సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు అధికమే. అబ్బాయి పేరు మీద అమ్మాయి, అమ్మాయి పేరు మీద అబ్బాయి.. ఇలా ఫేక్ అకౌంట్లు సృష్టించి, యూజర్లను కొందరు తప్పుదోవ పట్టిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌పై ఎన్ని నకిలీ అకౌంట్లు ఉన్నాయో అని కంపెనీ లెక్కతేల్చింది. దానిలో 2017 డిసెంబర్ ముగింపు నాటికి దాదాపు 200 మిలియన్ అకౌంట్లు(20 కోట్ల అకౌంట్లు) ఫేస్‌బుక్‌లో నకిలీవని తేలింది. ఈ అకౌంట్లు భారత్‌లోనే అత్యధికంగా ఉన్నాయని ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వెల్లడించింది. 2017 నాలుగో క్వార్టర్ ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్లలో సుమారు 10 శాతం డూప్లికేట్ అకౌంట్లు కలిగి ఉన్న వారేనని ఫేస్‌బుక్ తన వార్షిక రిపోర్టులో తెలిపింది.
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డూప్లికేట్ అకౌంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని రిపోర్టు వెల్లడించింది. 2017 డిసెంబర్ చివరి నాటికి ఫేస్‌బుక్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 2.13 బిలియన్లుగా ఉన్నారు. 2016 డిసెంబర్ చివరితో పోలిస్తే.. ఇది 14 శాతం అధికం. నెలవారీ యాక్టివ్ యూజర్ల పరంగా... 2017లో వృద్ధికి ప్రధాన వనరులుగా భారత్, ఇండోనేషియా, వియత్నాం ఉన్నాయని ఫేస్‌బుక్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ యాక్టివ్ యూజర్లు కూడా 14 శాతం పెరిగి 1.40 బిలియన్లుగా నమోదయ్యారు. 2016 డిసెంబర్‌లో ఈ సంఖ్య 1.23 బిలియన్లుగా ఉండేది. రోజువారీ యాక్టివ్ యూజర్ల పరంగా.. కీలక వనరులుగా కూడా భారత్, ఇండోనేషియాలే ఉన్నాయని, అదనంగా బ్రెజిల్ కూడా ఈ జాబితాలో ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment