‘డూప్‌’ అకౌంట్లు | many of accounts named government departments found to be duplicate | Sakshi
Sakshi News home page

‘డూప్‌’ అకౌంట్లు

Published Wed, Feb 14 2018 3:38 AM | Last Updated on Wed, Feb 14 2018 4:42 AM

many of accounts named government departments found to be duplicate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బ్యాంకు అకౌంట్లు.. వందల్లో కాదు.. ఇబ్బడిముబ్బడిగా.. ఏకంగా 40 వేలకుపైనే! ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలు తెరిచిన ఖాతాలు!! అసలు ఏ విభాగం ఎన్ని ఖాతాలు తెరిచింది? అవి ఎవరి అధీనంలో ఉన్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో అసలు నిధులున్నాయా? ఉంటే ఎంత ఉన్నాయి? ఈ ప్రశ్నలకు ఆర్థిక శాఖ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. 40 వేలకు మించిపోయిన ఈ ఖాతాల్లో దాదాపు 10 వేల నుంచి 20 వేల అకౌంట్లు అనుమానాస్పదంగా మిగిలిపోయాయి. వీటిలో భారీ మొత్తంలోనే నిధులు నిల్వ ఉన్నాయని, దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా ఉంటాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే వాటినెలా స్వా«ధీనం చేసుకోవాలి.. పెరిగిపోతున్న ఖాతాల సంఖ్యను ఎలా కట్టడి చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడి పథకానికి ఈ ఏడాది మే నెలలోనే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయి. ఇంత భారీ మొత్తంలో నిధులు సమకూర్చటం కత్తి మీద సామేనని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ లెక్కలేని ఖాతాలపై దృష్టి సారించింది. అందులో నిల్వ ఉన్న నిధులను తవ్వి తీయాలని భావిస్తోంది.

ఎందుకు పెరిగిపోయాయి?
ఒక్కో ప్రభుత్వ విభాగం తమ అవసరాల మేరకు ఖాతాలు తెరుచుకుంటూ పోవడం, వివిధ ప్రభుత్వ పథకాల అమలు కారణంగా బ్యాంకు అకౌంట్ల సంఖ్య ఏటేటా పెరిగిపోయింది. కొన్ని పథకాల అమలుకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవాల్సి వచ్చిందనిఅధికారులు చెబుతున్నారు. కొన్నిసార్లు కేంద్ర, రాష్ట్ర నిధుల కేటాయింపులకు అనుగుణంగా రెండు మూడు ఖాతాలు తెరిచిన సందర్భాలున్నాయి. కొన్ని విభాగాల్లో అధికారులు బదిలీపై వెళ్లినప్పుడల్లా పాత ఖాతాలు కొనసాగించే బదులు.. తమ పేరిట కొత్త ఖాతాలు తెరిచారు. దీంతో కొత్త ఖాతాలు పెరిగి పాత ఖాతాలు మూలనపడ్డాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఖాతాల సంఖ్యపై అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం విస్మయం వ్యక్తం చేసింది. ఇన్ని వేలల్లో ఖాతాలు ఎందుకున్నాయి.. ఇవన్నీ అవసరమా అని అడిట్‌లో ప్రశ్నించింది. పాత నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్ము కోసం..
బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్మును వాడుకునే కొందరు అధికారుల కక్కుర్తి కూడా.. ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కొందరు అధికారులు ఎక్కడికి బదిలీపై వెళ్లినా.. వెంటనే తన పేరిట జరిగే అధీకృత చెల్లింపులకు కొత్త ఖాతాలు తెరిచారు. అధికారులు మారినప్పుడల్లా.. ‘మీ ఖాతాలు మా బ్యాంకులో నిర్వహించండి..’అంటూ బ్యాంకర్లు సైతం రకరకాల ఆఫర్ల వల విసరటం పరిపాటిగా మారింది. దీంతో అధికారులు తమ ఇష్టానుసారం ఖాతాలు తెరిచారు. దీంతో అవి అన్ని బ్యాంకులు, బ్రాంచీలకు విస్తరించాయి. ఇలా కొత్త అధికారి వచ్చినప్పుడల్లా కొత్త ఖాతాలు తెరవటంతో పాత ఖాతాల్లో నిధులున్నాయా.. లేవా.. ఖాళీ అయ్యాయా.. అన్నది తేలకుండా పోయింది.

అనామతు ఖాతాలన్నీ రద్దు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ఉన్న ఖాతాల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఖాతాల వివరాలే అన్ని శాఖలు పంపిస్తాయని, మూలనపడ్డ ఖాతాలను దాచిపెడతాయని ముందుగానే అంచనా వేసుకుంది. అందుకే అధికారికంగా వెల్లడించిన ఖాతా నంబర్లను నోటిఫై చేసి.. బ్యాంకులకు సమాచారం అందించాలని నిర్ణయించింది. తాము నోటిఫై చేసినవిగాకుండా మిగతా ఖాతాలన్నీ చెల్లుబాటు కావనీ, వాటిలో ఉన్న డబ్బును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని బ్యాంకర్లకు సూచించనుంది. దీంతో దాదాపు రూ.వెయ్యి కోట్లు రికవరీ అవుతాయని ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. వివిధ శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు, నిధుల సర్దుబాటు, ఒక పథకం నిధులను అవసరం మేరకు మరో పథకానికి మార్చేందుకు వీలుగా అన్ని విభాగాల్లో పీడీ ఖాతాలు తెరిచే ఆనవాయితీని ఆర్థిక శాఖ ఎప్పట్నుంచో అమలు చేస్తోంది. వాటికి భిన్నంగా లెక్కతేలని సేవింగ్స్, కరెంట్‌ అకౌంట్లు కూడా ఉన్నాయని, ఇప్పుడు అందులో ఉన్న నిల్వలపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement