ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్(ఫైల్ ఫోటో)
శాన్ ఫ్రాన్సిస్కో: డేటా భద్రత యూజర్లకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఇప్పటికే సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారుల డేటా లీక్ ప్రకంపనల నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ మరో బాంబు పేల్చారు. డేటా బ్రీచ్ ప్రమాదం మరింత పొంచి వుందని యూజర్లు, ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో భవిష్యత్తులో మరింతగా డేటా లీక్ ఉండే అవకాశముందని ఫేస్‌బుక్ వెల్లడించింది.
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు అందించిన త్రైమాసిక నివేదికలో, కేంబ్రిడ్జ్ ఎనలైటికా గురించి ప్రస్తావించకుండానే యూజర్లకు ఈ హెచ్చరిక చేసింది. థర్డ్ పార్టీల అవాంఛనీయ కార్యాచరణ ద్వారా వినియోగదారుల డేటా లీక్ సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్‌బుక్ ఎస్ఈసీకి తెలిపింది. ఇది తమ కీర్తి, ప్రతిష్టలకు తీవ్ర హాని కలిగించవచ్చు. తమ వ్యాపారాన్ని, ఆర్థిక ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని పేర్కొంది.
కాగా ఫేస్‌బుక్ నుంచి అక్రమంగా సేకరించిన కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్ చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో అమెరికా, బ్రిటన్ చట్ట సభలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో కంపెనీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment