146 రిజర్వ్‌డ్, 480 సాధారణ రైళ్లు
పుష్కర మార్గాల్లో ద.మ.రైల్వే ఏర్పాట్లు
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయాణికుల రాకపోకల కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో 146 రిజర్వ్‌డ్(ఎక్స్‌ప్రెస్) రైళ్లు, 480 సాధారణ రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్‌ల నుంచి నిజామాబాద్, మహబూబ్‌నగర్, తిరుపతి, విజయవాడ, గుంటూరు, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి కోసం రోజూ నడిచే రైళ్లకు అదనంగా మరికొన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. పుష్కర మార్గాల్లోని అన్ని రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు.
డబుల్ డెక్కర్ రైళ్లు
పుష్కరాల సందర్భంగా సాధారణ, ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు డబుల్ డెక్కర్ రైళ్లను కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్-విశాఖ (07759) డబుల్ డెక్కర్ ట్రైన్ ఈ నెల 12వ తేదీ రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ-తిరుపతి మధ్య మరో డబుల్ డెక్కర్ (07761/07762) ఆగస్టు 13, 17, 21 తేదీల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఆగస్టు 14, 18 తేదీల్లో ఉదయం 4.15 గంటకు తిరుపతి నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 4.45కు విశాఖ చేరుకుంటుంది. తిరుపతి-కాచిగూడ (07760) డబుల్ డెక్కర్ ట్రైన్ ఆగస్టు 22న సాయంత్రం 7.15 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-విజయవాడ (07757/07758) స్పెషల్ ట్రైన్ ఆగస్టు 14, 21 తేదీల్లో ఉదయం 5.30 గంటలకు సికిం ద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10.45 గంటలకు విజయవాడ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో కూడా అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50 గంట లకు సికింద్రాబాద్ చేరుకుంటాయి.