ప్రభుత్వాల కోసం పని చేసే సర్వయిలెన్స్ కంపెనీలు.. నిఘాను అద్దెకి ఇస్తే!, డబ్బులిచ్చిన వాళ్ల కోసం యూజర్ల సమాచారాన్ని చేరవేస్తే! ఎలా ఉంటుంది?. అలాంటి సర్వయిలెన్స్ కంపెనీల బాగోతాన్ని వెలికి తీసింది మెటా కంపెనీ(ఒకప్పుడు ఫేస్‌బుక్). వేల కొద్దీ ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి, ఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్న కంపెనీల బండారాన్ని బయటపెట్టడంతో పాటు.. ఈ స్కామ్‌కు సంబంధించిన ఫేక్ అకౌంట్లను నిషేధించింది మెటా కంపెనీ.
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ గురువారం 1,500 అకౌంట్లను(ఏడు సర్వయిలెన్స్ కంపెనీలకు చెందినవి) పూర్తిగా నిషేధించింది. ఈ అకౌంట్లన్నీ సైబర్ మెర్కెనరీ (సైబర్ కిరాయి) కంపెనీలకు చెందినవిగా తేల్చింది. ఉద్యమకారులు, ప్రముఖ జర్నలిస్టులు, అసమ్మతివాదులపై నిఘాలో భాగంగా క్లయింట్ల తరపున ఈ అకౌంట్లు పని చేసినట్లు మెటా నిఘాలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వందకు పైగా దేశాల్లో యాభై వేల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్లను అప్రమత్తం చేసే ఉద్దేశంతో ఉంది మెటా.
చైనీస్ ఆపరేషన్..
మెటా ఆపరేషన్‌లో వెల్లడైన కీలక అంశం.. చైనా కేంద్రంగా నడుస్తున్న ఆపరేషన్. ఈ ఆపరేషన్ పేరు, ఎవరు నడుపుతున్నారో మెటా గుర్తించలేకపోయింది. కానీ, చైనా అధికారులకు చెందిన సర్వర్‌లు, నిఘా సాధనాల ‘కమాండ్ అండ్ కంట్రోల్’ వ్యవస్థను మెటా ట్రేస్ చేయగలిగింది. కొన్ని చైనా బ్రాండ్‌లకు చెందిన ఫోన్ల ద్వారా ఈ స్కామ్ నడుస్తోందని, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర డేటాను సైతం సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్నాయని మెటా పేర్కొంది. ఇక ఈ స్కామ్‌లో ఎక్కువగా పాల్గొంది ఇజ్రాయెల్‌కు చెందిన సర్వయిలెన్స్ కంపెనీలే. ఈ ఏడు కంపెనీల లిస్ట్‌లో బ్లూహాక్ సర్వయిలెన్స్ కంపెనీ పేరు ప్రముఖంగా ఉంది. భారత్‌కు చెందిన బెల్‌ట్రాక్స్ సంబంధిత ఫేస్‌బుక్ అకౌంట్లను సైతం తొలగించింది మెటా.
ఏం జరుగుతోందంటే..
సర్వయిలెన్స్ కంపెనీలు ఫేక్ అకౌంట్లు సృష్టించి.. యూజర్ల ప్రొఫైల్‌ను గుంజేస్తున్నాయి. వీటిలో సెలబ్రిటీలు, ప్రభుత్వ విభాగాల పేరుతోనూ అకౌంట్లను క్రియేట్ చేస్తాయి ఆ కంపెనీలు. అంతేకాదు గ్రూపుల్లో, సంభాషణల్లో జోక్యం చేసుకుంటూ వ్యక్తిగత వివరాల్ని సేకరిస్తాయి. ఫేస్‌బుక్ అకౌంట్లతో పాటు ఫోన్, కంప్యూటర్, పాస్‌వర్డ్‌లు, పొటోలు, వీడియోలు, మెసేజన్‌లు.. అన్నీ హ్యాక్ చేస్తారు.
చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి
నిఘా కంపెనీలు.. వెబ్ ఇంటెలిజెన్స్ సేవలను ప్రభుత్వాలకు విక్రయిస్తుంటాయి. వార్తా నివేదికలు, వికీపీడియా వంటి పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ మూలాల నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇవి నిఘా ప్రక్రియను ప్రారంభిస్తాయి. అయితే ఈ సేవలను ప్రైవేట్‌గా అద్దెకు ఇస్తుండడం, అందునా యూజర్ల డాటాను అందిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైబర్ మెర్కెనరీ సర్వయిలెన్స్ కంపెనీల పేరుతో ఇవి.. క్లయింట్ల(పెయిడ్) కోసం పని చేస్తుంటాయి. అయితే ఇవి కేవలం క్రిమినల్స్, టెర్రరిస్టులపై నజర్ కోసమే పని చేస్తున్నాయని ప్రకటించుకున్నప్పటికీ.. జరిగే వ్యవహారం అంతా మరోలా ఉంటోంది.
చదవండి: ఈ వీడియోలో ఉంది మీరేనా?
Comments
Please login to add a commentAdd a comment