వర్రీ ‘గుడ్‌ మార్నింగ్‌: 2 వేల కోట్లకు పైగా కొత్త ఏడాది శుభాకాంక్షలు  | Messages flooding cellphones in country | Sakshi
Sakshi News home page

వర్రీ ‘గుడ్‌ మార్నింగ్‌: 2 వేల కోట్లకు పైగా కొత్త ఏడాది శుభాకాంక్షలు 

Published Mon, Feb 6 2023 4:09 AM | Last Updated on Mon, Feb 6 2023 7:31 AM

Messages flooding cellphones in country - Sakshi

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మొదట చేతిలోకి తీసుకునేది సెల్‌ఫోనే. మొబైల్‌ ఓపెన్‌ చేయగానే టపటపా వచ్చిపడే మెస్సేజీలలో ‘గుడ్‌ మార్నింగ్‌’ సందేశాలే అధికం. ఒకప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడవి చిరాకు పుట్టిస్తున్నాయి. ఎవరు పంపారో చూడకుండానే తొలగించే ప్రక్రియతో రోజు ప్రారంభించాల్సిన పరిస్థితి. గుడ్‌ మార్నింగ్‌ సందేశాలు స్మార్ట్‌ఫోన్‌కు పెద్ద సమస్యగా మారుతున్నాయి. భారత్‌లో ఈ మెస్సేజ్‌ల వల్ల మూడో వంతు ఫోన్లు పనిచేయడం లేదని, ప్రతి మూడు స్మార్ట్‌ ఫోన్లలో ఒకటి మెమరీ ఫుల్‌ అయిపోతోందని అమెరికాకు చెందిన కంప్యూటర్‌ డ్రైవ్‌ తయారీ, డేటా నిల్వ సంస్థ ‘వెస్ట్రన్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌’ తెలిపింది. 
– సాక్షి, అమరావతి  

10 రెట్లు పెరిగిన సెర్చింగ్‌ 
భారతీయుల గుడ్‌ మార్నింగ్‌ సందేశాలు రోజూ కోట్ల సంఖ్యలో ఇంటర్నెట్‌ను ముంచెత్తుతున్నాయి. అపరిమిత డేటా అందుబాటులో ఉండడంతో గత ఐదేళ్లలో గుడ్‌ మార్నింగ్‌ సందేశాల కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేయటం 10 రెట్లు పెరిగింది. దేశంలో పింటరెస్ట్‌ యాప్‌ నుంచి సందేశాలతో కూడిన ఫొటోల డౌన్‌లోడ్‌ ఏడాదిలో 9 రెట్లు పెరిగింది.  

భారత్‌లో 2 వేల కోట్ల న్యూ ఇయర్‌ మెస్సేజ్‌లు  
సోషల్‌ మీడియా గ్రూప్‌లో వాట్సాప్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వాట్సాప్‌ వాడుతుండగా మన దేశమే అతిపెద్ద మార్కెట్‌. భారత్‌లో 48.75 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లు ఉండగా 39 కోట్ల మంది నిత్యం గ్రూపుల్లో చురుగ్గా ఉంటున్నట్లు వెస్టర్న్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ సర్వే తేల్చింది.

నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ల సందేశాలు పంపితే భారత్‌  నుంచి 20 బిలియన్లకు పైగా (2 వేల కోట్లకు పైగా) సందేశాలు వెల్లువెత్తాయని, ఇది ప్రపంచ రికార్డుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇలా వచ్చిపడే సందేశాలతో చాలామంది ఫోన్లు స్తంభించిపోతున్నాయి. వాటిని చదివి ప్రతిస్పందించడం కష్టంగా మారింది.


అమెరికాలో నిత్యం ప్రతి పది మందిలో ఒకరి ఫోన్‌ మెమరీ సందేశాలతో నిండిపోతుండగా మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు  వెస్టర్న్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఈ సమస్యకి పరిష్కారంపై అధ్యయనం చేసిన గూగుల్‌ ‘ఫైల్స్‌ గో’ అనే కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ సగటున ఒక్కో యూజర్‌కు ఒక గిగాబైట్‌ వరకూ డేటాను క్లియర్‌ చేసిందని గూగుల్‌ ప్రకటించింది. ఆఫ్‌లైన్‌లోనూ సేవలు వినియోగించుకునే అవకాశం ఉండడం ఈ యాప్‌ ప్రత్యేకత.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement