‘ఇన్నాళ్లూ మీ ఫోన్ నంబరుకు లాటరీ తగిలిందనో.. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంది.. వెంటనే మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలనో.. ఫోన్ చేస్తూ మోసం చేసిన నేరగాళ్ల గురించి విన్నాం. ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. స్నేహితుల ఫొటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో ఇలాంటి నేరాలు ఎన్నో వెలుగు చూశాయి. వెలుగు చూడని నేరాలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం..
సాక్షి, కడప : అనుమానం వచ్చిన వారు ఫోన్ చేసి నివృత్తి చేసుకుని మిన్నకుండిపోతుండగా, రిక్వెస్టుకు చలించిన వారు వెంటనే అకౌంటు ఎవరిదన్న విషయం చూసుకోకుండా డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో ఫేక్ అకౌంట్ దారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. ఫేక్ ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ప్రముఖుల పేర ఫేక్ అకౌంట్స్ సృష్టించి అత్యవసరమంటూ డబ్బులు దోచుకుంటున్నారు. తెలిసిన వారేనన్న భ్రమతో పలువురు వారి అకౌంట్లకు డబ్బులు జమ చేసి నష్టపోతున్నారు. తీరా అసలు విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. బాధితుల్లో జిల్లాలోని ప్రముఖులతోపాటు కొందరు పోలీసు అధికారులు ఉండడం గమనార్హం.
సైబర్ నేరగాళ్లు ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న ఫేస్‌బుక్, వాట్సాప్‌లను గుర్తించి ఆ తర్వాత స్వల్ప మార్పులతో వారి ఫొటోలతోనే ఫేక్ అకౌంట్లను సృష్టిస్తున్నారు. వారు రెగ్యులర్‌గా చాట్ చేస్తున్న స్నేహితులతో కొంతకాలం చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత అత్యవసరమని రూ. 15–30 వేల వరకు డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. సర్దుబాటు చేయలేమని చెబితే ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే డబ్బులు సర్దాలని, త్వరలోనే ఇచ్చేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు నిజమని నమ్మి బ్యాంకు అకౌంటు నంబరు ఎవరిదన్న విషయం నిర్ధారించుకోకుండానే డబ్బులు జమ చేస్తున్నారు.
అనుమానం వచ్చిన వారు ఫోన్ ద్వారా వివరాలు నిర్ధారించుకుని మిన్నకుండి పోతున్నారు. డబ్బు అడిగిన వారు పది మందికి తెలిసిన ప్రముఖులుగా ఉండడం, ఫాలోయర్స్ ఎక్కువగా ఉండడంతో కొందరు స్పందించి తక్షణమే ఫేక్ అకౌంట్ సృష్టించిన వారి అకౌంట్‌కు డబ్బులు జమ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆలస్యంగా విషయం తెలుసుకుంటున్నారు. జిల్లాలో చాలామంది ఫేక్ అకౌంట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈనెలలోనే జిల్లాలో వందలాది మంది ఫేక్ అకౌంట్ల ద్వారా దోపిడీ చేసిన సంఘటనలు ఉన్నాయి.
కొందరు డబ్బులు పోగొట్టుకుని మిన్నకుండి పోతుండగా, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక నెలలోనే సైబర్ క్రైంకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1100 మంది పోలీసు అధికారులు, పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్‌ఐలు, పోలీసులు సైతం బాధితులుగా ఉండగా, మరోవైపు జర్నలిస్టులు, కవులు, రచయితలు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, లాయర్లతోపాటు వివిధ రంగాలలో ప్రముఖులుగా ఉన్న వారు బాధితులుండడం గమనార్హం.
సైనికుల పేరుతో ఫేక్ అకౌంట్లు
మరోవైపు సైనికుల పేరుతోనూ జిల్లాలో ఫేక్ అకౌంట్లు వెలిసినట్లు తెలుస్తోంది. డబ్బులు పంపిస్తే తక్కువ ధరకే గృహోపకరణాలతోపాటు పలు రకాల వస్తువులు తీసుకు వస్తామని పోస్టులు పెడుతూ డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఈ తరహా మోసాల బారిన పడినట్లు తెలుస్తోంది.
ఇది రాజస్థాన్ ముఠా పనే!
రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్లతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల విచారణలోనూ వెల్లడైంది. ఇప్పటికే కొందరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉండకపోతే అంతే!
ఫేక్ ఫేస్‌బుక్, వాట్సాప్ అకౌంట్లతో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఈ తరహా నేరాలపై ఫేస్‌బుక్‌కు సైతం లేఖ రాసింది. దీంతో ఫేస్‌బుక్...ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాగ్ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చింది. ఫేస్‌బుక్ యాప్ సెట్టింగ్‌లోకి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ వివరాలతోపాటు ప్రొఫైల్ వివరాలు బయటికి వెలువడకుండా ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాగ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అప్పుడే సైబర్ నేరాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment