కొత్తగూడెం, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాకీలకు, ఖద్దర్ నాయకులకు మధ్య సమసిపోయిందనుకున్న ప్రచ్ఛన్న పోరు మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం రాత్రి సీపీఐ కార్యకర్తను పోలీస్‌లు అరెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. దీంతో ఎమ్మెల్యే కూనంనేని, ఎస్సీ రంగనాధ్‌ల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం మళ్లీ రాజుకుంది.
ఆజ్యంపోసిన పంచాయతీ ఎన్నికలు...
జిల్లాలో రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు వెళ్లగా కొత్తగూడెం ఏఎస్పీ భాస్కర్‌భూషణ్ కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారణకు ఎస్పీ రంగనాధ్ ఖమ్మం ఏఎస్పీని నియమించారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే కూనంనేని ఎస్పీపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా ఎస్పీ కూడా విమర్శలకు దిగారు. మరోపక్క స్పెషల్ డ్రైవ్‌ల పేరుతో ఆటోలను తనిఖీ చేసిన పోలీసులు లెసైన్స్‌లు లేని డ్రైవర్లపై కేసులు నమోదు చేసి నేరుగా కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12,13 తేదీలలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. రెండో రోజు కొత్తగూడెంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని ఎస్పీపై ఘాటైన విమర్శలు చేశారు. కేవలం తనపై కక్షతోనే ఆటోడ్రైవర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి స్పందించిన పోలీస్ ఆఫీసర్ల సంఘం నాయకులు సైతం ఎమ్మెల్యేపై ప్రతి విమర్శలు చేశారు. ఈ విషయంపై అప్పట్లో కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదైంది.
సీపీఐ కార్యకర్త అరెస్ట్‌తో మళ్లీ తెరపైకి...
గత నెల 9వ తేదీన బాబుక్యాంప్‌లో జరిగిన దాడి కేసులో అదే ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది కోర్టుకు హాజరుకాావాల్సి ఉంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న గోనమళ్ల నాగరాజు అలియాస్ డెక్‌రాజు ఆరు నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే ఈ కేసులో కోర్టు వాయిదాకు నాగరాజుకు బదులుగా చిట్లూరి సత్యనారాయణ అనే వ్యక్తి హాజరయ్యారు. ఇది గమనించిన కోర్టు కానిస్టేబుల్ న్యాయమూర్తికి సమాచారం అందించడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వీరిని ప్రోత్సహించాడనే కారణంతో కొత్తగూడెం మాజీ ఎంపీపీ భర్త దుర్గరాశి వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఐ కార్యకర్తలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. విషయం తెలియడంతో అక్కడకు అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఎమ్మెల్యే కూనంనేని పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడున్న సీఐతో వాగ్వాదానికి దిగారు. కావాలనే తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ భాస్కర్ భూషన్ ఈ కేసు విషయంలో తిరిగి విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే తిరిగి వెళ్లారు. అయితే గత నెల రోజులుగా ఇరువర్గాల మధ్య నిలిచిపోయిన మాటల యుద్దం మళ్లీ ఈ సంఘటనతో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఖాకీ వర్సెస్ ఖద్దర్
Published Sat, Oct 26 2013 3:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement