survilance
-
ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్ ట్రాకింగ్
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారుల భద్రత కోసం అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను నిఘా చట్రంలోకి తేవాలన్న ప్రతిపాదన తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి పూట ఆలస్యంగా క్యాబ్‌లో వెళ్లేందుకు భయపడాల్సి వస్తోందని, ఇలాంటి వాహనాలపై పోలీసులు లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నిఘా ఉంటే బాగుంటుందని ఇటీవల ఓ ప్రయాణికురాలు ట్వీట్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వెహికిల్ ట్రాకింగ్ అంశాన్ని పరిశీలించాలంటూ డీజీపీకి సూచించారు. ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత అన్ని ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ మేరకు అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖ కూడా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్లో తిరిగే క్యాబ్‌లు, ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర అన్ని రకాల వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అది అమలుకు నోచలేదు. దారుణం జరగినప్పుడే.. ఢిల్లీలో 2012లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. ముఖ్యంగా రాత్రి వేళ ప్రజా రవాణా వాహనాల వినియోగంపై భయాందోళనలను పెంచింది. క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం ఏ మాత్రం క్షేమం కాదనే భావన నెలకొంది. ఆ తర్వాత కొద్దిరోజులకే హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాదాపూర్ నుంచి క్యాబ్‌లో ఇంటికి వెళ్లే సమయంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత జరిగిన మరికొన్ని ఘటనలు రాత్రివేళ ప్రయాణించే మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి వాహనంపై నిఘా తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 2017లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు చట్టాన్ని రూపొందించింది. ప్రజా రవాణా వాహనాలపై నిఘా ఏర్పాటు చేసేందుకు నిర్భయ నిధి కింద కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు చేయవచ్చునని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నిర్భయ నిధులు వచ్చాయి. కానీ మరోమారు ఈ అంశం అటకెక్కింది. నిఘా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. గ్రేటర్లో తిరిగే క్యాబ్‌లలో ఆయా సంస్థలకు చెందిన వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అవి పోలీసు నిఘా పరిధిలో లేవు. దీంతో ఫిర్యాదులొస్తే తప్ప పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోతోంది. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాల్లోని డివైస్‌లను స్విచ్ ఆఫ్ చేస్తే వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతోంది. ట్రాకింగ్‌తో పక్కా నిఘా ప్రతి వాహనంలో జీపీఎస్ వెహికిల్ ట్రాకింగ్ డివైస్‌ను ఏర్పాటు చేయడం వల్ల దాని కదలికలపైన కచ్చితమైన నిఘా ఉంటుంది. ట్రాకింగ్ డివైస్ నుంచి ప్రతి 10 సెకన్లకు ఒకసారి వాహనం కదలికలు కమాండ్ కేంద్రానికి అందుతాయి. ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రయాణికులు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే కమాండ్ కంట్రోల్లో అలారం మోగుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు. ప్రస్తుతం వాహనాల్లో అమర్చిన డివైస్‌లను తొలగించేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టంగా ఏర్పాటు చేసే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ప.బెంగాల్లో మైనింగ్ వాహనాలకు ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కొన్ని బస్సులకు ఏర్పాటు చేసింది. రూ.5000 లోపు లభించే ట్రాకింగ్ డివైస్‌లను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు, యువతులు, విద్యార్ధినులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందజేయవచ్చు. ఆచరణ సాధ్యమే వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి వాహనంలో ఈ డివైస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఆదేశిస్తే ఆచరణసాధ్యమే. – రమేశ్, సంయుక్త రవాణా కమిషనర్, ఐటీ విభాగం తక్కువ ఖర్చుతో భద్రత వెహిల్ ట్రాకింగ్ డివైస్‌లు ఏ మాత్రం భారం కాదు. కేవలం నాలుగైదు వేల రూపాయల ఖర్చుతో మంచి భద్రత కలి్పంచవచ్చు. ఇప్పుడు మరింత కచి్చతమైన ప్రమాణాలతో రూపొందించిన డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వాటిని వాహనంలో ఏర్పాటు చేస్తే తొలగించడం సాధ్యం కాదు. – ఆర్.ఎల్ రెడ్డి, సాంకేతిక నిపుణులు చదవండి: 'మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్,రాజశేఖర్‌కు బెదిరింపులు' -
చైనీస్ ఆపరేషన్?.. బట్టబయలు చేసిన మెటా
ప్రభుత్వాల కోసం పని చేసే సర్వయిలెన్స్ కంపెనీలు.. నిఘాను అద్దెకి ఇస్తే!, డబ్బులిచ్చిన వాళ్ల కోసం యూజర్ల సమాచారాన్ని చేరవేస్తే! ఎలా ఉంటుంది?. అలాంటి సర్వయిలెన్స్ కంపెనీల బాగోతాన్ని వెలికి తీసింది మెటా కంపెనీ(ఒకప్పుడు ఫేస్బుక్). వేల కొద్దీ ఫేస్బుక్ అకౌంట్ల నుంచి, ఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్న కంపెనీల బండారాన్ని బయటపెట్టడంతో పాటు.. ఈ స్కామ్‌కు సంబంధించిన ఫేక్ అకౌంట్లను నిషేధించింది మెటా కంపెనీ. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ ‘మెటా’ గురువారం 1,500 అకౌంట్లను(ఏడు సర్వయిలెన్స్ కంపెనీలకు చెందినవి) పూర్తిగా నిషేధించింది. ఈ అకౌంట్లన్నీ సైబర్ మెర్కెనరీ (సైబర్ కిరాయి) కంపెనీలకు చెందినవిగా తేల్చింది. ఉద్యమకారులు, ప్రముఖ జర్నలిస్టులు, అసమ్మతివాదులపై నిఘాలో భాగంగా క్లయింట్ల తరపున ఈ అకౌంట్లు పని చేసినట్లు మెటా నిఘాలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వందకు పైగా దేశాల్లో యాభై వేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లను అప్రమత్తం చేసే ఉద్దేశంతో ఉంది మెటా. చైనీస్ ఆపరేషన్.. మెటా ఆపరేషన్‌లో వెల్లడైన కీలక అంశం.. చైనా కేంద్రంగా నడుస్తున్న ఆపరేషన్. ఈ ఆపరేషన్ పేరు, ఎవరు నడుపుతున్నారో మెటా గుర్తించలేకపోయింది. కానీ, చైనా అధికారులకు చెందిన సర్వర్లు, నిఘా సాధనాల ‘కమాండ్ అండ్ కంట్రోల్’ వ్యవస్థను మెటా ట్రేస్ చేయగలిగింది. కొన్ని చైనా బ్రాండ్లకు చెందిన ఫోన్ల ద్వారా ఈ స్కామ్ నడుస్తోందని, ఫేస్‌బుక్‌తో పాటు ఇతర డేటాను సైతం సేకరించి.. క్లయింట్లకు చేరవేస్తున్నాయని మెటా పేర్కొంది. ఇక ఈ స్కామ్‌లో ఎక్కువగా పాల్గొంది ఇజ్రాయెల్‌కు చెందిన సర్వయిలెన్స్ కంపెనీలే. ఈ ఏడు కంపెనీల లిస్ట్‌లో బ్లూహాక్ సర్వయిలెన్స్ కంపెనీ పేరు ప్రముఖంగా ఉంది. భారత్‌కు చెందిన బెల్‌ట్రాక్స్ సంబంధిత ఫేస్బుక్ అకౌంట్లను సైతం తొలగించింది మెటా. ఏం జరుగుతోందంటే.. సర్వయిలెన్స్ కంపెనీలు ఫేక్ అకౌంట్లు సృష్టించి.. యూజర్ల ప్రొఫైల్‌ను గుంజేస్తున్నాయి. వీటిలో సెలబ్రిటీలు, ప్రభుత్వ విభాగాల పేరుతోనూ అకౌంట్లను క్రియేట్ చేస్తాయి ఆ కంపెనీలు. అంతేకాదు గ్రూపుల్లో, సంభాషణల్లో జోక్యం చేసుకుంటూ వ్యక్తిగత వివరాల్ని సేకరిస్తాయి. ఫేస్బుక్ అకౌంట్లతో పాటు ఫోన్, కంప్యూటర్, పాస్వర్డ్లు, పొటోలు, వీడియోలు, మెసేజన్లు.. అన్నీ హ్యాక్ చేస్తారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి నిఘా కంపెనీలు.. వెబ్ ఇంటెలిజెన్స్ సేవలను ప్రభుత్వాలకు విక్రయిస్తుంటాయి. వార్తా నివేదికలు, వికీపీడియా వంటి పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఆన్లైన్ మూలాల నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇవి నిఘా ప్రక్రియను ప్రారంభిస్తాయి. అయితే ఈ సేవలను ప్రైవేట్‌గా అద్దెకు ఇస్తుండడం, అందునా యూజర్ల డాటాను అందిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సైబర్ మెర్కెనరీ సర్వయిలెన్స్ కంపెనీల పేరుతో ఇవి.. క్లయింట్ల(పెయిడ్) కోసం పని చేస్తుంటాయి. అయితే ఇవి కేవలం క్రిమినల్స్, టెర్రరిస్టులపై నజర్ కోసమే పని చేస్తున్నాయని ప్రకటించుకున్నప్పటికీ.. జరిగే వ్యవహారం అంతా మరోలా ఉంటోంది. చదవండి: ఈ వీడియోలో ఉంది మీరేనా? -
మహారాష్ట్ర సరిహద్దుల్లో నిఘా
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో వైరస్ కట్టడికి మరిన్ని పరీక్షలు, ట్రేసింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. హోం ఐసోలేషన్ కిట్లు అందిస్తామన్నారు. గాంధీ ఆస్పత్రితోపాటు టిమ్స్, నిమ్స్‌లలోనూ మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతానికి కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేనందున ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. అయినప్పటికీ కరోనా ఉన్నంతకాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈటల సూచించారు. ఓపెన్ మార్కెట్లో టీకా విడుదల మేలు... కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌కు ధర నిర్ణయించి బహిరంగ మార్కెట్లో ఉంచితే మంచిదని మంత్రి ఈటల అభిప్రాయపడ్డారు. అలా మార్కెట్లోకి అనుమతిస్తే ఆ మేరకు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 11 లక్షలకుపైగా టీకా డోస్‌లు వచ్చాయన్నారు. బోధనాసుపత్రుల్లో మందులు, శస్త్రచికిత్సలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండేళ్లుగా నాణ్యమైన, బ్రాండెడ్ మందులను కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ కూడా ఈసారి పెంచుతామన్నారు. గడువు తీరిన మందులను తిరిగి కంపెనీలకు వెనక్కు ఇస్తున్నామన్నారు. తాను త్వరలో వ్యాక్సిన్ తీసుకుంటానని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రి ఈటల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేసులు పెరుగుతున్నాయి: శ్రీనివాసరావు మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ఆ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల్లో ఇప్పటికీ చాలా మంది కరోనా జాగ్రత్తలను పాటించడంలేదని, మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో ఒక అంతిమయాత్రకు 50 మంది వెళితే, అందులో 35 మందికి కరోనా సోకిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. కరోనా టీకా తీసుకున్న వారు మద్యం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. వైరస్‌లో కొత్త వేరియంట్లు వస్తున్నాయన్నారు. కొన్నాళ్లు వైరస్ స్తబ్దుగా ఉండి తర్వాత కొత్త రూపంలో అది విజృంభిస్తుందన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి టీకా... వచ్చే నెల మొదటి వారంలో 50 ఏళ్లు పైబడినవారికి, ఆలోపు వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు కోవిన్ యాప్–2 అందుబాటులోకి వస్తుందన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా 50 ఏళ్లు పైబడినవారి వివరాలను నమోదు చేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను వివిధ పద్ధతుల ద్వారా సేకరిస్తున్నామన్నారు. -
నాణ్యత ‘కృష్ణార్పణం’ !
– ఇసుక ఎక్కువ.. సిమెంట్ తక్కువl –ఘాట్లకు నాసిరకమైన టైల్స్ వినియోగం – కొన్నిచోట్ల టైల్స్‌కు బదులు సిమెంట్ మెట్లు – పుష్కర కాలువలకు ఇరువైపులా ఇసుక బస్తాలు – హడావుడిగా పనులు.. కొరవడిన పర్యవేక్షణ సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేశారు. పుష్కర సమయం దగ్గర పడుతోందని ‘తెలుగు కాంట్రాక్టర్లు’ హడావుడిగా పనులు కానిచ్చేస్తున్నారు. జేబులు నింపుకోవటమే లక్ష్యంగా సాగుతున్న పనుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు పూర్తి సహకారం అందించడంతో పుష్కర పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. నాణ్యత నామమాత్రంగా కూడా కనిపించకపోవడం గమనార్హం. రేటులో ఎంత తేడా..! కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో పుష్కరాల కోసం ప్రభుత్వం సమారు రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోంది. ఘాట్ల కోసం రూ.250 కోట్లు వెచ్చించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రెండునెలల క్రితం పనులు ప్రారంభించినా, ఏర్పాట్లు మందకొడిగానే సాగాయి. కొన్ని ఘాట్లలో పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన టైల్స్ పూర్తి నాసిరకంగా కనిపిస్తున్నాయి. రూ.80 విలువైన టైల్స్‌ను వినియోగించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రూ.38 విలువచేసే టైల్స్‌ను కొనుగోలు చేసి ఘాట్ల వద్ద వాడినట్టు చెబుతున్నారు. ఇసుక ఎక్కువ.. సిమెంట్ తక్కువ ... పుష్కర ఘాట్లలో ఇసుక ఎక్కువ వేసి... సిమెంట్‌ను తక్కువ మోతాదులో కలిపి పనికానిచ్చేశారు. టైల్స్ ఏర్పాటుకు వాడే మిశ్రమంలో ఎక్కువశాతం ఇసుకనే వినియోగించారు. కృష్ణవేణి, భవానీ, పున్నమి, సీతమ్మవారి పాదాలు ఘాట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. సిమెంటు, ఇసుక, కంకరను మిల్లర్స్ పద్ధతిలో చేయాల్సి ఉండగా.. రెడీమిక్స్ మిశ్రమాన్ని వినియోగించారు. మిల్లర్స్ ద్వారా అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని పలువురు కాంట్రాక్టర్లు రెడీమిక్స్ ద్వారానే పనులు పూర్తిచేశారు. ఘాట్ల వద్ద 40 ఎంఎం కంకరకు బదులుగా, 20 ఎంఎం కంకర వినియోగించారు. భక్తులు స్నానం చేసేందుకు ఏర్పాటుచేస్తున్న కాంక్రీట్ కాలువ పనులు మరీ నాసిరకంగా చేసినట్టు ఓ అధికారి వివరించారు. నిబంధనల ప్రకారం ఘాట్ నిర్మాణానికి నేల గట్టిదనం బయటపడే వరకు ఉన్న ఇసుకను తోడి.. ఆ తర్వాతే కాంక్రీటు వేయాల్సి ఉంది. దీనికి 40 ఎంఎం కంకరను వినియోగించాలి. అయితే ప్రస్తుతం మొక్కుబడిగా ఇసుకను తొలగించి, మెటల్ వేసి సిమెంట్ కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. కాలువలకు ఇరువైపులా ఇసుక బస్తాలు ... కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భక్తులు పవిత్ర స్నానం ఆచరించేందుకు నిర్మించిన కాలువలకు సిమెంట్ కాంక్రీట్‌తో కూడిన కట్టలు (రిటెయినింగ్ వాల్) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ముహూర్తం ముంచుకొస్తుందని ఇసుక బస్తాలతో కాలువల వద్ద కట్టలు ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులు జారిపడి గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు జిల్లాల పరిధిలో నిర్మించిన పలు ఘాట్లకు టైల్స్ వేయలేదు. సమయం లేదని సిమెంట్, కంకర మిశ్రమంతో పనులు కానిచ్చేశారు. ఇదిలా ఉంటే ఘాట్ల పొడవును ఎవరికి వారు కుదించి నిర్మించారు. భవానీ ఘాట్ నుంచి దుర్గమ్మ ఆలయం సుమారు వెయ్యిమీటర్ల పొడవున ఘాట్ నిర్మించాలని మొదట నిర్ణయించి నిధులు మంజూరు చేశారు. అయితే సమయం లేదంటూ ఘాట్ల పొడవును కుదించి నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. పున్నమి ఘాట్‌ను మొదట 700 మీటర్లు నిర్మించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం 300 మీటర్లకు కుదించారు. వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేసినా.. ఘాట్లు పూర్తయ్యాయా? అంటే అదీ లేదు. పలు ఘాట్లు ఇంకా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.