నకిలీ ‘ఫేస్‌బుక్‌’ ఖాతాలు 25 కోట్లు | Duplicate Facebook accounts 25 crores | Sakshi
Sakshi News home page

నకిలీ ‘ఫేస్‌బుక్‌’ ఖాతాలు 25 కోట్లు

Published Tue, Feb 5 2019 4:52 AM | Last Updated on Tue, Feb 5 2019 4:52 AM

Duplicate Facebook accounts 25 crores - Sakshi

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో నకిలీల బెడద ఎక్కవైపోతోంది. గత మూడేళ్లలోనే ఇటువంటివి మూడు రెట్లు పెరిగిపోయాయి. నెలవారీ యాక్టివ్‌ యూజర్ల (తరచూ ఫేస్‌బుక్‌లో లీనమయ్యే వారు)ఖాతాలను విశ్లేషించగా, వీటిల్లో 25 కోట్ల ఖాతాలు నకిలీవేనని ఫేస్‌బుక్‌ సంస్థ తన 2018 వార్షిక నివేదికలో వెల్లడించింది. 2018 చివరి త్రైమాసికం (అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు)లో నెలవారీ యాక్టివ్‌ యూజర్లలో నకిలీ ఖాతాలు 11 శాతంగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. వాస్తవానికి 5 శాతం మేర ఉండొచ్చని సంస్థ అంచనా వేయడం గమనార్హం. 2015లో యాక్టివ్‌ యూజర్లలో నకిలీ ఖాతాలు 5 శాతంగానే ఉన్నాయి. 2015 డిసెంబర్‌ నాటికి ఫేస్‌బుక్‌లో నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 159 కోట్లుగా ఉంటే 2018 డిసెంబర్‌ చివరికి 232 కోట్లకు పెరిగినట్టు ఫేస్‌బుక్‌ నివేదిక తెలియజేసింది.

గడిచిన నెల రోజుల్లో ఫేస్‌బుక్‌ ఖాతాలో లాగిన్‌ అయిన యూజర్లను నెలవారీ యాక్టివ్‌ యూజర్లుగా సంస్థ పరిగణిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర మార్కెట్లలో నకిలీ ఖాతాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఒకటి కంటే అదనంగా ఓ యూజర్‌ నిర్వహించే ఖాతాలను డూప్లికేట్‌గా సంస్థ పరిగణిస్తుంది. ఇందులో యూజర్లు తమ వ్యక్తిగత ప్రొఫైల్‌తో ఒకటి, వ్యాపార అవసరాల కోసం మరొకటి, సంస్థ పేరిట, తమ పెంపుడు జంతువుల పేరిట నిర్వహించే ఖాతాలు ఒక కేటగిరీ కాగా, రెండో కేటగిరీలో ఫేస్‌బుక్‌ నిబంధనలకు ఉల్లంఘించే ఉద్దేశంతో క్రియేట్‌ చేసినవి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement