క్రిమినల్స్ ఇష్టపడేది 'ఆ' ఫోన్నే
న్యూయార్క్: నేరస్థులకు యాపిల్ ఐఫోన్ అంటే ఇష్టం పెరిగిపోతోందట. తమ దగ్గర ఉన్న వేరే మొబైళ్లను పడేసి మరీ వాళ్లు యాపిల్ ఐఫోన్లను వాడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు. యాపిల్ ఐఫోన్ను డీకోడ్ చేయడంలో విచారణ అధికారులు ఎదుర్కొటున్న ఇబ్బందులను గ్రహించిన నేరగాళ్లు వాటినే ఇష్టపడుతున్నారని నివేదికలో స్పష్టం చేశారు.
న్యూయార్క్ అధికారులు నేరస్థుడి ఫోన్కాల్ను ట్యాప్ చేసిన సందర్భంగా యాపిల్ ఐఫోన్లో ఉన్నటువంటి డీకోడ్ చేయరాని సాంకేతిక పరిఙ్ఞానాన్ని దేవుడిచ్చిన వరంగా అభివర్ణిస్తూ ఓ నేరగాడు మరొకరితో జరిపిన ఆసక్తికరమైన సంభాషణను సైతం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోర్టుకు వెల్లడించారు. ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టంను డీ కోడ్ చేయడంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులకు సహకరించడానికి యాపిల్ సంస్థ నిరాకరిస్తుండటంతో నేరగాళ్లు ఐఫోన్నే వాడుతున్నారని అధికారులు తెలిపారు.
శాన్బెర్నార్డినో ఉగ్రవాది ఐఫోన్ను డీకోడ్ చేసి ఎఫ్బీఐకి సహకరించాలన్న కోర్టు ఆదేశాలపై వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యతనిస్తామంటూ యాపిల్ పోరాడుతున్న విషయం తెలిసిందే. యాపిల్కు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్తో పాటు మరికొన్ని సంస్థలు మద్దతిస్తున్నాయి. అయితే యాపిల్ చర్య ఉగ్రవాదులకు, నేరగాళ్లకు సహకరించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.