duplicate accounts
-
అలాంటి నకిలీ ఖాతాలు తొలగించండి - కేంద్ర ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద నకిలీ ఖాతాలను (ఒకటికి మించి ఉన్న) తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లను (ఆర్ఆర్బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అన్ని ఆర్ఆర్బీలు డిజిటల్ సామర్థ్యాలను అలవరుచుకోవాలని కోరారు. ఎంఎస్ఎంఈ శాఖ గుర్తించిన క్లస్టర్ల వద్ద ఆర్ఆర్బీలు శాఖలు తెరిచేలా చూడాలని ప్రాయోజిత షెడ్యూల్డ్ బ్యాంకులకు మంత్రి సూచించారు. ఢిల్లీలో బుధవారం ఆర్ఆర్బీల చీఫ్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ఆర్బీఐ, నాబార్డ్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నకిలీ ‘ఫేస్బుక్’ ఖాతాలు 25 కోట్లు
హైదరాబాద్: ఫేస్బుక్లో నకిలీల బెడద ఎక్కవైపోతోంది. గత మూడేళ్లలోనే ఇటువంటివి మూడు రెట్లు పెరిగిపోయాయి. నెలవారీ యాక్టివ్ యూజర్ల (తరచూ ఫేస్బుక్లో లీనమయ్యే వారు)ఖాతాలను విశ్లేషించగా, వీటిల్లో 25 కోట్ల ఖాతాలు నకిలీవేనని ఫేస్బుక్ సంస్థ తన 2018 వార్షిక నివేదికలో వెల్లడించింది. 2018 చివరి త్రైమాసికం (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు)లో నెలవారీ యాక్టివ్ యూజర్లలో నకిలీ ఖాతాలు 11 శాతంగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. వాస్తవానికి 5 శాతం మేర ఉండొచ్చని సంస్థ అంచనా వేయడం గమనార్హం. 2015లో యాక్టివ్ యూజర్లలో నకిలీ ఖాతాలు 5 శాతంగానే ఉన్నాయి. 2015 డిసెంబర్ నాటికి ఫేస్బుక్లో నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 159 కోట్లుగా ఉంటే 2018 డిసెంబర్ చివరికి 232 కోట్లకు పెరిగినట్టు ఫేస్బుక్ నివేదిక తెలియజేసింది. గడిచిన నెల రోజుల్లో ఫేస్బుక్ ఖాతాలో లాగిన్ అయిన యూజర్లను నెలవారీ యాక్టివ్ యూజర్లుగా సంస్థ పరిగణిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర మార్కెట్లలో నకిలీ ఖాతాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఒకటి కంటే అదనంగా ఓ యూజర్ నిర్వహించే ఖాతాలను డూప్లికేట్‌గా సంస్థ పరిగణిస్తుంది. ఇందులో యూజర్లు తమ వ్యక్తిగత ప్రొఫైల్‌తో ఒకటి, వ్యాపార అవసరాల కోసం మరొకటి, సంస్థ పేరిట, తమ పెంపుడు జంతువుల పేరిట నిర్వహించే ఖాతాలు ఒక కేటగిరీ కాగా, రెండో కేటగిరీలో ఫేస్బుక్ నిబంధనలకు ఉల్లంఘించే ఉద్దేశంతో క్రియేట్ చేసినవి. -
‘డూప్’ అకౌంట్లు
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు అకౌంట్లు.. వందల్లో కాదు.. ఇబ్బడిముబ్బడిగా.. ఏకంగా 40 వేలకుపైనే! ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలు తెరిచిన ఖాతాలు!! అసలు ఏ విభాగం ఎన్ని ఖాతాలు తెరిచింది? అవి ఎవరి అధీనంలో ఉన్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో అసలు నిధులున్నాయా? ఉంటే ఎంత ఉన్నాయి? ఈ ప్రశ్నలకు ఆర్థిక శాఖ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. 40 వేలకు మించిపోయిన ఈ ఖాతాల్లో దాదాపు 10 వేల నుంచి 20 వేల అకౌంట్లు అనుమానాస్పదంగా మిగిలిపోయాయి. వీటిలో భారీ మొత్తంలోనే నిధులు నిల్వ ఉన్నాయని, దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా ఉంటాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే వాటినెలా స్వా«ధీనం చేసుకోవాలి.. పెరిగిపోతున్న ఖాతాల సంఖ్యను ఎలా కట్టడి చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడి పథకానికి ఈ ఏడాది మే నెలలోనే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయి. ఇంత భారీ మొత్తంలో నిధులు సమకూర్చటం కత్తి మీద సామేనని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ లెక్కలేని ఖాతాలపై దృష్టి సారించింది. అందులో నిల్వ ఉన్న నిధులను తవ్వి తీయాలని భావిస్తోంది. ఎందుకు పెరిగిపోయాయి? ఒక్కో ప్రభుత్వ విభాగం తమ అవసరాల మేరకు ఖాతాలు తెరుచుకుంటూ పోవడం, వివిధ ప్రభుత్వ పథకాల అమలు కారణంగా బ్యాంకు అకౌంట్ల సంఖ్య ఏటేటా పెరిగిపోయింది. కొన్ని పథకాల అమలుకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవాల్సి వచ్చిందనిఅధికారులు చెబుతున్నారు. కొన్నిసార్లు కేంద్ర, రాష్ట్ర నిధుల కేటాయింపులకు అనుగుణంగా రెండు మూడు ఖాతాలు తెరిచిన సందర్భాలున్నాయి. కొన్ని విభాగాల్లో అధికారులు బదిలీపై వెళ్లినప్పుడల్లా పాత ఖాతాలు కొనసాగించే బదులు.. తమ పేరిట కొత్త ఖాతాలు తెరిచారు. దీంతో కొత్త ఖాతాలు పెరిగి పాత ఖాతాలు మూలనపడ్డాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఖాతాల సంఖ్యపై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం విస్మయం వ్యక్తం చేసింది. ఇన్ని వేలల్లో ఖాతాలు ఎందుకున్నాయి.. ఇవన్నీ అవసరమా అని అడిట్‌లో ప్రశ్నించింది. పాత నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్ము కోసం.. బ్యాంకు ఆఫర్లు, వడ్డీ సొమ్మును వాడుకునే కొందరు అధికారుల కక్కుర్తి కూడా.. ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జిల్లాస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కొందరు అధికారులు ఎక్కడికి బదిలీపై వెళ్లినా.. వెంటనే తన పేరిట జరిగే అధీకృత చెల్లింపులకు కొత్త ఖాతాలు తెరిచారు. అధికారులు మారినప్పుడల్లా.. ‘మీ ఖాతాలు మా బ్యాంకులో నిర్వహించండి..’అంటూ బ్యాంకర్లు సైతం రకరకాల ఆఫర్ల వల విసరటం పరిపాటిగా మారింది. దీంతో అధికారులు తమ ఇష్టానుసారం ఖాతాలు తెరిచారు. దీంతో అవి అన్ని బ్యాంకులు, బ్రాంచీలకు విస్తరించాయి. ఇలా కొత్త అధికారి వచ్చినప్పుడల్లా కొత్త ఖాతాలు తెరవటంతో పాత ఖాతాల్లో నిధులున్నాయా.. లేవా.. ఖాళీ అయ్యాయా.. అన్నది తేలకుండా పోయింది. అనామతు ఖాతాలన్నీ రద్దు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ఉన్న ఖాతాల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఖాతాల వివరాలే అన్ని శాఖలు పంపిస్తాయని, మూలనపడ్డ ఖాతాలను దాచిపెడతాయని ముందుగానే అంచనా వేసుకుంది. అందుకే అధికారికంగా వెల్లడించిన ఖాతా నంబర్లను నోటిఫై చేసి.. బ్యాంకులకు సమాచారం అందించాలని నిర్ణయించింది. తాము నోటిఫై చేసినవిగాకుండా మిగతా ఖాతాలన్నీ చెల్లుబాటు కావనీ, వాటిలో ఉన్న డబ్బును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని బ్యాంకర్లకు సూచించనుంది. దీంతో దాదాపు రూ.వెయ్యి కోట్లు రికవరీ అవుతాయని ప్రభుత్వం లెక్కలేసుకుంటోంది. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు, నిధుల సర్దుబాటు, ఒక పథకం నిధులను అవసరం మేరకు మరో పథకానికి మార్చేందుకు వీలుగా అన్ని విభాగాల్లో పీడీ ఖాతాలు తెరిచే ఆనవాయితీని ఆర్థిక శాఖ ఎప్పట్నుంచో అమలు చేస్తోంది. వాటికి భిన్నంగా లెక్కతేలని సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు కూడా ఉన్నాయని, ఇప్పుడు అందులో ఉన్న నిల్వలపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు ఎన్నో తెలుసా?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు అధికమే. అబ్బాయి పేరు మీద అమ్మాయి, అమ్మాయి పేరు మీద అబ్బాయి.. ఇలా ఫేక్ అకౌంట్లు సృష్టించి, యూజర్లను కొందరు తప్పుదోవ పట్టిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌పై ఎన్ని నకిలీ అకౌంట్లు ఉన్నాయో అని కంపెనీ లెక్కతేల్చింది. దానిలో 2017 డిసెంబర్ ముగింపు నాటికి దాదాపు 200 మిలియన్ అకౌంట్లు(20 కోట్ల అకౌంట్లు) ఫేస్బుక్లో నకిలీవని తేలింది. ఈ అకౌంట్లు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నాయని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ వెల్లడించింది. 2017 నాలుగో క్వార్టర్ ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్లలో సుమారు 10 శాతం డూప్లికేట్ అకౌంట్లు కలిగి ఉన్న వారేనని ఫేస్బుక్ తన వార్షిక రిపోర్టులో తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డూప్లికేట్ అకౌంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని రిపోర్టు వెల్లడించింది. 2017 డిసెంబర్ చివరి నాటికి ఫేస్బుక్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 2.13 బిలియన్లుగా ఉన్నారు. 2016 డిసెంబర్ చివరితో పోలిస్తే.. ఇది 14 శాతం అధికం. నెలవారీ యాక్టివ్ యూజర్ల పరంగా... 2017లో వృద్ధికి ప్రధాన వనరులుగా భారత్, ఇండోనేషియా, వియత్నాం ఉన్నాయని ఫేస్బుక్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ యాక్టివ్ యూజర్లు కూడా 14 శాతం పెరిగి 1.40 బిలియన్లుగా నమోదయ్యారు. 2016 డిసెంబర్లో ఈ సంఖ్య 1.23 బిలియన్లుగా ఉండేది. రోజువారీ యాక్టివ్ యూజర్ల పరంగా.. కీలక వనరులుగా కూడా భారత్, ఇండోనేషియాలే ఉన్నాయని, అదనంగా బ్రెజిల్ కూడా ఈ జాబితాలో ఉందని తెలిపింది. -
రుణమాఫీని పకడ్బందీగా అమలు చేయాలి
రాంనగర్ : అర్హులైన రైతులకు రుణమాఫీ డబ్బులు సక్రమంగా అందే విధం గా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీకి సంబంధించిన అనెక్జర్-2ను అక్టోబర్ 1వ తేదీ ఉదయం నాటికి పంపించినట్లైతే అదే రోజు బ్యాంకు ఖాతాలోకి డబ్బును జమ చేస్తారన్నారు. బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బును రైతుల అకౌంట్లోకి బదిలీ చేసేటప్పుడు డూప్లికేట్ అకౌంట్లు, ఒకే బ్యాంకు అకౌంటు పేరున ఎక్కువ పేర్లు ఉన్నవి, బంగారంపై తీసుకున్న రుణానికి 7.5 శాతం కంటే అధికంగా వడ్డీ వసూలు చేసే బ్యాంకు అకౌంట్లు తొలగించాలన్నారు. 1 -బీ రికార్డుల ప్రకారం అనెక్జర్ -ఈలో 13, 14 కాలమ్స్‌ను వీఆర్ఓల చేత త్వరితగతిన పూర్తి చేయించాలని సూచి ంచారు. రైతుల భూముల వివరాలను పరిశీలించి మండల వ్యవసాయ అధికారి, రెవెన్యూ అధికారి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే రైతుల ఖాతాలలోకి రుణ మాఫీ డబ్బును బదిలీ చేయాలని బ్యాంకు అధికారులకు సూచి ంచారు. అలాగే అర్హత కలిగిన రైతులందరికీ అక్టోబర్15వ తేదీ నాటికి పంట రుణాలు ఇప్పించేందుకు బ్యాంకు బ్రాం చ్ల వారీగా, గ్రామం వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. బ్యాం కు వారీగా పాయింట్ పర్సన్స్‌ను నియమించుకుని డాక్యుమెంటేషన్ పూర్తి అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎన్ని చెరువులు ఏ మేరకు కబ్జాకు గురయ్యాయో వివరాలను త్వరితగతిన పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. చెరువుల్లో ఆక్రమణలు ఉన్నట్లైతే వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల వారికి పంపిణీ చేసేందుకు గుర్తించిన భూముల డాక్యుమెంటేషన్ ప్రతిపాదనలు త్వరితగతిన పంపించాలన్నారు. ఎస్సీలకు పంపిణీ చేసేందుకు ఇంకా భూమి ఎక్కడైనా అందుబాటులో ఉన్నట్లైతే గుర్తించి వాటి ప్రతిపాదనలను కూడా త్వరితగతిన పంపించాలన్నారు. జిల్లాలో రేషన్ కార్డులతో ఆధార్ నంబ ర్లు అనుసంధానం చేయడం 91 శాతం పూర్తి అయిందని, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దసరా పండగ సందర్భంగా అన్ని చౌకధర దుకాణాలలో బియ్యంను అందుబాటులో ఉంచి ప్రజలకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ప్రితిమీనా, జేడీఏ నర్సింహారావు, డీఎస్ఓ నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్లో నకిలీ ఖాతాల బెడద
హైదరాబాద్: అత్యంత ప్రాచుర్యం పొందిన సోషియల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో నకిలీ ఖాతాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షలకుపైగా నకిలీ అకౌంట్లు ఉన్నట్టు నిర్వాహకులు అంచనా వేవారు. భారత్‌తో పాటు టర్కీలో నకిలీ అకౌంట్ల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఫేస్బుక్ ఖాతాదారులు తమ ఒరిజినల్ అకౌంట్‌తో పాటు అదనంగా నకిలీ అకౌంట్ కలిగిఉన్నారని వివరించారు. గత మార్చితో పోలిస్తే ఏప్రిల్ నాటికి ఫేస్బుక్ ఖాతాదారుల సంఖ్య 15 శాతం పెరిగినట్టు నిర్వాహకులు తెలిపారు. ప్రతినెలా ఫేస్‌బుక్‌ను వినియోగించే వారి సంఖ్య 128 కోట్ల మంది ఉన్నట్టు చెప్పారు. ఖాతా దారుల సంఖ్య పెరగడానికి భారత్, బ్రెజిల్లో ఫేస్‌బుక్‌ను అమితంగా ఆదరించడమే కారణమని తెలిపారు. -
ఇండియా, టర్కీ ల్లో 14 కోట్లకు పైగా నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు
న్యూయార్క్: ఫేస్బుక్.. వ్యక్తుల మధ్య భావాల్ని పంచుకునేందుకు చక్కటి వేదిక. భావాల్ని పంచుకోవడం మాట అటు ఉంచితే.. నకిలీ అకౌంట్ల బెడద మాత్రం ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ కు తప్పడం లేదు. ఏకంగా ఇండియా, టర్కీ దేశాల్లో 14.3 కోట్ల మంది నకిలీ అకౌంట్లు కల్గి ఉన్నారని తాజాగా తేలింది. దీనిపై యూఎస్ సెక్యురిటీ ఎక్సెంజ్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 119 కోట్ల మంది ఫేస్బుక్ అకౌంట్ల కలిగి ఉన్నా, వీటిలో నకిలీ ఖాతాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం 7.9 శాతం మంది నకిలీ ఖాతాలతో ఉండగా, 2.1 శాతం మంది దుర్వినియోగ పరుస్తున్నట్టు తేలింది. వీటిలో 1.2 శాతం వరకూ తొలగించినట్లు ఎక్సైజ్ కమీషన్ తెలిపింది. అధునాతన మార్కెట్ రంగంలో ముందు వరుసలో ఉన్న అమెరికా, యూకే ల్లో కంటే భారత్, టర్కీల్లో నకిలీ ఖాతాలు పెరగడం ఆందోళనకరంగా మారింది.