ఫేస్‌‘బుక్‌’ అయ్యారు    | Fake Facebook Account Creators Gand Arrested By Nalgonda Police | Sakshi
Sakshi News home page

ఫేస్‌‘బుక్‌’ అయ్యారు   

Published Sun, Oct 4 2020 3:51 AM | Last Updated on Sun, Oct 4 2020 3:51 AM

Fake Facebook Account Creators Gand Arrested By Nalgonda Police - Sakshi

శనివారం నల్లగొండలో కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ రంగనాథ్‌ 

నల్లగొండ క్రైం: పోలీసుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించారు నల్లగొండ జిల్లా పోలీసులు. రాజస్తాన్‌ వెళ్లి మరీ నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 350 మంది పోలీసు అధికారుల పేరిట ఈ సైబర్‌ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఆర్థిక అవసరాలు ఉన్నాయంటూ మెసేజ్‌లు పంపి డబ్బులను ఖాతాల్లో జమ చేయించుకున్నారని వివరించారు. ఇదేవిధంగా తన పేరుతో కూడా నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను సృష్టించి డబ్బులు కావాలని పోలీసు అధికారులకు సందేశాలు పంపారని, అయితే విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని రాజస్తాన్‌కు పంపినట్లు తెలిపారు.

ఆ రాష్ట్రంలోని భరత్‌పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్‌ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, 8 మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, నకిలీ ఆధార్‌ కార్డులు, సిమ్‌ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిందితులు అనేక రాష్ట్రాలకు చెందిన కొందరు అధికారుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ముఠాలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అ«ధికారులకు రివార్డు ప్రకటిస్తామన్నారు. నిందితుల్లో ముగ్గురిని నల్లగొండ జైలుకు, బాలుడిని హైదరాబాద్‌లోని బాల నేరస్తుల జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. 

రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు 
పోలీసు వ్యవస్థపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉండటంతో పలువురు పోలీసు అధికారుల పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు సృష్టించారు. తెలంగాణకు చెందిన 81   మంది పోలీస్‌ అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారు. మొదట ఐజీ స్వాతి లక్రా పేరిట నకిలీ ఖాతాను సృష్టించగా, ఆ తర్వాత వారం పది రోజుల్లో నల్లగొండ జిల్లా ఎస్పీ పేరిట ఓ ఖాతా తెరిచారు. పోలీసుల పేరిటే నకిలీ ఖాతాలు తెరుస్తూ మోసాలకు పాల్పడుతుండటంతో జిల్లా పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకొని ఆ సైబర్‌ నేరగాళ్ల  ఆటను కట్టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement