
‘సర్కారు’లోకి అంగన్‌వాడీలు
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): జిల్లాలో 1,038 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 155 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 55,137 మంది చిన్నారులున్నారు. సాధారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో రెండున్నరేళ్ల పిల్లలను చేర్చుకుంటారు. ప్రాథమిక పాఠశాలల్లో విలీనం అనంతరం ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశపెట్టి, ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధిస్తారని తెలుస్తోంది. పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేయడం వల్ల ఈ చిన్నారులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నారు.
సమీపంలోని పాఠశాలలో..
ఇప్పటి వరకు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు వేరేవేరుగా నడుస్తున్నాయి. ఇకపై వాటిని విలీనం చేయాలని సర్కారు యోచిస్తోంది. చిన్నారులను నిర్ణీత వయసు తర్వాత నేరుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రాన్ని విలీనం చేస్తారు. ఒక్కో పాఠశాలలో సుమారుగా 10 మంది చిన్నారులు, 10 మంది గర్భిణులు ఉండాలి. ఒకవేళ అంతమంది లేకపోతే మరో అంగన్‌వాడీ కేంద్రంలో విలీనం చేసి సమీప ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులకు ఈ విషయమై సూచనలిచ్చింది. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కమిటీని వేసింది. ఐసీడీఎస్ అధికారులు పూర్తి నివేదికలను జూన్ నెలాఖరు కల్లా సమర్పించాల్సి ఉంది.
గ్రామీణ విద్యార్థులకు వరం
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసే దిశగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీనిపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి, నివేదికలు అందించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నివేదికలు రూపొందించాం. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. –సంధ్యారాణి, ఐసీడీఎస్ సీడీపీవో, కామారెడ్డి