రుణమాఫీని పకడ్బందీగా అమలు చేయాలి
రాంనగర్ : అర్హులైన రైతులకు రుణమాఫీ డబ్బులు సక్రమంగా అందే విధం గా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీకి సంబంధించిన అనెక్జర్-2ను అక్టోబర్ 1వ తేదీ ఉదయం నాటికి పంపించినట్లైతే అదే రోజు బ్యాంకు ఖాతాలోకి డబ్బును జమ చేస్తారన్నారు. బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బును రైతుల అకౌంట్‌లోకి బదిలీ చేసేటప్పుడు డూప్లికేట్ అకౌంట్లు, ఒకే బ్యాంకు అకౌంటు పేరున ఎక్కువ పేర్లు ఉన్నవి, బంగారంపై తీసుకున్న రుణానికి 7.5 శాతం కంటే అధికంగా వడ్డీ వసూలు చేసే బ్యాంకు అకౌంట్లు తొలగించాలన్నారు.
1 -బీ రికార్డుల ప్రకారం అనెక్జర్ -ఈలో 13, 14 కాలమ్స్‌ను వీఆర్‌ఓల చేత త్వరితగతిన పూర్తి చేయించాలని సూచి ంచారు. రైతుల భూముల వివరాలను పరిశీలించి మండల వ్యవసాయ అధికారి, రెవెన్యూ అధికారి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే రైతుల ఖాతాలలోకి రుణ మాఫీ డబ్బును బదిలీ చేయాలని బ్యాంకు అధికారులకు సూచి ంచారు. అలాగే అర్హత కలిగిన రైతులందరికీ అక్టోబర్15వ తేదీ నాటికి పంట రుణాలు ఇప్పించేందుకు బ్యాంకు బ్రాం చ్‌ల వారీగా, గ్రామం వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. బ్యాం కు వారీగా పాయింట్ పర్సన్స్‌ను నియమించుకుని డాక్యుమెంటేషన్ పూర్తి అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎన్ని చెరువులు ఏ మేరకు కబ్జాకు గురయ్యాయో వివరాలను త్వరితగతిన పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
చెరువుల్లో ఆక్రమణలు ఉన్నట్లైతే వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల వారికి పంపిణీ చేసేందుకు గుర్తించిన భూముల డాక్యుమెంటేషన్ ప్రతిపాదనలు త్వరితగతిన పంపించాలన్నారు. ఎస్సీలకు పంపిణీ చేసేందుకు ఇంకా భూమి ఎక్కడైనా అందుబాటులో ఉన్నట్లైతే గుర్తించి వాటి ప్రతిపాదనలను కూడా త్వరితగతిన పంపించాలన్నారు. జిల్లాలో రేషన్ కార్డులతో ఆధార్ నంబ ర్లు అనుసంధానం చేయడం 91 శాతం పూర్తి అయిందని, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దసరా పండగ సందర్భంగా అన్ని చౌకధర దుకాణాలలో బియ్యంను అందుబాటులో ఉంచి ప్రజలకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ప్రితిమీనా, జేడీఏ నర్సింహారావు, డీఎస్‌ఓ నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.