పోలీస్‌శాఖలో ‘వసూల్‌రాజా’ల జాబితా కలకలం రేపుతోంది. ఎవరు, ఎవరి కోసం వసూలు చేస్తున్నారో సవివరంగా విడుదలైన జాబితా జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. స్టేషన్ల వారీగా వారి పేర్లు, పీసీ నంబర్‌తో సహా బయటికి రావడం..వారందరిపై బదిలీ వేటు అన్న ప్రచారంతో జాబితాలో పేర్లు ఉన్నవారి గుండెల్లో గుబులు రేపుతోంది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు కావాల్సిన బడ్జెట్ నెలానెలా ఇస్తే .. ఇక, స్టేషన్లలో అవినీతి చోటు చేసుకోదని, పదికీ పరకకు చేతులు చాపాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలన్నీ గాలి బుడగలే అని తేలిపోయింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త వాహనాలు, నిర్వహణకు నెలవారీ బడ్జెట్, తదితర సాధన సంపత్తి సమకూర్చినా అవినీతికి చెక్ పెట్టలేకపోయారని విదితమవుతోంది.
రాష్ట్ర డీజీపీ నుంచి జిల్లాల ఎస్పీలకు అందినదిగా ప్రచారం జరుగుతున్న జాబితాలో పలువురు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలా 59 మంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరిలో అత్యధికంగా సూర్యాపేట కొత్త జిల్లా పరిధిలో 40 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మంది, నల్లగొండ జిల్లాలో ఇద్దరు చొప్పున వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరినీ జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేయాలని కూడా డీజీపీ నుంచి ఎస్పీలకు ఆదేశాలు అం దాయని విశ్వసనీయ సమాచారం.
ఇవీ.. వనరులు
స్టేషన్ల నిర్వహణ, తదితర ఖర్చుల కోసం ప్రతి స్టేషన్ పరిధిలో ఒకరికో, ఇద్దరికో బాధ్యత అప్పజెప్పే సంస్కృతి పోలీస్‌శాఖలో ఉండేది. తెలం గాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పోలీసులు ఎవరి దగ్గరా చేయి చాపకూడదన్న సదుద్దేశంతో భారీ గానే బడ్జెట్ కేటాయించారు. అయినా, స్పెషల్ పార్టీ, ఐడీ పార్టీ పోలీసుల పేర దాదాపు అన్ని స్టేషన్ల పరిధిలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. వైన్‌షాపులు, సిట్టింగులు తదితర అక్రమ వ్యాపారులనుంచి బాగానే దండుకుంటున్నారు.
వివిధ పంచాయితీలతో స్టేషన్లకు వచ్చే వారినుంచి, రకరకాల నేరాల్లో నిందితులుగా ఉన్న వారినుంచి వీరి వసూళ్లు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రతి స్టేషన్‌లో దఫేదార్ల పేర ఉన్న వ్యవస్థ పూర్తిగా డబ్బుల వసూళ్ల కోసమేనని చెబుతున్నారు. వీరే కాకుండా ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐల వాహనాల డ్రైవర్లూ ఇందులో పాలు పంచుకుంటున్నారు. డీజీపీ తయారు చేసినదిగా చెబుతున్న జాబితాలో ఏయే పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరెవరు వసూలు చేస్తున్నారో, ఎవరి కోసం వసూలు చేస్తున్నారో కూడా వివరాలు ఉండడం గమనార్హం.
నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి (సాగర్) స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్, కొండమల్లేపల్లి స్టేషన్‌లో ఒక ఏఎస్‌ఐ ఉన్నారు. అదే మాదిరిగా, యాదాద్రి భువనగరి జిల్లాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారం, బీబీనగర్, భువనగిరి టౌన్, భువనగిరి రూరల్, ఆలేరు, వలిగొండ, భూదాన్ పోచంపల్లి, మోటకొండూరు స్టేషన్లలో పదహారు మంది ఉన్నారు.
నల్లగొండలో ముందే ప్రక్షాళన !
రాష్ట్రంలో అత్యధికంగా మండలాలు ఉన్న న ల్లగొండ జిల్లాలో వాస్తవంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ, రెండు నెల్ల కిందట ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఏవీ రంగనాథ్ జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్లలో స్పెషల్ పార్టీలు, ఐడీ పార్టీల పేర జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి పెట్టారు. హోంగార్డు స్థాయి నుంచి ఎవరెవరూ వసూళ్లకు పాల్పడుతున్నారో స్వల్పకాలలోనే సమాచారం సేకరించి వారిపై బదిలీ వేటు వేశారు.
ఏ స్టేషన్లోనూ దఫేదార్ వ్యవస్థ లేకుండా చర్యలు తీసుకున్నారు. ఒకేసారి కాకుండా మూడు విడతలుగా సుమారు 125మంది పోలీసు సిబ్బందికి స్థాన చలనం కల్పించారు. ఈ బదిలీలు సంచలనం సృష్టించగా, సిబ్బంది కూడా ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేసుకుని బజారున పడ్డారు. బదిలీలపై కోర్టులనూ ఆశ్రయించారు. అయినా, వసూల్ రాజాలను గుర్తించడంలో, వారిని కట్టడి చేయడం కోసం ఎస్పీ రంగనాథ్ తీసుకున్న చర్యలకు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభించింది. ఒక విధంగా ప్రస్తుతం డీజీపీ లిస్టు తయారీకి నల్లగొండ దారి చూపినట్లు అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నిరంతర నిఘా
జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్లలో స్పెషల్, ఐడీ పార్టీలపేర జరగుతున్న వసూళ్లకు బ్రేక్ వేయగలిగాం. ఇప్పుడు కేవలం రెండు స్టేషన్ల పేర్లు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని సంబర పడడం లేదు. నిఘా నిరంతరం కొనసాగుతుంది. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ముఖ్యంగా, డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిని మాత్రమే కాకుండా, వారు ఎవరి కోసం ఆ వసూళ్లకు పాల్పడుతున్నారో సంబంధిత అధికారులనూ బాధ్యులను చేస్తాం. శాఖ పరువును తీస్తామంటే చూస్తూ ఊరుకోం, చర్యలు తీసుకుంటాం. – ఏవీ రంగనాథ్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment