నాణ్యత ‘కృష్ణార్పణం’ !
నాణ్యత ‘కృష్ణార్పణం’ !
Published Tue, Aug 9 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
– ఇసుక ఎక్కువ.. సిమెంట్ తక్కువl
–ఘాట్లకు నాసిరకమైన టైల్స్ వినియోగం
– కొన్నిచోట్ల టైల్స్‌కు బదులు సిమెంట్ మెట్లు
– పుష్కర కాలువలకు ఇరువైపులా ఇసుక బస్తాలు
– హడావుడిగా పనులు.. కొరవడిన పర్యవేక్షణ
సాక్షి, అమరావతి :
కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేశారు. పుష్కర సమయం దగ్గర పడుతోందని ‘తెలుగు కాంట్రాక్టర్లు’ హడావుడిగా పనులు కానిచ్చేస్తున్నారు. జేబులు నింపుకోవటమే లక్ష్యంగా సాగుతున్న పనుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు పూర్తి సహకారం అందించడంతో పుష్కర పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. నాణ్యత నామమాత్రంగా కూడా కనిపించకపోవడం గమనార్హం.
రేటులో ఎంత తేడా..!
కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో పుష్కరాల కోసం ప్రభుత్వం సమారు రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోంది. ఘాట్ల కోసం రూ.250 కోట్లు వెచ్చించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రెండునెలల క్రితం పనులు ప్రారంభించినా, ఏర్పాట్లు మందకొడిగానే సాగాయి. కొన్ని ఘాట్లలో పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన టైల్స్ పూర్తి నాసిరకంగా కనిపిస్తున్నాయి. రూ.80 విలువైన టైల్స్‌ను వినియోగించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రూ.38 విలువచేసే టైల్స్‌ను కొనుగోలు చేసి ఘాట్ల వద్ద వాడినట్టు చెబుతున్నారు.
ఇసుక ఎక్కువ.. సిమెంట్ తక్కువ ...
పుష్కర ఘాట్లలో ఇసుక ఎక్కువ వేసి... సిమెంట్‌ను తక్కువ మోతాదులో కలిపి పనికానిచ్చేశారు. టైల్స్ ఏర్పాటుకు వాడే మిశ్రమంలో ఎక్కువశాతం ఇసుకనే వినియోగించారు. కృష్ణవేణి, భవానీ, పున్నమి, సీతమ్మవారి పాదాలు ఘాట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. సిమెంటు, ఇసుక, కంకరను మిల్లర్స్ పద్ధతిలో చేయాల్సి ఉండగా.. రెడీమిక్స్ మిశ్రమాన్ని వినియోగించారు. మిల్లర్స్ ద్వారా అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని పలువురు కాంట్రాక్టర్లు రెడీమిక్స్ ద్వారానే పనులు పూర్తిచేశారు. ఘాట్ల వద్ద 40 ఎంఎం కంకరకు బదులుగా, 20 ఎంఎం కంకర వినియోగించారు. భక్తులు స్నానం చేసేందుకు ఏర్పాటుచేస్తున్న కాంక్రీట్ కాలువ పనులు మరీ నాసిరకంగా చేసినట్టు ఓ అధికారి వివరించారు. నిబంధనల ప్రకారం ఘాట్ నిర్మాణానికి నేల గట్టిదనం బయటపడే వరకు ఉన్న ఇసుకను తోడి.. ఆ తర్వాతే కాంక్రీటు వేయాల్సి ఉంది. దీనికి 40 ఎంఎం కంకరను వినియోగించాలి. అయితే ప్రస్తుతం మొక్కుబడిగా ఇసుకను తొలగించి, మెటల్ వేసి సిమెంట్ కాంక్రీట్ పనులు పూర్తి చేశారు.
కాలువలకు ఇరువైపులా ఇసుక బస్తాలు ...
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భక్తులు పవిత్ర స్నానం ఆచరించేందుకు నిర్మించిన కాలువలకు సిమెంట్ కాంక్రీట్‌తో కూడిన కట్టలు (రిటెయినింగ్ వాల్) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ముహూర్తం ముంచుకొస్తుందని ఇసుక బస్తాలతో కాలువల వద్ద కట్టలు ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులు జారిపడి గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు జిల్లాల పరిధిలో నిర్మించిన పలు ఘాట్లకు టైల్స్ వేయలేదు. సమయం లేదని సిమెంట్, కంకర మిశ్రమంతో పనులు కానిచ్చేశారు. ఇదిలా ఉంటే ఘాట్ల పొడవును ఎవరికి వారు కుదించి నిర్మించారు. భవానీ ఘాట్ నుంచి దుర్గమ్మ ఆలయం సుమారు వెయ్యిమీటర్ల పొడవున ఘాట్ నిర్మించాలని మొదట నిర్ణయించి నిధులు మంజూరు చేశారు. అయితే సమయం లేదంటూ ఘాట్ల పొడవును కుదించి నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. పున్నమి ఘాట్‌ను మొదట 700 మీటర్లు నిర్మించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం 300 మీటర్లకు కుదించారు. వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేసినా.. ఘాట్లు పూర్తయ్యాయా? అంటే అదీ లేదు. పలు ఘాట్లు ఇంకా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.
Advertisement
Advertisement