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.