శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. డేటా భద్రతపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తమ యూజర్ల వందల మిలియన్ల పాస్‌వర్డ్‌లను తమ ఇంటర్నల్ సెర్వర్‌లలో దాచిపెట్టినట్టు గురువారం ధృవీకరించింది. భద్రతా నిబంధనలకు విరుద్ధంగా సులువుగా చదవగలిగిన (ప్లెయిన్ టెక్స్ట్) ఫార్మాట్‌లోనే సర్వర్లలో నిక్షిప్తం చేసామని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూలో ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌వెల్లడించింది. అయితే ఈ పాస్‌వర్డ్‌లు ఫేస్‌బుక్ ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని వివరణ ఇచ్చింది.
ఫేస్‌బుక్ ఇంజినీరింగ్, భద్రత, గోప్యత విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి తన ‘బ్లాగ్‌స్పాట్’లో దీనిపై వివరణ ఇచ్చారు. ఏటా జరిపే భద్రత సమీక్షలో భాగంగా ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలేవీ లేవని, ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని ఆయన అంగీకరించారు. కాకపోతే ఈ తప్పిదం తమ దృష్టికి రాగానే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్‌వర్డ్‌లు కలిగి ఉన్నఫేస్‌బుక్ లైట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు త్వరలోనే ఈ విషయమై తగిన హెచ‍్చరికలు, సూచనలు జారీ చేస్తామన్నారు. కొత్త పాస్‌వర్డ్‌లు పెట్టుకునేలా సూచిస్తామన్నారు.
కాగా క్రెబ్స్‌ఆన్‌సెక్యూరిటీ.కామ్ అనే సెక్యూరిటీ న్యూస్ వెబ్‌సైట్ ఇంతకుముందెప్పుడో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. గత కొన్నేళ్లుగా 60 కోట్లమంది ఫేస్‌బుక్ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లు సాధారణ అక్షరాల్లోనే నిల్వ ఉంచారని, గుప్త అక్షరాల్లో నిక్షిప్తం చేయలేదని, 20వేలమంది ఫేస్‌బుక్ ఉద్యోగులు వాటిని చూడగలరని తెలిపింది. దీంతో ఫేస్‌బుక్ గోప్యతపై సర్వత్రా అనుమానాలు తలెత్తాయి. అయితే 2012కు ముందు పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు మాత్రమే ఈ ప్రభవానికి లోనయ్యాయని, ఆ తరువాత పాస్‌వర్డ్‌లు మార్చుకున్నవారు, కొత్త యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా క్రెబ్స్ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment