సాక్షి, కృష్ణా : క్రికెట్‌పై ఉన్న మక్కువ అతన్ని దొంగగా మార్చింది. తన కల సాకారం చేసుకొనేందుకు తాతగారి ఇంటికే కన్నం వేసాడు. రూ.10 లక్షలతో ఉడాయించాడు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించి.. ఇంటి దొంగను పట్టేసారు. ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు.. సుభాని కృష్ణా జిల్లా కంచికచర్ల నివాసి. క్రికెట్ అంటే ప్రాణం. దానికి తోడు వరల్డ్ కప్ ఫీవర్. ఇంకేముంది అకాడమీలో చేరి పెద్ద క్రికెటర్ అయిపోవాలని కలలు కనేవాడు. ఆ సమయంలోనే తాత భాష పొలం అమ్మాడు. పది లక్షల రూపాయల నగదు బీరువాలో భద్రపరిచి తన భార్యతో పాటు ఇంటి పైన నిద్రించాడు. ఇంట్లో డబ్బు ఉన్న విషయం తెలియటంతో సుభానీలోని కొరిక నిద్రలేచింది.
భాషా కుమార్తె కొడుకైన సుభాని డాబాపై నిద్రిస్తున్న తాత వద్ద తాళాలు దొంగిలించి ఇంట్లోకి ప్రవేశించాడు. అందుబాటులో ఉన్న స్క్రూడ్రైవర్ ద్వారా బీరువా తలుపులు తెరిచి తన తాత భాషా దాచుకున్న రూ.10 లక్షల నగదుతో ఇంటి నుంచి పరారయ్యాడు. దొంగిలించిన 10 లక్షల సొమ్ములో తనకు ఇష్టమైన లక్షా 30 వేల రూపాయల విలువైన ఐఫోన్ కొన్నాడు. ఆ తర్వాత క్రికెట్ అకాడమీలో చేరేందుకు 25 వేల రూపాయల విలువైన క్రికెట్ కిట్ కొనుగోలు చేశాడు. మిగిలిన డబ్బుతో అకాడమీలో జాయిన్ అయ్యేందుకు వెళుతుండగా కంచికచర్ల బస్టాండ్ వద్ద నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్ ఐ శ్రీ హరి బాబు పట్టుకున్నారు. సుభాని వద్ద నుంచి 8 లక్షల ఏడు వేల రూపాయల నగదు, ఐఫోన్, క్రికెట్ కిట్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment