చిన్నారుల తిండిలోనూ చిలక్కొట్టుడు | Scam is also in the eggs supply to the poor students | Sakshi
Sakshi News home page

చిన్నారుల తిండిలోనూ చిలక్కొట్టుడు

Published Mon, Feb 20 2017 1:32 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

చిన్నారుల తిండిలోనూ చిలక్కొట్టుడు - Sakshi

చిన్నారుల తిండిలోనూ చిలక్కొట్టుడు

పాఠశాలలు, అంగన్‌వాడీలకు కోడిగుడ్ల సరఫరాలో గోల్‌మాల్‌

ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే టెండర్‌  
ప్రభుత్వ పెద్దలకు అనుకూలురకు దక్కేలా నిబంధనలు
ఉమ్మడిగా ఒక్కటే టెండర్‌ దాఖలు చేసిన ఐదుగురు పౌల్ట్రీ వ్యాపారులు
జీవోలో పేర్కొన్న ధర కంటే అధికంగా దాఖలు
రూ.360 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెరిగిన టెండర్‌ విలువ
రూ.140 కోట్లకుపైగా దండుకునేందుకు చినబాబు కనుసన్నల్లో వ్యూహరచన
అక్రమాలకు అడ్డుపడ్డ మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి చెక్‌
టెండర్‌ నిర్వహణ బాధ్యత విద్యాశాఖకు అప్పగింత


సాక్షి, అమరావతి బ్యూరో: సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, భవనాల నిర్మాణం, మద్యం, మట్టి, ఇసుక... దోపిడీకి కాదేదీ అనర్హం అంటున్న ప్రభుత్వ పెద్దలు ఆఖరికి పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీల చిన్నారులకు అందజేసే కోడిగుడ్లను సైతం వదిలిపెట్టడం లేదు.గుడ్ల సరఫరాలో రూ.140 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేయడానికి  కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు. తమ వారికే టెండర్‌ దక్కేలా నిబంధనలను అమలు చేశారు. స్థానిక పౌల్ట్రీఫారాలకు అవకాశం ఇవ్వకుండా బడా వ్యాపారులకే గుడ్ల సరఫరా టెండర్‌ను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ అక్రమాలకు అడ్డుపడడంతో గుడ్ల సరఫరా టెండర్‌ నిర్వహణ బాధ్యతను మరో శాఖకు కట్టబెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న చినబాబు ఈ టెండర్‌లోనూ చక్రం తిప్పినట్లు సమాచారం.

ఒక్కో గుడ్డుకు రూ.1.10 అదనం
పాఠశాల విద్యార్థులకు, అంగన్‌వాడీల్లో చేరే చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్లు ఇస్తుంటారు. పాఠశాలలకు 4,62,09,924, అంగన్‌వాడీలకు 4,40,87,533 గుడ్లు... మొత్తం 9,02,97,457 కోడిగుడ్ల సరఫరాకు ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రభుత్వం టెండర్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ టెండర్‌ విలువ రూ.360 కోట్లు. తమకు అనుకూలమైన వారికే టెండర్‌ దక్కేలా ప్రభుత్వ పెద్దలు నిబంధనలు పొందుపరిచారు. టెండర్‌లో పాల్గొనాలంటే రూ.1.60 కోట్ల ఈఎండీ, రూ.2 కోట్ల బ్యాంకు గ్యారెంటీని నిర్దేశించారు. అలాగే రూ.5 కోట్ల సాల్వెన్సీ ఉండాలని పేర్కొన్నారు.

దీనికితోడు అగ్‌మార్క్, ఫుడ్‌ సర్టిఫికెట్‌ ఒక ఏడాది నుంచి ఉండాలని స్పష్టం చేశారు. చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఐదు గురు పౌల్ట్రీ వ్యాపారులు కలసి ఉమ్మడిగా ఒకే టెండర్‌ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ ఐదుగురు వ్యాపారులు టీడీపీకి అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. కాగా, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఇచ్చిన జీవో ప్రకారమైతే ఒక్కో కోడిగుడ్డు ధర, ప్యాకింగ్, లోడింగ్, అన్‌లోడింగ్, రవాణాతో కలిపి రూ.3.50కు మించకూడదు. కానీ, ఒక్కో గుడ్డు సరఫరాకు రూ.4.60కు పైగా టెండర్‌ దాఖలైనట్లు సమాచారం. దీని ప్రకారం టెండర్‌ విలువ దాదాపు రూ.500 కోట్లు కానుంది.

అంటే అసలు టెండర్‌ విలువ కంటే రూ.140 కోట్లు అదనం. ఇదిలా ఉండగా, కోడిగుడ్డు ఉత్పత్తి దారుల సంఘం(నెక్‌) ద్వారా గుడ్లను సరఫరా చేస్తామని చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పౌల్ట్రీవ్యాపారి ఒకరు సీఎం చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం.  మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అంగీకరించలేదు. గుడ్ల సరఫరాకు టెండర్లు పిలవాల్సిందేనన్నారు. దీంతో మహిళా, శిశు సంక్షేమ శాఖను పక్కనపెట్టి విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఒకే టెండర్‌ నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. చినబాబు కనుసన్నల్లోనే దీనికి వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.140 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు సమాచారం. ఈ టెం డర్లను ఈ నెల 20న తెరవనున్నారు.  కేవలం ఒక టెండరే దాఖలైంది. దాన్నే ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

స్థానిక పౌల్ట్రీఫారాలకు మొండిచేయి
ఇప్పటివరకు జిల్లా కొనుగోళ్ల కమిటీల ద్వారా టెండర్లు నిర్వహించి అంగన్‌వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు. మధ్యాహ్న భోజన పథకానికి స్థానికంగా ఉన్న పౌల్ట్రీఫారం నుంచి వంట ఏజెన్సీల నిర్వాహకులే గుడ్లు తెచ్చుకునేవారు. వీటికోసం ఇప్పటివరకూ మహిళా, శిశు సంక్షేమ, విద్యాశాఖలు ఒకే టెండర్‌ పిలిచిన దాఖలాలు లేవు. మరోవైపు తెలంగాణలో కోడిగుడ్ల సరఫరా కోసం ప్రతి పౌల్ట్రీఫారానికి అవకాశం కల్పించాలంటూ అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో ఈ విధానాన్నే అమలు చేసేవారు. ఇప్పుడు ఒకే కాంట్రాక్టు ఏజెన్సీ ద్వారా రాష్ట్రమంతటా గుడ్ల సరఫరా అంటే మున్ముందు ఇబ్బందులు తప్పవని, అక్రమాలకు ఆస్కారం ఏర్పడు తుందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement