krishna pusakaralu
-
‘కృష్ణా’ జల జాతర
-
రైళ్లన్నీ ఫుల్
నెల్లూరు(సెంట్రల్): ఈ నెల 25 వరకు రైల్వే రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. ఓ వైపు కృష్ణా పుష్కరాలు, మరో వైపు 13 రెండో శనివారం, 14న ఆదివారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుస సెలవులు రావడంతో చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాతాలకు రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు రూ.400 స్లీపర్ టికెట్ బ్లాక్‌లో రూ.1000కుపైగా పలుకుతోంది. ప్రత్యేక రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తత్కాల్ టికెట్లు వెబ్సైట్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఖాళీ అవుతున్నాయి. దీంతో బస్సుల యజమానులు టికెట్ల ధరను పెంచేశారు. -
146 రిజర్వ్డ్, 480 సాధారణ రైళ్లు
పుష్కర మార్గాల్లో ద.మ.రైల్వే ఏర్పాట్లు హైదరాబాద్: ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయాణికుల రాకపోకల కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో 146 రిజర్వ్డ్(ఎక్స్‌ప్రెస్) రైళ్లు, 480 సాధారణ రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి నిజామాబాద్, మహబూబ్‌నగర్, తిరుపతి, విజయవాడ, గుంటూరు, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి కోసం రోజూ నడిచే రైళ్లకు అదనంగా మరికొన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. పుష్కర మార్గాల్లోని అన్ని రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. డబుల్ డెక్కర్ రైళ్లు పుష్కరాల సందర్భంగా సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు డబుల్ డెక్కర్ రైళ్లను కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్-విశాఖ (07759) డబుల్ డెక్కర్ ట్రైన్ ఈ నెల 12వ తేదీ రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ-తిరుపతి మధ్య మరో డబుల్ డెక్కర్ (07761/07762) ఆగస్టు 13, 17, 21 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 14, 18 తేదీల్లో ఉదయం 4.15 గంటకు తిరుపతి నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 4.45కు విశాఖ చేరుకుంటుంది. తిరుపతి-కాచిగూడ (07760) డబుల్ డెక్కర్ ట్రైన్ ఆగస్టు 22న సాయంత్రం 7.15 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-విజయవాడ (07757/07758) స్పెషల్ ట్రైన్ ఆగస్టు 14, 21 తేదీల్లో ఉదయం 5.30 గంటలకు సికిం ద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10.45 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో కూడా అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50 గంట లకు సికింద్రాబాద్ చేరుకుంటాయి. -
పున్నమీ ఘాట్‌ను అందంగా చేయాలి
కలెక్టర్ బాబు.ఎ విజయవాడ : పున్నమీ(వీఐపీ) ఘాట్‌ను అందమైన గ్రీనరీతోపాటు రోడ్డుకు ఇరువైపులా మంచి పూలమొక్కలు పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్–కలెక్టర్ డాక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌తో కలిసి ఆయన మంగళవారం పున్నమీ, భవానీఘాట్లను పరిశీలించారు. పున్నమీ ఘాట్‌లో ఉన్న చెట్ల చుట్టూ ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేసి లైటింగ్‌తో సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ అధికారులకు చెప్పారు. కుమ్మరిపాలెం నుంచి వచ్చే మురుగునీరు, హెడ్ వాటర్ ట్యాంకు నుంచి వచ్చే వృథా నీరు పున్నమీఘాట్లోకి చేరకుండా మళ్లించాలని సూచించారు. పున్నమీ ఘాట్‌లోకి వచ్చి, వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. భవానీ ఘాట్‌లో ఉన్న నేవీ బేస్మెంట్ను తొలగించాలన్నారు. పుష్కరనగర్ ఏర్పాటు చేసే ప్రాంతంలో రెండు భారీ బోట్లను తొలగించాలని రెండు నెలల క్రితం ఆదేశించినా, ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారంలోపు తొలగించాలని ఆదేశించారు. దుర్గాఘాట్‌లోకి పనులు పూర్తయ్యే వరకు సందర్శకులను అనుమతించవద్దని చెప్పారు. మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత ‘కృష్ణార్పణం’ !
– ఇసుక ఎక్కువ.. సిమెంట్ తక్కువl –ఘాట్లకు నాసిరకమైన టైల్స్ వినియోగం – కొన్నిచోట్ల టైల్స్‌కు బదులు సిమెంట్ మెట్లు – పుష్కర కాలువలకు ఇరువైపులా ఇసుక బస్తాలు – హడావుడిగా పనులు.. కొరవడిన పర్యవేక్షణ సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేశారు. పుష్కర సమయం దగ్గర పడుతోందని ‘తెలుగు కాంట్రాక్టర్లు’ హడావుడిగా పనులు కానిచ్చేస్తున్నారు. జేబులు నింపుకోవటమే లక్ష్యంగా సాగుతున్న పనుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొందరు అధికారులు పూర్తి సహకారం అందించడంతో పుష్కర పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. నాణ్యత నామమాత్రంగా కూడా కనిపించకపోవడం గమనార్హం. రేటులో ఎంత తేడా..! కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో పుష్కరాల కోసం ప్రభుత్వం సమారు రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోంది. ఘాట్ల కోసం రూ.250 కోట్లు వెచ్చించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రెండునెలల క్రితం పనులు ప్రారంభించినా, ఏర్పాట్లు మందకొడిగానే సాగాయి. కొన్ని ఘాట్లలో పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన టైల్స్ పూర్తి నాసిరకంగా కనిపిస్తున్నాయి. రూ.80 విలువైన టైల్స్‌ను వినియోగించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రూ.38 విలువచేసే టైల్స్‌ను కొనుగోలు చేసి ఘాట్ల వద్ద వాడినట్టు చెబుతున్నారు. ఇసుక ఎక్కువ.. సిమెంట్ తక్కువ ... పుష్కర ఘాట్లలో ఇసుక ఎక్కువ వేసి... సిమెంట్‌ను తక్కువ మోతాదులో కలిపి పనికానిచ్చేశారు. టైల్స్ ఏర్పాటుకు వాడే మిశ్రమంలో ఎక్కువశాతం ఇసుకనే వినియోగించారు. కృష్ణవేణి, భవానీ, పున్నమి, సీతమ్మవారి పాదాలు ఘాట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. సిమెంటు, ఇసుక, కంకరను మిల్లర్స్ పద్ధతిలో చేయాల్సి ఉండగా.. రెడీమిక్స్ మిశ్రమాన్ని వినియోగించారు. మిల్లర్స్ ద్వారా అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని పలువురు కాంట్రాక్టర్లు రెడీమిక్స్ ద్వారానే పనులు పూర్తిచేశారు. ఘాట్ల వద్ద 40 ఎంఎం కంకరకు బదులుగా, 20 ఎంఎం కంకర వినియోగించారు. భక్తులు స్నానం చేసేందుకు ఏర్పాటుచేస్తున్న కాంక్రీట్ కాలువ పనులు మరీ నాసిరకంగా చేసినట్టు ఓ అధికారి వివరించారు. నిబంధనల ప్రకారం ఘాట్ నిర్మాణానికి నేల గట్టిదనం బయటపడే వరకు ఉన్న ఇసుకను తోడి.. ఆ తర్వాతే కాంక్రీటు వేయాల్సి ఉంది. దీనికి 40 ఎంఎం కంకరను వినియోగించాలి. అయితే ప్రస్తుతం మొక్కుబడిగా ఇసుకను తొలగించి, మెటల్ వేసి సిమెంట్ కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. కాలువలకు ఇరువైపులా ఇసుక బస్తాలు ... కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భక్తులు పవిత్ర స్నానం ఆచరించేందుకు నిర్మించిన కాలువలకు సిమెంట్ కాంక్రీట్‌తో కూడిన కట్టలు (రిటెయినింగ్ వాల్) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ముహూర్తం ముంచుకొస్తుందని ఇసుక బస్తాలతో కాలువల వద్ద కట్టలు ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులు జారిపడి గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు జిల్లాల పరిధిలో నిర్మించిన పలు ఘాట్లకు టైల్స్ వేయలేదు. సమయం లేదని సిమెంట్, కంకర మిశ్రమంతో పనులు కానిచ్చేశారు. ఇదిలా ఉంటే ఘాట్ల పొడవును ఎవరికి వారు కుదించి నిర్మించారు. భవానీ ఘాట్ నుంచి దుర్గమ్మ ఆలయం సుమారు వెయ్యిమీటర్ల పొడవున ఘాట్ నిర్మించాలని మొదట నిర్ణయించి నిధులు మంజూరు చేశారు. అయితే సమయం లేదంటూ ఘాట్ల పొడవును కుదించి నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. పున్నమి ఘాట్‌ను మొదట 700 మీటర్లు నిర్మించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం 300 మీటర్లకు కుదించారు. వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేసినా.. ఘాట్లు పూర్తయ్యాయా? అంటే అదీ లేదు. పలు ఘాట్లు ఇంకా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. -
12 నుంచి శత చండీయాగం
వల్లభాపురం(కొల్లిపర): పుష్కరాలకు మరింత శోభను తీసుకొచ్చేందుకు వల్లభాపురం గ్రామస్తులు సన్నాహాలు ప్రారంభించారు. నీటి సంఘాల మాజీ అధ్యక్షుడు మాకిరెడ్డి శివరామిరెడ్డి నివాసంలో అర్చకులు, గ్రామ పెద్దలు మంగళవారం సమావేశమయ్యారు. బ్రహ్మర్షి, వేదమూర్తి కేవీఆర్ శాస్త్రి బృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాల వివరాలను ఆయనతో పాటు పీఏసీఎస్ అధ్యక్షుడు అవుతు నగేష్‌రెడ్డి సాక్షికి తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు గ్రామంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శతచండీ యాగం, రుద్రహోమం, నవగ్రహ హోమం, సుదర్శన, మృత్యుంజయ హోమాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. 12న కృష్ణా పుష్కర ఆహ్వానం, పూజ, హారతి సంకల్పం, స్నానం ఘట్టాలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రథమ కలశ స్థాపన, చండీ హోమం ప్రారంభిస్తారు. ఇదే విధంగా మిగిలిన రోజుల్లోనూ విశేష పూజలు నిర్వహించనున్నారు.