కూనంనేనిపై కేసు ఎత్తివేయాలి: నారాయణ
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన నాన్‌బెయిలబుల్ కేసుల్ని ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.
ప్రజా సమస్యలపై ఆందోళనలు సహజమేనని, దీనిపై ఎస్పీ స్థాయి అధికారి జోక్యం చేసుకుని కక్ష సాధింపు దోరణితో వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. ఎస్సీయే పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజలు తమ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధికే ఇంతటి అవమానం జరిగాక దీని పర్యావసానాలు ఏ విధంగా ఉంటాయో ఊహించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
సింగరేణి సిబ్బందికి బోనస్ ఇవ్వాలి: మల్లేష్
సింగరేణి బొగ్గు గనుల సిబ్బందికి ఉత్పత్తి వాటా బోనస్ ఇప్పించాలని సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు జి.మల్లేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మంగళవారం లేఖ రాశారు. ఈ ఏడాది సింగరేణి యాజమాన్యానికి 4001 కోట్లరూపాయల లాభం వచ్చిందని, అధికోత్పత్తి వల్లే ఇది సాధ్యమైనందున బోనస్ ఇప్పించాలని కోరారు. గతంలో ఈ వ్యవహారమై ఇచ్చిన హామీ సత్వరమే అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.