ఇక భారత్ లో వాట్సాప్ చట్టవిరుద్ధం!?
వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ హ్యాకర్ల బారిన పడకుండా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తీసుకొచ్చిన సరికొత్త సెక్యూరిటీ ఎన్ క్రిప్షన్ (భద్రతా చర్యలు) సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వినియోగదారుల ప్రైవసీకి, సమాచార భద్రతకు పెద్దపీట వేసే ఈ నిర్ణయాన్ని వాట్సప్ యూజర్లు ప్రశంసిస్తున్నప్పటికీ.. దీని లెటేస్ట్ వెర్షన్ మాత్రం భారత్ లో చట్టవిరుద్ధమయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం కాలం చెల్లిన మన ఐటీ చట్టాలే. ఈ చట్టాల ఆధారంగా వాట్పప్ పై ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. అయితే, వాట్సప్ కు ఉన్న ప్రజాదరణ కారణంగా ప్రభుత్వం అంతటి సాహసానికి ఒడిగట్టకపోవచ్చునని చెప్తున్నారు.
యూజర్ల మెసేజ్ లు, వాయిస్ కాల్స్ వాటంతటవే ఎన్ క్రిప్ట్ అయ్యేవిధంగా వాట్సప్ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ చర్యల కారణంగా ప్రభుత్వం కావాలని కోరినా వాట్సప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. బై డిపాల్ట్ గా 256 బిట్ ఎన్ క్రిప్షన్ ను ఇందుకు వాడటమే కారణం. ఈ ఎన్ క్రిప్షన్ మన ఐటీ చట్టాల ప్రకారం అక్రమం. 256 బిట్ ఎన్ క్రిప్షన్ వాడినందుకు వాట్సప్ పై ఎవరైనా భారత్ లో కేసు పెట్టవచ్చు. ఐటీ చట్టాల నియమనిబంధనల ప్రకారం ప్రైవేటు సర్వీసులు ఏవీ కూడా ఈ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించరాదు. ఈ ప్రైవేటు సర్వీసులు ఏమిటన్నది ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీవోటీ) మాత్రం ఈ విషయమై కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం వాట్సప్ అక్రమమంటూ కేసు పెట్టవచ్చు.
2007లో డీవోటీ జారీచేసిన నిబంధనల ప్రకారం భారత్ లో ప్రవేటు పార్టీలు 40 బిట్స్ కన్నా ఎక్కువ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించితే.. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని లైసెన్స్ అగ్రీమెంట్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ స్పష్టం చేస్తుంది. 40 బిట్స్ కు మించి ఎన్ క్రిప్షన్ ఉపయోగించే ప్రైవేటు సంస్థలు దానిని అన్ లాక్ చేసేందుకు అవసరమైన కీస్ (తాళంచెవులు) ప్రభుత్వానికి ఇస్తేనే ఇందుకు అనుమతి ఇస్తుంది. ఈ విధంగా చూసుకుంటే వాట్సప్ కు అనుమతి లభించే అవకాశమే కనిపించడం లేదు. తాజా ఎన్ క్రిప్షన్ ను అన్ లాక్ చేసే కీస్ ప్రభుత్వానికి వాట్సప్ ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే తాజాగా చేపట్టిన భద్రతా చర్యల వల్ల ఈ కీస్ వాట్సప్ దగ్గర కూడా ఉండవు. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వాట్సప్ ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీసు (ఐఎస్పీ) కాదు. వాట్సప్ భారత్ లో అందించే సేవలకు డీవోటీ లైసెన్స్ అవసరమే లేదు. ఈ నేపథ్యంలో డీవోటీ ఎన్ క్రిప్షన్ నిబంధనలు వాట్సప్ కు వర్తిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.