ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫోన్లు వాడే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇందులో 80 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా సెల్‌ఫోన్ల వాడకం 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గణాంకాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతా లను కలిగి ఉన్నట్టు గూగుల్ లెక్కలు చెబుతున్నాయి.
పలమనేరు: మీ ఫోన్‌లో ఫేస్ బుక్ (ముఖ పుస్తకం) ఖాతా ఉందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. నిత్యం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ హ్యాక్ బుక్‌గా మారిపోయింది. ఫేస్‌బుక్‌ను టార్గెట్‌గా చేసుకొని హ్యాకర్లు విరుచుకు పడుతున్నారు. యూజర్స్ వ్యక్తిగత సమాచారం, ఫొటోలను వాడుకుంటూ నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఫేక్ అకౌంట్లను ఎలా డిలీట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లను గుర్తించినా వారి పేరు, చిరునామా తప్పుగా ఉంటుంది. దాంతో వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.
ఆపదలో ఉన్నామంటూ రిక్వెస్ట్‌లు
హ్యాక్ చేసిన వారి వివరాలతో ఫేక్ ఖాతాలను సృష్టించి వాటిద్వారా మన స్నేహితులకు ఫేస్‌బుక్‌తో పాటు వారి మొబైల్ నంబర్లకు మెసెంజర్, వాట్సాప్, సాధారణ ఎస్‌ఎంఎస్‌లను పంపుతున్నారు. తాను ఆస్పత్రిలో ఉన్నానని వెంటనే డబ్బు కావాలంటూ వారి ఫోన్‌పే లేదా గుగూల్‌పే నంబర్లను అందులో ఉంచి, సులభంగా డబ్బు కాజేస్తున్నారు. ఇది నిజమని నమ్మి ఎంతోమంది తమ ఖాతాలనుంచి నగదును హ్యాకర్లకు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్‌బుక్ ఖాతాలు హ్యాక్ అయి అదే పేర్లతో రెండు, మూడు ఫేక్ అకౌంట్లు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
బగ్స్ సృష్టించి హ్యాక్ చేస్తున్న వైనం
ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పలువురు సోషల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హ్యాకింగ్ చేయడమే వృత్తిగా చేసుకొని నిత్యం డబ్బులు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మన ఫోన్‌కొచ్చే లింక్స్ ద్వారా, యాడ్స్ ద్వారా, యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్‌బుక్ హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. మన ఫోన్‌కు తరచూ వచ్చే ఫోన్ రీచార్జీలు ఉచితమని, లాటరీ వచ్చిందని, ఫెస్టివల్ ఆఫర్‌లని క్యూఆర్ కోడ్‌లను పంపుతున్నారు. వాటిని టచ్ చేస్తే చాలు మన సమాచారం మొత్తం హ్యాకర్ల చేతిలోకి చేరుతోంది. మన ఫోన్‌ను హ్యాకర్లు ఆపరేట్ చేస్తుంటారు. మన ఫోన్‌లోని యాక్సెస్ లోకేషన్ ఆధారంగా మనకు తెలియకుండానే మన మొబైల్‌లోని కెమరాసైతం మనల్ని రికార్డు చేసే టెక్నిక్స్‌ను ఎథికల్ హ్యాకర్స్ సులభంగా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సెక్యూరిటీ పటిష్టం చేసుకోండి
ఫేస్‌బుక్ హ్యాక్ చేశాక ఇబ్బందులు పడేకంటే ముందుగానే సెక్యూరిటీ సిస్టంను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ఫేస్‌బుక్‌లోని సెట్టింగ్స్‌లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవడం, మన పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం, ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మన ఫేస్‌బుక్ హ్యాక్ అయిందా లేదా అని సెటింగ్స్‌లో కెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో అన్‌నోన్ ఫ్రెండ్ రిక్సెస్ట్‌లను ఎప్పుడూ అంగీరించకుండా ఉంటే మంచిది. మనకు బాగా తెలిసిన వారినే ఫ్రెండ్స్‌గా పెట్టుకోవాలి.
హ్యాక్‌చేసి.. ఫేక్ ఖాతాల సృష్టి
హ్యాక్‌చేసిన ఖాతాలోని వ్యక్తిగత వివరాలు, ఫొటోలను వాడి, అసలు ఖాతాను పోలిన నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. పోనీ ఎందుకొచ్చిన తంటలేనని మన ఫేస్‌బుక్ ఖాతాను శాశ్వతంగా డిలీట్ చేసుకుంటే మరిన్ని తిప్పలు తప్పవు. అప్పటికే హ్యాకర్ల చేతిలోకి వెళ్లిన మన సమాచారంతో మరిన్ని సైబర్ నేరాలు చేసుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన జీమెయిల్ ఆధారంగా బ్యాంకు ఖాతాలను సైతం సులభంగా హ్యాక్ చేసి ఆపై మన మొబైల్ నంబర్‌కు కొన్ని యాడ్‌లింక్స్ పంపుతున్నారు.
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
స్మార్ట్‌ఫోన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన లింకులను టచ్ చేయడం, మనకు తెలియని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, కోడ్‌ను స్కాన్ చేయడం చాలా ప్రమాదకరం. మనకు రకరకాలుగా ఆశపెట్టి హ్యాక్ చేసేవాళ్లు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. సైబర్ నేరాలపై తమశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలి. పొరబాటు జరిగాక బాధపడేకంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం ఉత్తమం.
– సుధాకర్ రెడ్డి, డీఎస్పీ, పలమనేరు
నా ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేశారు
ఇటీవల నా ఫేస్‌బుక్ హ్యాక్ అయింది. ఎవరో ఫేక్ అకౌంట్‌ను సృష్టించి ఆపదలో ఉన్నానని డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్‌లు పెట్టారు. దీంతోనేను ఫేస్‌బుక్‌హ్యాక్ అయిందని, అదే పేజీలో మెసేజ్ పెట్టాను. నా ఖాతాను సైతం మరింత భద్రపరుచుకున్నా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన వివరాలు సులభంగా బయటకు పోతాయి.
– సుధాకర్‌రెడ్డి, వి.కోట, పలమనేరు నియోజకవర్గం
Comments
Please login to add a commentAdd a comment