వాట్సాప్‌తో దేశానికి ముప్పా?
న్యూఢిల్లీ: వాట్సాప్.. నేడు స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లలో దాదాపు ప్రతి వ్యక్తి వాడుతున్న అప్లికేషన్. వాట్సాప్ ఈ మధ్యే మొదలుపెట్టిన 256 బిట్ ఎన్‌క్రిప్షన్ దేశ రక్షణకు విఘాతం కలిగించే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు వాట్సాప్‌పై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సమాచార హక్కు కార్యకర్త.
గుర్‌గావ్‌కు చెందిన సుధీర్ యాదవ్ వాట్సాప్ ఎన్క్రిప్షన్ అమలుచేసేందుకు ఏవైనా అనుమతులు తీసుకుందా అని కేంద్ర సమాచార కేంద్రాన్ని వివరాలు కోరగా అందుకు సంబంధించిన ఫైళ్లు ఏవీ లేవని సమాధానం వచ్చింది. ఆ డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకుని వాట్సాప్‌ను దేశంలో నిషేధించాలని యాప్‌లోని ఎన్క్రిప్షన్ కారణంగా దేశ భద్రతకు ముప్పు ఉంటుందని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతానికి పీర్ టూ పీర్ ఎన్క్రిప్షన్ను అమలు చేయడానికి భారతదేశంలో సరైన చట్టాలు లేవు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది. యాదవ్ తన పిటిషన్లో ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. త్వరలో ఈ కేసు సుప్రీంలో విచారణకు రానుంది.