encryption
-
భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సాప్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్‌ను సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.ఈ సందర్భంగా వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ ప్లాట్‌ఫాంలో మెసేజ్‌లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని ఆదేశాలిస్తే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.ఎన్క్రిప్షన్ తొలగించడమనేది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్,మెటా ఆరోపించాయి.ముఖ్యంగా మెసేజ్ సెండర్ వివరాలను ట్రేస్ చేసే నిబంధనను సవరించాలని కోరాయి. విచారణ సందర్భంగా వాట్సాప్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మెసేజ్‌ల గోప్యత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని మేం అమలు చేస్తున్నాం.సీక్రెసీ(రహస్యభద్రత) ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనల్లోని 4(2) సెక్షన్‌తో మేం ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు గనుక చెబితే మేం ఇండియా నుంచి వెళ్లిపోతాం’అని కోర్టుకు స్పష్టం చేశారు. -
ఉగ్రమూకల కొత్త యాప్ బాట
శ్రీనగర్: ఉగ్రమూకలు సరికొత్త పన్నాగాలకు తెరలేపుతున్నాయి. ఎన్క్రిప్షన్ సదుపాయం ఉన్నప్పటికీ వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి యాప్‌లను వాడకుండా మరింత ఎన్క్రిప్షన్ ఉంటూనే తక్కువ నెట్‌వర్క్‌లోనూ సమర్ధవంతంగా పని చేయగల యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి 3 యాప్‌లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మూడే ఎందుకు ? భద్రతా కారణాల రీత్యా ఆయా యాప్‌ల పేర్లను అధికారులు బయటపెట్టలేదు. అయితే ఆ మూడు యాప్‌లలో ఒకటి అమెరికా, రెండోది యూరోప్, మూడోది టర్కీకి చెందిన నిపుణులు తయారు చేసినవని వెల్లడించారు. ఈ యాప్‌లో ఎండ్ టు ఎండ్ డివైజ్ ఎన్క్రిప్షన్ ఉంటోంది. ప్రత్యేకించి ఇటీవల భారత్‌లో జరిగిన ఉగ్ర ఎన్కౌంటర్లలో మరణించిన వారి మొబైల్ ఫోన్లను పరిశీలించిన అధికారులకు టర్కీ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. 2జీ నెట్వర్క్ కోసం... కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా కాలం పాటు ఆ ప్రదేశాల్లో ఇంటర్నెట్ సౌకర్యం నిలిపేశారు. అనంతరం కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. 2జీ వేగంలో ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగల టర్కీ యాప్ వైపు ఉగ్రవాదులు మొగ్గు చూపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ యాప్‌లు కూడా ఫ్రీ సర్వీసులను అందించడం గమనార్హం. ఫోన్ నంబర్ అక్కర్లేదు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ఈ మూడు యాప్‌లలో ఒకదానికి అసలు మొబైల్ నంబర్ కూడా అవసరం లేకుండానే రిజిస్టర్ చేసుకొని సమాచారం పంచుకోవచ్చు. ఒకరకంగా ఇది వర్చువల్ సిమ్‌లాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. పుల్వామా–2019 ఘటనలోనూ ఇలాంటి వర్చువల్‌సిమ్ కార్డులను దాదాపు 40 వరకూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
మైక్రోసాఫ్ట్‌తో తాన్లా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ సేవలందించే తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారిత వైజ్లీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ఇది రోజుకు 100 కోట్ల దాకా మెసేజీలను సురక్షితంగా, వేగవంతంగా ప్రాసెస్ చేయగలదని బుధవారం వైజ్లీ ఆవిష్కరించిన సందర్భంగా తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్, సీఈవో డి. ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇది కంపెనీలు, మొబైల్ క్యారియర్స్, ఓటీటీ సంస్థలు, మార్కెటర్లు, పరిశ్రమ నియంత్రణ సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. బీమా, బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలు తమ కస్టమర్లకు పంపే మెసేజీలు, ఓటీపీలు, మెయిల్స్ మొదలైనవి డెలివరీ అయ్యే క్రమంలో వివిధ ప్రక్రియల కారణంగా జాప్యం జరగడం, పూర్తి స్థాయిలో ఎన్క్రిప్షన్ లేకపోవడం వంటి సవాళ్లు ఉంటున్నాయని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్క్రిప్షన్, డేటా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రారంభం నుంచి చివరి దాకా గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు వైజ్లీ తోడ్పడగలదని ఆయన వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సంబంధిత సాంకేతికతలతో కంపెనీలు సర్వీసుల నాణ్యతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉపయోగపడగలదని పేర్కొన్నారు. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చెయిన్ ప్రాసెస్‌లకు సంబంధించి వైజ్లీ ఇప్పటికే మూడు పేటెంట్లు దక్కించుకుందని ఉదయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. డేటాకు ప్రైవసీ, భద్రత అత్యంత కీలకమైనవని, వీటికి వైజ్లీ తోడ్పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు. వైజ్లీలో మార్కెట్ ప్లేస్ విధానం .. ఇప్పటికే ట్రూబ్లాక్ ప్లాట్‌ఫాం ద్వారా దేశీయంగా వివిధ సంస్థలకు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నామని ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడిక వైజ్లీతో ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు అందించనున్నామని ఆయన వివరించారు. దీనిలో ప్రప్రథమంగా మార్కెట్‌ప్లేస్ విధానాన్ని కూడా పొందుపర్చామని పేర్కొన్నారు. టెలికం సంస్థలు తదితర సర్వీస్ ప్రొవైడర్లను తమ అవసరాలకు అనుగుణంగా కంపెనీలు పారదర్శకంగా ఎంపిక చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్ (సీపాస్) విభాగంలో ఇలాంటిది అందించడం ప్రపంచంలోనే ఇదే ప్రథమమని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. క్లౌడ్ ద్వారా వైజ్లీ ప్లాట్‌ఫాంను అందించడానికి మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అలాగే మైక్రోసాఫ్ట్ అనుభవం .. దీని రూపకల్పనలో ఉపయోగపడిందని వివరించారు. ఇక, వైజ్లీ విక్రయంలో రెండు సంస్థలు కలిసి పనిచేసేందుకు కూడా భాగస్వామ్యం తోడ్పడగలదన్నారు. 40 బిలియన్ డాలర్లకు గ్లోబల్ సీపాస్ ... ప్రస్తుతం అంతర్జాతీయంగా సీపాస్ వ్యాపార విభాగం సుమారు 20 బిలియన్ డాలర్లుగా ఉందని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. గార్ట్నర్ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపై 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొన్నారు. ఇక భారత మార్కెట్ విషయానికొస్తే 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందన్నారు. పలు దిగ్గజ సంస్థలతో పాటు ప్రభుత్వానికి కూడా సర్వీసులు అందిస్తూ దేశీయంగా తాము ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల తర్వాత డిజిటైజేషన్ మరింత వేగవంతమైందన్నారు. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పుంజుకుంటుందని, తద్వారా అవకాశాలు మరింత పెరగగలవని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. -
షాకింగ్ న్యూస్ చెప్పిన ఫేస్బుక్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. డేటా భద్రతపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తమ యూజర్ల వందల మిలియన్ల పాస్‌వర్డ్‌లను తమ ఇంటర్నల్ సెర్వర్లలో దాచిపెట్టినట్టు గురువారం ధృవీకరించింది. భద్రతా నిబంధనలకు విరుద్ధంగా సులువుగా చదవగలిగిన (ప్లెయిన్ టెక్స్ట్) ఫార్మాట్లోనే సర్వర్లలో నిక్షిప్తం చేసామని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూలో ఈ విషయాన్ని ఫేస్బుక్వెల్లడించింది. అయితే ఈ పాస్వర్డ్లు ఫేస్బుక్ ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని వివరణ ఇచ్చింది. ఫేస్బుక్ ఇంజినీరింగ్, భద్రత, గోప్యత విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి తన ‘బ్లాగ్స్పాట్’లో దీనిపై వివరణ ఇచ్చారు. ఏటా జరిపే భద్రత సమీక్షలో భాగంగా ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలేవీ లేవని, ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని ఆయన అంగీకరించారు. కాకపోతే ఈ తప్పిదం తమ దృష్టికి రాగానే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్వర్డ్లు కలిగి ఉన్నఫేస్బుక్ లైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు త్వరలోనే ఈ విషయమై తగిన హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తామన్నారు. కొత్త పాస్వర్డ్లు పెట్టుకునేలా సూచిస్తామన్నారు. కాగా క్రెబ్స్ఆన్సెక్యూరిటీ.కామ్ అనే సెక్యూరిటీ న్యూస్ వెబ్సైట్ ఇంతకుముందెప్పుడో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. గత కొన్నేళ్లుగా 60 కోట్లమంది ఫేస్బుక్ ఖాతాదారుల పాస్వర్డ్లు సాధారణ అక్షరాల్లోనే నిల్వ ఉంచారని, గుప్త అక్షరాల్లో నిక్షిప్తం చేయలేదని, 20వేలమంది ఫేస్బుక్ ఉద్యోగులు వాటిని చూడగలరని తెలిపింది. దీంతో ఫేస్బుక్ గోప్యతపై సర్వత్రా అనుమానాలు తలెత్తాయి. అయితే 2012కు ముందు పెట్టుకున్న పాస్వర్డ్లు మాత్రమే ఈ ప్రభవానికి లోనయ్యాయని, ఆ తరువాత పాస్వర్డ్లు మార్చుకున్నవారు, కొత్త యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా క్రెబ్స్ నివేదించింది. -
ఫేస్బుక్లో బయటపడ్డ మరో భద్రతాలోపం
శాన్ ఫ్రాన్సిస్కో: భద్రతా లోపం కారణంగా కొన్ని కోట్ల ఫేస్బుక్ ఖాతాల పాస్వర్డ్లు ఎలాంటి ఎన్క్రిప్షన్ లేకుండా సాధారణ అక్షరాలుగానే సంస్థ అంతర్గత సర్వర్‌ల్లో స్టోర్ అయ్యాయని ఫేస్బుక్ గురువారం ఒప్పుకుంది. అలాంటి ఖాతాల సంఖ్య 60 కోట్లని విశ్వసనీయ సమాచారం. 20 వేల మంది తమ సంస్థ ఉద్యోగులకు ఆ పాస్వర్డ్లు కనిపించేవనీ, బయటి వారికి కాదని తెలిపింది. ఉద్యోగులు ఆ ఖాతాల్లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లు కానీ, వాటిని దుర్వినియోగం చేసినట్లు కానీ తమకేమీ ఆధారాలు లభించలేదని సంస్థ ఇంజినీరింగ్, సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి చెప్పారు. ఈ ఏడాది మొదట్లో సాధారణ భద్రతా తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడిందన్నారు. ఇలా ఏయే ఫేస్బుక్ ఖాతాల పాస్వర్డ్లు బయటకు కనిపించాయో ఆయా ఖాతాదారులకు దీనిపై త్వరలో ఓ నోటిఫికేషన్ కూడా పంపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. -
చోరీ డేటా అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!
-
వాట్సాప్‌తో దేశానికి ముప్పా?
న్యూఢిల్లీ: వాట్సాప్.. నేడు స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లలో దాదాపు ప్రతి వ్యక్తి వాడుతున్న అప్లికేషన్. వాట్సాప్ ఈ మధ్యే మొదలుపెట్టిన 256 బిట్ ఎన్క్రిప్షన్ దేశ రక్షణకు విఘాతం కలిగించే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు వాట్సాప్‌పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సమాచార హక్కు కార్యకర్త. గుర్గావ్కు చెందిన సుధీర్ యాదవ్ వాట్సాప్ ఎన్క్రిప్షన్ అమలుచేసేందుకు ఏవైనా అనుమతులు తీసుకుందా అని కేంద్ర సమాచార కేంద్రాన్ని వివరాలు కోరగా అందుకు సంబంధించిన ఫైళ్లు ఏవీ లేవని సమాధానం వచ్చింది. ఆ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని వాట్సాప్‌ను దేశంలో నిషేధించాలని యాప్‌లోని ఎన్క్రిప్షన్ కారణంగా దేశ భద్రతకు ముప్పు ఉంటుందని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి పీర్ టూ పీర్ ఎన్క్రిప్షన్ను అమలు చేయడానికి భారతదేశంలో సరైన చట్టాలు లేవు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. యాదవ్ తన పిటిషన్లో ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. త్వరలో ఈ కేసు సుప్రీంలో విచారణకు రానుంది. -
ఐఫోన్‌ను అన్‌లాక్ చేసినందుకు రూ. 8 కోట్లు!
వాషింగ్టన్: సాన్ బెర్నార్డినోలో కాల్పులు జరిపిన ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) అక్షరాల 1.3 మిలియన్ డాలర్ల (రూ. 8.64 కోట్ల)కుపైగా హ్యాకర్లకు చెల్లించింది. లండన్‌లోని అస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్‌కు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమె ఈ విషయాన్ని తెలిపారు. ఉగ్రవాది సయెద్ ఫరూఖ్ వాడిన ఐఫోన్ 5సీని అన్‌లాక్ చేసేందుకు రానున్న ఏడేళ్లలో తనకు అందే వేతనానికి పైగా హ్యాకర్లకు చెల్లించినట్టు ఆయన చెప్పారు. 14,900 డాలర్ల వేతనం చొప్పున ఆయన ఏడేళ్ల సర్వీసు ముగిసేలోపు మొత్తంగా 1.3 మిలియన్ డాలర్లకు పైగా అందుకుంటారు. ఈ వ్యవహారంలో అంతకన్నా ఎక్కువే హ్యాకర్లకు ఎఫ్‌బీఐ ముట్టజెప్పిందని, కానీ కేసు తీవ్రతను బట్టి ఇది అవసరమేనని కొమే అభిప్రాయపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 2న సాన్‌బెర్నార్డినోలో 14 మందిని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు సయెద్ ఫరుఖ్, అతని భార్య హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఈ ఇద్దరు చనిపోయారు. ఈ నేపథ్యంలో అతని ఐఫోన్ 5సీని అన్‌లాక్ చేసే వ్యవహారంలో యాపిల్ సంస్థను ఎఫ్‌బీఐ కోర్టుకు ఈడ్బిన సంగతి తెలిసిందే. అయితే, వినియోగదారుల ప్రైవసీని ప్రమాదంలో పడేసేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో దొంగదారిలో ఐఫోన్‌ను అన్‌లాక్ చేయబోమని యాపిల్ తేల్చి చెప్పడంతో ఎఫ్‌బీఐ ప్రైవేటు హ్యాకర్లను సంప్రదించి.. ఈ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయించింది. ఇందుకు ఏకంగా రూ. 8 కోట్ల(1.3 మిలియన్ డాలర్ల)కుపైగా ఖర్చు చేసినట్టు ఎఫ్‌బీఐ చెప్తోంది. -
వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌పై ఆందోళన
న్యూఢిల్లీ: వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ హ్యాకర్ల బారినపడకుండా వాట్సప్ తెచ్చిన సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ (భద్రతా చర్యలు)పై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీన్ని జాతి వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందన్నాయి. ఐఫోన్ అన్‌లాక్ విషయంలో ఆపిల్, ఎఫ్‌బీఐ మధ్య వివాదం నేపథ్యంలో.. వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఎన్క్రిప్షన్ వల్ల వాట్సాప్ గానీ, మూడో వ్యక్తి గానీ మీ సందేశాలను చూడలేరు. ప్రభుత్వం కోరినా వాట్సాప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. 256 బిట్ ఎన్క్రిప్షన్ను వాడటం మన ఐటీ చట్టాల ప్రకారం నేరమైనందున వాట్సాప్‌పై ఎవరైనా దేశంలో కేసు పెట్టవచ్చని అంటున్నారు. -
ఇక భారత్ లో వాట్సాప్ చట్టవిరుద్ధం!?
వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ హ్యాకర్ల బారిన పడకుండా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తీసుకొచ్చిన సరికొత్త సెక్యూరిటీ ఎన్ క్రిప్షన్ (భద్రతా చర్యలు) సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వినియోగదారుల ప్రైవసీకి, సమాచార భద్రతకు పెద్దపీట వేసే ఈ నిర్ణయాన్ని వాట్సప్ యూజర్లు ప్రశంసిస్తున్నప్పటికీ.. దీని లెటేస్ట్ వెర్షన్ మాత్రం భారత్ లో చట్టవిరుద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం కాలం చెల్లిన మన ఐటీ చట్టాలే. ఈ చట్టాల ఆధారంగా వాట్పప్ పై ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. అయితే, వాట్సప్ కు ఉన్న ప్రజాదరణ కారణంగా ప్రభుత్వం అంతటి సాహసానికి ఒడిగట్టకపోవచ్చునని చెప్తున్నారు. యూజర్ల మెసేజ్ లు, వాయిస్ కాల్స్ వాటంతటవే ఎన్ క్రిప్ట్ అయ్యేవిధంగా వాట్సప్ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ చర్యల కారణంగా ప్రభుత్వం కావాలని కోరినా వాట్సప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. బై డిపాల్ట్ గా 256 బిట్ ఎన్ క్రిప్షన్ ను ఇందుకు వాడటమే కారణం. ఈ ఎన్ క్రిప్షన్ మన ఐటీ చట్టాల ప్రకారం అక్రమం. 256 బిట్ ఎన్ క్రిప్షన్ వాడినందుకు వాట్సప్ పై ఎవరైనా భారత్ లో కేసు పెట్టవచ్చు. ఐటీ చట్టాల నియమనిబంధనల ప్రకారం ప్రైవేటు సర్వీసులు ఏవీ కూడా ఈ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించరాదు. ఈ ప్రైవేటు సర్వీసులు ఏమిటన్నది ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీవోటీ) మాత్రం ఈ విషయమై కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం వాట్సప్ అక్రమమంటూ కేసు పెట్టవచ్చు. 2007లో డీవోటీ జారీచేసిన నిబంధనల ప్రకారం భారత్ లో ప్రవేటు పార్టీలు 40 బిట్స్ కన్నా ఎక్కువ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించితే.. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని లైసెన్స్ అగ్రీమెంట్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ స్పష్టం చేస్తుంది. 40 బిట్స్ కు మించి ఎన్ క్రిప్షన్ ఉపయోగించే ప్రైవేటు సంస్థలు దానిని అన్ లాక్ చేసేందుకు అవసరమైన కీస్ (తాళంచెవులు) ప్రభుత్వానికి ఇస్తేనే ఇందుకు అనుమతి ఇస్తుంది. ఈ విధంగా చూసుకుంటే వాట్సప్ కు అనుమతి లభించే అవకాశమే కనిపించడం లేదు. తాజా ఎన్ క్రిప్షన్ ను అన్ లాక్ చేసే కీస్ ప్రభుత్వానికి వాట్సప్ ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే తాజాగా చేపట్టిన భద్రతా చర్యల వల్ల ఈ కీస్ వాట్సప్ దగ్గర కూడా ఉండవు. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వాట్సప్ ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీసు (ఐఎస్పీ) కాదు. వాట్సప్ భారత్ లో అందించే సేవలకు డీవోటీ లైసెన్స్ అవసరమే లేదు. ఈ నేపథ్యంలో డీవోటీ ఎన్ క్రిప్షన్ నిబంధనలు వాట్సప్ కు వర్తిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
క్రిమినల్స్ ఇష్టపడేది 'ఆ' ఫోన్‌నే
న్యూయార్క్: నేరస్థులకు యాపిల్ ఐఫోన్ అంటే ఇష్టం పెరిగిపోతోందట. తమ దగ్గర ఉన్న వేరే మొబైళ్లను పడేసి మరీ వాళ్లు యాపిల్ ఐఫోన్లను వాడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. యాపిల్ ఐఫోన్‌ను డీకోడ్ చేయడంలో విచారణ అధికారులు ఎదుర్కొటున్న ఇబ్బందులను గ్రహించిన నేరగాళ్లు వాటినే ఇష్టపడుతున్నారని నివేదికలో స్పష్టం చేశారు. న్యూయార్క్ అధికారులు నేరస్థుడి ఫోన్‌కాల్‌ను ట్యాప్ చేసిన సందర్భంగా యాపిల్ ఐఫోన్లో ఉన్నటువంటి డీకోడ్ చేయరాని సాంకేతిక పరిఙ్ఞానాన్ని దేవుడిచ్చిన వరంగా అభివర్ణిస్తూ ఓ నేరగాడు మరొకరితో జరిపిన ఆసక్తికరమైన సంభాషణను సైతం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టంను డీ కోడ్ చేయడంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులకు సహకరించడానికి యాపిల్ సంస్థ నిరాకరిస్తుండటంతో నేరగాళ్లు ఐఫోన్‌నే వాడుతున్నారని అధికారులు తెలిపారు. శాన్‌బెర్నార్డినో ఉగ్రవాది ఐఫోన్‌ను డీకోడ్ చేసి ఎఫ్‌బీఐకి సహకరించాలన్న కోర్టు ఆదేశాలపై వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యతనిస్తామంటూ యాపిల్ పోరాడుతున్న విషయం తెలిసిందే. యాపిల్‌కు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్‌తో పాటు మరికొన్ని సంస్థలు మద్దతిస్తున్నాయి. అయితే యాపిల్ చర్య ఉగ్రవాదులకు, నేరగాళ్లకు సహకరించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.