sp Ranganath
-
గంజాయి సమస్య కొత్తది కాదు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో (ఏవోబీ) గంజాయి సమస్య కొత్తది కాదని, పదిహేనేళ్లుగా కొనసాగుతోందని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడ గంజాయి సాగుచేస్తున్న విషయం అక్కడి సీనియర్ పోలీసు అధికారులకు, ప్రతి ఒక్కరికీ తెలిసిందేనన్నారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ఏవోబీ నుంచి గంజాయి రవాణా తెలంగాణతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. దీనిని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్మూలనపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, గంజాయి రవాణా, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టాలని ఆదేశించారని వెల్లడించారు. గడిచిన నెలన్నరలో నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేశామన్నారు. ఏవోబీ నుంచి నల్లగొండ మీదుగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతోందని తాము పట్టుకున్న వారి కాల్ డాటా ఆధారంగా గుర్తించామన్నారు. తనిఖీల్లో వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 35 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రతి తనిఖీలోనూ గంజాయి మూలాలు ఏవోబీవైపే చూపించాయని, గంజాయి విక్రయదారుల పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించామని వివరించారు. వాటి ఆధారంగానే దసరా రోజు నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలతో ఏపీలో దాడులు నిర్వహించామన్నారు. దీనికి ఏపీ పోలీసులు పూర్తిగా సహకరించారన్నారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు ఎంపీ హోదాలో ఉన్న విజయసాయిరెడ్డికి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారంతోనో తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఎస్పీ రంగనాథ్ ఆ ప్రకటనలో వివరించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి విషయమై చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగడం సరికాదన్నారు. ‘మా భుజాల మీద నుంచి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరం’అని పేర్కొన్నారు. గంజాయి ఇష్యూను అక్కడి నాయకులు ఎవరికి అనుగుణంగా వారు అన్వయించుకుంటూ రాజకీయ ప్రయోజనాలకు తమను వాడుకోవడం సరికాదన్నారు. -
ఫేస్‘బుక్’ అయ్యారు
నల్లగొండ క్రైం: పోలీసుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు నల్లగొండ జిల్లా పోలీసులు. రాజస్తాన్ వెళ్లి మరీ నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను నల్లగొండ ఎస్పీ రంగనాథ్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 350 మంది పోలీసు అధికారుల పేరిట ఈ సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం, ఆర్థిక అవసరాలు ఉన్నాయంటూ మెసేజ్‌లు పంపి డబ్బులను ఖాతాల్లో జమ చేయించుకున్నారని వివరించారు. ఇదేవిధంగా తన పేరుతో కూడా నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు కావాలని పోలీసు అధికారులకు సందేశాలు పంపారని, అయితే విషయం తన దృష్టికి రావడంతో వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాన్ని రాజస్తాన్‌కు పంపినట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలోని భరత్‌పురా జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు ముస్తభీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాంఖాన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. లక్ష నగదు, 8 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, నకిలీ ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిందితులు అనేక రాష్ట్రాలకు చెందిన కొందరు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తెరిచినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ముఠాలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అ«ధికారులకు రివార్డు ప్రకటిస్తామన్నారు. నిందితుల్లో ముగ్గురిని నల్లగొండ జైలుకు, బాలుడిని హైదరాబాద్‌లోని బాల నేరస్తుల జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉండటంతో పలువురు పోలీసు అధికారుల పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారు. తెలంగాణకు చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచారు. మొదట ఐజీ స్వాతి లక్రా పేరిట నకిలీ ఖాతాను సృష్టించగా, ఆ తర్వాత వారం పది రోజుల్లో నల్లగొండ జిల్లా ఎస్పీ పేరిట ఓ ఖాతా తెరిచారు. పోలీసుల పేరిటే నకిలీ ఖాతాలు తెరుస్తూ మోసాలకు పాల్పడుతుండటంతో జిల్లా పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకొని ఆ సైబర్ నేరగాళ్ల ఆటను కట్టించారు. -
పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
సాక్షి, నల్లగొండ : పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంతోపాటు పటిష్టమైన ఏర్పా ట్లు చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకుడు ధనంజయ్ దేవాంగన్, పోలీస్ పరిశీలకుడు లిరోమో జోపె సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు అమయ్‌కుమార్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీలు వెంకటేశ్వర్లు, ఏవీ రంగనాథ్, ఏఎస్పీ ప ద్మనాభరెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్యలతో సమావేశాన్ని నిర్వహించారు. నల్లగొం డ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేం దుకు చేపట్టిన చర్యలు, తీసుకోబోతున్న విధివిధానాలపై కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలకులకు వెల్లడించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు కేంద్ర పోలీస్ బలగాలను ఉపయోగించి మరింత భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత భద్రతను పెంచామని, గ్రామాల్లో జరుగుతున్న అన్నిరకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నామని తెలిపారు. ఘర్షణకు ప్రేరేపించేవారిని బైండోవర్ చేస్తున్నామని, ఎక్సైజ్ అధికారులతో కలిసి బెల్ట్ షాపులను నిరోధించేందుకు తనిఖీలు చేస్తున్నామని, మద్యం, డబ్బు రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించామని ఓటింగ్ శాతం పెరిగే విధంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఎన్నికల నిబంధనల మేరకు ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పరిశీలకులు ధనంజయ్ దేవాంగన్, లిరోమో జోపెలు సూచించారు. ఎన్నికల విధుల్లోకి ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, మాజీ సైనికులు పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగినవారు సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వలంటీర్లు రమేశ్ ఫోన్ నెం. 8186025800ను, మాజీ సైనికులు సైనిక సంక్షేమ అధికారి నరేందర్‌రెడ్డి 9966170084 నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ కోరారు. -
‘మాజీ ఎమ్మెల్యే వీరేశంను విచారిస్తాం’
సాక్షి, నల్గొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసు లో మొత్తం 7 గురు నిందితులు ఉన్నారని ఎస్పీ రంగనాథ్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ హత్యకు సంబంధించి మొత్తం కోటి రూపాయల డీల్ జరిగినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 18 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు తెలిపాడు. నల్గొండ గ్యాంగ్ తో కలిసి బీహార్ గ్యాంగ్ సుపారీ తీసున్నారని వివరించారు. దీనిలో భాగమైన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరితో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంని కూడా విచారిస్తామని అన్నారు. నల్గొండ కి చెందిన మాజీ ఐసిస్ టెర్రరిస్ట్ లు ప్రణయ్ హత్య కేసు లో ఇన్వాల్వ్ అయ్యారని, ప్రణయ్‌ను చంపిన వాడు బీహార్‌కు చెందినవాడని తెలిపారు. -
వసూల్ రాజాలకు.. ముకుతాడు!
పోలీస్‌శాఖలో ‘వసూల్‌రాజా’ల జాబితా కలకలం రేపుతోంది. ఎవరు, ఎవరి కోసం వసూలు చేస్తున్నారో సవివరంగా విడుదలైన జాబితా జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. స్టేషన్ల వారీగా వారి పేర్లు, పీసీ నంబర్‌తో సహా బయటికి రావడం..వారందరిపై బదిలీ వేటు అన్న ప్రచారంతో జాబితాలో పేర్లు ఉన్నవారి గుండెల్లో గుబులు రేపుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : పోలీస్స్టేషన్ల నిర్వహణకు కావాల్సిన బడ్జెట్ నెలానెలా ఇస్తే .. ఇక, స్టేషన్లలో అవినీతి చోటు చేసుకోదని, పదికీ పరకకు చేతులు చాపాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలన్నీ గాలి బుడగలే అని తేలిపోయింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త వాహనాలు, నిర్వహణకు నెలవారీ బడ్జెట్, తదితర సాధన సంపత్తి సమకూర్చినా అవినీతికి చెక్ పెట్టలేకపోయారని విదితమవుతోంది. రాష్ట్ర డీజీపీ నుంచి జిల్లాల ఎస్పీలకు అందినదిగా ప్రచారం జరుగుతున్న జాబితాలో పలువురు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలా 59 మంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో అత్యధికంగా సూర్యాపేట కొత్త జిల్లా పరిధిలో 40 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మంది, నల్లగొండ జిల్లాలో ఇద్దరు చొప్పున వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరినీ జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేయాలని కూడా డీజీపీ నుంచి ఎస్పీలకు ఆదేశాలు అం దాయని విశ్వసనీయ సమాచారం. ఇవీ.. వనరులు స్టేషన్ల నిర్వహణ, తదితర ఖర్చుల కోసం ప్రతి స్టేషన్ పరిధిలో ఒకరికో, ఇద్దరికో బాధ్యత అప్పజెప్పే సంస్కృతి పోలీస్‌శాఖలో ఉండేది. తెలం గాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పోలీసులు ఎవరి దగ్గరా చేయి చాపకూడదన్న సదుద్దేశంతో భారీ గానే బడ్జెట్ కేటాయించారు. అయినా, స్పెషల్ పార్టీ, ఐడీ పార్టీ పోలీసుల పేర దాదాపు అన్ని స్టేషన్ల పరిధిలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. వైన్‌షాపులు, సిట్టింగులు తదితర అక్రమ వ్యాపారులనుంచి బాగానే దండుకుంటున్నారు. వివిధ పంచాయితీలతో స్టేషన్లకు వచ్చే వారినుంచి, రకరకాల నేరాల్లో నిందితులుగా ఉన్న వారినుంచి వీరి వసూళ్లు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రతి స్టేషన్లో దఫేదార్ల పేర ఉన్న వ్యవస్థ పూర్తిగా డబ్బుల వసూళ్ల కోసమేనని చెబుతున్నారు. వీరే కాకుండా ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్ఐల వాహనాల డ్రైవర్లూ ఇందులో పాలు పంచుకుంటున్నారు. డీజీపీ తయారు చేసినదిగా చెబుతున్న జాబితాలో ఏయే పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరెవరు వసూలు చేస్తున్నారో, ఎవరి కోసం వసూలు చేస్తున్నారో కూడా వివరాలు ఉండడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి (సాగర్) స్టేషన్లో ఒక కానిస్టేబుల్, కొండమల్లేపల్లి స్టేషన్లో ఒక ఏఎస్ఐ ఉన్నారు. అదే మాదిరిగా, యాదాద్రి భువనగరి జిల్లాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారం, బీబీనగర్, భువనగిరి టౌన్, భువనగిరి రూరల్, ఆలేరు, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, మోటకొండూరు స్టేషన్లలో పదహారు మంది ఉన్నారు. నల్లగొండలో ముందే ప్రక్షాళన ! రాష్ట్రంలో అత్యధికంగా మండలాలు ఉన్న న ల్లగొండ జిల్లాలో వాస్తవంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ, రెండు నెల్ల కిందట ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఏవీ రంగనాథ్ జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్లలో స్పెషల్ పార్టీలు, ఐడీ పార్టీల పేర జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టారు. హోంగార్డు స్థాయి నుంచి ఎవరెవరూ వసూళ్లకు పాల్పడుతున్నారో స్వల్పకాలలోనే సమాచారం సేకరించి వారిపై బదిలీ వేటు వేశారు. ఏ స్టేషన్లోనూ దఫేదార్ వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకున్నారు. ఒకేసారి కాకుండా మూడు విడతలుగా సుమారు 125మంది పోలీసు సిబ్బందికి స్థాన చలనం కల్పించారు. ఈ బదిలీలు సంచలనం సృష్టించగా, సిబ్బంది కూడా ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేసుకుని బజారున పడ్డారు. బదిలీలపై కోర్టులనూ ఆశ్రయించారు. అయినా, వసూల్ రాజాలను గుర్తించడంలో, వారిని కట్టడి చేయడం కోసం ఎస్పీ రంగనాథ్ తీసుకున్న చర్యలకు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభించింది. ఒక విధంగా ప్రస్తుతం డీజీపీ లిస్టు తయారీకి నల్లగొండ దారి చూపినట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిరంతర నిఘా జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్లలో స్పెషల్, ఐడీ పార్టీలపేర జరగుతున్న వసూళ్లకు బ్రేక్ వేయగలిగాం. ఇప్పుడు కేవలం రెండు స్టేషన్ల పేర్లు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని సంబర పడడం లేదు. నిఘా నిరంతరం కొనసాగుతుంది. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ముఖ్యంగా, డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిని మాత్రమే కాకుండా, వారు ఎవరి కోసం ఆ వసూళ్లకు పాల్పడుతున్నారో సంబంధిత అధికారులనూ బాధ్యులను చేస్తాం. శాఖ పరువును తీస్తామంటే చూస్తూ ఊరుకోం, చర్యలు తీసుకుంటాం. – ఏవీ రంగనాథ్, ఎస్పీ -
పబ్లిక్ కాంటాక్ట్ ద్వారా సేవలు
నల్గొండ : నల్గొండ జిల్లా ఎస్పీగా వెంకట రంగనాథ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నేరుగా కలుసుకోవడం ద్వారా ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ఎఫెక్టివ్ పోలీసింగ్ ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీస్ ఉక్కు పాదం మోపుతుందన్నారు. అక్రమ భూ దందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రత్యేక సోషల్ కార్యక్రమాలు కొనసాగుతాయని నూతన ఎస్పీ వెంకట రంగనాథ్ వివరించారు. -
ఖాకీ వర్సెస్ ఖద్దర్
కొత్తగూడెం, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాకీలకు, ఖద్దర్ నాయకులకు మధ్య సమసిపోయిందనుకున్న ప్రచ్ఛన్న పోరు మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం రాత్రి సీపీఐ కార్యకర్తను పోలీస్‌లు అరెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. దీంతో ఎమ్మెల్యే కూనంనేని, ఎస్సీ రంగనాధ్ల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం మళ్లీ రాజుకుంది. ఆజ్యంపోసిన పంచాయతీ ఎన్నికలు... జిల్లాలో రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు వెళ్లగా కొత్తగూడెం ఏఎస్పీ భాస్కర్‌భూషణ్ కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారణకు ఎస్పీ రంగనాధ్ ఖమ్మం ఏఎస్పీని నియమించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే కూనంనేని ఎస్పీపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా ఎస్పీ కూడా విమర్శలకు దిగారు. మరోపక్క స్పెషల్ డ్రైవ్‌ల పేరుతో ఆటోలను తనిఖీ చేసిన పోలీసులు లెసైన్స్‌లు లేని డ్రైవర్లపై కేసులు నమోదు చేసి నేరుగా కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12,13 తేదీలలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. రెండో రోజు కొత్తగూడెంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని ఎస్పీపై ఘాటైన విమర్శలు చేశారు. కేవలం తనపై కక్షతోనే ఆటోడ్రైవర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన పోలీస్ ఆఫీసర్ల సంఘం నాయకులు సైతం ఎమ్మెల్యేపై ప్రతి విమర్శలు చేశారు. ఈ విషయంపై అప్పట్లో కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదైంది. సీపీఐ కార్యకర్త అరెస్ట్‌తో మళ్లీ తెరపైకి... గత నెల 9వ తేదీన బాబుక్యాంప్‌లో జరిగిన దాడి కేసులో అదే ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది కోర్టుకు హాజరుకాావాల్సి ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గోనమళ్ల నాగరాజు అలియాస్ డెక్రాజు ఆరు నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే ఈ కేసులో కోర్టు వాయిదాకు నాగరాజుకు బదులుగా చిట్లూరి సత్యనారాయణ అనే వ్యక్తి హాజరయ్యారు. ఇది గమనించిన కోర్టు కానిస్టేబుల్ న్యాయమూర్తికి సమాచారం అందించడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వీరిని ప్రోత్సహించాడనే కారణంతో కొత్తగూడెం మాజీ ఎంపీపీ భర్త దుర్గరాశి వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఐ కార్యకర్తలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. విషయం తెలియడంతో అక్కడకు అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఎమ్మెల్యే కూనంనేని పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడున్న సీఐతో వాగ్వాదానికి దిగారు. కావాలనే తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ భాస్కర్ భూషన్ ఈ కేసు విషయంలో తిరిగి విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే తిరిగి వెళ్లారు. అయితే గత నెల రోజులుగా ఇరువర్గాల మధ్య నిలిచిపోయిన మాటల యుద్దం మళ్లీ ఈ సంఘటనతో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
రాంరెడ్డి, రేణుక వర్గీయులకు ఎస్పీ హెచ్చరిక
ఇల్లెందు: గ్రూపు రాజకీయాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయులను ఎస్పీ ఎ.వి.రంగనాథ్ హెచ్చరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఫారెస్టు గ్రౌండ్లో ఏర్పా టు చేసిన సభలో రేణుకను ఉద్దేశించి రాంరెడ్డి వర్గీయులు మడత వెంకట్‌గౌడ్, కొక్కు నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె వర్గీయులు గోచికొండ సత్యనారాయణ, సురేష్‌లాహోటీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎస్పీ ఆదివారం ఇల్లెందుకు వచ్చారు. ఇరు వర్గాలకు చెందిన నాయకులను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి వేర్వేరుగా విచారణ చేశారు. ఉత్సవాల్లో రాంరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. తమపై ప్రజలు దాడికి పాల్పడే విధంగా రాంరెడ్డి వర్గీయులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సురేష్లాహోటి, గోచికొండ సత్యనారయణ, పద్మావతి తదితరులు ఎస్పీకి వివరించారు. రేణుక వర్గీయుల వైఖరి గురించి మడత వెంకట్‌గౌడ్ కూడా ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు. ఇరువర్గాల వాదోపవాదనలను విన్న ఎస్పీ శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పలు సూచనలు చేసినట్లు చెప్పా రు. ప్రజల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించినా సహిం చేది లేదన్నారు. అల్లర్లను సష్టిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు.